• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రపతి - కార్యనిర్వాహక అధికారాలు

దౌత్యం.. యుద్ధం.. శాంతి!

దేశపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదే జరుగుతుంది. అత్యున్నత నియామకాలన్నీ ఆయన/ఆమె జరుపుతారు. బడ్జెట్లు ప్రవేశపెడతారు. ఆర్థికం సహా అన్ని బిల్లులను ఆమోదిస్తారు.యుద్ధం ప్రకటించడం, శాంతి చేసుకోవడం, దౌత్యం నడపడం వంటి అధికారాలన్నీ రాష్ట్రపతి పరిధిలోనే ఉంటాయి. వీటిని అభ్యర్థులు ఆర్టికల్స్‌తో సహా తెలుసుకోవాలి. 

 

  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 53 ప్రకారం రాష్ట్రపతి భారతదేశ ప్రధాన కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తారు. దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగానే నిర్వహించాలి. రాష్ట్రపతి మన దేశ పాలనను స్వయంగా లేదా ఇతర రాజ్యాంగ బద్ధ అధికారులు, ప్రతినిధుల ద్వారా నిర్వహిస్తారు. ఆర్టికల్‌ 74(1) ప్రకారం రాష్ట్రపతికి పరిపాలనా వ్యవహారాల్లో సహకరించడానికి ప్రధాని నాయకత్వంలో మంత్రి మండలి ఉంటుంది. 

 రాష్ట్రపతి తన కార్యనిర్వాహక అధికారాలను చెలాయించడంలో భాగంగా పలు రకాల నియామకాలు చేపడతారు. 

ఆర్టికల్‌ 75(1): లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం మెజార్టీ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా నియమిస్తారు. ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రి మండలి సహచరులను నియమిస్తారు.
* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తుంది. 

 

ఆర్టికల్‌ 76(1): భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుడైన అటార్నీ జనరల్‌.

 

ఆర్టికల్‌ 124: సుప్రీంకోర్టు ప్రధాన, ఇతర న్యాయమూర్తులు.

 

ఆర్టికల్‌ 155: రాష్ట్రాలకు గవర్నర్లు.

 

ఆర్టికల్‌ 239: కేంద్రపాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్‌ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు. 

 

ఆర్టికల్‌ 148: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చులు, ఖాతాలను తనిఖీ చేసి, వాటి వివరాలను తెలియజేసే కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌).

 

ఆర్టికల్‌ 217: హైకోర్టుల ప్రధాన, ఇతర న్యాయమూర్తులు.

 

ఆర్టికల్‌ 263: కేంద్రం, రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి అంతర్‌ రాష్ట్రమండలి.

 

ఆర్టికల్‌ 280: కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీ విధానాలను సిఫార్సు చేసే కేంద్ర ఆర్థిక సంఘం, దానికి ఛైర్మన్, సభ్యులు.

 

ఆర్టికల్‌ 315: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు.

 

ఆర్టికల్‌ 316: జాయింట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు.

 

ఆర్టికల్‌ 324: కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన, ఇతర కమిషనర్లు.

 

ఆర్టికల్‌ 323(A): సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ ఛైర్మన్, సభ్యులు.

 

ఆర్టికల్‌ 338: జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు.

 

ఆర్టికల్‌ 338(A): జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు.

 

ఆర్టికల్‌ 340: జాతీయ వెనుకబడిన కులాల ఛైర్మన్, సభ్యులు.

* జాతీయ మహిళా కమిషన్, జాతీయ సమాచార కమిషన్, జాతీయ మైనార్టీ కమిషన్, లోక్‌పాల్‌కు ఛైర్మన్, సభ్యులను నియమిస్తారు.

 

ఆర్థిక అధికారాలు 

భారతదేశ ఆర్థిక విధానాలను ప్రభావితం చేసే పలు అధికారాలు, విధులు రాష్ట్రపతికి ఉన్నాయి.

 

ఆర్టికల్‌ 112:  కేంద్ర వార్షిక బడ్జెట్‌ను రాష్ట్రపతి అనుమతి ద్వారానే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.

 

ఆర్టికల్‌ 117:  ఆర్థిక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి.

 

ఆర్టికల్‌ 151:  కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కేంద్ర ప్రభుత్వ ఖర్చులు, ఖాతాలకు సంబంధించిన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తే, ఆయన / ఆమె వాటిని పార్లమెంటు ముందు ఉంచుతారు. 

 

ఆర్టికల్‌ 265:  ప్రజల నుంచి కొత్త పన్నులు వసూలు చేసే బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి.

 

ఆర్టికల్‌ 292:  భారత ప్రభుత్వం విదేశీ రుణాలు సేకరించేందుకు రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి.

 

ఆర్టికల్‌ 267: భారత ప్రభుత్వానికి ఊహించని ఖర్చులు ఎదురైనప్పుడు రాష్ట్రపతి నియంత్రణలో ఉండే భారత ఆగంతుక నిధి నుంచి రాష్ట్రపతి అనుమతితో నగదును తీసి ఖర్చు చేయవచ్చు.

 

ఆర్టికల్‌ 280:  కేంద్ర ఆర్థిక సంఘాన్ని అయిదేళ్లకు ఒకసారి ఏర్పాటు చేస్తారు.

 

దౌత్యాధికారాలు

* మన దేశం ప్రపంచంలోని ఇతర దేశాలతో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం ద్వారా ప్రపంచ దేశాల సహకారాన్ని పొందేందుకు రాష్ట్రపతి కృషి చేస్తారు.

* మిత్ర దేశాలకు మన దేశం తరఫున రాయబారులను నియమిస్తారు. మిత్ర దేశాల నుంచి మన దేశానికి వచ్చే విదేశీ రాయబారుల నియామక పత్రాలను స్వీకరిస్తారు. 

* మన దేశంలో ఉంటూ దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విదేశీ రాయబారులు, దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిస్తారు. 

* అంతర్జాతీయ స్థాయిలో జరిగే సమావేశాలకు భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు. 

 

సైనిక అధికారాలు

* రాష్ట్రపతి భారతదేశ సర్వసైన్యాధిపతిగా, త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్‌గా వ్యవహరిస్తారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌లకు అధిపతులను నియమిస్తారు.

* శత్రు దేశాలపై యుద్ధం ప్రకటించగలరు. శత్రు దేశాలతో జరుగుతున్న యుద్ధాన్ని విరమిస్తూ ప్రకటన చేయగలరు. 

* మన దేశం విదేశాలతో కుదుర్చుకునే శాంతి ఒప్పందం రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతుంది. 

* ప్రధాని సలహా మేరకు రక్షణమంత్రిని, రక్షణ మంత్రిత్వ శాఖలోని కీలకమైన అధికారులను నియమిస్తారు.

 

న్యాయాధికారాలు 

  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 72 ప్రకారం రాష్ట్రపతి క్షమాభిక్ష/న్యాయాధికారాలను కలిగి ఉంటారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, సైనిక కోర్టులు విధించిన శిక్షలను రాష్ట్రపతి నిలిపివేయగలరు. న్యాయ విచారణ, న్యాయస్థానాల్లో జరిగే పొరపాట్లను నివారించడం రాష్ట్రపతికి ఉన్న క్షమాభిక్ష అధికారాల ఉద్దేశం. పౌరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రపతికి ఉంటుంది. నిందితులు పరివర్తన చెందడానికి కూడా క్షమాభిక్ష అధికారాలు ఉపకరిస్తాయి. రాష్ట్రపతి అయిదు రకాల క్షమాభిక్ష అధికారాలను కలిగి ఉంటారు.

 

పార్డన్‌ (అబ్సాల్వింగ్‌ ఎంటైర్‌ పనిష్‌మెంట్‌): న్యాయస్థానాలు విధించిన శిక్షలను పూర్తిగా రద్దుచేసి క్షమాభిక్షను ప్రసాదించడం. 

ఉదా: ఉరిశిక్షను రద్దుచేసి సంబంధిత వ్యక్తికి ఉపశమనం కలిగించడం.

 

కమ్యుటేషన్‌ (ఛేంజింగ్‌ నేచర్‌ ఆఫ్‌ సెంటెన్స్‌): న్యాయస్థానాలు విధించిన ఒకరకమైన శిక్షను మరొక రకమైన శిక్షగా మార్పు చేయడం. 

ఉదా: ఒక వ్యక్తికి విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్పు చేయడం.

 

రెమిషన్‌ (రిడక్షన్‌ ఆఫ్‌ సెంటెన్స్‌): శిక్ష స్వభావంలో మార్పు లేకుండా శిక్షాకాలంలో మార్పు చేయడం.

ఉదా: ఒక వ్యక్తికి విధించిన 7 సంవత్సరాల జైలు శిక్షను 3 సంవత్సరాలకు తగ్గించడం.

 

రెస్పైట్‌ (ప్రొవైడింగ్‌ రిలీఫ్‌): ప్రత్యేక కారణం రీత్యా శిక్ష అమలును వాయిదా వేయడం లేదా మరొక రకమైన శిక్షగా మార్పు చేయడం.

ఉదా: శిక్షకు గురైన వ్యక్తి మానసిక సమతౌల్యతను కోల్పోయినప్పుడు, తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు, గర్భిణి అయితే ఈ విధమైన వెసులుబాటు ఉంటుంది. 

 

రిప్రైవ్‌ (పోస్ట్‌పోన్‌మెంట్‌ ఆఫ్‌ సెంటెన్స్‌): శిక్ష అమలు కాకుండా తాత్కాలికంగా నిలిపివేయడం.

ఉదా: శిక్షకు గురైన వ్యక్తి క్షమాభిక్ష పిటిషన్‌ రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నప్పుడు.

 

సుప్రీంకోర్టు తీర్పులు

సుధాకర్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసు: రాష్ట్రపతి, గవర్నర్‌లు ప్రసాదించే క్షమాభిక్ష అధికారాలను న్యాయసమీక్షకు గురి చేయవచ్చని ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. 

దేవేందర్‌ పాల్‌ సింగ్‌ థిల్లార్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మరణశిక్ష విషయంలో రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకున్నప్పుడు దానిపై రాష్ట్రపతి నిర్ణీత కాలంలోగా నిర్ణయం తెలియజేయకపోతే మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగానే పరిగణించాలని పేర్కొంది.

* ఉరి శిక్ష, సైనిక కోర్టులు విధించే శిక్షల విషయంలో క్షమాభిక్షను ప్రసాదించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. గవర్నర్‌కు ఈ అధికారాలు లేవు. 

* ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు మాత్రమే రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలను వినియోగించాలి.

న్యాయసలహా (ఆర్టికల్‌ 143): రాష్ట్రపతికి పరిపాలనా వ్యవహారాల్లో రాజ్యాంగపరమైన ధర్మసందేహాలు ఎదురైనప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహాను కోరవచ్చు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన న్యాయసలహాను రాష్ట్రపతి పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు.

 

ప్రత్యేక రక్షణలు

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 361 ప్రకారం రాష్ట్రపతికి కొన్ని ప్రత్యేక రక్షణలు మినహాయింపులు ఉన్నాయి. 

* పదవిలో ఉన్న రాష్ట్రపతిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయకూడదు. అరెస్టు చేయకూడదు. 

* రాష్ట్రపతిపై సివిల్‌ కేసులు నమోదు చేయాలంటే రెండు నెలల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. 

* రాష్ట్రపతి పదవిలో ఉండగా తీసుకున్న నిర్ణయాలపై పదవీ విరమణ అనంతరం దేశంలో ఏ న్యాయస్థానానికి కూడా బాధ్యులు కారు. 

* రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు, రాష్ట్రాల లోకాయుక్తలను గవర్నర్లు నియమించినప్పటికీ వారిని తొలగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది.

* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 244 ప్రకారం మన దేశంలో ఆదివాసీ, షెడ్యూల్డు ప్రాంతాలను రాష్ట్రపతి ప్రకటిస్తారు.

 

మాదిరి ప్రశ్నలు

 

1. రాష్ట్రపతి నియమించే వివిధ రాజ్యాంగ పదవులకు సంబంధించి సరికానిది?

1) ఆర్టికల్‌ 76(1) - అడ్వకేట్‌ జనరల్‌

2) ఆర్టికల్‌ 148 - కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌

3) ఆర్టికల్‌ 324 - కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన, ఇతర కమిషనర్లు 

4) ఆర్టికల్‌ 315 - యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు

 

2. రాష్ట్రపతి ముందస్తు అనుమతితో పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లును గుర్తించండి. 

ఎ) ఆర్టికల్‌ 112 - కేంద్ర వార్షిక బడ్జెట్‌

బి) ఆర్టికల్‌ 117 - ఆర్థిక బిల్లులు 

సి) ఆర్టికల్‌ 265 - సహాయక గ్రాంట్లు 

డి) ఆర్టికల్‌ 292 - విదేశీ రుణాల సమీకరణ బిల్లులు

1) ఎ, బి, సి     2) ఎ, సి, డి    3) ఎ, బి, డి    4) ఎ, బి, సి, డి

 

3. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం రాష్ట్రపతి అయిదేళ్లకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేస్తారు?

1) ఆర్టికల్‌ 275   2) ఆర్టికల్‌ 280   3) ఆర్టికల్‌ 265    4) ఆర్టికల్‌ 117

 

4. న్యాయస్థానాలు విధించిన శిక్షలను పూర్తిగా రద్దుచేసి, రాష్ట్రపతి క్షమాభిక్షను ప్రసాదించడం ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది?

1) కమ్యుటేషన్‌     2) పార్డన్‌    3) రెస్పైట్‌    4) రిప్రైవ్‌  

 

5. పరిపాలనా వ్యవహారాల్లో రాష్ట్రపతికి రాజ్యాంగ పరమైన ధర్మసందేహాలు ఎదురైనప్పుడు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహాను పొందగలరు?

1) ఆర్టికల్‌ 143   2) ఆర్టికల్‌ 124    3) ఆర్టికల్‌ 151   4) ఆర్టికల్‌ 361

 

సమాధానాలు

1-1,   2-3,   3-2,   4-2,   5-1.

 

రచయిత: బంగారు సత్యనారాయణ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  భారత రాష్ట్రపతి

‣ ఉపరాష్ట్రపతి

 రాష్ట్రపతి పాలన

 

‣ ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 21-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌