• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో భూసంస్కరణలు

సమ సమాజ నిర్మాణం... సకల జనుల సౌభాగ్యం!


ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిలో భూమి ప్రధానపాత్ర పోషిస్తోంది. అనాదిగా ఆ భూమి పంపిణీలో పాతుకుపోయిన అసమానతలు సమాజంలో అస్తవ్యస్త పరిస్థితులకు కారణమవుతున్నాయి. దీనికి సంబంధించి బ్రిటిష్‌ కాలంలో రకరకాల విధానాలను అమలు చేసి శిస్తుల రూపంలో దోపిడీలు చేశారు. అందుకోసం జమీందారులు, భూస్వాముల వంటి దళారులను సృష్టించారు. స్వాతంత్య్రానంతరం సమ సమాజాన్ని, అందరి సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకొని సామాజిక న్యాయాన్ని అందించేందుకు ప్రభుత్వం భూ సంస్కరణలు చేపట్టింది. భారత ఆర్థిక వ్యవస్థ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వాటి గురించి వివరంగా తెలుసుకోవాలి. 

 

భారతదేశంలో భూసంస్కరణలు 

గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం ప్రజలకు భూమే ప్రధాన జీవనాధారం. కానీ ఆ భూమి పంపిణీకి సంబంధించి అనేక అసమానతలు అమలవుతున్నాయి. గ్రామాల్లో ఎక్కువ మొత్తం భూమి అతి తక్కువ సంఖ్యలో ఉన్న ధనవంతులైన భూస్వాముల అధీనంలో ఉంది. ఈ పరిస్థితి సామాజిక న్యాయం అందించాలనే ప్రణాళికా లక్ష్యానికి విరుద్ధంగా ఉంది. భూమి యాజమాన్యంలోని అసమానతలను తగ్గించి సామాజిక న్యాయాన్ని అందించడానికి భూసంస్కరణలు అమలుచేయాల్సిన అవసరం ఏర్పడింది. భూయాజమాన్యంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడాన్నే భూసంస్కరణలుగా చెప్పవచ్చు.

 

నిర్వచనాలు

* భూసంస్కరణలు అంటే భూమి పునఃపంపిణీ, కౌలు పరిమాణం నిర్ణయం, కౌలుదారులకు భద్రత, వ్యవసాయ కార్మికుల వేతనాల నిర్ణయం, వ్యవసాయ పరపతి ఆధారాల అభివృద్ధి, భూమి పన్నుల విధానంలో మార్పులు, సహకార వ్యవస్థ మెరుగుదల, వ్యవసాయ విద్య, సాంకేతిక మార్పులు.  - ఐక్యరాజ్య సమితి

* మధ్యవర్తుల తొలగింపు, భూహక్కుల పునఃపంపిణీ, కమతాల సమీకరణ, కౌలు సంస్కరణలు, సహకార, సామూహిక వ్యవస్థల నిర్మాణం భూసంస్కరణల లక్ష్యం.  - ప్రొఫెసర్‌ రాజ్‌కృష్ణ

* రైతుల ఆర్థిక, సామాజిక, రాజకీయ శక్తిని దృఢపరచడమే భూసంస్కరణల లక్ష్యం. భూమిని దున్నేవాడికి యాజమాన్యపు హక్కుగా చేయడంతోనే భూసంస్కరణల లక్ష్యం పూర్తికాదు. అలాంటి హక్కును సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందగలిగే ఇతరత్రా మార్పులు కూడా భూసంస్కరణల పరిధిలోనివే.   - జవహర్‌లాల్‌ నెహ్రూ 

స్థూలంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా ప్రభుత్వం జోక్యం చేసుకొని వ్యవసాయ నిర్మాణంలో (అగ్రేరియన్‌ స్ట్రక్చర్‌) మార్పులు తీసుకురావడాన్ని భూసంస్కరణలు అంటారు.

భూసంస్కరణలను వ్యవసాయ సంబంధ సంస్కరణలని అంటారు. భూసేకరణ చట్టం - 1894 ప్రకారం ప్రైవేటు భూములు సేకరించే అధికారం  ప్రభుత్వానికి ఉంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనసభలకు భూసంబంధ చట్టాలు చేసే అధికారం ఉంది. దేశంలో భూసంస్కరణలు చేసిన మొదటి రాష్ట్రం కేరళ. తర్వాత పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలు అమలుచేశాయి.

 

ఇతర దేశాల అనుభవాలు

చరిత్రాత్మకంగా ప్రపంచంలో భూసంస్కరణలు చాలా పురాతనమైనవి. ఆరో శతాబ్దంలో గ్రీకులోని (133 - 121 బి.సి) రోమ్‌లో భూసంస్కరణలు ప్రవేశపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం వరకు స్వీడన్‌ (1827), డెన్మార్క్‌ (1850), ఐర్లాండ్‌ (1930) దేశాల్లో భూసంస్కరణలు ప్రవేశపెట్టారు. తర్వాత ఫ్రాన్స్‌లో 1992లో అమలయ్యాయి.

బ్రిటిష్‌ ఇండియాలో భూమిశిస్తు విధానాలు:  బ్రిటిషర్ల పరిపాలనలో వ్యవసాయ భూముల శిస్తు వసూలుకు అనేక పద్ధతులు అనుసరించారు. వాటిలో మూడు విధానాలు ముఖ్యమైవి.అవి 1) జమీందారీ పద్ధతి (1793) 2) రైత్వారీ విధానం (1820)  3) మహల్వారీ విధానం (1833)

 

జమీందారీ పద్ధతి

శాశ్వత భూమిశిస్తు వసూలు విధానం: ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రభుత్వం 1793లో లార్డ్‌ కారన్‌వాలీస్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్న సమయంలో శాశ్వత భూమి శిస్తు వసూలు పద్ధతిని ప్రవేశపెట్టింది. దీన్నే జమీందారీ విధానం అంటారు. ఇది బెంగాల్, బిహార్, ఒడిశాల్లో అమల్లో ఉండేది. ఈ పద్ధతి ప్రకారం మొదట వ్యవసాయ భూముల నికర ఆదాయంలో 83% కౌలుగా వసూలు చేసేవారు. ఆ తర్వాత సాగుభూమిలో నికర ఆదాయంలో 40% శిస్తుగా వసూలు చేశారు. అయితే శాశ్వత భూమి శిస్తు నిర్ణయం ప్రకారం జమీందార్లు 10/11వ వంతు పంట దిగుబడిని ప్రభుత్వానికి చెల్లించాలి. దీంతో శిస్తు వసూలుకు జమీందార్లు రైతులను పీడించేవారు. చివరికి రైతులు భూమిపై వ్యవసాయం చేసే హక్కుకు వదులుకునేవారు. ఈ పద్ధతి వల్ల రైతులు, కూలీలుగా మారి వ్యవసాయ రంగ అభివృద్ధి క్షీణించింది.

తాత్కాలిక శిస్తు నిర్ణయ విధానం: భూమిశిస్తు వసూలు విధానాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించి అవసరమైనప్పుడు భూమిశిస్తును సవరించే తాత్కాలిక నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 20 - 40 సంవత్సరాలకు వ్యవసాయదారులు చెల్లించాల్సిన శిస్తు నిర్ణయిస్తారు. దీంతో రైతులపై పన్ను భారం పెరిగి వ్యవసాయ రంగానికి హాని జరిగింది.

* 1952లో మొదటి ప్రణాళికా కాలంలో జమీందారీ విధానాన్ని రద్దు చేసి భూసంస్కరణలు అమలుచేశారు.

 

రైత్వారీ విధానం

రైతు అంటే భూమిని సాగుచేసేవాడు. రైత్వారీ అంటే రైతులకు సాగు హక్కును ఇవ్వడం. భూమిని సొంతంగా సాగుచేసే లేదా ఇతరులతో సాగు చేయించే భూమి వాస్తవ యజమానులు/సాగుదారుల నుంచి నేరుగా శిస్తు వసూలు చేయాలని నిర్ణయించారు. మధ్యవర్తుల ద్వారా పన్నులు వసూలు చేయడంలో ప్రభుత్వానికి కలిగే నష్టాన్ని తొలగించడానికి 1820లో థామస్‌ మన్రో రైత్వారీ విధానాన్ని అమలుచేశారు. దీన్నే రైత్వారీ శిస్తు నిర్ణాయక విధానం అంటారు. భూమిపై హక్కు ఉన్న రైతులందరినీ భాగస్వాములుగా ఏర్పాటుచేశారు. సంవత్సరానికి ఒకసారి ఈ పన్నును రైతులు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ పద్ధతిలో పన్ను వసూలు చేయడంలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. భూసారం, ఉత్పత్తి వ్యయం అంశాల ఆధారంగా ప్రభుత్వమే పన్ను నిర్ణయిస్తుంది. భూయజమానులే (కౌలుదారులు కాదు) ఈ పన్నును బ్రిటిష్‌ ప్రభుత్వానికి చెల్లించాలి. స్థూల ఉత్పత్తిలో 40% - 50% వరకు పన్నుగా నిర్ణయించారు. శిస్తును 20 నుంచి 40 సంవత్సరాలకు ఒకసారి సవరించే వీలు ఉంటుంది. రైత్వారీ విధానాన్ని ముందుగా (1817 - 18) బొంబాయి, మద్రాస్‌ రాష్ట్రాల్లో ప్రవేశపెట్టి తర్వాత ఈశాన్య, వాయవ్య రాష్ట్రాలకు విస్తరించారు. దేశంలోని 38% వ్యవసాయ భూమిలో మాత్రమే ఈ విధానం అమల్లో ఉండేది.

 

మహల్వారీ విధానం

బ్రిటిష్‌ ప్రభుత్వం ఒక గ్రామంలోని వ్యవసాయ యోగ్యమైన మొత్తం భూమిని అంచనా వేసి దాన్ని ఆ గ్రామ సమష్టి ఆస్తిగా పరిగణించి మొత్తం భూమిపై శిస్తు విధించేది. ఈ పద్ధతిని మహల్వారీ పద్ధతి అంటారు. దీన్ని 1833లో విలియం బెంటింక్‌ ప్రవేశపెట్టాడు. గంగా మైదానంలో ఈ పద్ధతి అమల్లో ఉండేది. మహల్వారీ పద్ధతిని ఆగ్రా, అవధ్‌ ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామపెద్దకు ఈ భూమిపై శిస్తు వసూలు చేసే అధికారం ఉంటుంది. ఈయన గ్రామంలోని రైతుల నుంచి శిస్తు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తాడు. తన సేవలకు ప్రతిఫలంగా వసూలు చేసిన భూమి శిస్తులో కొంత శాతం కమిషన్‌గా పొందుతాడు. దేశంలోని 5 శాతం వ్యవసాయ భూమిలో మాత్రమే మహల్వారీ పద్ధతి అమల్లో ఉండేది.

* అలీస్‌ థోర్నర్‌ చెప్పినట్లు జమీందారీ విధానం జమీందార్లను గ్రామ అధికారులుగా మారిస్తే, రైత్వారీ విధానం గ్రామ వ్యవస్థను ఛేదించి రైతులను, ప్రభుత్వాన్ని వేరుచేసింది.

 

లక్ష్యాలు

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పార్లమెంటు జోసెఫ్‌ చెల్లాదురై కార్నెలియస్‌ కుమారప్ప (జేసీ కుమారప్ప) అధ్యక్షతన 1948లో వ్యవసాయ సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది. 1949లో ఆ కమిటీ నివేదిక సమర్పించింది. ఈ సిఫార్సులను అనుసరించి జమీందారీ లాంటి మధ్యవర్తుల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. దున్నేవాడికే భూయాజమాన్యాన్ని బదిలీ చేయాలని సూచించింది.

* వ్యవసాయ సంబంధాలను పునర్‌వ్యవస్థీకరించి సమసమాజ స్థాపన చేయడం. 

* భూసంబంధ వ్యవహారాల్లో దోపిడీ నిర్మూలన.  

* దున్నేవాడికే భూమి హక్కు కల్పించడం. 

* భూసంబంధ అసమానతలు తొలగించి గ్రామీణ ప్రాంతాల్లో పేదవర్గాల వారికి భూయాజమాన్య వసతి కల్పించడం. 

* భూమి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం. 

* ప్రభుత్వానికి, రైతులకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరిచి వివిధ వర్గాల రైతులకు సాంఘిక న్యాయం సమకూర్చడం. 

* స్థానిక సంస్థల ద్వారా సాంఘిక సమానత్వాన్ని సాధించడానికి విధానపరమైన మార్పులు చేయడం.

 

8వ పంచవర్ష ప్రణాళిక (1992-97)లో పొందుపరిచిన భూసంస్కరణల లక్ష్యాలు: 

* సామాజిక సమానత్వాన్ని సాధించేలా భూవ్యవసాయ సంబంధాలను పునర్నిర్మించడం.

* భూవ్యవసాయ సంబంధాల దోపిడీని అరికట్టడం.

* దున్నేవాడికే భూమిని సమకూర్చడం.

* గ్రామీణ పేదలకు భూమి పంపిణీ చేసి వారి ఆర్థిక సామాజిక పరిస్థితులను మెరుగుపరచడం.

* వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం.

* గ్రామీణ వ్యవస్థలో అన్నిరకాలుగా సమానత్వాన్ని సాధించడం.


రచయిత: బండారి ధనుంజయ 

మరిన్ని అంశాలు ... మీ కోసం!

‣  భారత ఆర్థికవ్యవస్థ లక్షణాలు

‣  ఆర్థిక వృద్ధి - సూచికలు

‣  వస్తు సేవల పన్ను

 

 ప్ర‌తిభ పేజీలు

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

‣ ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌