• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో భూసంస్కరణలు

సమానత్వం.. సామాజిక న్యాయ సాధనాలు!

  సమాజంలో సాంఘిక, రాజకీయ, ఆర్థిక అసమానతలకు ప్రధాన కారణం భూములు కొద్దిమంది చేతుల్లో ఉండిపోవడమే. శతాబ్దాలుగా పాతుకుపోయిన ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకొచ్చేందుకు, చిన్న రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు భూసంస్కరణలను ప్రవేశపెట్టారు. వీటి అమలు వల్ల భూపంపిణీ జరుగుతుంది. వ్యవసాయ ఉత్పాదకత పెరిగి దేశం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ప్రాంతంలో నిజాం కాలం నుంచి అనేక రకాలుగా భూములు కొన్ని వర్గాల స్వాధీనంలోకి వెళ్లిపోయాయి. అప్పటి భూస్వామ్య విధానాలు ఏవిధంగా ఉన్నాయి, వాటిని సరిదిద్దేందుకు తర్వాత కాలంలో చేపట్టిన సంస్కరణలు, చట్టాల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. 

  

ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని వ్యవసాయ నిర్మాణంలో (Agrarian Structure) మార్పులను తీసుకురావడాన్ని భూసంస్కరణలు అంటారు. 

* భూమిలేని కుటుంబాలు, చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, భూమిని మళ్లీ పంపిణీ చేయడానికి భూసంస్కరణలు సహాయపడతాయి. 

* భూమి, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక, ఆర్థికేతర మార్పులను భూసంస్కరణల ద్వారా ప్రవేశపెడతారు.

* సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునర్‌ నిర్మాణం కోసం భారత ప్రభుత్వం స్వాత్రంత్యం తర్వాత భూ సంస్కరణలను ప్రవేశపెట్టింది. 

* మనదేశంలో సామాజిక న్యాయం ఆశించిన స్థాయిలో అమలు కాకపోవడానికి ఉన్న ప్రధాన కారణాల్లో భూసంబంధాలు ఒకటి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలకు భూమి జీవనాధారం. కానీ స్వాతంత్య్రం వచ్చే నాటికి వివిధ ప్రాంతాల్లో భిన్న భూవ్యవసాయ సంబంధాలతో కూడిన అర్ధ‌ భూస్వామ్య వ్యవసాయ నిర్మాణం వారసత్వంగా సంక్రమించింది. 

* అల్ప సంఖ్యాకులైన భూస్వాములు, మధ్యవర్తుల అధీనంలో భూయాజమాన్య నియంత్రణ అధికంగా కేంద్రీకృతమైంది. వ్యవసాయ రంగంలో ప్రధాన వర్గాలుగా ఉన్న హక్కుదారులు, వ్యవసాయదారులు, కార్మికుల మధ్య భూసంబంధాలు (మానవ-భూసంబంధాలు) తీవ్రమైన అసమతౌల్యాలతో ఉన్న స్థితిలో స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించింది. 

* వ్యవసాయదారులు, భూస్వాములు భూమి ఉత్పాదకతను పెంపొందించడం పట్ల ఆసక్తి చూపలేదు. 

* సామర్థ్యం కంటే అతి స్వల్పంగా వ్యవసాయ ఉత్పాదకత, ఉత్పత్తుల వృద్ధి ఉండేవి.  

 

హైదరాబాద్‌ రాష్ట్రంలో భూస్వామ్య విధానాలు 

  హైదరాబాద్‌ రాష్ట్రంలో నిజాం పరిపాలనలో అయిదు రకాలైన భూస్వామ్య విధానాలుండేవి. అవి 1) జాగీర్లు 2) సంస్థానాలు 3) ఇనాందార్లు 4) సర్ఫేఖాస్‌ 5) ఖాల్సా/దివానీ/రైత్వారీ.

జాగీర్లు: నిజాం ప్రభుత్వం తమ బంధుమిత్రులకు, సైన్యంలో ఉన్నతస్థాయి అధికారులకు ‘జాగీర్‌’ పేరుతో కొన్ని గ్రామాలను అప్పగించింది. రైతుకు, నిజాం ప్రభుత్వానికి మధ్యవర్తులుగా వీరు రైతుల నుంచి పెద్ద మొత్తంలో శిస్తు వసూలు చేసేవారు. జాగీర్‌దారుల ప్రభావం 6,560 గ్రామాల్లో 40 వేల చదరపు మైళ్ల వరకు విస్తరించి ఉండేది. 1922లో 1170గా ఉన్న జాగీర్ల సంఖ్య 1949 నాటికి 1500కు పెరిగింది. 

 

సంస్థానాలు: హైదరాబాద్‌ సంస్థానంలో అనేక చిన్న ప్రాంతాలకు హిందూ రాజులు అధిపతులుగా ఉండేవారు. పేష్కరస్‌ రూపంలో వీరు నిజాం ప్రభువుకు నిర్ణీత మొత్తంలో కొంత శిస్తు చెల్లించేవారు. దున్నేవాడికి, నిజాం ప్రభుత్వానికి వీరు మధ్యవర్తులుగా ఉంటూ, అధిక మొత్తంలో రైతుల నుంచి శిస్తు వసూలు చేసేవారు. తమ అధీనంలో ఉన్న ప్రాంతంలో వీరికి విస్తృతాధికారాలు ఉండేవి. హైదరాబాద్‌ రాష్ట్రంలో మొత్తం 14 సంస్థానాలున్నప్పటికీ 5 పెద్ద సంస్థానాలు మాత్రమే చెలామణిలో ఉండేవి. 


అవి 1) గద్వాల 2) వనపర్తి 3) జట్టిప్రోలు 4) అమర్‌చింత 5) పాల్వంచ. వీటిలో నిజాం ప్రభుత్వ ప్రత్యక్ష పాలన ఉండే దివానీ విధానం, స్వతంత్రులుగా వ్యవహరించే జాగీర్ల వ్యవస్థ ఉండేవి. 

 

ఇనాందార్లు: నిజాం రాజులు తమ ఆస్థానంలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులు, కవులు, కళాకారులు, పండితులు, మసీదులు, మదర్సాలకు జీతాలు, బహుమతులకు బదులుగా భూములను ఇచ్చేవారు. వాటిని పొందిన వారిని ఇనాందార్లు అంటారు. ఈ ఇనాంలు 16 రకాలుగా ఉండేవి. ఇనాంల రూపంలో ఎనిమిది లక్షల ఎకరాలకు మించి భూమి ఉండేదని ఒక అంచనా. 

 

సర్ఫేఖాస్‌: నిజాం తన సొంత ఖర్చుల కోసం ప్రత్యేకంగా కేటాయించుకున్న గ్రామాలు సర్ఫేఖాస్‌ కిందకు వస్తాయి. వీటి నుంచి వచ్చే ఆదాయం/భాటకం నిజాం ఖజానాలో జమ అయ్యేది. 

ఖాల్సా లేదా దివానీ లేదా రైత్వారీ: నిజాం ప్రత్యక్షపాలనలో ఉండే వ్యవసాయ భూమిని ఖాల్సా లేదా దివానీ లేదా రైత్వారీ అనేవారు. ఇది హైదరాబాద్‌ రాష్ట్రంలో 60 శాతం ఉండేది. రైతుల నుంచి ప్రభుత్వ యంత్రాంగమే శిస్తు వసూలు చేసేది. దీని కోసం దళారీ వ్యవస్థ ఉండేది. శిస్తు వసూలు చేసే అధికారాన్ని మధ్యవర్తులకు వేలం పాట ద్వారా అప్పగించేవారు. ఆ మధ్యవర్తులను 1) దేశ్‌ముఖ్, 2) సర్‌ దేశ్‌ముఖ్, 3) దేశాయ్‌లు, 4) సర్‌ దేశాయ్, 5) పండిత్, 6) కరణం పేర్లతో పిలిచేవారు. శిస్తు వసూలు చేసే అధికారం తమ గుప్పిట్లో పెట్టుకున్న వీరు రైతులను పీల్చి పిప్పి చేయడమే కాకుండా వేల ఎకరాలను తమ పేరున రాయించుకున్నారు. 1875 తర్వాత కాలంలో అతి పెద్ద భూస్వాములుగా అవతరించారు. 

 

భూసంస్కరణ లక్ష్యాలు

  భూములు అమూల్య సంపద. అవి కొద్ది మంది చేతుల్లో బందీ కాకుండా చూసేందుకు, గ్రామీణ జనాభాకు పంపిణీ చేసేందుకు భూసంస్కరణలను రూపొందించారు. కేవలం భూమిని పంచడంతోనే సరిపెట్టకుండా భూస్యామ్య వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వచ్చేందుకు వాటిని ప్రవేశపెట్టారు. వ్యవసాయ సంబంధాలను మెరుగుపరిచి, రైతులకు మేలు చేకూర్చి, వ్యవసాయ ఉత్పాదకత పెంచి, దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడ‌టమే ఈ సంస్కరణల లక్ష్యం.

తెలంగాణలో కౌలు చెల్లింపులు: హైదరాబాద్‌ ప్రాంతంలో కౌలు చెల్లింపులు 3 రకాలు.అవి 1) బెతాయి 2) గల్లమక్తా 3) సర్ఫేఖాస్‌.

 

 బెతాయి: పండించిన పంటలో నిర్దిష్ట భాగం కౌలు చెల్లించాలి.

 

గల్లామక్తా: పంట ఉత్పత్తితో సంబంధం లేకుండా చెల్లించాలి.

 

సర్ఫేఖాస్‌: నగదు రూపంలో చెల్లించే స్థిరమైన కౌలు.

 

హైదరాబాద్‌ రాష్ట్రంలో కౌలుదార్లు: హైదరాబాద్‌ రాష్ట్రంలో రెండు రకాల కౌలుదార్లు ఉండేవారు.

 

1) షక్మిదార్లు (శాశ్వత కౌలుదార్లు): కౌలుదారుడికి రక్షణ, భూమిని సాగు చేసుకునే హక్కు ఉన్నవారిని షక్మిదార్లు అంటారు.

 

2) అసామి షక్మిదారు (ఏ హక్కులు లేని కౌలుదార్లు): వీరికి రక్షణ, భూమిని సాగు చేసుకునే హక్కు ఉండేదికాదు.

* కౌలుదార్ల సమస్యలను పరిష్కరించడానికి 1937లో బరుచా కమిటీని నియమించారు.

భూసంస్కరణలు - చట్టాలు 

* హైదరాబాద్‌ రాష్ట్రంలో జమీందార్, జాగీర్దార్, ఇనాందార్లు లాంటి మధ్యవర్తులను తొలగించడానికి, భూయాజమాన్య హక్కులు రైతులకు కల్పించడానికి పలు చట్టాలు అమల్లోకి వచ్చాయి. అవి

* హైదరాబాద్‌ జాగీర్దార్ల రద్దు క్రమబద్దీకరణ చట్టం, 1949 

* హైదరాబాద్‌ (తెలంగాణ) కౌలు, వ్యవసాయ భూముల చట్టం, 1950 

* ఆంధ్రప్రదేశ్‌ (తెలంగాణ ప్రాంతం) ఇనాముల రద్దు చట్టం, 1955

* ఆంధ్రప్రదేశ్‌ భూసంస్కరణల (భూకమతాల పరిమితి) చట్టం, 1973.

 

భూదాన ఉద్యమం

* భూకేంద్రీకరణను తగ్గించడానికి చేపట్టిన ఉద్యమమే ఈ భూదాన ఉద్యమం.

* 1951, ఏప్రిల్‌ 18న నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో భూదాన ఉద్యమం ప్రారంభమైంది.

* భూదాన ఉద్యమకర్త ఆచార్య వినోబా భావే

* భూదాన కర్త వెదిరే రామచంద్రారెడ్డి (100 ఎకరాలు దానం చేశారు.)

* భూదాన ఉద్యమంలో భాగంగా భూమిని దానంగా పొందిన తొలి రైతు మైసయ్య.

 

రచయిత: బండారి ధనుంజయ

మరిన్ని అంశాలు ... మీ కోసం!

  తెలంగాణలో భూసంబంధాలు

 తెలంగాణలో మానవ వనరులు

 తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

 

 ప్ర‌తిభ పేజీలు

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2022

 ప్ర‌తిభ ప్ర‌త్యేక పేజీలు - 2015

Posted Date : 28-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 2 - తెలంగాణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌