• facebook
  • whatsapp
  • telegram

పండుగలు

ఏడు రాళ్లను పాతి... ఏడు పాయలు దాటి!

  ప్రతి ప్రాంతంలో జరిగే పండుగలు, జాతరలు అక్కడి తరతరాల సంస్కృతికి అద్దం పడతాయి. తెలంగాణలోని గిరిజనులు నిర్వహించుకునే కొన్ని పండుగలు, జాతరలు   ఆ విధంగానే వారి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రసిద్ధి చెందాయి. ఏడు రాళ్లను పాతి సీత్ల జాతర జరిపితే, ఏడుపాయలు దాటి దుర్గను కొలుస్తారు. సమ్మక్క-సారక్కలకు పూజలు చేసి జాతి కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటారు. ప్రముఖమైన ఆ ఉత్సవాలు జరిగే ప్రాంతాలు, వాటిని నిర్వహించునే తీరు తదితర వివరాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 

 

  తెలంగాణ సంస్కృతిలో వివిధ పండుగలు, జాతరలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. గిరిజనులు వివిధ పండుగలను నిర్వహించుకుంటారు.  ముఖ్యంగా జాతరలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇవి ప్రజల జీవన విధానం, వారి విశ్వాసాలకు అద్దం పడతాయి. 

 

పండుగలు

సీత్ల: ఇది లంబాడీల పండుగ. తండా దగ్గర పండుగ చేసుకోవడానికి స్థలాన్ని ఎంపిక చేసుకుంటారు. ఆ స్థలంలో ఏడుగురు దేవలతకు సంబంధించిన ఏడు రాళ్లను పాతుతారు. ఈ రాళ్లు సీత్ల నుంచి సీత్ల భవాని వరకు ప్రాతినిధ్యం వహిస్తాయి. పండుగ రోజు కొత్త వస్త్రాలు ధరించి ఆ స్థలానికి వెళతారు. తండా ప్రజలందరూ కలిసి దేవతలకు మేకను బలిస్తారు.

 

తీజ్‌: లంబాడీలు తీజ్‌ పండుగను 9 రోజుల పాటు రోజుకో పద్ధతిలో పాటలు, నృత్యాలతో నిర్వహిస్తారు. ఈ పండుగను పెళ్లికాని వారు మాత్రమే చేసుకుంటారు. పండుగ మొదటి, చివరి రోజులు ముఖ్యమైనవి. ఆఖరి రోజున పరమాన్నం, నెయ్యిని సేవాభయ్యా దేవుడికి సమర్పిస్తారు. తండా నాయకుడు చివరి రోజు ఉపవాసం ఉంటాడు. మేరమ్మ అనే పేరు మీద మేకను బలిస్తారు. ఈ పండుగ సమయంలో పెళ్లికాని వారు మిరపకాయలు, ఉప్పు, మాంసం లాంటి పదార్థాలు తినకూడదు. పండుగ చివరి రోజున పవిత్రమైన తీజ్‌ గంపలను నీటిలోకి వదులుతారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వర్షాలు బాగా పడి భూమి సాగుకు సిద్ధమైన సందర్భంలో జరుపుతారు.

 

పెద్ద దేవుడు: పొలాలను సాగు చేయడానికి ముందు మే లేదా జూన్‌ మొదటి వారంలో పెద్దదేవుడి గౌరవార్థం ఈ పండుగను గిరిజనులు చేసుకుంటారు. వర్షాలు బాగా కురవాలని దేవుడిని కోరుకుంటారు. భూమిలో త్రిభుజాకార ఆకృతిలో ఒక రాయిని పాతిపెట్టి దేవుడిగా పూజిస్తారు. పరిగి పిట్ట పెద్దదేవుడికి ఇష్టమైందిగా భావించి దాన్ని దేవుడికి బలి ఇస్తారు. బలి ఇచ్చిన పరిగి పిట్ట, మేక రక్తాన్ని ఒక కుండలో దేవుడి ముందు నైవేద్యంగా ఉంచుతారు. దేవుడు ఎలుక రూపంలో వచ్చి దాన్ని ఆహారంగా స్వీకరిస్తాడని వారి నమ్మకం. సాధారణంగా తెలంగాణలోని గిరిజనులు ఈ పండుగను వైశాఖ మాసంలో నిర్వహిస్తారు. 

 

అకిపెన్‌: గోండుల గ్రామ దేవత అకిపెన్‌. ప్రతి ఏడాది జంతుబలి ఇచ్చి ఈ దేవతను పూజిస్తారు. గోండు మాండలికంలో ఈ పండుగను నొవోంగ్‌ అంటారు. మొదటగా పూసిన పువ్వులు, ఫలాలు, కాయలను ఈ దేవతకు సమర్పిస్తారు.

  గోండు తెగ గిరిజనులు పెర్షపెన్‌ అనే దేవత పండుగను ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే; డిసెంబరు, జనవరి నెలల్లో చేసుకుంటారు. రాజుల్‌ ముండ అనే పండుగను టేకు కలప, ఆకులు కోయడానికి ముందు నిర్వహిస్తారు.

 

జాతరలు

  సమ్మక్క - సారక్క జాతర: తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందింది సమ్మక్క - సారక్క జాతర. గత 700 సంవత్సరాలుగా రెండేళ్లకు ఒకసారి సమ్మక్క - సారక్కల స్మృతి చిహ్నంగా ఈ పండుగ నిర్వహిస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన సంప్రదాయ ఉత్సవం. వరంగల్‌ నగరానికి 100 కి.మీ. దూరంలో ఉన్న తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఇందులో గిరిజనేతరులే ఎక్కువగా పాల్గొంటారు. కరీంగనర్‌ ప్రాంతాన్ని పాలించే కోయరాజైన మేడ రాజు తన కుమార్తె సమ్మక్కను మేడారం పరగణాను పాలించే పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేశాడు. వీరికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్నలు జన్మించారు. మేడారంలో వరుస కరవుల వల్ల వీరు కాకతీయ పాలకులకు కప్పం చెల్లించలేకపోయారు. కాకతీయ సైన్యం మేడారం పైకి దండెత్తింది. అక్కడ జరిగిన యుద్ధంలో పగిడిద్ద రాజు తన కుమార్తెలతో సహా మరణించాడు. ఆయన కుమారుడు జంపన్న పోరాటంలో గాయపడి సంపెంగ వాగులో పడి మరణించాడు. అప్పటి నుంచి దానికి జంపన్న వాగు అని పేరు వచ్చిందంటారు. పగిడిద్ద రాజు భార్య సమ్మక్క కాకతీయులతో వీరోచిత పోరాటం చేస్తుండగా ఒక సైనికుడు బల్లెంతో ఆమెను వెనుక నుంచి పొడవటంతో గాయపడి చిలుకలగుట్ట పైకి వెళ్లి అదృశ్యమైంది. గిరిజనులకు అక్కడ నాగవృక్షం సమీపంలో కుంకుమ భరిణ దొరికిందని ప్రతీతి. ఆ కుంకుమ భరిణను సమ్మక్కగా భావించి పూజలు చేసేవారు. అది క్రమంగా జాతరగా మారింది. సమ్మక్క - సారక్కలు తమ జాతి కోసం ప్రాణత్యాగం చేశారని గిరిజనులు భావిస్తారు. 

  జాతర మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారక్కను గద్దెకు తీసుకువస్తారు. రెండో రోజు చిలుకలగుట్టపై నుంచి గిరిజన పూజారులు సమ్మక్క దేవతను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దీంతో జాతర ప్రారంభమవుతుంది. మూడో రోజు గద్దెలపై ప్రతిష్ఠితులైన సమ్మక్క - సారక్క దేవతలను జంపన్న వాగులో స్నానమాచరించిన భక్తులు దర్శించుకొని నగదు, నగలు, బంగారం, వెండి, బెల్లం, కొబ్బరికాయలు, చీరలు సమర్పించుకుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు త్రాసులో తూకం వేసి అంతే మొత్తం బంగారం (బెల్లం) కొనుగోలు చేసి గద్దెల వద్ద దేవతలకు నివేదిస్తారు. కోళ్లు, గొర్రెలను బలి ఇస్తారు. నాలుగో రోజు ఆవాహనం పలికి సాయంత్రం అమ్మవార్లను వనప్రవేశం చేయిస్తారు. దీంతో జాతర ముగుస్తుంది. 

  మేడారానికి 10 కి.మీ. దూరంలో ఉన్న బయ్యక్కపేట గ్రామానికి చెందిన గిరిజనులు మొదటిసారి ఈ జాతరను నిర్వహించారు. ఈ దేవతలకు పూజారులుగా 12 కుటుంబాల వారు వ్యవహరిస్తున్నారు. ఇందులో జంతువులను పూజించడం ఆచారంగా వస్తోంది. సమ్మక్కకు నాగస్వరం, సారక్కకు పెద్దపులి, పగిడిద్ద రాజుకు తాబేలు సంకేతాలు. వాటిని నేటికీ పూజిస్తారు. ప్రభుత్వం 1968 నుంచి ఈ జాతరను దేవాదాయ శాఖ పరిధిలోకి తెచ్చింది. దీన్ని ఆసియాలోనే పెద్ద జాతరగా యునెస్కో గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1996 ఫిబ్రవరి 1న ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. 

 

పెద్దగట్టు జాతర: ఈ జాతర సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని దురాజ్‌పల్లి వద్ద జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇది రెండో అతిపెద్ద జాతర. దీనిలో భాగంగా యాదవుల కులదైవం లింగమంతుల స్వామికి (శివుడు) పూజలు చేస్తారు. ఈ జాతరలో కేసారం గ్రామానికి 30 విగ్రహాలున్న పెట్టెను తీసుకువెళ్లి హక్కుదారులకు చూపించి పూజలు చేస్తారు. ఆ తర్వాత లింగమంతుల స్వామి తోబుట్టువు చౌడమ్మ తల్లిని పూజిస్తారు. సూర్యాపేట యాదవ కులస్థులు ఈ జాతరలో లింగమంతుల స్వామికి మకర తోరణాన్ని ఊరేగింపుగా తీసుకువెళతారు. ఖాసింపేట యాదవ కులస్థులు పసిడి కుండను ఆలయగోపురంపై అలంకరిస్తారు. భక్తులు కుక్కల బండ మీద నైవేద్యాన్ని ఉంచి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. నాలుగో రోజు (చివరి రోజు) పూజారులు దేవుళ్లకు కేసారం చేయడంతో జాతర ముగుస్తుంది. దీన్ని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు.

 

ఏడుపాయల జాతర: హైదరాబాద్‌ నగరానికి 110 మైళ్లు, మెదక్‌ పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉన్న పాపన్నపేట మండలం నాగసాని పల్లెకు 2 కి.మీ. దూరంలో మంజీరా నదీ గర్భంలో ఉన్న దుర్గను ఏడుపాయల దుర్గగా పిలుస్తారు. ఇది కొండకోనల మధ్య దట్టమైన అటవీ సంపదలతో తులతూగే ప్రదేశం. ఈ అడవిని ఆనుకొని జలజల పారుతూ ఏడుపాయలుగా చీలి మళ్లీ కలిసి ప్రవహించే మంజీరా నది ఉంది. ఈ ఏడుపాయల మధ్య గుట్టల గుహలో దుర్గమ్మ దేవాలయం ఉంది. ఏడుపాయల దుర్గమ్మ జాతర శివరాత్రి జాగరణతో ప్రారంభమవుతుంది. భక్తులు ఆ రోజు దుర్గమ్మ సాన్నిధ్యంలో రాత్రంతా మేలుకొని ఉదయమే మంజీరా నదిలో స్నానం చేసి దుర్గాదేవిని దర్శించుకొని శివరాత్రి వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఆ రోజు అన్నం, శనగకూర, పచ్చిపులుసు, పరమాన్నం, పెరుగు, నూనె పోలెలతో బోనాలు ఎత్తుతారు. ఇది గ్రామీణులు సమర్పించే సాత్వికాహార నివేదన. ఈ జాతరలో తెలంగాణ, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని దుర్గాదేవికి ముడుపులు చెల్లించుకుంటారు. 

 

మాదిరి ప్రశ్నలు

 

1. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద జాతర ఏది?

1) పెద్దగట్టు జాతర    2) నాగోబా జాతర    3) సమ్మక్క - సారక్క జాతర    4) కొండగట్టు జాతర

 

2. సీత్ల పండుగను ఎవరు జరుపుకుంటారు?

1) కోయలు    2) లంబాడీలు   3) గోండులు    4) కొండరెడ్లు

 

3. సమ్మక్క - సారక్క జాతర సందర్భంగా దేవతలకు సమర్పించే బెల్లాన్ని ఏ పేరుతో పిలుస్తారు?

1) బెల్లం ప్రసాదం    2) నైవేద్యం    3) హారతి    4) బంగారం

 

4. అకిపెన్‌ ఎవరి దేవత?

1) కోయ గిరిజనులు 2) గోండు గిరిజనులు   3) గుత్తి కోయలు 4) కొండరెడ్లు

 

5. మెదక్‌ జిల్లాలో ప్రఖ్యాత యాత్రా స్థలం?

1) ఏడుపాయలు  2) మూడుపాయలు 3) అయిదుపాయలు 4) రెండుపాయలు 

 

6. పెద్దగట్టు జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?

1) వరంగల్‌    2) కరీంనగర్‌    3) జగిత్యాల   4) సూర్యాపేట

 

7. తీజ్‌ పండుగను ఎవరు జరుపుకుంటారు?

1) లంబాడీలు   2) గోండులు   3) కోయలు   4) రాజుగోండులు

 

8. ఏడుపాయల జాతరలో ప్రధాన దేవత?

1) దుర్గాదేవి    2) సరస్వతి    3) పార్వతి    4) లక్ష్మి

 

9. సమ్మక్క - సారక్క జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది?

1) సంవత్సరానికి ఒకసారి   2) రెండేళ్లకు ఒకసారి 

3) మూడేళ్లకు ఒకసారి     4) అయిదేళ్లకు ఒకసారి

 

సమాధానాలు 

1-3, 2-2, 3-4, 4-2, 5-1, 6-4, 7-1, 8-1, 9-2.

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 తెలంగాణ కళలు

  కాకతీయులు

 ఇక్ష్వాకులు

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015


 

Posted Date : 05-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌