• facebook
  • whatsapp
  • telegram

పెద్ద మనుషుల ఒప్పందం- ఉల్లంఘనలు

మాట తప్పారు... మళ్లీ విడిపోయారు!

నిజాం పద్దెనిమిదో శతాబ్దంలో ఆంగ్లేయులకు ఆంధ్రను అప్పగించడంతో విడిపోయిన తెలుగు ప్రాంతాలు, స్వాతంత్య్రానంతరం పెద్దమనుషుల ఒప్పందంతో విశాలాంధ్రగా ఏర్పడ్డాయి. కానీ ఆ సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన రక్షణలు పూర్తిగా ఉల్లంఘనకు గురయ్యాయి. దాంతో తలెత్తిన పరిస్థితులు మళ్లీ రాష్ట్ర విభజనకు దారితీశాయి. తెలుగువారు కలవడానికి, విడిపోవడానికి ఉన్న కారణాలను అభ్యర్థులు సమగ్రంగా అర్థం చేసుకుంటే గ్రూప్స్, ఇతర పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయగలుగుతారు. 

  రెండు తెలుగు ప్రాంతాలను విలీనం చేసి విశాలాంధ్రను నిర్మించిన ఆంధ్ర రాష్ట్ర నాయకులు తెలంగాణకు ఇచ్చిన హామీలే పెద్దమనుషుల ఒప్పందం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఒప్పందంలోని హామీలన్నింటినీ పూర్తిగా ఉల్లంఘించారు. 1956 నవంబరు 1న రాష్ట్రం ఏర్పడగానే రక్షణల అమలు స్థానంలో ఉల్లంఘనలు నిరాటకంగా కొనసాగాయి.

 

హామీల విస్మరణ ఇలా..!

* విశాలాంధ్ర రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్‌) ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైతే ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ వారికి ఇవ్వాలి. కానీ మొదటి మంత్రిమండలిలో తెలంగాణ వారికి ఉప ముఖ్యమంత్రి పదవిని నిరాకరించారు. అంతేకాకుండా నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవి చేతికి ఆరో వేలు లాంటిదని అభివర్ణించి కించపరిచారు. 1956 నుంచి 1971 వరకు 15 ఏళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఆంధ్రా ప్రాంతానికి చెందినవారే పనిచేశారు.  

* ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర వారికి ఉద్యోగాలు కల్పించారు. ముల్కీ నియమాలకు వ్యతిరేకంగా బోగస్‌ సర్టిఫికెట్లను జారీ చేసి తెలంగాణ ఉద్యోగాలన్నింటినీ ఆంధ్ర ప్రాంతం వారికే దక్కేలా చేశారు. రాష్ట్ర సచివాలయంలో పెద్ద మొత్తంలో ఆంధ్రులే నియమితులయ్యారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అంతటా ఆంధ్రావారినే నియమించడం వల్ల తెలంగాణ విద్యావంతులు నిరుద్యోగులయ్యారు.  

* ఒప్పందానికి వ్యతిరేకంగా రాష్ట్రం ఏర్పడగానే హైదరాబాద్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీని రద్దు చేశారు. 

* ఒప్పంద ముసాయిదాలో రాష్ట్రం పేరును ఆంధ్ర - తెలంగాణ అని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత దాన్ని ఆంధ్రప్రదేశ్‌గా మార్పు చేశారు. ఈ విధంగా రాష్ట్రం పేరులో తెలంగాణ పదాన్ని తీసివేయడం తెలంగాణ అస్థిత్వాన్ని రూపుమాపడానికి చేసిన కుట్ర పూరితమైన చర్యగా ఇక్కడి నాయకులు భావించారు. 

* జల వనరుల వినియోగంలో తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా దోచేశారు. తెలంగాణలో గోదావరి నదిపై ప్రతిపాదిత నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని రద్దుచేశారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి మొదట ఎడమ కాలువకు ప్రతిపాదించిన 132 టీఎంసీల నీటిని 89 టీఎంసీలకు తగ్గించారు. ప్రతిపాదిత బీమా ప్రాజెక్టును రద్దుచేసి ఆంధ్రా ప్రాంతానికి చెందిన తుంగభద్ర కెనాల్‌ నిర్మాణానికి నిధులను కేటాయించారు. 

* పోచంపాడు (శ్రీరాంసాగర్‌)కు సంబంధించి మొదట ప్రతిపాదించిన 250 టీఎంసీల నీటిని రాష్ట్రం ఏర్పడిన తర్వాత 66 టీఎంసీలకు తగ్గించారు. మొత్తం మీద తెలంగాణలో నీటిపారుదల సామర్థ్యాన్ని 20 లక్షల ఎకరాల నుంచి 5.7 లక్షలకు తగ్గించారు.  

* రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణ ప్రాంతంలోని మిగులు నిధులను ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి తరలించారు. 

* 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి 5 నెలల కాలంలోనే తెలంగాణలోని మొత్తం మిగులు నిధులను ఆంధ్రా ప్రాంత అభివృద్ధికి కేటాయించారు.

* 1956 - 68 మధ్య కాలంలో తెలంగాణ ఆదాయంలో సాలీన, సరాసరి 12.4% నిధులను ఆంధ్రకు ఖర్చుచేశారు.   

* పెద్దమనుషుల ఒప్పందానికి వ్యతిరేకంగా తెలంగాణ వ్యవసాయ భూములను కోస్తా ఆంధ్రా ప్రజలు కొనుగోలు చేశారు. దీనివల్ల కాలక్రమంలో తెలంగాణలోని సన్నకారు రైతులు వ్యవసాయ కూలీలుగా మారారు.  

* వ్యవసాయాభివృద్ధి కోసం ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో నికరసాగు భూమి వరుసగా 5 : 4 ఉండగా వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర  ప్రభుత్వం చేసిన ఖర్చు వరుసగా 2.2 : 1 మాత్రమే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో వ్యవసాయ భూమి శిస్తును గణనీయంగా పెంచి ఆంధ్రాలో తగ్గించారు.  

* గ్రామీణ విద్యుదీకరణ కోసం ఆంధ్రా, తెలంగాణలకు కేటాయించిన నిధులు 5 : 1 మాత్రమే. విద్యుత్‌ ఉత్పత్తి తెలంగాణలో 225 మెగావాట్లు కాగా ఆంధ్రా ప్రాంతంలో 181 మెగావాట్లు ఉండేది. కానీ వినియోగంలో మాత్రం ఆంధ్ర, తెలంగాణల మధ్య నిష్పత్తి 2 : 1గా ఉండేది.

* తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రాంతీయ కమిటీ ఎలాంటి అధికారాలు లేక నామమాత్రంగా ఉండిపోయింది. ఆ తర్వాతి కాలంలో పూర్తిగా రద్దయింది. 

   ఈ విధంగా తెలంగాణ వారికి హామీల రూపంలో కల్పించిన రక్షణలన్నింటినీ ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించడం వల్ల 1969లో ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమ స్ఫూర్తే అనంతర కాలంలో కొనసాగి 2014లో రాష్ట్ర విభజనకు దారి తీసింది.

 

రచయిత: ఎ.ఎం.రెడ్డి 

 

మరిన్ని అంశాలు... మీ కోసం!

తెలంగాణ ఉద్యమ అనంతర పరిణామాలు

తెలంగాణ ప్రజా సమితి పగ్గాలు

తెలంగాణ కళలు

Posted Date : 16-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌