• facebook
  • whatsapp
  • telegram

మిశ్రమ సంస్కృతి - పండుగలు

సామరస్య సహజీవన సంబురాలు!

  కుతుబ్‌షాహీల పాలనలో ప్రారంభమైన సంస్కృతీ సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నాడు వివిధ మతాలు, జాతుల ప్రజలు సామరస్యంతో కలిసిపోయి నిర్వహించుకున్న అనేక పర్వదినాలను నేటికీ పండుగలుగా జరుపుతున్నారు. శతాబ్దాల సహజీవనానికి  చిహ్నాలుగా నిలిచి ఉన్న ఆ సంబురాల విశిష్టతలను, వివరాలను అభ్యర్థులు తెలుసుకోవాలి. 

 

  కుతుబ్‌షాహీల కాలంలో హైదరాబాదు నగరం భిన్న ప్రజల సహజీవనానికి కేంద్రంగా ఉండేది. వివిధ మతాలు, జాతుల సమ్మేళనంతో విలసిల్లింది. సూఫీ మత గురువుల బోధనల వల్ల హిందూ - ముస్లింల మధ్య మత సామరస్యం పెంపొంది సంస్కృతీ సమ్మేళనానికి, శాంతియుత జీవనానికి దారితీసింది. 

  కుతుబ్‌షాహీల పాలన సమయంలో ఇరాన్‌కు చెందినవారు చాలామంది హైదరాబాదుకు వలస వచ్చారు. వీరిలో మీర్‌ - మొమీన్‌ - అస్ట్రాబాదీ అనే ఇరాన్‌ దేశీయుడు మహమ్మద్‌ కులీకుతుబ్‌షా దగ్గర వజీర్‌ (ప్రధానమంత్రి) పదవికి నియమితుడయ్యాడు. ఈయన పర్షియా రాజులైన సఫావిద్‌ వంశం వారితో గోల్కొండ సుల్తాన్‌లకు సన్నిహిత సంబంధాన్ని ఏర్పరిచాడు. ఫలితంగా మధ్య ఆసియా ప్రాంతం నుంచి అనేక మంది కవులు, కళాకారులు, వృత్తి నిపుణులు ఇక్కడికి వలస వచ్చారు. దీంతో హైదరాబాదు నగరంలో మిశ్రమ సంస్కృతి (కాంపోజిట్‌ కల్చర్‌) అభివృద్ధి చెందింది. అది నేటికీ సజీవంగా ఉంది.                              

  కుతుబ్‌షాహీ పాలకులు వారి రాజ్య సుస్థిరత, అధికారం స్థానిక హిందూ ప్రజల మద్దతుపై ఆధారపడి ఉందని గ్రహించారు. అందువల్ల వారు సంపూర్ణ పరమత సహనాన్ని ప్రదర్శించారు. హిందువుల ఆచార వ్యవహారాలను గౌరవించారు. వారిని ఉన్నతోద్యోగాల్లో నియమించారు. పాలకుల అండతో హిందూ - ముస్లింలు అనేక పండుగలు, ఉత్సవాలను స్నేహపూర్వక వాతావరణంలో ఘనంగా నిర్వహించుకునేవారు. వీరు హిందూ యాత్రికులపై ఎలాంటి పన్నులను విధించలేదు. తెలంగాణ ప్రాంతంలో మొహర్రంను పీర్ల పండుగ పేరుతో హిందువులు (అన్నీ కులాలవారు) అన్ని గ్రామాల్లో అత్యంత వైభవంగా జరిపేవారు. ఈ సందర్భంగా అనేక మొహర్రం గీతాలు ఆలపించేవారు. దక్కన్‌లో ప్రసిద్ధ సూఫీ సన్యాసులైన గెసూదెరాజ్, హుస్సేన్‌ షావలీ లాంటివారు మానవతా విలువలు, సోదర భావాన్ని, హిందూ - ముస్లిం సఖ్యతను బోధించారు. రంజాన్‌కు ముందు ముస్లింలు నిర్వహించుకునే పండుగ షబీబారత్, దీపావళిని పోలి ఉండేది. నాటి పాలకులు తమ దర్బార్‌లో ఈద్, దుస్సేరాత్, హోళి, దీపావళి, వసంత పంచమి లాంటి పండుగలనూ జరిపించేవారు. 

 

తెలంగాణలో ముఖ్యమైన పర్వదినాలు

 

బోనాలు: ఇది అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. జులై లేదా ఆగస్టులో వచ్చే ఆషాడమాసంలో ఈ పండుగను జరుపుతారు. ఆషాడమాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ సొంత కూతురు ఇంటికి వచ్చిన భావనతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వండిన భోజనాన్ని మట్టి లేదా రాగి లేదా ఇత్తడి పాత్రల్లో పెట్టి వాటిని వేప రెమ్మలు, పసుపు, కుంకుమలతో అలంకరించి దానిపై దీపం ఉంచుతారు. ఈ విధంగా తయారుచేసిన భోజనాన్ని తలపై పెట్టుకొని డప్పుగాళ్లు, ఆటగాళ్లతో కలిసి ఊరేగింపుగా గుడికి వెళతారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, డొక్కాలమ్మ, ముత్యాలమ్మ, మారెమ్మ లాంటి గ్రామదేవతల ఆలయాలను అలంకరిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడతారని ప్రజల విశ్వాసం. 

 

రంగం: బోనాల పండుగ రెండో రోజు రంగం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పోతురాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఈ కోపాన్ని తగ్గించడానికి అక్కడ ఉన్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును సమర్పిస్తారు. అమ్మవారి సోదరుడైన పోతురాజు తన దంతాలతో ఆ మేకపోతు మెడను కొరికి తల, మొండెం వేరుచేసి పైకి ఎగురవేస్తాడు. దీన్ని గావుపెట్టడం అంటారు. రంగం కార్యక్రమంలో పూనకం వచ్చిన మహిళ భవిష్యవాణి వినిపించడంతో ఈ పండుగ ముగుస్తుంది. 

 

నవరాత్రి ఉత్సవాలు: ఇది సెప్టెంబరు, అక్టోబరులో జరిగే పండుగ. ఆశ్వయుజ మాసంలోని మొదటి రోజున నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇది 9 రాత్రులు 10 రోజులు జరిగే పండుగ. చాంద్రమాన పంచాంగం ప్రకారం ఈ పండుగ తేదీలను నిర్ణయిస్తారు. నవరాత్రుల్లో దేవిని వివిధ రూపాల్లో ఆరాధిస్తారు. భక్తులను రక్షిస్తుందనే నమ్మకంతో మొదటి మూడు రోజులు దుర్గాదేవిని, సంపాదన ఇచ్చే మాతగా ఆ తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవి రూపంలో, చివరి మూడు రోజుల్లో సరస్వతి రూపంలో పూజిస్తారు. ఎనిమిదో రోజున దుర్గాష్టమి, తొమ్మిదో రోజున మహార్నవమి సందర్భంగా సరస్వతి పూజ, ఆయుధ పూజలను జరుపుతారు.

 

దసరా: తెలంగాణలో దసరా (విజయదశమి) పండుగ ముఖ్యమైంది. ఆశ్వయుజ మాస పాడ్యమి నుంచి నవమి దాకా నవరాత్రులని పిలుస్తారు. పదోరోజును విజయదశమి అంటారు. ప్రజలు ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి జమ్మిచెట్టుకు పూజలు చేస్తారు. జమ్మి ఆకును బంగారం పేరుతో ఇచ్చి పుచ్చుకుంటారు. వివిధ వృత్తుల వారు తమ పనిముట్లకు పూజలు చేస్తారు. ఆ రోజు పాలపిట్టను దర్శించుకుంటారు. దసరా రోజు రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఈ రోజును చెడుపై మంచి సాధించిన విజయంగా భావిస్తారు. 

 

బతుకమ్మ: ఈ పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మాసం మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు 9 రోజుల పాటు నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైంది. ఇది తెలంగాణ సంస్కృతికి చిహ్నం. ఒకనాటి ‘బతుకునిచ్చె అమ్మ’ అనే పదమే కాలక్రమంలో ‘బతుకమ్మ’గా ప్రఖ్యాతి చెందింది. వెదురు లేదా దూసేరు తీగలతో అల్లిన సిబ్బిలో గుమ్మడిపూలు పరిచి వాటిపై తంగేడు, గునుగు, నువ్వు, కట్ల, గట్టు, కాకర, బీర, గన్నేరు, పొట్ల, కట్లాయి, బంతి, చామంతి పూలను వరుసగా ఒకదానిపై ఒకటి ఉంచుతూ గోపురం ఆకారంలో పేరుస్తారు. దానిపైన తమలపాకును పెట్టి పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఈ మొత్తం సముదాయాన్ని బతుకమ్మగా వ్యవహరిస్తారు. బతుకమ్మ చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. బతుకమ్మలో ఉపయోగించే ప్రధానమైన పువ్వులు గునుగు, తంగేడు. మహిళలు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ గౌరిదేవిని కీర్తిస్తూ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో ప్రారంభమయ్యే ఈ పండుగ సద్దుల బతుకమ్మగా ముగుస్తుంది (చిన్న పిల్లలు, పెళ్లికాని అమ్మాయిల పండుగ - బొడ్డెమ్మ). ఈ బతుకమ్మ పాటలో చందమామ పాటలు, ఉయ్యాల పాటలు ఎక్కువగా వినిపిస్తాయి. వీటిని పరిశోధనలో వెలువరించిన వారు ఆచార్య బిరుదురాజు. ‘బతుకమ్మ బతుకమ్మా ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో, పాలించవే మమ్ము ఉయ్యాలో’ లాంటి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడతారు. 

 

  నవాబులు, భూస్వాముల అకృత్యాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలచుకొని పాడే పాటల నుంచి బతుకమ్మ పాటలు పుట్టినట్లు తెలుస్తోంది. బతుకమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడతారు. ఈ పాటలో మహిళల కష్టసుఖాలు, ప్రేమలు, ఆప్యాయత, స్నేహం, బంధుత్వం, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు అన్నీ మేళవిస్తారు. పాటను ఒకరు ముందుగా మొదలుపెడితే మిగిలినవారు వారితో గొంతు కలుపుతారు. చాలాసేపు ఆడిపాడిన తర్వాత పురుషులు వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత పళ్లెంలో తెచ్చిన నీటితో మహిళలు ‘వాయినమ్మా వాయినం’ అంటూ వాయినాలు ఇచ్చి పుచ్చుకుంటారు. అనంతరం ఇంటి నుంచి తెచ్చిన వివిధ పదార్థాలను పంచుకుంటారు. బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత, ప్రాశస్త్యాన్ని తెలంగాణ జాగృతి సంస్థ విస్తృతంగా ప్రచారం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ, బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తిస్తూ 2014, జూన్‌ 16న ఉత్తర్వులు జారీ చేసింది. 

 

* బతుకమ్మ పండుగను 9 రోజులు రోజుకో పేరుతో పిలుస్తారు. 

రోజు బతుకమ్మ పేరు నైవేద్యం
మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ నువ్వులు, నూకలు
రెండో రోజు అటుకుల బతుకమ్మ ఉడకబెట్టిన పప్పు, బెల్లం, అటుకులు
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు, పాలు, బెల్లం
నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ తడి బియ్యం, పాలు, బెల్లం
అయిదో రోజు అట్ల బతుకమ్మ అట్లు/దోశ
ఆరో రోజు అలిగిన బతుకమ్మ ----
ఏడో రోజు వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని వేపపండ్ల ఆకారంలో చేస్తారు
ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ వెన్న, నువ్వులు, బెల్లం
తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ

పెరుగన్నం, పులిహోర, నిమ్మకాయల చిత్రాన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం, వివిధ పొడులతో అన్నం

 

              

గ్రామ దేవతల ఉత్సవాలు 

  తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రజలు గ్రామానికి రానున్న కీడును నివారించడానికి గ్రామ దేవతలకు పూజలు చేస్తారు. ఏడుగురు అక్కాచెల్లెళ్లు అయిన గ్రామ దేవతలకు ప్రతి గ్రామంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. వారిలో పోచమ్మ, మైసమ్మ, మారెమ్మ, ముత్యాలమ్మ, ఉప్పలమ్మ, మహంకాలమ్మ, ఎల్లమ్మ లాంటి దేవతలకు గ్రామ ప్రజలు అందరూ కలిసి పండుగలు చేస్తారు. ఈ దేవతా ఉత్సవాల సమయంలో జంతువులను బలిచ్చే ఆచారం ఉంది. 

 

రచయిత: డాక్టర్‌ ఎం.జితేందర్‌ రెడ్డి

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  తెలంగాణ కళలు

‣  శాతవాహనులు 

 విష్ణుకుండినులు

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015


 

Posted Date : 30-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌