• facebook
  • whatsapp
  • telegram

ఎంసెట్‌లో టాప్‌ర్యాంక్‌ ఎలా సాధ్యమైంది?

విజేతల విశ్లేషణ

పట్టుదల, ఏకాగ్రతతో శ్రమిస్తే ఎలాంటి ర్యాంకు అయినా సునాయాసంగా తెచ్చుకోవచ్చని రుజువు చేశారీ విద్యార్థులు. తెలంగాణ ఎంసెట్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకులు తెచ్చుకుని సత్తా చాటారు పోలు లోహిత్‌ రెడ్డి, జూటూరి నేహ. స్థిరమైన ప్రణాళికతో మాత్రమే ఇది సాధ్యమైందని చెబుతున్న వారి విజయానికి పాటించిన  మెలకువలేంటో  వారి మాటల్లోనే...

రోజంతా కాలేజీలోనే...

ఎంసెట్‌లో 154.14 మార్కులు తెచ్చుకోడానికి నేను చాలా శ్రమించాను. అమ్మానాన్నలు ఇద్దరూ డాక్టర్లు కావడంతో నేనూ డాక్టర్‌ అవ్వాలనే ఆశతో కష్టపడి చదివాను. 8, 9, 10 తరగతులు తెనాలిలో పూర్తిచేశాను. ఇంటర్‌లో విజయవాడ శ్రీచైతన్య కళాశాలలో బైపీసీలో చేరాను. మొదటి సంవత్సరం నుంచీ ఎక్కువ ఫోకస్‌ నీట్‌ పరీక్షపైనే ఉండేది. అదే సమయంలో అకడమిక్స్‌ను అశ్రద్ధ చేయకుండా రెండింటినీ బ్యాలెన్స్‌ చేస్తూ చదువుకున్నాను. నీట్, ఎంసెట్‌ పరీక్షల కోసం చాలా వరకూ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలపైనే ఆధారపడ్డాను. కొన్ని టాపిక్స్‌కు మాత్రం అదనంగా రాష్ట్ర అకాడమీ పుస్తకాలను చదివాను.

ఎప్పటి పాఠం అప్పుడే...

రోజూ ఉదయం 6.30 నుంచి రాత్రి 10.30 వరకూ కళాశాలలో ఉండేదాన్ని. క్లాసులు ముగిసిన తర్వాత స్టడీ అవర్స్‌ కోసం కూడా అక్కడే ఉండి చదువుకున్నాను. ఏరోజు చెప్పిన పాఠం ఆరోజే నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాను. దానివల్ల ఏడాది మొత్తం మీద సిలబస్‌ అంతా పూర్తిస్థాయిలో నేర్చుకునే అవకాశం ఉంటుంది. వారం వారం పరీక్షలు నిర్వహించేవారు. సిలబస్‌ పూర్తయ్యాక గ్రాండ్‌ టెస్ట్‌లు రాశాను. పాఠ్య పుస్తకాలకు అదనంగా కాలేజీలో ఇచ్చిన మెటీరియల్‌ చదివాను. పాఠం చివర్లో ఇచ్చిన సాధనలు (ఎక్సర్‌సైజ్‌) పూర్తిచేయడంతోనూ, అధ్యాపకులు ఇచ్చిన అసైన్‌మెంట్ల ద్వారా చాలావరకూ నేర్చుకున్నాను.

బోటనీ చదివేటప్పుడు ముందు తరగతిలో పాఠం బాగా వినాలి. లేదంటే టెక్ట్స్‌ బుక్‌ చదివేటప్పుడు అర్థం కాదు. ప్రతి వాక్యాన్నీ అర్థం చేసుకుంటూ చదివి, వీలైనంత సమాచారం గుర్తుంచుకోవాలి. ఎంసెట్‌ గత ప్రశ్నపత్రాలు చూసి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో గమనించాను. దాన్నిబట్టి టెక్ట్స్‌ బుక్‌నే మళ్లీ మళ్లీ రివిజన్‌ చేశాను. ఇందులో ఎక్కువగా విద్యార్థులను గందరగోళానికి గురిచేసేలా ప్రశ్నలు ఇస్తారు. ఆ ఇబ్బందిని ఎదుర్కోవాలంటే బాగా పునశ్చరణ చేయడం ఒక్కటే మార్గం. జువాలజీలో యానిమల్‌ కింగ్‌డమ్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణలతో సహా చదవాలి. ఏ టాపిక్‌ చదివినా దాన్ని ఒక చిత్రంలా (మైండ్‌ మ్యాప్‌) ఊహించుకుని గుర్తుంచుకునేదాన్ని.

ఫిజిక్స్‌ కోసం మా తరగతి నోట్సే చాలావరకూ సరిపోయింది. ఫ్యాకల్టీ బాగా చెప్పడం వల్ల వేరే ఏం చదవాల్సిన అవసరం రాలేదు. అందులో లెక్కలకు మాత్రం వీలైనన్ని ఎక్కువ మోడల్స్‌ సాధన చేశాను. ప్రవేశ పరీక్షల్లో జవాబు ఇవ్వడానికి ఒక్క నిమిషం మాత్రమే సమయం దొరుకుతుంది కాబట్టి అక్కడ కాలిక్యులేషన్స్‌ అవీ చేస్తాం అంటే కుదరదు. ప్రశ్నను చూడగానే టకటకా జవాబు రాబట్టేలా సాధన చేశాను. నీట్‌ కోసం చేసిన కసరత్తు చాలావరకూ ఎంసెట్‌కు సరిపోతుంది. కమ్యూనికేషన్‌ సిస్టం వంటి అదనపు టాపిక్స్‌ కోసం కాలేజీ నోట్స్, మెటీరియల్‌ లాంటివి చదువుకున్నాను.

కెమిస్ట్రీలో ముఖ్యమైన రియాక్షన్స్‌ గుర్తుంచుకున్నాను. ఇన్‌ ఆర్గానిక్‌ కోసం పూర్తిగా ఎన్‌సీఈఆర్‌టీ చదివాను. సాధనలు పూర్తిచేశాను. కొన్నిసార్లు మెకానిజమ్స్‌ కూడా గుర్తుంచుకోవాల్సి వస్తుంది. వీలైనంతగా పునశ్చరణ చేస్తేనే పాఠం బాగా గుర్తుంటుంది. పరీక్షకు ఆందోళన పడకుండా వెళ్లాలి. మనం చదివినవే ఉంటాయనే నమ్మకం, నిశ్చింత ఉన్నప్పుడు మంచి మార్కులు తెచ్చుకోవడం సులభమవుతుంది.

అర్థం చేసుకోవాలి..

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 151.61 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో ఆలిండియా 27వ ర్యాంకు సాధించాను. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కి సన్నద్ధమవుతున్నాను. వరుసగా ఇలా పరీక్షలకు చదివేటప్పుడు చాలా ఒత్తిడి ఉంటుంది. ఫోకస్‌ పెట్టడం ద్వారానే దాన్ని అధిగమించగలం.

లెక్కలంటే ఇష్టంతోనే...

పదోతరగతి వరకూ గుడివాడలో చదువుకున్నాను. ఇంటర్‌ హైదరాబాద్‌ నారాయణ కళాశాలలో చేరాను. చిన్నప్పటి నుంచి లెక్కలు అంటే చాలా ఇష్టం. 8వ తరగతి నుంచే ఫౌండేషన్‌ కోర్సు నేర్చుకోవడం వల్ల ఇంటర్‌లో సబ్జెక్ట్‌ చదవడం మరింత సులభమైంది. మొదటి నుంచి జేఈఈ మీదే దృష్టి ఉండేది. ఆఖరి రెండు నెలలు పూర్తిస్థాయిలో ఇంటర్‌ పరీక్షల మీద దృష్టిపెట్టాను. అవి పూర్తికాగానే మళ్లీ ఎంసెట్‌కు సన్నద్ధం అయ్యాను. రోజుకు 9 నుంచి 10 గంటలు చదివేవాడిని. నాకు లెక్కలు కాస్త సులభమైన సబ్జెక్ట్‌ కావడం వల్ల దానికి 2 గంటలు కేటాయించాను. ఫిజిక్స్‌ 3 గంటలు, కెమిస్ట్రీ 4 గంటలు చదివేవాడిని.

పూర్తిగా అధ్యయనం

మ్యాథ్స్‌ ముందు నుంచి బాగా రావడం వల్ల ఒక లెక్కను ఎక్కువ వేగంగా చేయడానికి, తప్పులు లేకుండా షార్ట్‌కట్‌లో జవాబు వచ్చేలా సాధన చేయడానికే సమయం కేటాయించాను. ప్రాక్టీస్‌ తగ్గిపోతే స్పీడ్‌ కూడా పడిపోతుంది. అలా జరగకుండా జాగ్రత్తపడ్డాను. కాలేజీలో ఇచ్చే వర్క్‌షీట్స్‌ను పూర్తిగా సాధన చేశాను. చాలావరకూ అందులో మాదిరి ప్రశ్నలే వస్తాయి. ఫిజిక్స్‌ చదివేటప్పుడు టాపిక్‌ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. బట్టీ పనికిరాదు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఉన్నవరకూ టాపిక్‌ చదివాను. మిగతా కాలేజ్‌ మెటీరియల్‌ ఫాలో అయ్యాను. కెమిస్ట్రీ ప్రతి వాక్యం చదివి గుర్తుంచుకున్నాను. చాప్టర్‌ మొదటి నుంచి ఉన్న సమాచారం మొత్తం అధ్యయనం చేశాను.

కళాశాలలో వారం వారం జరిగే పరీక్షల ఫలితాలనుబట్టి నా స్థాయి ఎలా ఉందో అంచనా వేసుకునేవాడిని. ఏ టాపిక్‌లో అయినా తప్పు జరగకుండా ముందే పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేవాడిని. విద్యార్థులెవరైనా పరీక్షల్లో చిన్న చిన్న తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి. టైం టేబుల్‌ను క్రమం తప్పకుండా అనుసరించాలి.

ఎవరు ఏ సబ్జెక్ట్‌లో బలహీనమైతే దానికి ఎక్కువ సమయం కేటాయించాలి. ఆన్‌లైన్‌ క్లాసులు విన్నా వేరే ధ్యాస లేకుండా పూర్తిగా దృష్టిపెట్టాలి. ఏవో ఒకటి లేదా రెండు పుస్తకాలు మాత్రమే చదవాలి. అన్నీ కలిపేయకూడదు. 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఐఐటీలో ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సు

‣ దిల్లీలో ఎస్‌ఐ ఉద్యోగాలు

‣ కానిస్టేబుల్‌ పరీక్షకు చివరి దశ ప్రిపరేషన్‌ ఎలా?

‣ సోషల్‌ మీడియాలో సమయం వృథా అవుతోందా?

‣ ఎల్‌ఐసీ హౌసింగ్‌లో కొలువులు

‣ శారీరక సామర్థ్య పరీక్షలకు సిద్ధమవుతున్నారా?

‣ ఇంజినీరింగ్‌కి ఐఐటీ - మద్రాస్‌ టాప్‌!

Posted Date : 16-08-2022

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌