• facebook
  • whatsapp
  • telegram

  పార్లమెంటు సభ్యులు

దేశానికి శాసనకర్తలు!

రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం సక్రమంగా, సంతృప్తికరంగా కార్యనిర్వాహక విధులను నిర్వర్తించేందుకు కొన్ని శాసనాలు అవసరం. వాటిని పార్లమెంటు సభ్యులు రూపొందిస్తారు. దేశానికి అత్యంత ఆవశ్యకమైన ఆ శాసనాలను నిర్మించే ప్రజాప్రతినిధులు ఎలా ఎన్నికవుతారు? వారికి ఉండాల్సిన అర్హతలు, ఇతర అన్ని రకాల వివరాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. 

  

భారతదేశంలో అత్యున్నత శాసననిర్మాణ వ్యవస్థ పార్లమెంటు. ఇందులో లోక్‌సభకు ప్రత్యక్షంగా, రాజ్యసభకు పరోక్షంగా ఎన్నికయ్యే వారే పార్లమెంటు సభ్యులు (ఎంపీలు). శాసననిర్మాణ వ్యవస్థలో వీరంతా కీలక వ్యక్తులు. పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యేందుకు ఉండాల్సిన అర్హతలు, షరతులను రాజ్యాంగం నిర్దేశించింది. ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారం, వారికి ఉండే ప్రత్యేక రక్షణలు, అనర్హతకు గురయ్యే సందర్భాలను వివరంగా పేర్కొంది.

 

అర్హతలు

* భారతీయ పౌరసత్వం ఉండాలి.

* దివాలా తీసి ఉండకూడదు.

* నేరారోపణ రుజువై ఉండకూడదు (క్రిమినల్‌ కేసుల్లో).

* దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.

* మానసిక సమతౌల్యత కలిగి ఉండాలి.

* ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో ఉండకూడదు.

* లోక్‌సభ సభ్యత్వానికి 25 సంవత్సరాలు, రాజ్యసభ సభ్యత్వానికి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.

 

షరతులు: * ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి తన నామినేషన్‌ పత్రంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్‌గా (ధరావతు) రూ.25 వేలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.12,500 చెల్లించాలి.

* అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినా, ఒక సెక్యూరిటీ డిపాజిట్‌ సరిపోతుంది.

* ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం పోలై, చెల్లుబాటు అయిన ఓట్లలో 1/6వ వంతు ఓట్లు రాని అభ్యర్థులు తమ డిపాజిట్‌ను కోల్పోతారు.

* నామినేషన్‌ పత్రంతో పాటు అభ్యర్థి తన ఆస్తులు, అప్పులు, నేరచరిత్ర, వైవాహిక వివరాలను అఫిడవిట్‌ రూపంలో సమర్పించాలి.

 

ప్రమాణస్వీకారం: పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతి ఎదుట లేదా రాష్ట్రపతి ప్రత్యేకంగా నియమించిన వ్యక్తి సమక్షంలో లేదా రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్‌లోని ఆర్టికల్‌ 99 ప్రకారం ‘భారత రాజ్యాంగం పట్ల శ్రద్ధానిష్ఠలతో భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను సంరక్షిస్తానని, తాను చేపట్టిన బాధ్యతలను శ్రద్ధగా నిర్వహిస్తానని’ ప్రమాణస్వీకారం చేయాలి. పదవీ ప్రమాణస్వీకారం చేయకుండా సభాకార్యక్రమాల్లో పాల్గొనే పార్లమెంటు సభ్యుడికి రోజుకు రూ.500 జరిమానా విధిస్తారు.

 

రాజీనామా: పార్లమెంటు సభ్యుల రాజీనామా గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 101(3)్బ్జ్శ పేర్కొంటుంది. సభ్యులు తమ రాజీనామా పత్రాలను నిర్ణీత ప్రొఫార్మాలో సంబంధిత సభాధ్యక్షులకు పంపాలి. సభ్యులు స్వచ్ఛందంగానే రాజీనామా చేశారని సభాధ్యక్షులు ధ్రువీకరించుకున్న తర్వాత అవి ఆమోదం పొందుతాయి.

 

జీతభత్యాలు: ఆర్టికల్‌ 106 ప్రకారం పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. 2019లో పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం సభ్యుల జీతభత్యాలు కింది విధంగా ఉన్నాయి.

* వేతనం - రూ.1,00,000

* నియోజకవర్గ అలవెన్స్‌ - రూ.70,000

* ఆఫీసు ఖర్చులు - రూ.60,000

* సెక్రటేరియట్‌ అలవెన్స్‌ - రూ.40,000

* దినసరి అలవెన్స్‌ - రూ.2,000

* ఉచిత నివాసం, ఉచిత రవాణా, వైద్య సౌకర్యాలు కల్పిస్తారు. పదవీవిరమణ తర్వాత నెలకు రూ.25,000 పెన్షన్‌ లభిస్తుంది.

* వీరి జీతభత్యాలు ఆదాయపు పన్ను పరిధిలోకి రావు.

 

ప్రత్యేక హక్కులు, రక్షణలు

* పార్లమెంటు సభ్యుల ప్రత్యేక హక్కుల గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 105లో పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు. వీరు ఓటు చేసిన విధానం గురించి న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి వీలులేదు.

* పార్లమెంటు సమావేశాలకు 40 రోజుల ముందు లేదా సమావేశం తర్వాత 40 రోజుల వరకు లేదా సమావేశాలు జరుగుతున్నపుడు సభాధ్యక్షుల అనుమతి లేకుండా సభ్యులను అరెస్ట్‌ చేయకూడదు.

* సభా సమావేశాలు జరుగుతున్నప్పుడు సభాధ్యక్షుడి అనుమతి లేకుండా ఏ సభ్యుడిని న్యాయస్థానంలో సాక్ష్యం ఇవ్వడానికి హాజరు కావాలని న్యాయస్థానాలు ఆదేశించలేవు.

 

సమావేశాలు

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 85 ప్రకారం పార్లమెంటు సంవత్సరానికి రెండుసార్లు సమావేశం కావాలి. రెండు సమావేశాల మధ్య కాలం 6 నెలలకు మించకూడదు ప్రత్యేక పరిస్థితుల్లో, అవసరమైనప్పుడు ఎన్ని సమావేశాలైనా నిర్వహించవచ్చు. ప్రస్తుతం మన దేశంలో పార్లమెంటు సమావేశాలను సాంప్రదాయికంగా సంవత్సరానికి మూడు సార్లు నిర్వహిస్తున్నారు.

* బడ్జెట్‌ సమావేశాలు (Budget Sessions): ఫిబ్రవరి - మార్చి

* వర్షాకాల సమావేశాలు (Monsoon Session): జులై - ఆగస్టు

* శీతాకాల సమావేశాలు (Winter Session): నవంబరు - డిసెంబరు

 

అనర్హతలు

 పార్లమెంటు సభ్యులు అనర్హతకు గురై, సభ్యత్వాన్ని కోల్పోయే సందర్భాలను ఆర్టికల్‌ 102 వివరిస్తుంది.

- లాభదాయక ప్రభుత్వ పదవిని చేపట్టడం.

- మానసిక స్థితి సక్రమంగా లేదని న్యాయస్థానం ప్రకటించడం.

- దివాలా తీశాడని న్యాయస్థానం ధ్రువీకరించడం.

- ఎన్నికల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడం.

- ఎన్నికల వ్యయ పరిమితికి సంబంధించిన వివరాలను నిర్ణీత గడువులోగా సమర్పించడంలో విఫలమవడం.

- భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోవడం.

- ఇతర దేశాలకు విధేయుడై ఉంటానని ప్రకటించడం.

- వరకట్న నిషేధ చట్టం, అస్పృశ్యత నేరనిషేధ చట్టం ప్రకారం శిక్షకు గురవడం.

 రాష్ట్రపతి ఎన్నికల సంఘాన్ని సంప్రదించి ఒక పార్లమెంటు సభ్యుడిని అనర్హుడిగా ప్రకటిస్తారు.

ద్వంద్వ సభ్యత్వం ఆధారంగా అనర్హత: ఆర్టికల్‌ 101 ప్రకారం ద్వంద్వ సభ్యత్వం అంటే ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు సభల్లో సభ్యుడిగా కొనసాగడాన్ని నిషేధించారు. భారత ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం ద్వంద్వ సభ్యత్వం ఉన్నప్పుడు ఒక సభలో సభ్యత్వాన్ని తప్పనిసరిగా వదులుకోవాల్సి ఉంటుంది.

* ఒక వ్యక్తి ఏకకాలంలో పార్లమెంటులోని ఉభయసభలకు ఎన్నికైతే అతడు 10 రోజుల్లోగా ఏ సభలో కొనసాగాలని కోరుకుంటున్నాడో తెలియజేయాలి. అలా తెలియజేయకపోతే అతడు రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోతాడు.

* ఒక వ్యక్తి ఒకే సభలో రెండు సీట్లకు ఎన్నికైతే ఎన్నికల సంఘం నిర్దేశించిన కాలపరిమితిలోగా ఒకదాన్ని వదులుకోవాలి. లేదంటే రెండు సీట్ల సభ్యత్వాన్నీ కోల్పోతాడు.

* ప్రస్తుతం ఒక సభలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి మరొక సభకు ఎన్నికయితే అతడు మొదటి సభలో సభ్యత్వాన్ని కోల్పోతాడు.

*  ఒక వ్యక్తి ఏకకాలంలో పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు రెండింటికీ ఎన్నికైతే 14 రోజుల్లోగా రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. లేకపోతే అతడు పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోతాడు.

 

గైర్హాజరు: పార్లమెంటు సభ్యుడు సభాపతి అనుమతి లేకుండా వరుసగా 60 రోజులపాటు సమావేశాలకు గైర్హాజరైతే ్బత్జి(’-్మ్శ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 101(4) ప్రకారం అతడు సభలో సభ్యత్వాన్ని కోల్పోతాడు. 60 రోజుల కాలవ్యవధిని లెక్కించడంలో సభ వాయిదా పడిన కాలం లేదా వరుసగా నాలుగు రోజుల కంటే ఎక్కువ కాలం వాయిదా పడిన రోజులను పరిగణనలోకి తీసుకోకూడదు.

 

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉల్లంఘన ఆధారంగా అనర్హత: మన దేశంలో చట్టసభల సభ్యులలో నైతికత, బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో 1985లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చేసింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పొందుపరిచారు. ఈ చట్టం ప్రకారం ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు మరో పార్టీలోకి మారితే అతడు సభలో సభ్యత్వాన్ని ఏ విధంగా కోల్పోతాడో నిర్దేశించారు. చట్టసభల సభ్యుల అనర్హతలను నిర్ణయించే అధికారం లోక్‌సభలో స్పీకర్‌కు, రాజ్యసభలో ఛైర్మన్‌కు ఉంటుంది.

 

పదవిని కోల్పోయే సందర్భాలు

* ఏ రాజకీయ పార్టీ నుంచి ఎన్నికవుతారో ఆ రాజకీయ పార్టీకి రాజీనామా చేసినప్పుడు.

* రాజకీయ పార్టీ జారీ చేసిన ‘విప్‌’నకు వ్యతిరేకంగా సభలో ఓటు వేయడం లేదా ఓటింగ్‌కు గైర్హాజరైతే.

* స్వతంత్రంగా (ఇండిపెండెంట్‌) గెలిచిన సభ్యుడు ఏదైనా రాజకీయ పార్టీలో చేరినప్పుడు.

* పార్లమెంటుకి నామినేట్‌ అయిన సభ్యుడు 6 నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలోకి చేరితే.

అనర్హతకు గురయ్యే ఇతర సందర్భాలు: పార్లమెంటు సభ్యుడు కింది సందర్భాల్లో సభలో సభ్యత్వం కోల్పోయి అనర్హతకు గురవుతాడు.

- సభ నుంచి సభ్యుడు బహిష్కరణకు గురైనప్పుడు.

- సభ్యుడి ఎన్నిక చెల్లుబాటు కాదని న్యాయస్థానం తీర్చు ఇచ్చినప్పుడు.

- సభ్యుడు రాష్ట్రపతి/ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైనప్పుడు.

- సభ్యుడు ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైనప్పుడు.

 

సుప్రీంకోర్టు తీర్పులు

కిహోటా Vs జాచీలూ కేసు: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో లోక్‌సభ స్పీకర్‌ ఇచ్చే రూలింగ్‌ను న్యాయసమీక్షకు (Judicial Review) గురిచేయవచ్చు.

లిల్లీ థామస్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: క్రిమినల్‌ కేసులో దోషిగా నిర్ధారణ అయ్యే చట్టసభల సభ్యులను వెంటనే అనర్హులుగా ప్రకటించాలి.

 

మాదిరి ప్రశ్నలు

 

1. భారత ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎంతకంటే తక్కువ ఓట్లు వస్తే తమ డిపాజిట్‌ను కోల్పోతారు?

1) 1/2  2) 1/3  3) 1/4  4) 1/6

 

2. పార్లమెంటు సభ్యుల పదవీ ప్రమాణస్వీకారం గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?

1) ఆర్టికల్‌ 91   2) ఆర్టికల్‌ 97   3) ఆర్టికల్‌ 99   4) ఆర్టికల్‌ 100

 

3. రాజ్యాంగంలోని ఆరిక్టల్‌ 85 ప్రకారం పార్లమెంటు సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశమవ్వాలి?

1) రెండుసార్లు 2) మూడుసార్లు 3) నాలుగుసార్లు  4) ఐదుసార్లు

 

4. ఆర్టికల్‌ 102 ప్రకారం కింద పేర్కొన్న ఏ కారణం వలన పార్లమెంటు సభ్యుడు అనర్హతకు గురవుతాడు?

1) లాభదాయక ప్రభుత్వ పదవిని చేపట్టడం

2) భారత పౌరసత్వాన్ని కోల్పోవడం

3) దివాలా తీశాడని న్యాయస్థానం ప్రకటించడం

4) పైవన్నీ

 

5. ఒక వ్యక్తి ఏకకాలంలో రెండుసభలలో సభ్యుడిగా కొనసాగడాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిషేధిస్తుంది?

1) ఆర్టికల్‌ 101     2) ఆర్టికల్‌ 102    3) ఆర్టికల్‌ 103     4) ఆర్టికల్‌ 104

 

6. సభాధ్యక్షుల అనుమతి లేకుండా పార్లమెంటు సభ్యుడు వరుసగా ఎన్ని రోజులపాటు సమావేశాలకు గైర్హాజరు అయితే సభలో సభ్యత్వాన్ని కోల్పోతారు?

1) 30 రోజులు     2) 40 రోజులు     3) 50 రోజులు     4) 60 రోజులు

 

7. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రూపొందించారు?

1) 36వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975

2) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976

3) 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985

4) 61వ రాజ్యాంగ సవరణ చట్టం, 1988

 

8. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న నియమాల ప్రకారం పార్లమెంటు సభ్యుడు ఏ సందర్భంలో తన సభ్యత్వాన్ని కోల్పోతాడు?

ఎ) రాజకీయ పార్టీ జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించినపుడు

బి) ఏ రాజకీయ పార్టీ నుంచి ఎన్నికయ్యారో ఆ రాజకీయ పార్టీకి రాజీనామా చేసినపుడు.

సి) ఇండిపెండెంట్‌గా గెలిచిన సభ్యుడు ఏదైనా రాజకీయ పార్టీలో చేరినపుడు

డి) నామినేటెడ్‌ సభ్యుడు 6 నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలోకి చేరినపుడు

1) ఎ, బి, సి సరైనవి 2) ఎ, సి, డి సరైనవి

3) ఎ, బి, డి సరైనవి 4) అన్నీ సరైనవి

 

9. పార్లమెంటు సభ్యుల జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు?

1) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

2) కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌

3) పార్లమెంటు

4) కేంద్ర ఆర్థిక సంఘం

 

10. పార్లమెంటుసభ్యుల ప్రత్యేక హక్కులు, రక్షణలు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?

1) ఆర్టికల్‌ 105    2) ఆర్టికల్‌ 107

3) ఆర్టికల్‌ 109     4) ఆర్టికల్‌ 111

 

సమాధానాలు

1-4, 2-3, 3-1, 4-4, 5-1, 6-4, 7-3, 8-4, 9-3, 10-1.

 

రచయిత: బంగారు సత్యనారాయణ 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  ఆర్థిక అత్యవసర పరిస్థితి

  గవర్నర్‌

 ఉపరాష్ట్రపతి

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 30-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌