• facebook
  • whatsapp
  • telegram

అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు

నిలకడ వృద్ధి... నిర్మాణాత్మక మార్పు!

  ఒక దేశంలో వస్తుసేవల ఉత్పత్తి ఎలా ఉంది? వాటి అమ్మకాలు, కొనుగోళ్లు ఏవిధంగా జరుగుతున్నాయి? తదితర అంశాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను అంచనా వేస్తారు. అందుబాటులో ఉన్న వనరులు, వాటి కేటాయింపులు, వినియోగాలనూ పరిగణలోకి తీసుకుంటారు. ఇందుకోసం కొన్ని సూచీలను ఏర్పాటుచేశారు. ఆ కొలమానాల ప్రకారం మనదేశాన్ని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేర్కొన్నారు. 

 

  తక్కువ తలసరి ఆదాయం, పేదరికం, ఎక్కువ జనాభా వృద్ధి రేటు, వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాల కొరత, పెట్టుబడుల లేమి వంటివి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ లక్షణాలు. భారతదేశం ఈ రకంలోకే వస్తుంది. 

 

ఆర్థిక వృద్ధి: దీర్ఘకాలంలో వస్తుసేవల ఉత్పత్తి నిలకడగా పెరిగినప్పుడే దాన్ని వృద్ధిగా పేర్కొంటారు. అందుకే వాస్తవ తలసరి స్థూల జాతీయోత్పత్తిలోని దీర్ఘకాల వస్తుసేవల పెరుగుదలను ఆర్థికవృద్ధిగా నిర్వచిస్తారు. ఇది పరిమాణాత్మకమైంది, ఏకముఖమైంది. ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావన.  

ఉదా: అమెరికా

  స్థూల వస్తుసేవల కంటే దేశ జనాభా మరింత పెరిగితే తలసరి ఆదాయం తగ్గుతుంది. అధిక జనాభా కంటే జీడీపీ పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్నప్పుడే ఆర్థిక వృద్ధి జరుగుతుంది.

ఆర్థికాభివృద్ధి: ఆర్థికాభివృద్ధి చాలా విశాలమైంది, గుణాత్మకమైంది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన భావన.  ఉదా: భారత్‌ 

 

  ఆర్థికాభివృద్ధి అంటే ఆర్థిక వృద్ధితో పాటు ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు. వీటిని ప్రధానంగా కింది విధంగా పేర్కొంటారు. 

* నిరుద్యోగిత, పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గించడం.

* అక్షరాస్యతను పెంచి, ప్రజల ఆరోగ్యస్థితిని మెరుగుపరచడం. 

* జీడీపీలో వ్యవసాయ రంగం, పరిశ్రమలు, సేవారంగం వాటా పెరగడం.

* సంప్రదాయ ఉత్పత్తి పద్ధతులను వదిలి ఆధునిక ఉత్పత్తి పద్ధతులను ఎంచుకోవడం.

* రవాణా, విద్యుత్, సమాచారం లాంటి అవస్థాపన రంగాలను అభివృద్ధి చేయడం.

* పట్టణీకరణ 

* శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి

 

ఆర్థికాభివృద్ధిని కొలిచే సూచికలు

 

* తలసరి వినియోగ స్థాయి

 

* ఐక్యరాజ్య సమితి పరిశోధన సంస్థ సాంఘిక ఆర్థిక సూచీ (UNRISD), 1963

 

* భౌతిక జీవన నాణ్యత సూచీ (PQLI), (1970)

 

* మానవాభివృద్ధి సూచీ (HDI), 1990

 

* లింగ అసమానత సూచీ (GII), 1995

 

* లింగ అభివృద్ధి సూచీ (GDI), 1995 

 

* లింగ సాధికారత కొలమానం (GEM), 1995 

 

* మానవ పేదరిక సూచీ (HPI), 1997

 

* అమర్త్య కుమార్‌ సేన్‌ ప్రతిపాదించిన సామర్థ్యాల అప్రోచ్, 1999 

 

* బహుళ కోణ పేదరిక సూచీ (MPI), 2010

 

* ప్రపంచ హరిత ఆర్థిక వ్యవస్థ సూచీ (GGEI)

 

* సామాజిక ప్రగతి సూచీ (SPI)

 

భౌతిక జీవన నాణ్యత సూచీ (PQLI):     దీన్ని 1970వ దశకం మధ్యలో డేవిడ్‌ మోరిస్‌ అనే ఆర్థిక వేత్త అభివృద్ధి చేశారు. దీనిలో మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని అంచనా వేస్తారు. 1) అక్షరాస్యత రేటు 2) శిశు మరణాల రేటు 3) ఆయుర్ధాయం

 

మానవాభివృద్ధి సూచీ (HDI): యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (గీవిదీశి) మానవాభివృద్ధి నివేదికను విడుదల చేస్తుంది. మానవాభివృద్ధి సూచికను 1990లో పాకిస్థాన్‌ ఆర్థికవేత్త మహబూబ్‌-ఉల్‌-హక్‌ రూపొందించారు. అమర్త్యసేన్‌ కూడా ఈయనతో కలిసి పని చేశారు. దీనిలో ఆయుర్ధాయం, విద్యార్హత, తలసరి స్థూల జాతీయోత్పత్తి అనే మూడు అంశాలను తీసుకుంటారు. యూఎన్‌డీపీ మానవాభివృద్ధి నివేదిక - 2020ని 2020, డిసెంబరు 15న విడుదల చేసింది. మొత్తం 189 దేశాల ర్యాంకులను ప్రకటించారు. ఇందులో నార్వే మొదటి స్థానంలో ఉండగా నైగర్‌కు చివరి స్థానం లభించింది. భారత్‌ 131వ స్థానంలో నిలిచింది.

 

ప్రపంచ దేశాలు - అంతర్జాతీయ సంస్థల వర్గీకరణ 

 

2020లో ప్రపంచ బ్యాంకు అట్లాస్‌ పద్ధతి ద్వారా 2019 తలసరి స్థూల జాతీయాదాయం ఆధారంగా దేశాలను కింది విధంగా వర్గీకరించింది.

 

అల్ప ఆదాయ దేశాలు: 1036 డాలర్ల కంటే తక్కువ తలసరి స్థూల జాతీయాదాయం ఉన్న దేశాలు.

 

మధ్యమ ఆదాయ దేశాలు (నిమ్న మధ్య ఆదాయ దేశాలు): 1036 - 4045 డాలర్ల మధ్య ఆదాయ దేశాలు.

 

ఉన్నత మధ్య ఆదాయ దేశాలు: 4046 - 12,535 డాలర్లు డాలర్ల మధ్య ఆదాయం ఉన్న దేశాలు.

 

అధిక ఆదాయ దేశాలు: 12,535 డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన దేశాలు. 

* ప్రపంచ బ్యాంకు భారతదేశాన్ని మధ్యమ ఆదాయ దేశాల జాబితాలో చేర్చింది. 

 

భారత్‌- మిశ్రమ ఆర్థిక వ్యవస్థ 

భారత ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా (Mixed Economy) గా పేర్కొంటారు. 1948లో భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం వల్ల మన దేశంలో తొలిసారిగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు పునాది పడింది. 

 

లక్షణాలు: 

 

* సమాఖ్య వ్యవస్థ (ఫెడరల్‌ వ్యవస్థ) 

 

* మిశ్రమ ఆర్థిక వ్యవస్థ

 

* వ్యవసాయ ప్రాధాన్యం ఉన్న ఆర్థిక వ్యవస్థ

 

* ప్రజా పంపిణీ వ్యవస్థ - ఆహార భద్రత

 

* సముచిత స్థాయిలో పారిశ్రామికీకరణ 

 

* మూలధనకల్పన - విస్తరణ 

 

* వేగంగా వృద్ధి చెందుతున్న సేవారంగం

 

* పెరుగుతున్న ఎగుమతులు - రాబడి

 

* పెద్ద మార్కెట్‌గా రూపొందుతున్న వ్యవస్థ

 

* మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

 

* నిలకడగా వృద్ధి చెందే స్థూల ఆర్థిక వ్యవస్థ

 

* స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల 

 

* ద్రవ్యోల్బణ నియంత్రణ 

 

* ఆదాయ అసమానతలు తగ్గించడం 

 

* ఉపాధి కల్పన, అవకాశాల విస్తరణ 

 

* అవస్థాపన సౌకర్యాల కల్పన - విస్తృతి

 

* పెరుగుతున్న పట్టణీకరణ రేటు 

 

* సాంఘిక సేవల విస్తరణ - మానవ వనరుల అభివృద్ధి

 

5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా..!

  ప్రపంచ బ్యాంకు 2021, జలై 1న ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల జాబితా-2020 ప్రకటిచింది. వాటిలో మొదటి పది స్థానాల్లో ఉన్న దేశాలు 1) అమెరికా  2) చైనా  3) జపాన్‌  4) జర్మనీ  5) బ్రిటన్‌ 6) భారత్‌ 7) ఫ్రాన్స్‌  8) ఇటలీ  9) కెనడా  10) దక్షిణ కొరియా.

  సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌ రిసెర్చ్‌ ్బదినితీళ్శి - వరల్డ్‌ ఎకనామిక్‌ లీగ్‌ టేబుల్‌ - 2022 (13వ ఎడిషన్‌) 191 దేశాలకు సంబంధించిన నివేదికను ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాల జాబితాలో 2022లో అమెరికా మొదటి స్థానం, చైనా రెండో స్థానంలో ఉండగా తువాలు చివరి స్థానంలో ఉంది. భారత్‌ ఆరో స్థానంలో నిలిచింది. 2031 నాటికి భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ప్రకటించింది. 

* 2024 - 25 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. 

* నీతి ఆయోగ్‌ - న్యూ ఇండియాజీ75 డ్రాఫ్ట్‌ నివేదిక ప్రకారం 2022 సంవత్సరానికి భారతదేశాన్ని నాలుగు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం.

 

రచయిత: బండారి ధనుంజయ్‌ 

 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  భారత ఆర్థికవ్యవస్థ లక్షణాలు

  ఆర్థిక వృద్ధి - సూచికలు

‣  వస్తు సేవల పన్ను

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 28-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌