Post your question

 

    Asked By: లహరి

    Ans:

    - మీకు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో ఆసక్తి ఉంటే ఫ్యాషన్‌కి సంబంధించిన సబ్జెక్టుల్లోనే డిగ్రీ చేసే ప్రయత్నం చేయండి. ఫీజు కట్టడం ఇబ్బందయితే బ్యాంకులో విద్యారుణం తీసుకొనే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫీజు తక్కువ. అందుకని ప్రవేశ పరీక్షల్లో మెరుగైన మార్కులు పొంది ప్రభుత్వ కళాశాలల్లో సీటు తెచ్చుకొని, మెరిట్‌ స్కాలర్‌షిప్‌కోసం ప్రయత్నం చేయండి. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో స్థిరపడాలనుకొంటే ఫ్యాషన్‌ డిజైన్, లెదర్‌ డిజైన్, యాక్సెసరీ డిజైన్, టెక్స్‌టైల్‌ డిజైన్, నిట్‌ వేర్‌ డిజైన్, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్, అపారెల్‌ ప్రొడక్షన్‌ లాంటి స్పెషలైజేషన్లతో బీ డిజైన్‌/బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ లాంటి కోర్సులు చేయవచ్చు. వీటితో పాటు బీఎస్సీలో ఫ్యాషన్‌ డిజైన్, ఫ్యాషన్‌ మర్చెండైౖౖజింగ్‌ లాంటి కోర్సులూ చేయవచ్చు. మీకు ఆసక్తి ఉంటే.. ఫ్యాషన్‌ స్ట్టైలింగ్, ప్యాటర్న్‌ మేకింగ్, టెక్స్‌టైల్స్‌ ఫర్‌ ఇంటీరియర్స్‌ అండ్‌ ఫ్యాషన్, గార్మెంట్‌ కన్‌స్ట్రక్షన్, టైలరింగ్‌ అండ్‌ డిజైనింగ్‌ లాంటివాటిలో తక్కువ ఖర్చుతో సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు కూడా చేసే అవకాశం ఉంది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో రాణించాలంటే సర్టిఫికెట్‌ మాత్రమే ఉంటే సరిపోదు. సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మకత, కమ్యూనికేషన్‌ స్కిల్స్, నలుగురితో కలిసి పనిచేయగల సామర్థ్యం కూడా చాలా అవసరం.

    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: లహరి

    Ans:

    చాలా యూనివర్సిటీల్లో బీసీఏ చదవాలంటే ఇంటర్‌లో మ్యాథ్స్‌ ఉండాలన్న నిబంధన ఉంది. కొన్ని ప్రైవేటు యూనివర్సిటీల్లో ఈ నిబంధన లేనప్పటికీ బీసీఏ మొదటి సంవత్సరంలో మ్యాథ్స్‌ని బ్రిడ్జి కోర్సుగా చేయాల్సి ఉంటుంది. సాధారణంగా బీసీఏ లాంటి కోర్సుల్లో రాణించాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులపై పట్టు అవసరం. ఇక బీబీఏ, బీకాం  రెండు కోర్సులకూ మంచి భవిష్యత్తు ఉంది. బీబీఏని పేరున్న బిజినెస్‌ స్కూల్‌లో చదివితే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ అవకాశం ఉంది. బీబీఏ చదివినవారికి బీకాం పూర్తిచేసిన వారి కంటే కొంత ఎక్కువ వేతనం లభించవచ్చు. అదే సమయంలో బీబీఏ చదివిన వారినుంచి వ్యాపార సంస్థలు చాలా ఎక్కువ నైపుణ్యాలను ఆశిస్తున్నాయి. బీకాంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏదో ఒక ఉపాధి దొరికే అవకాశం ఉంది. బీకాం, బీబీఏల్లో దాదాపు సగం సిలబస్‌ ఒకేలా ఉంటుంది. కానీ వాటిని రెండు కోర్సుల్లో ఒక్కో రకంగా బోధిస్తారు. బీకాంలో వ్యాపారానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను ఎక్కువగా బోధిస్తారు. బీబీఏలో వ్యాపారానికి సంబంధించిన అప్లికేషన్‌లతో పాటు, కమ్యూనికేషన్, ప్రజెంటేషన్, ప్రాబ్లం సాల్వింగ్, కంప్యూటర్‌ నైపుణ్యాలపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. బీకాంలో అకౌంట్స్, ఫైనాన్స్, ట్యాక్స్, బిజినెస్‌ చట్టాలు, బ్యాంకింగ్‌ లాంటి అంశాలపై బోధన ఎక్కువ. డిగ్రీతో పాటు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ లాంటి కోర్సులు చేయాలంటే బీకాం చదవడం ఉపయోగకరం. భవిష్యత్తులో ఎంబీఏ చదవాలంటే బీబీఏతో పాటు, బీకాం పూర్తిచేసుకున్నవారూ అర్హులే. మీ దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఆశయాలనూ, ఆసక్తినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,  కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కె. వెంకటేష్‌

    Ans:

    ఇంటర్‌ బైపీసీ తర్వాత నర్సింగ్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, బయో మెడికల్‌ ఇంజినీరింగ్, జెనెటిక్స్, ఫోరెన్సిక్‌ సైన్సెస్, ఫిజియో థెరపీ,  ఫార్మసీ, ఆప్టోమెట్రీ, హెల్త్‌ సైకాలజీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, నేెచురోపతి, న్యూట్రిషన్, హోమ్‌ సైన్స్, హార్టి కల్చర్, ఆక్వా కల్చర్, ఫిషరీస్, ఫారెస్ట్రీ, జియాలజీ, ఫుడ్‌ సైన్స్, న్యూరో సైన్స్‌ కోర్సులు చదివే అవకాశం ఉంది. బయాలజీకి సంబధం లేని ప్రొఫెషనల్‌ కోర్సుల విషయానికొస్తే- ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ, బీబీఏ, టూరిజం, విజువల్‌ డిజైన్, హోటల్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, ఫ్యాషన్‌ టెక్నాలజీ, మల్టీమీడియా, మాస్‌ కమ్యూనికేషన్‌ లాంటి కోర్సులు చదవవచ్చు. సాధారణంగా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రతి సంవత్సరం జులైౖలోగా పూర్తవుతాయి. కొన్ని కోర్సులకు ప్రవేశ పరీక్షల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా కేంద్రీకృత అడ్మిషన్లు నిర్వహిస్తారు. మరి కొన్ని కోర్సుల్లో ఇంటర్‌లో పొందిన మార్కుల ఆధారంగా ప్రవేశం పొందవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: పావని

    Ans:

    మీరు డ్రాయింగ్‌ బాగా వేయగలను అంటున్నారు కాబట్టి, కార్టూన్లు వేయడం ఒక హాబీగా మొదలుపెట్టండి. మీరు వేసిన కార్టూన్లను వివిధ పత్రికలకు పంపుతూ మంచి పేరు తెచ్చుకోండి. ఆ తరువాత ఏదైనా పత్రికలో కార్టూనిస్ట్‌గా చేరవచ్చు. అలా కాకుండా, ఫ్రీలాన్సర్‌గా కూడా వివిధ పత్రికలకు, వాణిజ్య ప్రకటన సంస్థలకూ పనిచేయవచ్చు. కోర్సుల విషయానికొస్తే, కార్టూనిస్టుల కోసం ప్రత్యేకమైన కోర్సులు ఏమీ లేవు. యుడెమి, కోర్స్‌ ఎరా లాంటి ఆన్‌లైన్‌ వేదికల్లో కోర్సు చేయవచ్చు. మెరుగైన కెరియర్‌ కోసం డ్రాయింగ్‌ నైపుణ్యాలు అవసరమయ్యే సృజనాత్మక కోర్సులైన ఫైన్‌ ఆర్ట్స్, యానిమేషన్, విజువల్‌ ఆర్ట్, విజువల్‌ డిజైన్, గ్రాఫిక్‌ డిజైన్, డిజిటల్‌ గేమింగ్‌ డిజైన్‌ లాంటి కోర్సులు చేయండి. కార్టూన్లు వేయడంలో మరిన్ని మెలకువలు నేర్చుకోవడానికి ఎవరైనా ప్రముఖ కార్టూనిస్ట్‌ దగ్గర చేరి శిక్షణ పొందవచ్చు.

    Asked By: అల్తాఫ్‌

    Ans:

    వివిధ ప్రాంతాల్లో పర్యటించడమంటే ఇష్టం కాబట్టి మీరు డిగ్రీలో టూరిజం కోర్సు చదవండి. డిగ్రీ తరువాత టూరిజంలో పీజీ కూడా చేసి, ఆ రంగంలో కొలువు సంపాదిస్తే ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మీకు ఆసక్తి ఉంటే హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ హోటళ్లలో పనిచేసే అవకాశం కూడా ఉంటుంది.  షిప్‌లో షెఫ్‌గా చేరి సముద్రయానం కూడా చేయవచ్చు. డిగ్రీ, పీజీల్లో ఆర్కియాలజీ చదివి, ఆ రంగంలో ఉద్యోగం పొంది, పరిశోధనలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటించవచ్చు. ఇవే కాకుండా డిగ్రీ, పీజీల్లో ఆంత్రొపాలజీ, లింగ్విస్టిక్స్‌ లాంటి సబ్జెక్టులు చదివి, పరిశోధÅన రంగంలో ఉద్యోగం పొంది కూడా మీ కోర్కెను నెరవేర్చుకోవచ్చు. ఇంటర్‌ తరువాత ఏదైనా డిగ్రీ చేసి ఆర్మీ/ నేవీ/ఎయిర్‌ ఫోర్స్‌లో చేరి ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించవచ్చు. డిగ్రీ తరువాత బీఈడీ చేసి కేంద్రీయ విద్యాలయ, నవోదయ లాంటి పాఠశాలల్లో ఉద్యోగం పొందితే దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఉద్యోగం చేయొచ్చు. విదేశాల్లో ప్రముఖ యూనివర్సిటీల్లో పీజీ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: మనోజ్‌

    Ans:

    సాధారణంగా నేర పరిశోధనను పోలీసు వ్యవస్థ చేస్తుంది. ఫోరెన్సిక్‌ సైన్స్‌ చదివినవారు నేరపరిశోధనలో సహకారం మాత్రమే అందిస్తారు. ఒక నేరంలో అందుబాటులో ఉన్న సాక్ష్యాలను ఫోరెన్సిక్‌ నిపుణులు శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించి నివేదికను న్యాయస్థానాల్లో సమర్పిస్తారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌లో వివిధ విభాగాలుంటాయి. వాటిలో ఫోరెన్సిక్‌ ఆంత్రొపాలజీ, కంప్యూటర్‌ ఫోరెన్సిక్స్, ఫోరెన్సిక్‌ కెమిస్ట్రీ, ఫింగర్‌ ప్రింట్, డీఎన్‌ఏ ప్రొఫైలింగ్, ఫోరెన్సిక్‌ బాలిస్టిక్స్, ఫోరెన్సిక్‌ పాథాలజీ, ఫోరెన్సిక్‌ సైకాలజీ, ఫోరెన్సిక్‌ టాక్సికాలజీ, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ ముఖ్యమైనవి. మీ ఆసక్తిని బట్టి సరైన స్పెషలైజేషన్‌ ఎంచుకోండి. స్పెషలైజేషన్‌లు డిగ్రీ చివరి సంవత్సరంలో కానీ, పీజీలో కానీ ఉంటాయి. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు ఫోరెన్సిక్‌ కోర్సును డిగ్రీ, పీజీ స్థాయిలో  అందిస్తున్నాయి. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ కోసం ప్రత్యేకించి నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ ఉంది. మద్రాసు యూనివర్సిటీ బీఏ స్థాయిలో పోలీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ క్రిమినాలజీ కోర్సును అందిస్తోంది. ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సు చదివినవారికి పోలీస్‌ శాఖ, డిఫెన్స్, కేంద్ర/రాష్ట్ర ప్రైవేటు ఫోరెన్సిక్‌ పరిశోధన సంస్థలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎ. అభి

    Ans:

    ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌లో ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్‌ కోర్సు పూర్తిచేసినవారికి వివిధ ఉన్నత విద్యావకాశాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్వహించే బ్రిడ్జి కోర్సులో ఉత్తీర్ణత సాధించి, ఎంసెట్‌ రాసి ఇంజినీరింగ్‌ కోర్సులో కానీ, బీఎస్సీలో కానీ చేరవచ్చు. ఎలాంటి ప్రవేశ పరీక్షా రాయకుండా ఇంటర్‌ మార్కుల ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశం పొందవచ్చు. బ్రిడ్జి కోర్సుతో సంబంధం లేకుండా బీఏ, బీకామ్, బీబీఏ, ఐదు సంవత్సరాల బీఏ ఎల్‌ఎల్‌బీ/ బీబీఏ ఎల్‌ఎల్‌బీ/ బీకామ్‌ ఎల్‌ఎల్‌బీ లాంటి డిగ్రీ కోర్సుల్లోనూ చేరొచ్చు. నూతన విద్యావిధానం-2020 పూర్తి స్థాయిలోకి అమల్లోకి వస్తే మరిన్ని ఉన్నత విద్యావకాశాలు అందుబాటులో ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: గాయత్రి

    Ans:

    ప్రతి ఓటమీ విలువైన అనుభవాన్నిస్తుంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని, రాబోయే చిక్కులను సమర్థంగా ఎదుర్కొనే మానసిక  స్థైర్యాన్ని పొందండి. సమస్యతో పోరాడాలే కానీ, సమస్య నుంచి పారిపోవడం పరిష్కారం కాదు. ఈ వైఫల్యాన్ని మిమ్మల్ని మీరు రుజువు చేసుకొనే అవకాశంగా భావించండి. సమస్యను లోపల నుంచి కాకుండా, బయట నుంచి చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు సమస్య తీవ్రత తగ్గిపోతుంది!

    ‣ ఇంటర్‌ ఫెయిలై ఇంజినీరింగ్‌ చదవలేకపోయాననే బాధతో ఇలాంటి ప్రతికూల ఆలోచనలు చేయటంలో అర్థం లేదు. ప్రపంచంలో అన్నింటికన్నా అత్యంత విలువైనది మీ జీవితం. ఇది మీ ఒక్కరిదే కాదు, మీ కుటుంబానిదీ, సమాజానిదీ కూడా! ఆ ఆలోచన వచ్చిన ప్రతిసారీ మీరే లోకంగా ఉండే అమ్మానాన్నల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆత్మహత్య చేసుకున్న మీ క్లాస్‌ టాపర్‌ కన్నవాళ్లకు ఎంత క్షోభ మిగిల్చాడో దృష్టిలో పెట్టుకోండి. పరీక్షలో ఫెయిలవ్వడం అనేది ప్రమాదం లాంటిది. దాని తరువాత కూడా జీవితం ఉంటుంది. చాలాసార్లు అంతకుముందు కంటే ఇంకా బాగుండే అవకాశమూ ఉంది.

    దాదాపు 35 సంవత్సరాల క్రితం ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెÆయిలైనప్పుడు ఆత్మహత్య ఆలోచన నాకూ వచ్చింది. అప్పుడు మా అమ్మగారు ‘జీవితాన్ని అర్థ్ధాంతరంగా ముగించడం పిరికివాళ్ళు చేసే పని’ అంటూ మందలించి, ఆ ఆలోచన నుంచి నన్ను దూరం చేశారు. ఒకవేళ అలాంటి నిర్ణయమే తీసుకొనివుంటే, ఈ రోజు మీకీ సమాధానం ఇవ్వడానికి నేనుండేవాడినే కాదు.

    ఈ ఓటమి కంటే ముందు, మీరెన్నో విజయాలు సాధించివుంటారు. అవన్నీ గుర్తుకు తెచ్చుకొని మీమీద నమ్మకాన్ని పెంచుకోండి. ‘చంద్రుడు కనిపించట్లేదని ఏడిస్తే, కళ్ళల్లో నీరు నిండి నక్షత్రాలు కూడా కనిపించవు’. మన చుట్టూ ఉన్న చాలామంది మనకంటే తీవ్రమైన సమస్యలను చిరునవ్వుతో ఎదుర్కొంటూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అవకాశం ఉంటే ఎవరైనా ఒక కౌన్సెలర్‌తో మాట్లాడండి. అమ్మానాన్నలతో మీ ఆలోచనలను పంచుకోండి. సానుకూల దృక్పథం ఉన్న బంధువులతో, స్నేహితులతో మాట్లాడుతూ ఉండండి. మ్యాథ్స్‌ సబ్జెక్టుకు ట్యూషన్‌ పెట్టుకొని ఈసారి కచ్చితంగా ఉత్తీర్ణులయ్యే ప్రయత్నం చేయండి. ఇంటర్‌ మ్యాథ్స్‌లో ఉత్తీర్ణతే కష్టంగా ఉంటే, ఇంజినీరింగ్‌లో ఉండే మ్యాథ్స్‌ కూడా కష్టంగా ఉండే అవకాశం ఉంది. అందుకని ఇంజినీరింగ్‌ కాకుండా, నచ్చిన మరేదైనా డిగ్రీ చదివే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఇంజినీరింగ్‌ మీద బాగా ఇష్టం ఉంటే.. ఈ కోర్సులో చేరడానికి ముందే ఇంజినీరింగ్‌ మ్యాథ్స్‌పై పట్టు తెచ్చుకొనే ప్రయత్నం చేయండి. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: మోహిత్‌

    Ans:

    గేమ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ డిజైన్‌ అనేది వినూత్నమైన ప్రత్యేక కోర్సు. ఇందులో వినోదం, విద్య, వ్యాయామం కోసం గేమ్‌లను డిజైన్‌ చేయడం, తయారుచేయడం నేర్చుకుంటారు. ల్యాప్‌టాప్‌లు, పర్సనల్‌ కంప్యూటర్లు, మొబైల్‌లు, టాబ్లెట్‌ల కోసం గేమ్‌లను రూపొందించడంలో ఆసక్తి ఉన్నవారికి అవసరమయ్యే డిజైన్‌ స్పెషలైజేషన్‌ ఇది. వీడియో గేమ్‌ డెవలప్‌మెంట్, డిజైన్‌ అంశాలు, ప్రోగ్రామింగ్‌ సూత్రాల గురించి శిక్షణ ఇస్తారు.పెరుగుతున్న ఆదాయ స్థాయులు, ఇంటర్నెట్‌ వ్యాప్తి వల్ల గేమింగ్‌ పరిశ్రమకు మనదేశం ఒక చిరునామాగా మారబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో  గేమ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ డిజైన్‌ కోర్సును కొన్ని విద్యాసంస్థలు డిగ్రీ కోర్సులుగా అందిస్తున్నాయి. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న మూడు కళాశాలల్లో సంబంధిత కోర్సులు ఉన్నాయి.  
    * క్రియేటివ్‌ మల్టీమీడియా కాలేజ్‌ ఆఫ్‌ ఫైనార్ట్స్‌- బీఏ (ఆనర్స్‌) గేమ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ (4 ఏళ్లు)
    * బ్యాక్‌స్టేజ్‌ పాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గేమింగ్‌- బీఎస్సీ (ఆనర్స్‌) కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ గేమ్‌ డెవలప్‌మెంట్‌ (4 ఏళ్లు), బీఏ (ఆనర్స్‌) గేమ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌ (4 ఏళ్లు)
    * ఐకాట్‌ కాలేజ్‌- బీఏ (ఆనర్స్‌) గేమ్‌ అండ్‌ డిజైన్‌ (4 ఏళ్లు), బీఎస్సీ (ఆనర్స్‌) కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ గేమ్‌ డెవలప్‌మెంట్‌ (4 ఏళ్లు)
    గేమ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ డిజైన్‌ లాంటి కోర్సుల్లో డిగ్రీల కంటే, నైపుణ్యం ప్రధానం. ఈ కోర్సు చేసినవారికి గేమ్‌ డిజైనర్, గేమ్‌ డెవలపర్, గేమ్‌ రైటర్, గేమ్‌ యానిమేటర్, గ్రాఫిక్స్‌ సిములేటర్, గేమ్‌ టెస్టర్, గేమ్‌ ఆర్టిస్ట్, క్రియేటివ్‌ డైరెక్టర్‌ హోదాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌