• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రపతి-విచక్షణాధికారాలు

విచక్షణతో విశిష్ట‌ముద్ర!

  రాజ్యాంగం ప్రకారం ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలికి పాలనాపరమైన అధికారాలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు రాజకీయ, ఇతర సందర్భాల్లో రాష్ట్రపతి తన విచక్షణతో అధికారాలను వినియోగించి పాలనపై విశిష్టముద్రలు వేస్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములవుతారు. ఈ అంశాలను పరిశీలించి అభ్యర్థులు రాష్ట్రపతి పదవికి రాజ్యాంగం కల్పించిన గౌరవం, ప్రాధాన్యంపై అవగాహన పెంచుకోవాలి. 

  రాష్ట్రపతి విచక్షణాధికారాలను రాజ్యాంగంలో ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఇవి సందర్భానుసారం రాష్ట్రపతికి లభించి, పరిపాలనలో ఆయన ముద్రను తెలియజేస్తాయి. 

1) లోక్‌సభ  సాధారణ ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ ఏ రాజకీయ పార్టీకి లభించని సందర్భంలో ప్రధానమంత్రిని ఎంపిక చేయడానికి రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను వినియోగిస్తారు. 

* 1989లో మన దేశంలో తొలిసారిగా 9వ లోక్‌సభ హంగ్‌ పార్లమెంట్‌గా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ (లోక్‌సభలో 272 స్థానాలు) ఏ రాజకీయ పార్టీకి లభించలేదు. ఈ ఎన్నికల్లో 191 స్థానాలతో పెద్ద రాజకీయ పార్టీగా కాంగ్రెస్‌ అవతరించినప్పటికీ రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ముందుకు రాలేదు. ఫలితంగా 141 స్థానాలతో రెండో పెద్ద పార్టీ కూటమిగా అవతరించిన జనతాదళ్‌కు చెందిన విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి రాష్ట్రపతి ఆర్‌.వెంకట్రామన్‌ ఆహ్వానించారు. 

* 1996లో 11వ లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ లభించకపోవడంతో 161 లోక్‌సభ స్థానాలతో పెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతాపార్టీకి చెందిన అటల్‌బిహారి వాజ్‌పేయీని ప్రధానమంత్రిగా అప్పటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ నియమించారు. కానీ లోక్‌సభలో మెజార్టీని నిరూపించుకోవడంలో విఫలమైన అటల్‌బిహారి వాజ్‌పేయీ 13 రోజులకే పదవిని కోల్పోయారు.

 

2) కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయినప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాన్ని కల్పించాలా లేదా లోక్‌సభను రద్దు చేసి ఎన్నికలకు పిలుపునివ్వాలా అనేది రాష్ట్రపతి విచక్షణ పైనే ఆధారపడి ఉంటుంది. 

* 1979లో మొరార్జీ దేశాయ్‌ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చరణ్‌ సింగ్‌ ముందుకు వచ్చారు. దీంతో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, చరణ్‌ సింగ్‌తో ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించి నెలరోజుల్లోగా లోక్‌సభలో విశ్వాసాన్ని నిరూపించుకోవాలని ఆదేశించారు. చరణ్‌ సింగ్‌ పార్లమెంట్‌కు హాజరుకాకుండానే పదవిని చేపట్టిన 23 రోజులకే రాజీనామా చేశారు. 

* చరణ్‌ సింగ్‌ రాజీనామా అనంతరం బాబూ జగ్జీవన్‌రామ్‌ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. కానీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆ అవకాశం కల్పించకుండా లోక్‌సభను రద్దు చేశారు. 

* 1998లో 12వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం 182 స్థానాలను గెలుపొందింది. ఇదే పార్టీకి చెందిన అటల్‌బిహారి వాజ్‌పేయీని అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ ప్రధానమంత్రిగా నియమించారు. కానీ 1999లో అటల్‌బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయింది. దీంతో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకపోవడం వల్ల రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ 12వ లోక్‌సభను రద్దు చేశారు. మన దేశంలో అతి తక్కువ కాలం (13 నెలలు మాత్రమే) పనిచేసిన లోక్‌సభ 12వ లోక్‌సభ.

 

3) పదవిలో ఉన్న ప్రధానమంత్రి అకస్మాత్తుగా మరణించిన సందర్భంలో మళ్లీ ప్రధాని నియామకంలో రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను వినియోగిస్తారు. 1984లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు గురవడంతో  అప్పటి రాష్ట్రపతి జ్ఞానీజైల్‌సింగ్‌ తన విచక్షణాధికారాన్ని వినియోగించి రాజీవ్‌గాంధీని ప్రధానిగా నియమించారు. ఆ సమయంలో సాధారణ పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించలేదని విమర్శలు ఎదురయ్యాయి. 

 

4) ఇతర సందర్భాలు

* 1998లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర కేబినెట్‌ రూపొందించిన ప్రసంగానికి బదులు అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ ఒక పాత్రికేయుడితో సంభాషణ ద్వారా జాతిని ఉద్దేశించి మాట్లాడారు.

* 1999లో అటల్‌బిహారి వాజ్‌పేయీ నాయకత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం రూపొందించిన నూతన టెలికాం విధానం, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ను మెరుగుపరిచేందుకు రూ.125 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ విషయాలపై అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

* డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2006లో రూపొందించిన లాభదాయక పదవుల బిల్లుకు అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఆమోద ముద్ర వేయకుండా పునఃపరిశీలనకు పంపారు. 

* 1997లో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కల్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనను విధించాలని ఐ.కె.గుజ్రాల్‌ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ చేసిన సిఫారసును అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ పునఃపరిశీలనకు పంపారు. 

భారత రాజ్యాంగం కేంద్ర మంత్రిమండలికి పాలనాపరమైన అధికారాలు కల్పించినప్పటికీ రాష్ట్రపతి పదవికి ప్రత్యేక గౌరవం, ప్రాముఖ్యతను ఇచ్చిందని జవహర్‌లాల్‌ నెహ్రూ పేర్కొన్నారు. 

 

రాజ్యాంగ సవరణలు - రాష్ట్రపతి అధికారాలపై పరిమితులు  

* ఇందిరా గాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ద్వారా ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి ఇచ్చే సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించారు. 

* మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ద్వారా ప్రధాని నాయకత్వంలోని కేంద్ర మంత్రిమండలి ఇచ్చే సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని, ఒకసారి పునఃపరిశీలనకు పంపవచ్చని, మళ్లీ తిరిగి వచ్చిన వాటికి రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదముద్ర ద్వారా అంగీకారాన్ని తెలియజేయాలని నిర్దేశించారు.

 

మాదిరి ప్రశ్నలు 

 

1. 1989లో 9వ లోక్‌సభ హంగ్‌ పార్లమెంట్‌గా ఏర్పడటంతో అప్పటి రాష్ట్రపతి ఆర్‌.వెంకట్రామన్‌ ఎవరిని ప్రధానిగా నియమించారు? 

1) రాజీవ్‌ గాంధీ           2) వి.పి.సింగ్‌           3) చంద్రశేఖర్‌           4) పి.వి.నరసింహారావు 

 

2. 1996లో 11వ లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీ పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ ఎవరిని ప్రధానిగా నియమించారు?

1) ఐ.కె.గుజ్రాల్‌           2) హెచ్‌.డి.దేవెగౌడ           3) చంద్రశేఖర్‌             4) అటల్‌బిహారి వాజ్‌పేయీ 

 

3. 1979లో చరణ్‌ సింగ్‌ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు బాబూ జగ్జీవన్‌రామ్‌ ముందుకు వచ్చినప్పటికీ అవకాశం ఇవ్వకుండా లోక్‌సభను రద్దు చేసిన రాష్ట్రపతి ఎవరు? 

1) శంకర్‌దయాళ్‌ శర్మ           2) నీలం సంజీవరెడ్డి          3) జ్ఞాని జైల్‌సింగ్‌             4) ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ 

 

4. 1997లో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కల్యాణ్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని ఆర్టికల్‌ 356 ప్రకారం రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధించాలని ఐ.కె.గుజ్రాల్‌ ప్రభుత్వం చేసిన సిఫార్సును పునఃపరిశీలనకు పంపిన రాష్ట్రపతి ఎవరు? 

1) కె.ఆర్‌.నారాయణన్‌           2) డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం 

3) ఆర్‌.వెంకట్రామన్‌                4) జాకీర్‌ హుస్సేన్‌ 

 

సమాధానాలు

 1-2     2-4     3-2     4-1

 

రచయిత: బంగారు సత్యనారాయణ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

‣  భారత రాష్ట్రపతి

  ఉపరాష్ట్రపతి

  భారత పార్లమెంట్ - లోక్‌సభ

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015


 

Posted Date : 09-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌