• facebook
  • whatsapp
  • telegram

కంపెనీ పాలనలో ప్రభుత్వ నిర్మాణం (క్రీ.శ.1757 - 1858)

ఆంగ్లేయుల వ్యవస్థీకృత దోపిడీ!

  విభజించు-పాలించు అనే అనైతిక సూత్రంతో ఈస్టిండియా కంపెనీ, బెంగాల్‌లో ప్రారంభించిన ఆక్రమణలను భారతదేశమంతా సాగించింది. ఎదురులేని సామ్రాజ్యశక్తిగా ఎదిగింది. ఇక్కడి ఆర్థిక వనరులను కొల్లగొట్టేందుకు అనువైన పాలనా వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంది. సైన్యం, సివిల్‌ సర్వీసెస్, పోలీస్, న్యాయవ్యవస్థలను నెలకొల్పి వ్యవస్థీకృతంగా దోపిడీలు చేసింది. ఈ పరిణామ క్రమంపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. 

 

   బక్సర్‌ యుద్ధం(1764)లో ఓడిపోయిన నామమాత్రపు మొగల్‌ చక్రవర్తి రెండో షా-ఆలం, అయోధ్య నవాబు షుజా ఉద్‌-దౌలాలు ఈస్టిండియా కంపెనీతో విడివిడిగా అలహాబాద్‌ ఒడంబడిక (1765) చేసుకున్నారు. దీని ప్రకారం నవాబు మొదటగా అలహాబాద్, కారా ప్రాంతాలను మొగల్‌ చక్రవర్తికి ఇచ్చేశాడు. తర్వాత రెండో షా ఆలం బెంగాల్, బిహార్, ఒరిస్సాల్లో రెవెన్యూ వసూలు చేసుకునే ‘దివానీ’ హక్కులు కంపెనీకి ఇచ్చాడు. దీంతో బెంగాల్‌ రాజ్యంపై ఆంగ్లేయుల రాజ్యాధికార హక్కుకు చట్టబద్ధత లభించింది. వారి ప్రత్యక్ష పాలనా బాధ్యతల నిర్వహణ మొదలైంది. ఫలితంగా బెంగాల్‌లో కంపెనీ, నవాబుల ద్వంద్వ ప్రభుత్వం ఏర్పడింది. ఈ వ్యవస్థలో కంపెనీకి అధికారాలు, నవాబుకు బాధ్యతలు మిగిలాయి. ఉద్యోగుల్లో జవాబుదారీతనం లోపించి గందరగోళం ఏర్పడటంతో ఆ ప్రభుత్వాన్ని వారెన్‌ హేస్టింగ్స్‌ కాలంలో రద్దు చేశారు. 

  అతి తక్కువ కాలంలోనే కంపెనీ, భారతదేశంలో ఒక విశాల సామ్రాజ్యం స్థాపించి, గొప్పశక్తిగా అవతరించింది. ఈ క్రమంలో తన ప్రధాన లక్ష్యమైన దేశ ఆర్థిక వనరులు కొల్లగొట్టడంతోపాటు రాజ్య విస్తరణను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు పాలనా వ్యవస్థను రూపొందించుకుంది.ఈ ప్రక్రియ వారెన్‌ హేస్టింగ్స్‌ (1772-85), కారన్‌ వాలీస్‌ (1786-93) కాలం నుంచే ప్రారంభమైంది. వీరిద్దరూ బ్రిటిష్‌ పాలనా భవన పునాదిని పటిష్ఠం చేసి నిర్మాణం మొదలుపెట్టారు. ఆ పాలనా వ్యవస్థకు మూలస్తంభాలు సైన్యం, సివిల్‌ సర్వీస్, పోలీస్, న్యాయవ్యవస్థ.

 

సివిల్‌ సర్వీస్‌ 

  వారెన్‌ హేస్టింగ్స్‌ బెంగాల్‌ కంపెనీ రాజ్యాన్ని జిల్లాలుగా విభజించి, రెవెన్యూ వసూళ్లకు ఏజెంట్లుగా కలెక్టర్లను నియమించాడు. అతడి తర్వాతŸ బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా వచ్చిన కారన్‌ వాలీస్‌ నిజాయతీపరుడు, ఉన్నత భావాలున్న వ్యక్తి. ఈయన కంపెనీ పాలనలో వారెన్‌ హేస్టింగ్స్‌ వేసిన సివిల్‌ సర్వీస్‌ వ్యవస్థను సంస్కరించి, ఆధునికీకరించి, స్పష్టమైన రూపం కల్పించాడు. అందుకే అతడిని ఆధునిక భారతదేశంలో ‘సివిల్‌ సర్వీస్‌ పితామహుడు’ అంటారు. కంపెనీ ఉద్యోగుల్లో అవినీతికి ముఖ్యకారణం వారి తక్కువ వేతనాలే అని అర్థం చేసుకోని, జీతభత్యాలను గణనీయంగా పెంచాడు. అప్పటి వరకు సొంత వ్యాపారాలు చేస్తూ, లంచాలకు అలవాటు పడిన కంపెనీ ఉద్యోగుల వ్యవస్థను సంస్కరించాడు. అర్హతలున్న వారికే పాలనలో స్థానం కల్పించాడు. చరిత్రకారుల ప్రకారం ఆనాటి భారత సివిల్‌ సర్వీస్‌ ఉద్యోగుల వేతనాలు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండేవి.

 

* బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌గా వెల్లస్లీ (1798-1805) పాలనా కాలంలో బ్రిటన్‌ నుంచి వస్తున్న యువ అధికారులకు శిక్షణ అవసరమని గ్రహించాడు. వారి కోసం కలకత్తాలోని విలియం కోటలో శిక్షణ కళాశాలను స్థాపించాడు. దీని స్థానంలో కంపెనీ యాజమాన్యం మొదట లండన్‌ దగ్గర హెర్ట్‌ఫోర్డ్‌లో, తర్వాత ఇంగ్లండ్‌లోని హైలీబరిలో శిక్షణ కళాశాలలను స్థాపించింది. ఇవి 1858 వరకు సుశిక్షితులు, సమర్థులైన అధికారులను తయారుచేసి కంపెనీకి అందించాయి.

 

మరొక ముఖ్య పరిణామం, క్రీ.శ.1853 వరకు సివిల్‌ సర్వీస్‌లో నియామకాలను కంపెనీ డైరెక్టర్లు నిర్వహించేవారు. తర్వాత వచ్చిన 1853 చార్టర్‌ చట్టం సివిల్‌ సర్వీస్‌లోని అన్ని ఉద్యోగాలను పోటీపరీక్ష ద్వారా, ప్రతిభ ప్రాతిపదికగా భర్తీ చేయాలని శాసించింది. కానీ ఆ పరీక్షలను లండన్‌లో నిర్వహించడంతో భారతీయులకు ఉపయోగం లేకుండా పోయింది. వాస్తవానికి కంపెనీలో ఉన్నత ఉద్యోగాల్లో భారతీయులను నియమించకూడదనేది ఆంగ్లేయుల విధానం. ఆ ఖాళీలను తెల్లవారితోనే నింపేవారు. మనవాళ్లను దిగువస్థాయి పనులకు పరిమితం చేశారు. ఈ కాలంలో సివిల్‌సర్వీస్‌ అధికారులు బ్రిటిష్‌ ప్రయోజనాల కోసమే పనిచేసేవారు. భారతీయుల సంక్షేమాన్ని పట్టించుకునేవారు కాదు. కాలక్రమంలో 1857 తిరుగుబాటు, భారత జాతీయోద్యమ ప్రభావాలతో సివిల్‌ సర్వీసెస్‌ పటిష్ఠ విధానంగా రూపొందడం మొదలైంది.

 

సైన్యం

  బ్రిటిషర్లు అనాదిగా సైన్యాన్ని రాజ్యాధికారానికి మూలస్తంభంగానే పరిగణించారు. భారతదేశ ఆక్రమణలో సైన్యాన్ని సమర్థంగా వాడుకున్నారు. కంపెనీ సైన్యంలో భారతీయ సిపాయిలు సంఖ్యాపరంగా ఎక్కువ. వీరి జీతభత్యాలు, పదోన్నతి అవకాశాలు ఆంగ్లేయ సిపాయిల కంటే తక్కువ. ఆ రోజుల్లో ఆధునిక జాతీయతా భావాలు లేకపోవడంతో ఇతర రాజులు, తోటి భారతీయ సైన్యంపై యుద్ధానికి కంపెనీ భారత సిపాయిలు సంశయించేవారు కాదు. కంపెనీ యాజమాన్యానికి విధేయులుగా ఉండేవారు. స్వదేశీ రాజ్యాలను జయించడంలో, అంతర్గత తిరుగుబాట్లు అణచివేయడంలో, విదేశీ దండయాత్రల నుంచి కంపెనీ రాజ్యాన్ని రక్షించడంలో కీలకపాత్ర పోషించేవారు.

 

పోలీసు 

  1765లో కంపెనీ దివానీ అధికారం చేపట్టేనాటికి బెంగాల్‌లో మొగలుల పోలీసు వ్యవస్థ అమలులో ఉంది. జిల్లాల్లో ఫౌజ్‌దార్లు, నగరంలో కొత్వాల్, గ్రామాల్లో జమీందారులు శాంతిభద్రతల విధులు నిర్వహించేవారు. వీరి పోలీసు విధులను కారన్‌ వాలీస్‌ రద్దు చేశాడు. శాంతిభద్రతలు పరిరక్షించడానికి శాశ్వత పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కొన్ని గ్రామాలకు ఒక పోలీసు ఠాణాను పెట్టి దానికి ‘దరోగా’ అనే అధికారిని నియమించాడు. వీటన్నింటిపై పర్యవేక్షణకు ఒక పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఉండేవాడు. ఈ వ్యవస్థలో నూ భారతీయులను ఉన్నత పదవుల్లో నియమించలేదు. కంపెనీ ప్రయోజనాల పరిరక్షణే తమ విధిగా భావించి పోలీసులు ప్రజలను శత్రువుల్లాగా పీడించేవారు. కానీ ఆ సమయంలో మధ్య భారతంలో భయోత్పాతాలు సృష్టించిన ‘థగ్గులు’ అనే దారిదోపిడీ దొంగలను అణచివేసి, ప్రజలను రక్షించడం నాటి పోలీసులు నిర్వర్తించిన గొప్ప పని.

 

న్యాయవ్యవస్థ 

  వారెన్‌ హేస్టింగ్స్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్న కాలంలో దేశంలోని పండితుల సహాయంతో న్యాయ సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. వీలైనంతవరకు సంప్రదాయ సిద్ధంగా వస్తున్న హిందూ, మహమ్మదీయ చట్టాలను అనుసరించాడు.ప్రతి జిల్లాలోనూ ‘దివానీ అదాలత్‌’లను ఏర్పాటు చేశాడు. ఇందులో సివిల్‌ కేసులు విచారించేవారు. ఈ కోర్టు నుంచి పై కోర్టుకు అప్పీలు చేసుకోడానికి వీలు కల్పిస్తూ కలకత్తాలో ‘సాదర్‌ దివానీ అదాలత్‌’ అనే ఉన్నత న్యాయస్థానాన్ని స్థాపించాడు. క్రిమినల్‌ కేసుల పరిష్కారానికి జిల్లాల్లో ‘నిజామత్‌ అదాలత్‌’ లేదా ‘ఫౌజుదారీ అదాలత్‌’ అనే న్యాయస్థానాన్ని, దాన్నుంచి అప్పీలుకు కలకత్తాలో ‘సదర్‌ నిజామాత్‌ అదాలత్‌’ను నెలకొల్పాడు. వారెన్‌ హేస్టింగ్స్‌ కాలంలో 11 మంది పండితులతో హిందూ ధర్మశాస్త్రాలను క్రోడీకరించారు. వాటిని హాల్‌హెడ్‌ ఇంగ్లిష్‌లోకి అనువాదం చేశాడు. వీటివల్ల న్యాయస్థానాల పని సులభతరమైంది. ఆ తర్వాత వచ్చిన గవర్నర్‌ జనరల్‌ కారన్‌ వాలీస్‌ కలకత్తాలోని ఉన్నత న్యాయస్థానాలకు దిగువగా ‘ప్రాంతీయ కోర్టులు’, ‘సర్క్యూట్‌ కోర్టులు’ ఏర్పాటు చేశాడు. న్యాయస్థానాల్లో పాటించడానికి న్యాయ నియమ నిబంధనావళిని ‘కారన్‌ వాలీస్‌ కోడ్‌’ పేరుతో అమల్లోకి తెచ్చాడు. దీన్ని తయారుచేయడానికి సర్‌ జార్జ్‌బార్లో సహాయపడ్డాడు. పూర్వం నుంచి కలెక్టర్‌కు ఉన్న న్యాయాధికారాలు తొలగించి, వారిని కార్యనిర్వహణ అధికారాలకు పరిమితం చేశాడు. తర్వాత కాలంలో జ్యుడీషియల్‌ సర్వీసెస్‌లో భారతీయుల అధికార స్థాయిని  విలియం బెంటిక్‌ (1838-35) పెంచాడు. ఇతడి కాలంలో వచ్చిన చార్టర్‌ చట్టం 1833, బ్రిటిష్‌ ఇండియా పాలనలో మౌలిక మార్పులు తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ బెంగాల్‌ పేరు ‘గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా’గా మారింది. ఈ చట్టం మద్రాసు, బొంబాయి కౌన్సిళ్ల శాసనాధికారాలను తొలగించి, దేశం మొత్తానికి చట్టాలు చేసే అధికారాన్ని గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చింది. కోర్టులో అధికార భాషగా ఉన్న పర్షియన్‌ను రద్దు చేసి, ఆ స్థానంలో ఇంగ్లిష్‌ను ప్రవేశపెట్టాడు. న్యాయచట్టాల సమీక్షకు, క్రోడీకరణకు మెకాలే నాయకత్వంలో న్యాయ సంఘం (లా కమిషన్‌) ఏర్పాటైంది. ఇండియన్‌ సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్, ఇండియన్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ రూపంలో భారత శిక్షాస్మృతి న్యాయసూత్రాల క్రోడీకరణ జరిగింది. చట్టం ముందు అందరూ ఒక్కటే, అందరూ సమానం అనే విధానం అమల్లోకి వచ్చింది. ఈ సంస్కరణల వల్ల సమర్థ, ఆచరణయోగ్యమైన న్యాయపాలన వ్యవస్థ ఏర్పడటానికి అవకాశం కలిగింది. 1858 తర్వాత మహారాణి పాలనలో వచ్చిన భారతీయ హైకోర్టు చట్టం-1861తో కంపెనీ ఏర్పాటు చేసిన న్యాయపాలనా వ్యవస్థలో సమూల మార్పులు వచ్చాయి.

 

రచయిత: వి.వి.ఎస్‌. రామావతారం

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  ఐరోపావారి రాక

‣  రాబర్ట్‌ క్లైవ్‌ తర్వాత పరిస్థితులు

  స్వదేశీ సంస్థానాల విలీనం - నాయ‌కుల పాత్ర‌

 

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015


 

Posted Date : 28-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌