• facebook
  • whatsapp
  • telegram

మెరుగైన ర్యాంకుకు మెలకువలు

> ఎంసెట్‌/ ఈఏపీ సెట్‌ అభ్య‌ర్థులకు సూచనలు

ఇంటర్‌ వార్షిక పరీక్షలు పూర్తిచేసుకున్న విద్యార్థులు.. వృత్తివిద్యాకోర్సుల్లో చేరడానికి విభిన్న ప్రవేశ పరీక్షలకు తయారవుతుంటారు. వీటిలో కీలకమైనది- ఇంజినీరింగ్, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ లాంటి కోర్సుల్లో చేరేందుకు రాసే ఎంసెట్‌/ఈఏపీసెట్‌! రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్న విద్యార్థులు పరీక్ష ముందూ, పరీక్ష సమయంలో పాటించదగ్గ సూచనలు.. ఇవిగో! 

ఎంసెట్‌/ ఈఏపీసెట్‌లో తెచ్చుకునే మెరుగైన  ర్యాంకు ఆధారంగానే విద్యార్థి కళాశాలనూ, బ్రాంచినీ ఎంచుకునే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి.. కనీసం సగం ప్రశ్నలకు సమాధానాలను సరిగ్గా గుర్తించగలిగితే.. అంటే 50 శాతం మార్కులు సాధించగలిగినా మంచి కళాశాలల్లో సీటు వస్తుంది.  

తెలంగాణలో మే 10 నుంచి 14 వరకూ,  ఆంధ్రప్రదేశ్‌లో మే 15 నుంచి 23 వరకూ ఎంసెట్‌/ఈఏపీ సెట్‌  నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందుగా చేరుకునేట్లు చూసుకోవాలి. హాల్‌టికెట్‌తో పాటు ఇచ్చే సూచనలు గమనించి పాటించాలి. 

పూర్తిగా రివిజన్‌కే

ఈ చివరి వారాన్ని పూర్తిగా రివిజన్‌ (పునశ్చరణ)కు మాత్రమే కేటాయించాలి. వాటిలో చాలా ముఖ్యమైన టాపిక్‌లను ముందుగా రివైజ్‌ చేయాలి. 

రోజంతా ఒకే సబ్జెక్టుకు కేటాయించకుండా అన్ని సబ్జెక్టులకు రోజులో కొంత సమయాన్ని కేటాయించి చదువుకోవాలి.  

ఇప్పుడు అందుబాటులో ఉన్న అతి స్పల్ప సమయంలో విద్యార్థులు కొత్త పాఠ్యాంశాలపై దృష్టి సారించకూడదు. తమకు తెలిసిన పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకోవడం ఉత్తమం. 

ఫార్ములాలు, స్టాండర్డ్‌ రిజల్ట్స్, మెమరీ బేస్డ్‌ కాన్సెప్టులను పునశ్చరణ చేసుకోవాలి. 

పాత ప్రశ్నపత్రాల సాధన ద్వారా రాసే వేగం పెంచుకోవచ్చు. 

వేగం, కచ్చితత్వం పెరిగేందుకు ఎక్కువగా గ్రాండ్‌ టెస్టులు రాయడం అవసరం. 

తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాల్లోని ఉదాహరణలు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు తప్పక చూసుకోవాలి. 

మెయిన్స్, నీట్‌ లాంటి పరీక్షల ఒరవడికి అలవాటుపడిన విద్యార్థులు ఎంసెట్‌లో 160 ప్రశ్నలు సంపూర్ణంగా చదివేందుకు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఓపిగ్గా, త్వరగా ప్రశ్నలను చదవడం, జవాబులను సాధించడం చేయాలి. 

రుణాత్మక మార్కుల్లేని కారణంగా ప్రతి ప్రశ్నకూ సమాధానం గుర్తించడం తప్పనిసరి. 

తాను చేయగలిగిన ప్రశ్నలను ముందుగా సాధించి.. ఆపైన వదిలేసిన ప్రశ్నలను రాసేట్లుగా చూసుకోవాలి. 

నేర్చుకున్న ప్రశ్నలను అనవసరమైన   ఒత్తిడికి గురికాకుండా సాధించాలి. 

రాని ప్రశ్నల దగ్గర ఎక్కువ సమయం వెచ్చించకుండా, వచ్చిన ప్రశ్నను త్వరగా రాసుకోవాలి. 

పరీక్షలో చివరి 10 నిమిషాలు అన్ని ప్రశ్నలకూ జవాబు గుర్తించారో లేదో చూసుకుని వదిలివేసిన ప్రశ్నలకు విచక్షణతో జవాబులను గుర్తించాలి. 

     

ఆసక్తి ఉన్న సబ్జెక్టుతో.. 

పరీక్షను ఆసక్తి ఉన్న సబ్జెక్టుతో మొదలుపెట్టాలి. ప్రశ్న తీరు కఠినంగా అనిపిస్తే వేరే సబ్జెక్టును లేదా వేరే ప్రశ్నను ఎంచుకుని సమాధానాలను గుర్తించడం ఉత్తమం. ఏదైనా ప్రశ్న అర నిమిషంలో అవగాహన కాని పక్షంలో ఎక్కువ సమయాన్ని వృథా చేయకూడదు. 

విద్యార్థులు 180 నిమిషాల వ్యవధిలో 160 ప్రశ్నలను సాధించాలి. ఈమధ్య కాలంలో గణితంలో ప్రశ్నలు ఒకింత నిడివి ఎక్కువగా ఉంటున్న కారణంగా జవాబులు ప్రశ్నలతోపాటు కనిపించకపోవచ్చు. అందువల్ల విద్యార్థులు తికమక పడే అవకాశం ఉంది.  అలాంటి ప్రశ్నలను జాగ్రత్తగా చదివి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నలను పూర్తిగా చదివి జవాబు గుర్తించాలి.  

    

గణిత శాస్త్రం

ఫార్ములాల పునశ్చరణ దీనిలో ముఖ్యం. భౌతిక, రసాయనశాస్త్రాల్లో కలిసి ఉన్న మార్కులు కేవలం ఒక్క గణితంలో ఉంటాయి. గణితంలో 80 ప్రశ్నలను దాదాపు గంటన్నరలో రాయాలి. ప్రశ్నని పూర్తిగా చదవడం,  రాని, అర్థంకాని ప్రశ్నలపై మరీ ఎక్కువ సమయం కేటాయించకుండా తర్వాతి ప్రశ్నలకు వెళ్లడం ప్రధానం. ఒకసారి తెలిసిన ప్రశ్నలను పూర్తిగా సాధించాక.. వదిలేసిన ప్రశ్నల సమాధానాలను గుర్తించాలి. 

గణితంలో పరీక్షకు ముందు మాత్రికలు, నిర్ధారకాలు, సరళరేఖలు, త్రిభుజ ధర్మాలు, గణితానుగమనం, సదిశా బీజగణితం, త్రికోణమితీయ సమీకరణాలు, ప్రస్తారాలు సంయోగాలు, సంభావ్యత, వృత్తాలు, సమాకలనం, అవకలన సమీకరణలు పునశ్చరణ చేసుకోవాలి. 

    

వృక్ష శాస్త్రం

వృక్షశాస్త్రంలో జీవసాంకేతికశాస్త్రం, అనువర్తనాలు, ఖనిజపోషకాలు, ఎంజైమ్‌లు, వృక్షరాజ్యం, జీవశాస్త్ర వర్గీకరణ, వృక్ష ఆవరణశాస్త్రం, కణజీవశాస్త్రం, సూక్ష్మజీవశాస్త్రం, మొక్కల్లో ప్రత్యుత్పత్తి ముఖ్యమైనవి. ఈ పాఠ్యాంశాలను ఈ స్వల్పకాలంలో మరోసారి రివైజ్‌ చేసుకోండి. 

    

జంతు శాస్త్రం

మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఆరోగ్యం, జంతు వైవిధ్యం 1, 2, గమనం, ప్రత్యుత్పత్తి, మానవ సంక్షేమంలో జీవశాస్త్రం చాలా ముఖ్యమైనవి. ఈ పాఠాలను పునశ్చరణ చేసుకుంటూ మాక్‌ టెస్టులు రాయాలి. 

   

భౌతిక శాస్త్రం 

ఫిజిక్స్‌ ముఖ్యంగా వివిధ సూత్రాలు, యూనిట్లు, సిద్ధాంతాల చుట్టూ తిరుగుతుంది. సిలబస్‌లో 70 శాతం మొదటి సంవత్సరం, 100 శాతం ద్వితీయ సంవత్సర పాఠాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రమాణాలు-మితులు, శుద్ధ గతికశాస్త్రం, గతిశాస్త్రం, గురుత్వాకర్షణ, స్థితిస్థాపకత, అణునిర్మాణశాస్త్రం, ఉష్ణగతిక శాస్త్రం, విద్యుత్తు పాఠాలను తుది ప్రిపరేషన్‌లో ముఖ్యమైనవిగా భావించి రివైజ్‌ చేసుకోండి. పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం వల్ల పేపర్‌ ఏ స్థాయిలో వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఎంసెట్‌లో ఫిజిక్స్‌కి 40 ప్రశ్నలు/ 40 మార్కులకు ఉంటాయి. అందులో దాదాపు 20 ప్రశ్నలు కాన్సెప్ట్, ఫార్ములాలపై ఆధారపడి ఉంటాయి. ఇంటర్‌ మార్కులతో సంబంధం లేకుండా ఎంసెట్‌ ర్యాంక్‌ను నిర్థాÄరిస్తారు. కాబట్టి ప్రతి మార్కు ప్రతి ప్రశ్న చాలా ముఖ్యం. ద్వితీయ సంవత్సర ప్రశ్నలు ఈమధ్యే పూర్తిచేశారు కాబట్టి కాస్త ఎక్కువ పట్టు ఉంటుంది. ద్వితీయ సంవత్సర టాపిక్స్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. 

  

రసాయన శాస్త్రం 

ఇప్పుడున్న ఈ కొద్ది రోజుల సమయంలో బేసిక్స్‌ రివైజ్‌ చేసుకుంటూ ఎక్కువ వెయిటేజి ఉన్న పాఠాలు చదవాలి. ఉదాహరణకు ఆవర్తన పట్టిక, ఆమ్లాలు, క్షారాలు, పరమాణు సూత్రాలు చూసుకున్నట్లయితే దాదాపు 50 శాతం ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు. రసాయన బంధం, రసాయన గతికశాస్త్రం, ఉష్ణగతికశాస్త్రం, నేమ్డ్‌ రియాక్షన్స్‌ చూసుకుంటే 40 మార్కులకుగాను 25 మార్కులపైన సాధించవచ్చు. 

అకాడమీ పుస్తకాలు చదివితే మెరుగైన సాధన సాధ్యమవుతుంది. ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, నేమ్డ్‌ రియాక్షన్స్, రీఏజెంట్లు, ఇంటర్‌ కన్వర్షన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇన్‌ ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పట్టికలు, గ్రాఫ్‌లు, పటాలు, మూలక ధర్మాలు, నేమ్డ్‌ ప్రాసెస్‌లు పునశ్చరణ చేసుకోండి.

  

చివరిగా...

1 పరీక్ష రాసేటప్పుడు సమయ పాలన    పాటించండి. 180 నిమిషాల్లో 160 ప్రశ్నలను సాధించాలని మరిచిపోకండి. 

2 సమాధానం రాయడానికి ముందు ప్రశ్నను పూర్తిగా చదవండి.  

3 సులభమైన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు రాసి.. కఠినమైన ప్రశ్నలను చివరిలో సాధించండి.

4 జవాబు తెలియని ప్రశ్నలకు ఎలిమినేషన్‌ ద్వారా జవాబులు     గుర్తించండి. 

5 పది నిమిషాల సమయాన్ని అన్ని ప్రశ్నలకూ సమాధానాలను   గుర్తించారో లేదో చూసుకోవడానికి కేటాయించండి. 

6 ఎంసెట్‌/ ఈఏపీసెట్‌లో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉండదు. కాబట్టి ఏ ప్రశ్ననూ వదిలెయ్యకుండా జవాబులు  గుర్తించండి. 

- ప‌ద్మ‌శ్రీ జాలాది, డీన్‌, శ్రీ చైత‌న్య విద్యా సంస్థ‌లు

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ షిప్పింగ్‌ కోర్సులతో మేటి అవకాశాలు

‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో కొలువులు

‣ క్రీడా నిర్వహణ కోర్సుల్లోకి ఆహ్వానం

‣ డిగ్రీ, పీజీతో సిపెట్‌లో ఉద్యోగాలు

‣ బోధనలో రాణించాలని ఉందా?

Posted Date : 08-05-2023

<

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌