• facebook
  • whatsapp
  • telegram

రేచర్ల పద్మనాయకులు

ప్రజారంజక నాయకులు!

కాకతీయుల అనంతరం తుగ్లక్‌ పాలనలో తెలుగు ప్రాంత ప్రజలు అరాచక పాలనను అనుభవించారు. అధిక పన్నులు, హింస, అణచివేతలతో అష్టకష్టాల పాలయ్యారు. ఆ దశలో నాయకరాజులు పోరాటాలతో స్వతంత్ర రాజ్యాలు స్థాపించి జనానికి విముక్తి కల్పించారు. సముద్రాల పేరుతో చెరువులు నిర్మించారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. దుర్గాలు కట్టారు. విదేశీ వ్యాపారాలు సాగించారు. అగ్రహారాలు, దేవాలయాలను విద్యాకేంద్రాలుగా మార్చారు. కవులను పోషించారు. జక్కిణి, పేరిణి వంటి కళలను అభివృద్ధి చేశారు. ప్రజారంజక పాలనను అందించి చరిత్రలో నిలిచిపోయారు. 

 

రేచెర్ల పద్మనాయకులు

క్రీ.శ. 1323లో కాకతీయుల పతనానంతరం ఓరుగల్లును ఢిల్లీ సుల్తాన్‌ మహమ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ఆక్రమించి ఓరుగల్లుకు సుల్తాన్‌పూర్‌ అని పేరు పెట్టాడు. అనంతరం ఆంధ్ర ప్రాంతాన్ని కూడా ఆక్రమించి క్రీ.శ. 1324లో తమ పరిపాలనను ప్రవేశపెట్టాడు. తుగ్లక్‌ పరిపాలనలో తెలుగు ప్రజలు దుర్భర దారిద్య్రం అనుభవించారు. రైతులపై అధిక పన్నులు విధించడం, హిందూ దేవాలయాలను కూల్చడం, వాటి స్థానంలో మసీదులు నిర్మించడం, బ్రాహ్మణులను చంపడం, దేవతా విగ్రహాలను పగలగొట్టడం మొదలైన దుశ్చర్యలకు పాల్పడ్డారు. వీరి పాలనలో అరాచకం ప్రబలింది. శాంతిభద్రతల పరిస్థితి క్షీణించింది. వీరి పరిపాలనను ప్రజలు భరించలేని స్థితికి వచ్చారు. ఆ సమయంలో ముసునూరి ప్రోలయ నాయకుడి నాయకత్వంలో అనేకమంది ముస్లిం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ప్రోలయ నాయకుడు భద్రాచలం దగ్గర ఉన్న రేకపల్లిని కేంద్రంగా చేసుకుని పోరాటం చేశాడు. క్రీ.శ. 1326 నాటికి ముస్లింలను తెలుగు ప్రాంతాల నుంచి తరిమేశారు. ప్రోలయ నాయకుడు ఓరుగల్లు రాజధానిగా ముసునూరి వంశ రాజ్యాన్ని స్థాపించగా, సింగమ నాయకుడు తెలంగాణలో ఆమనగల్లు రాజధానిగా పద్మనాయక రాజ్యాన్ని స్థాపించాడు.

రేచెర్ల పద్మనాయకులనే వెలమలని కూడా అంటారు. వీరు నల్లగొండ జిల్లాలోని రాచకొండ, దేవరకొండ రాజధానులుగా దాదాపు 150 సంవత్సరాలు (క్రీ.శ. 1326 - 1475) తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. రేచెర్ల వంశానికి మూలపురుషుడు  భేతాళ నాయకుడు. ఈయన అసలు పేరు చెవిరెడ్డి. నల్లగొండ జిల్లాలోని పిల్లలమర్రి సమీపంలో ఉన్న ఆమనగంటిపురం ఇతడి జన్మస్థలం. ఇతడి వారసులందరూ కాకతీయుల ఆస్థానంలో వివిధ హోదాల్లో పనిచేశారు. మొదటి సింగమ నాయకుడు (క్రీ.శ.1326-1361) రేచెర్ల పద్మనాయక రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి సైన్యాధిపతిగా పనిచేశాడు.

అనపోతానాయకుడు (క్రీ.శ. 1361-1384): ఇతడు సింగమ నాయకుడి కుమారుడు, రాచకొండ రాజ్య నిర్మాత. రాచకొండను శత్రుదుర్భేద్యమైన దుర్గంగా నిర్మించి తన రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చాడు. ఇతడి కాలంలో కొండవీటి రెడ్డి రాజులతో ఘర్షణ ప్రారంభమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం అనపోతానాయకుడు తన రాజ్యాన్ని రెండుగా విభజించి, తమ్ముడైన మాదానాయకుడిని దేవరకొండ పాలకుడిగా నియమించాడు. నాటి నుంచి రాచకొండలో అనపోతానాయకుడి సంతతివారు, దేవరకొండలో మాదానాయకుని సంతతివారు పరస్పర సహకారంతో పాలించారు. అనపోతానాయకుడు భువనగిరి (త్రిభువనగిరి) కోటను జయించి ‘త్రిభువనీయ రావు’ అనే బిరుదు పొందాడు. ఇతడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అయ్యనవోలు (ఐనవోలు) దర్శించి, అక్కడ క్రీ.శ. 1369లో ఒక శాసనం వేయించాడు. ఈ అయ్యనవోలు సంస్కృత శాసనాన్ని నాగనాథుడు రచించాడు. అనపోతానాయకుడు రాచకొండ ప్రాంతంలో రాయసముద్రం, అనపోతు సముద్రం పేర్లతో చెరువులు నిర్మించాడు. నాగాయని కొండ, రాచకొండ దుర్గాలకు ప్రాకారాలు నిర్మించాడు. శ్రీ పర్వతానికి మెట్లు కట్టించాడు. విశ్వేశ్వర కవి అనపోతానాయకుడి ప్రశంస ఉన్న ‘చమత్కారచంద్రిక’ అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు.

రెండో సింగమ నాయకుడు (క్రీ.శ. 1384-1399): ఇతడు అనపోతానాయకుడి కుమారుడు. ఇతడికి కుమార సింగమ నాయకుడు, కుమార సింగభూపాలుడు, సర్వజ్ఞ సింగభూపాలుడు అనే ఇతర పేర్లున్నాయి. ఇతడు యువరాజుగా ఉన్నప్పుడు కణ్యాణ దుర్గాన్ని జయించి, అక్కడ విజయస్తంభం ప్రతిష్ఠించి కణ్యాణభూపతి అనే బిరుదు పొందినట్లు విశ్వేశ్వరుడు తన గ్రంథమైన ‘చమత్కార చంద్రిక’లో పేర్కొన్నాడు. ఈ పాలకుడికి సర్వజ్ఞ చక్రవర్తి, ఆంధ్రమండలాధీశ్వర, ప్రతిదండ భైరవ, ఖడ్గనారాయణ, సర్వజ్ఞ చూడామణి అనే బిరుదులుండేవి. ఈయన గొప్పకవి. అనేక మంది కవులను పోషించాడు. ఈయన ‘సంగీత సుధాకరం’ అనే సంగీతశాస్త్ర గ్రంథాన్ని, ‘రసార్ణవ సుధాకరం’ అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని, రత్నపాంచాళిక (కువలయావళి) అనే నాటకాన్ని రచించాడు. ఇవన్నీ సంస్కృతంలో రచించాడు. ఈయన ఆస్థానంలో అప్పయార్యుడు అనే కవి అమరకోశానికి సంస్కృత భాషలో వ్యాఖ్యానం రాశాడు. విశ్వేశ్వరుడు సింగ భూపాలుడిని ‘సాహిత్య శిల్పావధి’ అని వర్ణించాడు. ఈయన ఆస్థానాన్ని ప్రముఖ కవి శ్రీనాథుడు సందర్శించాడు. రెడ్డి, వెలమ రాజ్యాల మధ్య దౌత్యం జరిపేందుకు శ్రీనాథుడు ప్రయత్నించాడు.

రావు మాదా నాయకుడు (క్రీ.శ. 1421-1430): ఈయన మరో ముఖ్య పాలకుడు. ఈయన భార్య నాగాంబిక రాచకొండ సమీపంలోని దేవలమ్మనాగారం వద్ద నాగసముద్రం అనే చెరువును నిర్మించి ఆ చెరువు కట్టపై క్రీ.శ. 1429లో ఒక శాసనం వేయించింది. ఈ శాసనం రావు మాదానాయకుడి చరిత్రకు ముఖ్యమైన ఆధారం. రావు మాదానాయకుడు వాల్మీకి రచించిన రామాయణానికి రాఘవీయం అనే వ్యాఖ్య రచించి శ్రీరాముడికి అంకితం చేశాడు. ఈయన గొప్ప వైష్ణవ మతాభిమాని. శ్రీశైల వంశంలో జన్మించిన రామానుజాచార్యుడి కుమారుడైన వెంకటాచార్యుని శిష్యుడు. క్రీ.శ. 1422లో శ్రీరంగనాథస్వామికి తొర్రూరు గ్రామాన్ని శ్రీరంగపుర అగ్రహారం అనే పేరుతో దానం చేశాడు.

మూడవ సింగమ నాయకుడు (క్రీ.శ. 1430-1475): ఇతడు మాదానాయకుడి అన్న కుమారుడు. ఈయనకు ముమ్మడి సింగమ నాయకుడు, సర్వజ్ఞరావు సింగమ నాయకుడు అనే బిరుదులుండేవి. సుదీర్ఘ కాలం పాలించాడు. అనేకమంది కవులను పోషించాడు. ఈయన ఆస్థాన కవియైన గౌరన లక్షణ దీపిక, నవనాథ చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం అనే గ్రంథాలు రచించాడు. ఈయనకు ‘సరస సాహిత్య లక్షణ చక్రవర్తి’ అనే బిరుదుండేది. మరో కవి కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక’ అనే గ్రంథాన్ని రచించాడు. మహాకవి బమ్మెర పోతన ఈ పాలకుడి ఆస్థానంలో కొంతకాలం ఉండి ఆయన కోరికపై ‘భోగినీ దండకం’ను రచించాడు. వీరభద్ర విజయం, నారాయణ శతకం అనేవి పోతన ఇతర రచనలు. మూడో సింగమ నాయకుడే చివరి రాచకొండ పద్మనాయక పాలకుడు.

 దేవరకొండ పద్మనాయక పాలకుల్లో మొదటివాడైన మాదానాయకుడి రాజధాని దేవరకొండ. శ్రీశైలం దేవాలయానికి ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం. ఇక్కడ మాదానాయకుడు ఉత్తర ద్వార మండపాన్ని, శివాలయాన్ని నిర్మించి శాసనం వేయించాడు. పెద వేదగిరి ఈయన కుమారుడు. వేదగిరి శివభక్తుడు, కవిపండిత పోషకుడు. ఈయన ఆస్థాన కవి శాకల్య అయ్యలార్యుడు ‘భాస్కర రామాయణం’ రచించాడు. చివరి దేవరకొండ రాజ్యపాలకుడు లింగమనేడు.

ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. పండిన పంటలో 1/6వ వంతు భూమి శిస్తు వసూలు చేసేవారు. పర్వతరావు తటాకం, విదేగిరి తటాకాలను దేవరకొండ పాలకులు నిర్మించారు. ఏతము, రాట్నముల ద్వారా పొలాలకు నీటి సరఫరా చేసేవారు. వస్త్ర, కలంకారీ పరిశ్రమలకు ఓరుగల్లు, దేవరకొండ, గోల్కొండ ప్రసిద్ధి గాంచాయి. వైశ్య, తెలగ, బలిజలు దేశ, విదేశీ వ్యాపారం చేసేవారు. కృష్ణానది తీరంలో ఉన్న ఓడపల్లి (వాడపల్లి) ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉండేది. ఓడపల్లి పద్మనాయకులకు జలదుర్గంగా ఉండేది. ఇక్కడి నుంచి దేశ, విదేశీ వ్యాపారం ఓడల ద్వారా జరిగేది.

 

మతం

పద్మనాయకులు మొదట శైవాన్ని, తర్వాత వైష్ణవాన్ని స్వీకరించి వ్యాపింపజేశారు. బసవేశ్వరుడిపై  వీరశైవ ప్రభావం ఉండేది. తీవ్రవాద శైవం ప్రజాదరణ పొందింది. భైరవ, మైలారు దేవాలయాలు వెలిశాయి. భైరవారాధన ఫలితంగా ‘రణము కుడుపు’ అచారం ప్రారంభమైంది. రణము కుడుపు అంటే మృతుల రక్తమాంసాలతో బియ్యం కలిపి వండిన ఆహారాన్ని రణ దేవతలకు, భూతప్రేత పిశాచాలకు నివేదన చేయడం. మంత్రాలు, తాంత్రిక పూజలు ఎక్కువయ్యాయి. కాళికాదేవి, దుర్గాదేవి, చండి, భద్రకాళి మొదలైన దేవతలను పూజించేవారు. కట్టమైసమ్మ, రేణుక, ముత్యాలమ్మ, మారెమ్మ, ఏకవీర మొదలైన దేవతలకు ఆలయాలు నిర్మించారు. చివరి పద్మనాయక రాజులు వైష్ణవ మతాన్ని అనుసరించారు. మూడోసింగ భూపాలుడి ఆస్థానంలో వేదాంత దేశికుడి కుమారుడైన నైనాచార్యులు ఉండేవాడు. ఈయన వరదాచార్య నామాంకితుడు. వేదాంత దేశీకుడు సర్వజ్ఞ సింగభూపాలుడి అనుమతితో ‘సుభాషిత నీతితత్వ సందేశ’, ‘రహస్య సందేశ’ మొదలైన గ్రంథాలు రచించాడు. వేదాంత దేశికుడు ప్రచారం చేసిన వడగల్‌ వైష్ణవ శాఖ ఈ కాలంలో వ్యాప్తిలో ఉండేది. శైవ, వైష్ణవ మతాధిపతుల మధ్య సిద్ధాంతపర వాదనలు జరిగేవి. రాచకొండలో శాకల్యమల్ల భట్టుకు పరాశర భట్టుతో వివాదం ఏర్పడింది. రాచకొండలో  భైరవాలయాలు నిర్మించారు. దుర్గాదేవి ఆలయం, భువనగిరి సోమేశ్వరాలయాన్ని పునరుద్ధరించారు.

 

విద్య, సాహిత్యం

అగ్రహారాలు, దేవాలయాలు విద్యా కేంద్రాలుగా ఉండేవి. జ్యోతిషం, షడ్దర్శనాలు, శబ్ద శాస్త్రాలు, ఆయుర్వేద విద్యలుండేవి. వాటి పండితులు, రాజులు ఉర్దూ, ఫారసీ, అరబ్బీ వంటి భాషల్లో పాండిత్యం సాధించారు. సింగభూపాలుడు వసంతోత్సవాలను ఏర్పాటుచేసి రాజ్యంలో ఉన్న కవి పండిత, గాయకులను సన్మానించేవాడు. భరతనాట్యం, జక్కిణి, పేరిణి, చిందుగోండ్లి, పారశీక మత్తల్లి మొదలైన నాట్యరీతులు వ్యాప్తిలో ఉండేవి. డక్క, ఝర్ఘరి, ఝల్లరి, భేరి, కాహళ, హుడక్క, వీణ లాంటి వాయిద్యాలుండేవి. రెండో సింగభూపాలుడు రచించిన రత్నపాంచాలిక (కువలయావళి) అనే సంస్కృత నాటకాన్ని రాచకొండలోని ప్రసన్నగోపాలదేవుడి వసంత యాత్రా మహోత్సవ సందర్భంలో ప్రదర్శించేవారు. సింగభూపాలుడికి ‘లక్షలక్షణవేది సర్వజ్ఞ’ అనే బిరుదులుండేవి. ఇతడు విశ్వేశ్వరుడు అనే కవిని సాహిత్య శిల్పావధి అని తన గ్రంథంలో పేర్కొన్నాడు. మూడో సింగభూపాలుడి ఆస్థానంలో శాకల్యమల్లభట్టు అనే కవి ఉండేవాడు. ఈ కవి నిరోష్ఠ్య రామాయణం, ఉదార రాఘవకావ్యం గ్రంథాలతో పాటు అవ్యయ సంగ్రహం అనే నిఘంటువు చివర తాను ‘చతుర్భాషా కవితా పితామహంకుడ’నని చెప్పుకున్నాడు. శాకల్య మల్లభట్టును వైష్ణవ మతాచార్యుడైన నైనాచార్యుడిని ఓడించినట్లు ***వైష్ణవ సంప్రదాయం తెలుపుతుంది. ఈ కాలంలోనే గోన బుద్దారెడ్డి రంగనాథ రామాయణాన్ని ద్విపదలో రచించాడు.


మాదిరి ప్రశ్నలు


1. రేచెర్ల వంశ మూలపురుషుడు ఎవరు?

1) రేచెర్ల నాయకుడు     2) పద్మనాయకుడు    3) రాజనాయకుడు     4) బేతాళనాయకుడు

 

2. రేచెర్ల పద్మనాయక రాజ్యస్థాపకుడు ఎవరు?

1) సింగమ నాయకుడు      2) ఎరదాచా నాయకుడు     3) దామా నాయుడు      4) వెన్నమ నాయకుడు

 

3. రెండో సింగమ నాయకుడ్ని సాహిత్య శిల్పావధి అని వర్ణించినవారు ఎవరు?

1) నాగనాథుడు      2) విశ్వేశ్వరుడు      3) పశుపతి మేఘనాథుడు      4) అప్పయార్యుడు

 

4. నాగసముద్రం అనే చెరువును నిర్మించినవారు?

1) మూకాంబిక      2) సూరాంబిక      3) నాగాంబిక      4) వరదాంబిక

 

5. పద్మనాయకుల కాలంనాటి ప్రముఖ వ్యాపార కేంద్రం?

1) పేరూరు      2) పానగల్లు      3) గద్వాల      4) ఓడపల్లి

 

6. ‘సింహాసన ద్వాత్రింశికం’ను రచించిందెవరు?

1) వామనుడు      2) గౌరన      3) కొరవి గోపరాజు      4) నారాయణ

 

7. కవి బమ్మెర పోతన రచించని గ్రంథం ఏది?

1) నవనాథ చరిత్రి       2) వీరభద్ర విజయం      3) నారాయణ శతకం      4) భాగవతం

 

8. రాచకొండ దుర్గాన్ని నిర్మించినవారు ఎవరు?

1) సింగమ నాయకుడు      2) అనపోతా నాయకుడు      3) మాదా నాయకుడు      4) సింగభూపాలుడు

 

9. ‘సరస సాహిత్య లక్షణ చక్రవర్తి’ అనే బిరుదు ఎవరిది?

1) గోపరాజు      2) అయ్యలార్యుడు      3) గౌరన      4) విశ్వేశ్వరుడు

 

10. ‘మదన విలాస బాణం’ గ్రంథ రచయిత ఎవరు?

1) విశ్వేశ్వరుడు      2) నాగనాథుడు     3) కృష్ణయామాత్యుడు      4) రాజశేఖరుడు

 

సమాధానాలు: 1-4, 2-1, 3-2, 4-3, 5-4, 6-3, 7-1, 8-2, 9-3, 10-2.


రచయిత: ఎం. జితేందర్‌ రెడ్డి

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

‣  విష్ణుకుండినులు

‣  ఇక్ష్వాకులు

  కాకతీయులు - సాంస్కృతిక ప్రాభవం

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 12-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌