• facebook
  • whatsapp
  • telegram

కాకతీయులు - సాంస్కృతిక ప్రాభవం

కళలకు.. కవులకు నిండైన కొలువు!

  సుమారు మూడు వందల సంవత్సరాలు సాగిన కాకతీయుల పాలనలో సంస్కృతిపరంగా ఎన్నో మార్పులు చోటుచేసున్నాయి. శైవం, వైష్ణవం రాజాదరణ పొందాయి. నాటి పాలకులు, ప్రజలు జైనాన్ని అనుసరించారు. అనేక కావ్యాలు, పురాణాలు, శాస్త్ర గ్రంథాలు వెలుగు చూశాయి. పేరిణిలాంటి నృత్యాలు, జలకరండం వంటి వాయిద్యాలు, దోరసముద్రంలాంటి నటుల నిలయాలతో కళకళలాడి కాకతీయుల కాలం కళలకు, కవులకు నిండైన కొలువుగా విలసిల్లింది.

  కాకతీయుల పరిపాలనలో తెలంగాణ సాహిత్యపరంగా, సాంస్కృతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. వీరు తెలుగు, సంస్కృత కవులను పోషించి సాహిత్యాభివృద్ధికి పాటుపడ్డారు. వివిధ మతాలను ఆదరించారు. అనేక కళలను పోషించడంతో పాటు పలు దేవాలయాలనూ నిర్మించారు. అవి నేటికీ సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. 

 

మతం 

  కాకతీయుల కాలంలో హిందూమతంతో పాటు జైనమతం ఉండేది. ముఖ్యంగా శైవమతం రాజాదరణ, ప్రజాదరణ పొందింది. తొలి కాకతీయ పాలకులు జైనమతాన్ని, మలి కాకతీయులు శైవాన్ని అనుసరించారు.జైనమతం: క్రీ.శ.800 నాటికే హనుమకొండ ప్రముఖ జైన కేంద్రంగా ఉండేది. తొలి కాకతీయ రాజులు దిగంబర జైనమతాన్ని అనుసరించారు. వేంగిలో హింసకు గురైన జైనులు హనుమకొండకు వలస వచ్చినట్లు ఓరుగల్లు కైఫీయత్తు వివరిస్తుంది. హనుమకొండలోని పద్మాక్షి దేవాలయం జైన దేవాలయంగా ఉండేది. బోధన్, వేములవాడ, అలంపురం, పొట్లచెరువు (పటాన్‌చెరువు),కొల్లిపాక (కొలనుపాక), వర్ధమానపురం, పొట్లపల్లి లాంటివి ప్రముఖ జైన కేంద్రాలుగా ఉండేవి. ప్రోలరాజు అనుమకొండ శాసనం జినేంద్ర ప్రార్థనతో మొదలవుతుంది. ప్రోలరాజు మంత్రి బేతన భార్య మైలమ అనుమకొండపై కడలాలయ బసది అనే జైన బసదిని నిర్మించింది. క్రమంగా జైనులను శైవులు హింసించినట్లు, వారి దేవాలయాలను నేలమట్టం చేసినట్లు పండితారాధ్య చరిత్ర తెలుపుతుంది. కాలక్రమంలో జైనమతం ప్రజలను సంతృప్తి పరచలేకపోయింది. అనేక మంది జైనులను బలవంతంగా శైవంలోకి  మార్పించారు. అయినప్పటికీ జైనమతం పూర్తిగా పతనం కాలేదు.

 

శైవం: కాకతీయుల కాలంలో ప్రజాదరణ, రాజాదరణ పొందిన మతం శైవం. గణపతిదేవుడు, రుద్రమదేవి పాలనాకాలంలో కాలాముఖ, పాశుపత, శివశాసన, కాపాలిక, యామిళ, సిద్ధి లాంటి శైవ శాఖలు ఉన్నట్లు త్రిపురాంతకం, మల్కాపురం శాసనాల ద్వారా తెలుస్తుంది. క్రీ.శ.10వ శతాబ్దంలో కాలాముఖ శైవం ప్రచారంలో ఉండేది. గణపతిదేవుడి కాలంలో గోళకీమఠం విశేష జనాదరణ పొందింది. గోళకీమఠ ప్రధానాచార్యుడైన విశ్వేశ్వర శంభూ గణపతిదేవుడి శివదీక్షా గురువు. రుద్రమదేవి క్రీ.శ.1261లో విశ్వేశ్వర శంభుకు మందారం (మందడం) గ్రామాన్ని వెలగపూడి కృష్ణలంకలతో కలిపి దానం చేసింది. విశ్వేశ్వర శంభు మందారం గ్రామంలో ఒక శివాలయాన్ని, శుద్ధ శైవ మఠాన్ని నిర్మించాడు. ఈ మఠానికి అనుబంధంగా ఒక వేదశాస్త్ర ఆగమ విద్యాలయాన్ని నిర్మించి అందులో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. ఈయన కాళేశ్వరంలో ఉపల మఠాన్ని, ఏలేశ్వరంలో షోడశ ఆవర కాల మఠాన్ని నిర్మించాడు. శివుడి అవతారాలైన 28 మంది యోగాచార్యుల గురించి శివపురాణం, కూర్మపురాణం తెలుపుతున్నాయి. ఈ యోగాచార్యుల్లో శ్వేతాచార్యుడు మొదటి గురువు, లకులీశుడు చివరి గురువు. ఒక్కో యోగాచార్యుడికి నలుగురు శిష్యులు ఉన్నారు. వీరి కృషి ఫలితంగా శైవమతం భారతదేశంలో ప్రథమ స్థానం ఆక్రమించింది. వీరశైవ మత శాఖను బసవేశ్వరుడు కర్ణాటకలో స్థాపించాడు. వీరశైవులు కుల వ్యవస్థ, బ్రాహ్మణుల ఆధిక్యత, బాల్య వివాహాలను వ్యతిరేకించారు. వితంతు పునర్వివాహాలను సమర్థించారు. తెలుగు ప్రాంతాల్లో బసవేశ్వరుడి శిష్యులకు వీరశైవులు లేదా లింగాయతులని పేరు. వీరు ఉపవాసాలను వ్యతిరేకించారు. వీరశైవుల గురువులను జంగములు, వీరశైవ గ్రంథాలను ఆగమములు అంటారు.

 

వైష్ణవం: వీరి కాలంలో వైష్ణవం కూడా ప్రజాదరణ పొందింది. కాకతీయుల రాజ లాంఛనం వరాహం. వీరి ముద్ర, నాణేల మీద వరాహ లాంఛనం ఉండేది. వారి త్రికూట ఆలయాలన్నింటిలో విష్ణువును కూడా ప్రతిష్ఠించారు. దక్షిణ దేశం నుంచి రామానుజ వైష్ణవం తెలుగు ప్రాంతాల్లోకి ప్రవేశించింది. తెలంగాణలో రామానుజుడి బ్రాహ్మణేతర అనుచరులను దాసరులు, సాతానులు అంటారు. రుద్రమదేవి కాలంలో వైష్ణవం విశేషంగా వ్యాప్తి చెందింది. వీరి సామంతులు వైష్ణవాన్ని ఆదరించారు. పల్నాడులో బ్రహ్మనాయుడు వీర వైష్ణవాన్ని ప్రచారం చేసి సంఘ సంస్కరణకు పూనుకున్నాడు. అంటరానితనాన్ని వ్యతిరేకించి వారికి ఆలయ ప్రవేశాన్ని కల్పించాడు. కాకతీయ రుద్రుడు హనుమకొండలో శివుడు, కేశవుడు, సూర్యుడికి ఆలయాలు నిర్మించాడు. రుద్రదేవుడి మంత్రి గంగాధరుడు హనుమకొండలో ప్రసన్న కేశవాలయాన్ని, నగుమారులో వైష్ణవాలయాన్ని నిర్మించాడు. రుద్రదేవుడు, గణపతిదేవుడు చాతుర్వర్ణ సముద్ధరణ బిరుదు ధరించారు. గణపతిదేవుడి సోదరి మైలాంబ ఇనుగుర్తిలో గోపాలకృష్ణుడి ఆలయం కట్టించింది. వీరులకు వీరగల్లు, వీరగుళ్లు వెలిశాయి. వీరపూజ సాగింది. జైనమత దేవతలైన కాకతమ్మ, జోగులాంబ హిందూ సంప్రదాయానుసారం దుర్గ, కాళీ రూపాలను ధరించాల్సి వచ్చింది. వీరికాలంలో ఏకవీర, కాకతమ్మ, పోలేరమ్మ, పోతురాజు లాంటి గ్రామ దేవతలను పూజించారు.

విద్యా సారస్వతాలు 

  కాకతీయుల కాలం నాటి రాజ భాష సంస్కృతం. వీరి కాలంలో విద్యా మండపాలు ముఖ్య దేవాలయాలకు అనుబంధంగా ఉండి, సాహిత్య గోష్టులు, మత చర్చలకు కేంద్రంగా పనిచేసేవి. ఇవి మందడం, పుష్పగిరి లాంటి ప్రాంతాల్లో ఉండేవి. వేద పాఠశాలల్లో గణితం, జ్యోతిషం, ఆయుర్వేద విద్యలు నేర్పేవారు. క్రీ.శ.1261 నాటి మల్కాపురం శాసనం అప్పటి విద్యా మండపాల స్థితిగతులను తెలుపుతుంది. విశ్వేశ్వర శంభు మందడం గ్రామాన్ని అగ్రహారంగా పొంది అక్కడ విశ్వేశ్వర గోళకీ అనే నూతన గ్రామాన్ని, ఒక విద్యామండపాన్ని నిర్మించాడు. విద్యా మండపాల్లో వేద విద్యలు, వ్యాకరణం, వైద్య, సాహిత్యాలను బోధించేవారు.

 

సారస్వతం (సంస్కృతం): కాకతీయులు గొప్ప కవులను పోషించి సారస్వతాభివృద్ధిని ప్రోత్సహించారు. అగస్త్యుడు నలకీర్తి కౌముది (ఖండకావ్యం), బాలభారత (కావ్యం), కృష్ణచరిత లాంటివి రచించాడు. శాకల్య మల్లభట్టు ఉదాత్త రాఘవం, నిరోష్ణ్య రామాయణాలు రచించాడు. ప్రతాపరుద్రుడిఆస్థాన కవి విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం (అలంకార శాస్త్ర గ్రంథం) రచించాడు. నరసింహకుడు అనే మరో కవి కాదంబరి కళ్యాణం (నాటకం), కాకతీయ చరిత్ర, మలయవతి అనే గ్రంథాలను రచించాడు. అప్పయార్యుడు అనే జైన కవి జినేంద్ర కళ్యాణాభ్యుదయం గ్రంథాన్ని రచించాడు. రావిపాటి త్రిపురాంతకుడు ప్రేమాభిరామం అనే వీధి నాటకాన్ని సంస్కృతంలో రాయగా, దాని ఆధారంగా తెలుగులో క్రీడాభిరామం వీధి నాటకాన్ని వినుకొండ వల్లభార్యుడు రచించాడు. ఈ నాటకం  హనుమకొండ ప్రజల సాంఘిక జీవితాన్ని తెలుపుతుంది. నన్నెచోడుడు రచించిన కుమార సంభవం తెలుగు కావ్యాల్లో ప్రథమ శ్రేణిది. కేతన అనే కవి దశకుమార చరిత్ర (తెలుగులో మొదటి కథాకావ్యం), ఆంధ్ర భాషా భూషణమే (మొదటి తెలుగు వ్యాకరణ గ్రంథం); గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం (తెలుగు ద్విపద కావ్యాల్లో గొప్పది), శివదేవయ్య పురుషార్థసారం, మడికిసింగన సకలనీతి సమ్మతం, కాసె సర్వప్ప సిద్ధేశ్వర చరిత్ర,  శైవ కవి మల్లికార్జున పండితారాధ్యుడు శివతత్వ సారం (తెలుగులో మొదటి శతకం) రచించారు. మరో శైవ కవి పాల్కురికి సోమనాథుడు ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి. ఈయన దేశీ కవితా రీతికి గౌరవాన్ని కలిగించాడు. బసవపురాణం, పండితారాధ్య చరిత్ర (ద్విపద కావ్యం), అనుభవసారం (పద్య కావ్యం), వృషాధిప శతకం లాంటి తెలుగు గ్రంథాలను రచించాడు. భాస్కర రామాయణాన్ని అయిదుగురు కవులు రచించారు.

 

నాట్యం, సంగీతం, చిత్రలేఖనం

  కాకతీయుల కాలంలో పురుషులు ప్రదర్శించే పేరిణి నాట్యం విశేష ప్రచారంలో ఉండేది. ఇది వీరులు యుద్ధభూమికి వెళ్లే సమయంలో ప్రేరణగా చేసే నాట్యం. వీరు గంభీరమైన మృదంగ వాయిద్యాన్ని మోగిస్తూ శివుడు తమ శరీరంలోకి ఆవహించాడని విశ్వసించేవారు. మరుగునపడిన ఈ నాట్యాన్ని ఇటీవలి కాలంలో ప్రముఖ నాట్యాచార్యుడు నటరాజు రామకృష్ణ వెలుగులోకి తెచ్చారు. శైవుడైన జాయపసేనాని శైవ నృత్యంలోని మెలకువలు, అందాలను శైవ ధర్మ సూత్రాలను సమన్వయం చేస్తూ నృత్యరత్నావళి రచించాడు. రామప్ప దేవాలయంలోని శిల్పాలు, నాట్య చిత్రాలను నృత్యరత్నావళి ఆధారంగా చెక్కారు. నాటి శిల్పాల్లో అనేక రకాల వాద్యాలు కనిపిస్తాయి. పిల్లలమర్రి, త్రిపురాంతకం, నాగులపాడు దేవాలయాల్లో ఆనాటి చిత్రాలు ఉన్నాయి. పానగల్లు, రామప్ప, పిల్లలమర్రి, చేబ్రోలు, మల్కాపురం, ధర్మసాగర్‌ శాసనాల్లో నాట్యకత్తెలు, వాద్యగాండ్ర ప్రస్తావన ఉంది. ధర్మసాగర్‌ శాసనంలో ‘జలకరండం’ అనే వాయిద్య విశేషం కనిపిస్తుంది. ఈ కాలంలో రాజాస్థానాలు, దేవస్థానాల్లో నాట్యం, సంగీతాలకు మంచి పోషణ లభించింది. పల్నాటి వీరగాథలు, శివలీలలు లాంటి నాటకాలను ప్రదర్శించేవారు. నటులకు నిలయం దోరసముద్రం (ద్వారసముద్రం) అనే విషయం క్రీడాభిరామం ద్వారా తెలుస్తుంది. ఈ కాలంలో నవకాశి అనే చిత్రకళ ఉండేది. నవకాశి చిత్రకారులు కాన్వాసు వస్త్రంపై పురాణ, రామాయణ, మహాభారత గాథలను చిత్రీకరించేవారు. నాటి స్త్రీలు చిత్రలేఖనంలో ప్రసిద్ధులు. రామ, కృష్ణావతార గాథల చిత్రపటాలను గృహాల్లో అలంకరించుకునేవారని పల్నాటి వీరచరిత్ర ద్వారా తెలుస్తుంది. ప్రతాపరుద్రుడి ఉంపుడుగత్తె మాచల్దేవి ప్రత్యేక చిత్రశాలను నిర్మించి అందులో దారుకావన శివలీలలు, గోపికా కృష్ణులు, తారాచంద్రులు లాంటి చిత్రాలను ప్రదర్శించినట్లు క్రీడాభిరామంలో పేర్కొన్నారు. వీరికాలంలో ప్రజల సర్వసాధారణమైన వినోదం తోలుబొమ్మలాట.

 

నిర్మాణాలు 

  కాకతీయులు తమ నిర్మాణాల్లో చాళుక్య శైలి అయిన వెసరా శైలిని అనుసరించారు. తొలి కాకతీయుల కాలంలో జినాలయాల నిర్మాణం విరివిగా సాగింది. జైనతీర్థంకరుల శాసనాధికారిణుల ప్రతిమలు వెలిశాయి. హనుమకొండలోని పద్మాక్షి ఆలయం జైనాలయంగా ఉండేది. ప్రోలరాజు కాలంలో హనుమకొండలో సిద్ధేశ్వరాలయం, పద్మాక్షి ఆలయం, ఓరుగల్లులో స్వయంభు, కేశవాలయాలు నిర్మించారు. రుద్రదేవుడు తనను స్వతంత్ర ప్రభువుగా ప్రకటించుకున్న సందర్భంలో క్రీ.శ.1163లో రుద్రేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఇది రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యుడు లాంటి దేవతలు ఉన్న త్రికూటాలయం. రామప్ప దేవాలయాన్ని రేచెర్ల రుద్రుడు క్రీ.శ.1213లో పాలంపేటలో నిర్మించాడు. ఇది ఏకశిలా పద్ధతిలో నక్షత్రాకారంలో నిర్మించిన ఆలయం. ఎటు వైపు నుంచి చూసినా ప్రేక్షకుల వైపే చూడటం ఈ దేవాలయంలోని నంది ప్రత్యేకత. ఈ ఆలయంలోని నాలుగు శిల్పాల్లో మూడు నాట్యకత్తెలవి కాగా ఒకటి నాగినిది. జాయపసేనాని రచించిన నృత్యరత్నావళి ఆధారంగా ఇక్కడి శిల్పాలను చెక్కారు. పేడంపేట దేవాలయంలోని యక్షిణి శిల్పం ముఖ్యమైంది. పానగల్లు పంచీశ్వరాలయంలోని శివుడు, గణేశుడి శిల్పాలు మనోహరమైనవి. పిల్లలమర్రిలోని ఎరుకేశ్వర, నామేశ్వర దేవాలయాలు ఆనాటి చిత్రలేఖన నైపుణ్యానికి నిదర్శనాలు. రేచెర్ల గణపిరెడ్డి ఘనపురం (ములుగు)లోని గణపేశ్వరాలయాన్ని నిర్మించాడు. వీటినే కోటగుళ్లు అంటారు. గణపతిదేవుడు ఓరుగల్లు, కొండపర్తి, నాగులపాడు లాంటి ప్రదేశాల్లో దేవాలయాలను నిర్మించాడు.

 

రచయిత: డాక్టర్‌.ఎం.జితేందర్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

 శాతవాహనులు

 తెలంగాణ కళలు

  రేచర్ల పద్మనాయకులు

 

‣ ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 07-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌