• facebook
  • whatsapp
  • telegram

ద్రవ్యోల్బణం

పాకుతూ... పరిగెడుతూ... నడుస్తూ... దూకుతూ!

  అప్పట్లో అయిదువేలు జీతం. అవసరమైనవన్నీ కొనుకున్నా... ఇంకా నెలకు అయిదు వందలు దాచుకునేవాళ్లం. ఇప్పుడు యాభైవేల వేతనమైనా ఏ మూలకు సరిపోవడం లేదు. ఇలాంటి మాటలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. మార్కెట్లో డబ్బు ప్రవాహం పెరిగింది. అంతకంటే వేగంగా వస్తుసేవల డిమాండ్, వాటి ధరలూ పెరిగాయి. డబ్బు విలువ పడిపోయింది. దీంతో వినియోగదారుల కొలుగోలుశక్తి తగ్గిపోయింది. ఇదే ద్రవ్యోల్బణం. ఆర్థిక వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్న అంతర్జాతీయ సమస్య. ఇది పాకుతుంది, నడుస్తుంది, పరిగెడుతుంది, దూకుతుంది. అందుకే దీన్ని నియంత్రించడానికి నిపుణులు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, వాటి భావనలు, రకాలు, అంచనా పద్ధతులు, కారణాలు, ఫలితాలు తదితరాలను పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

  ద్రవ్యోల్బణం ఒక స్థూలమైన జాతీయ సమస్య. ఇది వివిధ వర్గాల ప్రజలపై వేర్వేరు ప్రభావాలను చూపుతుంది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దశ, స్థాయులను ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రభుత్వం తగిన నివారణ చర్యలను చేపట్టాలి. లేకపోతే హెచ్చుస్థాయి ద్రవ్యోల్బణం ఆర్థిక అస్థిరతను కలిగిస్తుంది. సాధారణంగా ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. కానీ వాస్తవానికి వస్తుసేవలకు ఉన్న అత్యధిక డిమాండ్‌ వల్ల ద్రవ్యం విలువ తగ్గి ధరలు పెరగడాన్నే ద్రవ్యోల్బణం అంటారు.

 

అయిదు భావనలు 

1) సాధారణంగా ధరల తగ్గుదలను ప్రతిద్రవ్యోల్బణం అంటారు.

2) ద్రవ్యోల్బణం రేటులో తగ్గుదలను ద్రవ్యోల్బణ పంథా అంటారు.

3) నియంత్రించడానికి వీలుకాని ద్రవ్యోల్బణ విస్ఫోటాన్ని అతి తీవ్రమైన ద్రవ్యోల్బణం అంటారు.

4) ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగిత, తక్కువ స్థాయి ఆర్థిక వృద్ధిరేటు మిశ్రమ స్థితిని స్తబ్ధత ద్రవ్యోల్బణం అంటారు.

5) ప్రతి ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడానికి ధరలను పెంచే ప్రయత్నాన్నే పరిమిత ద్రవ్యోల్బణం అంటారు.

 

ద్రవ్యోల్బణ రకాలు 

పాకుతున్న ద్రవ్యోల్బణం (Creepimg Inflation): ఒక సంవత్సరంలో ధరల పెరుగుదల 3 శాతానికి మించకుండా ఉంటే దాన్ని పాకుతున్న ద్రవ్యోల్బణం అని కెంట్‌ అనే అర్థశాస్త్రవేత్త వివరించారు.

 

నడుస్తున్న ద్రవ్యోల్బణం (Walking Inflation): ఒక సంవత్సరంలో ధరల పెరుగుదల 3 - 4 శాతం మధ్యలో ఉంటే దాన్ని నడుస్తున్న ద్రవ్యోల్బణం అంటారు.

 

పరిగెత్తే ద్రవ్యోల్బణం (Running Inflation): సంవత్సరంలో ధరల పెరుగుదల 10 శాతం వరకు ఉంటే దాన్ని పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటారు.

 

దూకుతున్న ద్రవ్యోల్బణం (Gallop[ing Inflation): చాలా ఎక్కువ స్థాయిలో ధరల పెరుగుదల ఉంటే దాన్ని దూకుతున్న ద్రవ్యోల్బణం అంటారు. ధరల పెరుగుదల 100 శాతం కూడా ఉండవచ్చు. దీన్ని అతి తీవ్ర ద్రవ్యోల్బణం అంటారు. 

* రాబర్ట్‌ జె.గార్డన్‌ ద్రవ్యోల్బణాన్ని మూడు రకాలుగా వివరించారు. ఈ వివరణను త్రికోణ నమూనా (Triangle Model) అంటారు.

1) డిమాండ్‌ ప్రేరిత ద్రవ్యోల్బణం ((Demand Plan Inflation): ఇది ప్రభుత్వ, ప్రైవేటు వ్యయాల వల్ల సమష్టి డిమాండ్‌లో కలిగే పెరుగుదల కారణంగా ఏర్పడే ద్రవ్యోల్బణం.

 

2) వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం (Cost Push Inflation): ఉత్పత్తి కారకాల ధరల పెరుగుదల వల్ల సమష్టి సప్లయ్‌ తగ్గినప్పుడు ఈ ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

 

3) అంతర్లీన ద్రవ్యోల్బణం (Built-in Inflation): వేతనాలు పెరగాలనే కార్మికులు, ఉద్యోగుల ఆశలు ద్రవ్యోల్బణానికి ప్రేరణ కల్పిస్తాయి. దీన్ని ధర/వేతన విస్ఫోటం అంటారు. ఈ విధమైన వేతన పెరుగుదల వ్యయం వినియోగదారుడి పైకి మారుతుంది. అంతర్లీన ద్రవ్యోల్బణం గత కాలపు పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. అందువల్ల దీన్ని అంతర్లీన ద్రవ్యోల్బణం (హ్యాంగోవర్‌ ద్రవ్యోల్బణం) అంటారు.

 

గుణాత్మక ద్రవ్యోల్బణం (Quality Inflation): అమ్మకందారుడు వస్తువుల అమ్మకం ద్వారా సేకరించిన కరెన్సీని భావికాలంలో మార్పు చేసుకోవాలనే అంచనాపై ఆధారపడిన ధరల పెరుగుదలను గుణాత్మక ద్రవ్యోల్బణం అంటారు.

 

పరిమాణాత్మక ద్రవ్యోల్బణం (Quality Theory of Inflation): ద్రవ్య సప్లయ్, చెలామణీ, ద్రవ్య మారకాల సమీకరణంపై ఆధారపడిన ధరల పెరుగుదలను పరిమాణాత్మక ద్రవ్యోల్బణం అంటారు.

 

రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం (Sectoral Inflation): ఉత్పత్తి రంగంలోని ఒక తరహా పరిశ్రమలో తయారైన వస్తుసేవల ధరలు పెరగడాన్ని రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం అంటారు. ముడిచమురు ధర పెరిగితే దాన్ని ఉపయోగించే ఇతర పరిశ్రమల ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి.

 

ధర - శక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం (Pricing Power Inflation): పారిశ్రామిక, వ్యాపార సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి వాటి ఉత్పత్తి, అమ్మకపు ధరలు పెంచడాన్ని ధర - శక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం అంటారు.

 

కోశ సంబంధ ద్రవ్యోల్బణం (Fiscal Inflation): ఇది ప్రభుత్వం సేకరించిన రాబడి కంటే ఎక్కువ వ్యయం చేయడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణం. ప్రభుత్వ బడ్జెట్‌ లోటు వల్ల కలిగే ధరల పెరుగుదలను కోశ సంబంధ ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు.

 

ద్రవ్యోల్బణాన్ని అంచనావేసే పద్ధతులు 

కొంతరేటులో ధరల పెరుగుదల కొంత కాలం కొనసాగితే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయవచ్చు. 

1) వినియోగదారుల ధరల సూచిక (Consumer PriceIndex): ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులు వాడే వస్తుసేవల ధరలను ప్రతిబింబిస్తూ తయారు చేసిన ధరల సూచిక ద్వారా దీన్ని అంచనా వేయవచ్చు.

 

2) ఉత్పత్తిదారుల ధరల సూచిక (Producer Price Index): దీన్ని టోకు ధరల సూచిక అంటారు. వినియోగదారుడి ధరల సూచిక మాదిరిగానే ఉత్పత్తిదారుడి ధరల సూచికను కూడా నిర్మించవచ్చు.

 

3) స్థూల జాతీయోత్పత్తి అవ్యక్త ద్రవ్యోల్బణ సూచిక (GNP Implicit Price Deflator): ఇది ప్రతిద్రవ్యోల్బణానికి సంబంధించిన సూచిక. ఎందుకంటే ప్రస్తుత రూపాయి విలువలో స్థూల జాతీయోత్పత్తికి, ప్రాతిపదిక సంవత్సర రూపాయి విలువలో స్థూల జాతీయోత్పత్తికి ఉన్న వ్యత్యాసాన్ని తెలుపుతుంది.

 

4) వినియోగదారుడి వ్యయ అవ్యక్త ద్రవ్యోల్బణ సూచిక (Consumer Implicit Price Deflator): ఇది వినియోగదారుడి ధరల సూచికకు ప్రత్యామ్నాయ సూచిక. వినియోగదారుడు వ్యయం చేసే వస్తువుల ధరల్లోని మార్పును ఈ సూచిక తెలియజేస్తుంది.

 

5) జీవన ప్రమాణ వ్యయ సూచీ (Cost of Living Index): వినియోగదారుడి సూచీ లాంటిదే జీవన ప్రమాణ వ్యయ సూచీ. దీనిలో  స్థిర ఆదాయాలు, కాంట్రాక్టు ఆదాయాలు, వాటి వాస్తవిక విలువను నిలకడగా ఉంచడానికి తగిన సవరణలు చేసే వీలుంటుంది.

 

6) మూలధన వస్తువుల ధరల సూచీ (Capital Goods Price Index): వాస్తవానికి ద్రవ్య సప్లయ్‌ పెరుగుదల వినియోగదారుడి వస్తువుల ద్రవ్యోల్బణంతో పాటు మూలధన వస్తువుల ద్రవ్యోల్బణాన్ని కూడా కలిగిస్తుంది.

 

ప్రతిద్రవ్యోల్బణ సూచీ: కొన్ని సంవత్సరాల ధరల గణాంకాలను ఆధార సంవత్సర ధరల్లో తెలియజేయడానికి ఉపయోగపడే విలువను ప్రతిద్రవ్యోల్బణ సూచీ (Price Deflator)  అంటారు.

 

ద్రవ్యోల్బణానికి కారణాలు 

డిమాండ్, సప్లయ్‌ మధ్య సమతౌల్యం ఏర్పడటం చాలా కష్టం. అందువల్ల ధరల్లో స్థిరత్వాన్ని సాధించడానికి వీలు కాదు. ఏదైనా ఒక కాలంలో డిమాండ్, సప్లయ్‌ మధ్య సమతౌల్యం ఏర్పడినప్పటికీ అది ఎక్కువ కాలం నిలవదు. అందువల్ల ధరల స్థాయిని సవరిస్తుండాలి. ఇది నిరంతర ప్రక్రియ. లేకపోతే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రభుత్వానికి ధరలను నియంత్రించే శక్తి తగ్గిందని చెప్పవచ్చు. అందువల్ల మార్కెట్‌ శక్తులైన డిమాండ్, సప్లయ్‌  అంశాల్లో ఇమిడి ఉన్న అనిశ్చితి వల్ల ధరలు నిలకడగా లేక ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ద్రవ్యోల్బణానికి డిమాండ్‌ ప్రేరిత, వ్యయ ప్రేరిత అంశాలు కారణాలుగా చెప్పవచ్చు.

 

డిమాండ్‌ ప్రేరిత అంశాలు: 

* జనాభా పెరుగుదల వల్ల వస్తుసేవల డిమాండ్‌ పెరుగుతుంది. 

* దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడం వల్ల ప్రజల ఆదాయాలు పెరిగి వస్తుసేవలకు డిమాండ్‌ పెరుగుతుంది. 

* సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగ కల్పన పథకాలపై బడ్జెట్‌ కేటాయింపులు ఎక్కువ చేసి ఉపాధి కల్పించడం వల్ల వస్తుసేవల డిమాండ్‌ పెరుగుతుంది. 

* ఉత్పాదక ప్రాజెక్టులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడి రేటు తక్కువగా ఉండి ఉత్పత్తి కుంటుపడుతుంది. 

* ద్రవ్య సప్లయ్‌ పెరిగి ద్రవ్య చెలామణి ఎక్కువై వస్తుసేవలకు డిమాండ్‌ పెరుగుతుంది. 

* ఎంఆర్‌టీపీ చట్టం నీరుకారిపోవడం వల్ల వస్తుసేవలకు కృత్రిమ కొరత ఏర్పడి డిమాండ్‌ పెరుగుతుంది. 

* ప్రభుత్వ రుణ సేకరణ పెరిగి అనుత్పాదక అంశాలపై వ్యయం చేయడం వల్ల దేశంలో కొనుగోలుశక్తి పెరిగి డిమాండ్‌ పెరుగుతుంది. 

* బడ్జెట్‌లో కోశలోటు నియంత్రణలో ప్రభుత్వం సఫలీకృతం కాలేకపోవడం వల్ల వస్తుసేవలకు డిమాండ్‌ పెరుగుతుంది.

* విచక్షణా రహిత, హేతుబద్ధం కాని సబ్సిడీల వల్ల కూడా వస్తుసేవలకు డిమాండ్‌ పెరుగుతుంది.

వ్యయ ప్రేరిత అంశాలు:

* ఉత్పత్తి కారకాలపై వ్యయం పెరుగుతుంది. భూమి రేటు, బాటకం, మూలధనంపై వడ్డీరేటు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. 

* శ్రామికుల వేతనాల పెరుగుదల వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. కొన్ని శ్రామిక సంఘాల డిమాండ్‌లు విపరీతంగా ఉంటున్నాయి. 

* పాతవైన పెద్ద పరిశ్రమల్లో ఆధునికీకరణ రేటు తక్కువగా ఉండి వ్యయం పెరుగుతుంది. పరిశ్రమల ఆధునికీకరణకు అవసరమైన యంత్ర భాగాలు దిగుమతి చేసుకోవడం వ్యయంతో కూడుకున్నది. కాబట్టి ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. 

* ప్రభుత్వరంగ సంస్థల యాజమాన్యం సమర్థంగా లేకపోవడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది.


ద్రవ్య సంబంధ అంశాలు: 

  సప్లయ్‌ వైపు ఆర్థిక అంశాలను వివరించినట్లు ద్రవ్య సప్లయ్‌ పెరుగుదల లేదా ద్రవ్య మిగులుకు ఉన్న డిమాండ్‌ తగ్గుదలను ద్రవ్యోల్బణ పరిస్థితిగా చెప్పవచ్చు.

* ఆస్ట్రిషన్‌ అనే అర్థశాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారం అదనపు ద్రవ్యం కలిగి ఉన్నవారి కొనుగోలుశక్తి పెరుగుతుంది. దాంతో వారి కొనుగోలు లక్షణాలు మారి సాధారణంగా వస్తుసేవల డిమాండ్‌ పెరిగి ద్రవ్యోల్బణ పరిస్థితులకు కారణమవుతాయి. 

* కార్ల్‌మార్క్స్‌ వాదన ప్రకారం శ్రామికశక్తిలో కొలిచిన ఉత్పత్తి వ్యయం వాస్తవిక ద్రవ్యోల్బణానికి ముఖ్య కారణం.

* జె.ఎం.కీన్స్‌ అనే అర్థశాస్త్రవేత్త విశ్లేషణ ప్రకారం ఆర్థిక వ్యవస్థలోని వాస్తవిక అంశాలను ద్రవ్య పారదర్శకత తెలియజేస్తుంది. ధరల పెరుగుదల రూపంలో ఆర్థిక వ్యవస్థలోని ఒత్తిడి కారణంగా ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.

  రాబోయే కాలంలో అనేక మార్పులు వస్తాయి. కాబట్టి ఉత్పత్తి స్థాయిని విధాన నిర్ణాయక పాలకులు కచ్చితంగా అంచనా వేయడం ఒక సమస్య. అందుకే ద్రవ్యోల్బణం అసమానంగా తగ్గడం కంటే పెరగుతుంది. అంటే విధాన నిర్ణాయక అనిశ్చితి కారణంగా ద్రవ్యోల్బణం ఏర్పడుతుందని చెప్పవచ్చు.ఇతర అంశాలు: భారతదేశంలో ద్రవ్యోల్బణం ఏర్పడటానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనేక అంశాలు కారణమవుతాయి.  

1) మూలధన కొరత  2) వ్యవస్థాపక నైపుణ్యత లేమి 3) శ్రామిక నైపుణ్యత కొరత 4) శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన లభ్యత లేమి  5) అవస్థాపక సౌకర్యాల కొరత 6) విదేశీ మారక ద్రవ్య కొరత, ఆహార భద్రత లేమి

 

ద్రవ్యోల్బణ ప్రభావాలు

ద్రవ్యోల్బణ ప్రభావం ముఖ్యంగా ఉత్పత్తి, పంపిణీ, విదేశీ చెల్లింపులపై ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దేశంలోని పారిశ్రామికవేత్తలు, రుణదాతలు, రుణగ్రహీతలు, వేతనాలు, జీతాలు పొందేవారు; షేర్లు, బాండ్లు లాంటివి ఉన్న వివిధ వర్గాల ప్రజలపై కూడా ద్రవ్యోల్బణం ప్రభావం చూపుతుంది. 

 

వివిధ వర్గాలపై ద్రవ్యోల్బణ ప్రభావం: 

* ధరల పెరుగుదల దేశంలోని వివిధ వర్గాలపై అనేక రకాల ప్రభావాలు చూపుతుంది. దీనివల్ల కొన్ని వర్గాల వారికి ప్రయోజనం, మరికొన్ని వర్గాల వారికి నష్టం కలుగుతుంది. గతంలో రుణాలు స్వీకరించిన వారు (రుణ గ్రహీతలు) ద్రవ్యోల్బణంలో అప్పులు తీర్చడం వల్ల కొంత ప్రయోజనాన్ని పొందుతారు. ఎందుకంటే వారు అప్పు తీసుకున్నప్పుడు దాన్ని ద్రవ్య విలువ ఎక్కువ, తీర్చేటప్పుడు దాని ద్రవ్య విలువ తక్కువ. ఈ కారణంగా రుణదాతలు కొంతవరకు నష్టపోతారు. 

* స్థిరమైన ఆదాయ వర్గాల ప్రజలు ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోతారు. వారి ఆదాయం స్థిరంగా ఉండి వస్తుసేవల ధరలు పెరిగితే గతంలో మాదిరి  అదే పరిమాణంలో వస్తుసేవలను కొని వినియోగించలేరు. అందువల్ల జీవన ప్రమాణ స్థాయి తగ్గవచ్చు. 

* వేతన కార్మికులు ద్రవ్యోల్బణం వల్ల నష్టపోవచ్చు. కానీ అది ధరల పెరుగుదల రేటుకు సమానంగా, వేతనాల పెరుగుదలను వేగంగా సాధించే శ్రామిక సంఘాల శక్తి, సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. 

* నిర్ణీత వడ్డీరేటు కంటే డిబెంచర్లను కలిగి ఉన్నవారు ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోతారు. 

* వ్యవసాయ రంగంలో భూములను నిర్ణీత మొత్తాలకు కౌలుకు ఇచ్చినవారు నష్టపోతారు. ఉత్పత్తి వ్యయం పెరగకుండా వ్యవసాయ ఉత్పత్తి ధరలు పెరిగితే కౌలుదారులు లాభపడతారు. 

* నిర్ణీత వేతనాలకు పనిచేసే వ్యవసాయ కార్మికులు ద్రవ్యోల్బణం వల్ల నష్టపోతారు. 

అందువల్ల ద్రవ్యోల్బణం వివిధ వర్గాల ప్రజలపై మిశ్రమ ప్రభావాలను చూపుతుంది.  

 

రచయిత: బండారి ధనుంజయ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

 

 భార‌త ఆర్థికవ్య‌వ‌స్థ ల‌క్ష‌ణాలు

 స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌/ మార్కెట్

  ఆర్థిక సంఘం

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

 

Posted Date : 07-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌