‣ ఆగస్టు 24న ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2024 నోటిఫికేషన్ విడుదలైంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష స్కోరు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల ఎంపికకు సైతం ఉపయోగపడుతుంది. గేట్లో సాధించిన స్కోరును బట్టి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, కొలువులకు ఎంపిక చేస్తాయి.
నలభై ఏళ్ల మైలురాయిని దాటిన పరీక్ష - గేట్.. కొద్ది సంవత్సరాలుగా కొత్త పేపర్లను ప్రవేశపెట్టడం, రెండు పేపర్లలో పరీక్ష రాసే అవకాశం కల్పించడం, ప్రశ్నల విధానంలో మార్పులతో ఎప్పటికప్పుడు నూతనంగా తయారవుతోంది. బహుళైచ్ఛిక ప్రశ్నలతో మొదలైన గేట్ పరీక్షకు సంఖ్యా సమాధాన ప్రశ్నలు తరువాత.. బహుళ ఎంపిక ప్రశ్నలు జోడించారు. అదేవిధంగా కొత్త పేపర్లను జోడిస్తున్నారు.
‣ ఈ సంవత్సరం కొత్తగా డేటాసైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (డీఏ) పేపర్‌ను ప్రవేశపెట్టారు.
‣ గేట్ స్కోరు ఆధారంగా ఐఐటీలతోపాటు ఐఐఎస్సీ బెంగళూరు, వివిధ ఎన్ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇంజినీరింగ్/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్/ ఫార్మసీ విభాగాల్లో పీజీ ప్రవేశం లభిస్తుంది.
‣ గేట్-2024ను కొత్తగా చేర్చిన (డీఏ) పేపర్‌తో కలిపి మొత్తం 30 పేపర్లలో నిర్వహించనున్నారు.
‣ బీహెచ్ఈఎల్, గెయిల్, ఐఓసీఎల్, ఎన్టీపీసీ, సీఓఏఎల్, ఎన్హెచ్ఏఐ, ఎన్ఎండీసీ, ఓఎన్జీసీ లాంటి ప్రసిద్ధ సంస్థలు ఉద్యోగ నియామకాలకు గేట్ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. .
‣ గేట్-2024 పరీక్షను అభ్యర్థులు రెండు పేపర్లలో రాసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు తప్పకుండా రెండు పేపర్లలో పరీక్ష రాయవలసిన అవసరం లేదు. తమ ఇష్టప్రకారం ఒకటి లేదా రెండు పేపర్లు ఎంచుకోవచ్చు.
‣ గేట్ స్కోరు పీజీ ప్రవేశానికి మూడు సంవత్సరాలు, పీఎస్‌యూలకు ఒకటి లేదా రెండు సంవత్సరాలు చెల్లుబాటులో ఉంటుంది.
‣ గేట్‌తో మన దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశంతోపాటు నెలకు రూ.12,400 ఉపకార వేతనం కూడా లభిస్తుంది.
‣ గేట్ స్కోరు పీహెచ్డీ ప్రవేశాలకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నెలకు రూ.28,000 ఉపకార వేతనం కూడా లభిస్తుంది.
అర్హతలు: ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, హ్యూమానిటీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: అభ్యర్థులకు గరిష్ఠ వయః పరిమితి లేదు.
పరీక్ష ఫీజు
‣ స్త్రీలు/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు - రూ.900.
‣ పురుషులు (జనరల్, ఓబీసీ), ప్రవాస భారతీయులు/ విదేశీయులకు - రూ.1800.
పరీక్ష ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. రెండు పేపర్లలో పరీక్ష రాయదలిచిన అభ్యర్థులు రెండు పేపర్లకు విడివిడిగా పరీక్ష రుసుమును చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు
‣ ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 24 ఆగస్టు 2023
‣ ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ గడువు: 29 సెప్టెంబర్ 2023
‣ గేట్ 2023 పరీక్ష తేదీలు: 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11
(ఉదయం: 9:00-12:00 గంటలు, మధ్యాహ్నం 2:00-5:00 గంటలు)
ఆబ్జెక్టివ్ విధానంలో
‣ ఈ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఆన్లైన్ పరీక్ష విధానంలో కంప్యూటర్ మౌస్ ఉపయోగించి సరైన ఆప్షన్ గుర్తించాలి.
‣ గేట్ ప్రశ్నపత్రం పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో మూడు రకాలుగా ప్రశ్నలు అడుగుతారు.
బహుళైచ్ఛిక ప్రశ్నలు: నాలుగు ఆప్షన్లు ఇస్తారు. అందులో ఒకటి మాత్రమే సరైన సమాధానం. అభ్యర్థులు సరైన ఆ ఒక్క సమాధానాన్ని మాత్రమే గుర్తించాలి.
బహుళ ఎంపిక ప్రశ్నలు: ఇవి కూడా బహుళైచ్ఛిక ప్రశ్నల్లానే ఉంటాయి. కానీ ఇందులో ఒకటికంటే ఎక్కువ సరైన ఆప్షన్లుంటాయి. సమాధానంలో అన్ని సరైన ఆప్షన్లను గుర్తించాలి.
సంఖ్యా (న్యూమరికల్) సమాధాన ప్రశ్నలు: ఈ ప్రశ్నల్లో ఎలాంటి ఆప్షన్లు ఇవ్వరు. ఈ ప్రశ్నలకు సమాధానాలు వర్చువల్ కీబోర్డును ఉపయోగించి రాయాలి. సమాధానంలో పక్కన యూనిట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు దగ్గర స్థాయిలో ఇవ్వొచ్చు. సరైన సమాధానం 92.24 అనుకుంటే 92.23 నుంచి 92.25 మధ్యలో రాసినా మార్కులు ఇస్తారు.
‣ పరీక్ష కేంద్రంలోకి కాలిక్యులేటర్, మొబైల్స్‌ను అనుమతించరు. అభ్యర్థులు కాలిక్యులేషన్స్ చేసుకోవడానికి ఆన్లైన్ వర్చువల్ కాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుంది. కంప్యూటర్ మౌస్‌ని ఉపయోగించి దీన్ని వాడుకోవచ్చు.
‣ వర్చువల్ క్యాలిక్యులేటర్‌లో అన్ని రకాల ఫంక్షన్స్ లేకపోవడం వల్ల, తదనుగుణంగానే ప్రశ్నలు రూపొందించవచ్చు. ఇమాజినరీ ఫంక్షన్స్, హైయర్ ఆర్డర్ సమీకరణాలకు సంబంధించిన ప్రశ్నలు అడగకపోవచ్చు.
పరీక్ష విధానం
‣ గేట్ ప్రశ్నపత్రంలో మొత్తం 100 మార్కులకు 65 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి.
విభాగం-1: (జనరల్ ఆప్టిట్యూడ్): 15 మార్కులు
‣ ఇందులో పది ప్రశ్నలుంటాయి. ఐదు ఒక మార్కు ప్రశ్నలు, మరో ఐదు రెండు మార్కులు ప్రశ్నలు. ఈ విభాగంలోని నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు ఇంగ్లిష్ సంబంధితం (వెర్బల్ ఎబిలిటీ). మిగతా ప్రశ్నలు క్వాంటిటేటివ్‌కు సంబంధించినవి ఇవ్వొచ్చు.
‣ రోజూ వార్తాపత్రికలు చదవడం, ఇతర పోటీ పరీక్షల (ఉదా: క్యాట్) గత ప్రశ్నపత్రాలు సాధన చేస్తే ఈ విభాగంలో మంచి మార్కులు వస్తాయి.
నెగెటివ్ మార్కులతో జాగ్రత్త:
‣ గేట్లో ఒక తప్పు జవాబుకు 33.33 శాతం రుణాత్మక మార్కులుంటాయి. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల వాటికి 2/3 చొప్పున మార్కులు తగ్గుతాయి. న్యూమరికల్, బహుళ ఎంపిక ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉండవు.
విభాగం-2: (ఇంజినీరింగ్ సబ్జెక్టు): 85 మార్కులు
‣ ఈ విభాగంలో 55 ప్రశ్నలుంటాయి. ఇందులో 25 ఒక మార్కు ప్రశ్నలు, 30 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి.
‣ గణితం నుంచి 10 - 15 మార్కులు. అయితే ఈ విభాగంలోని ప్రశ్నలు శుద్ధ గణితంలా ఉండవు. ఇంజినీరింగ్ అప్లికేషన్‌తో ఉంటాయి.
‣ ప్రశ్నలు ఆయా రంగాల్లోని నూతన ఆవిష్కరణలను దృష్టిలో పెట్టుకుని ఉంటాయి.
సన్నద్ధత వ్యూహం
ముందు పరీక్ష సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి. దీనివల్ల ఏ సబ్జెక్టుల్లో ఏయే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలో అవగతం అవుతుంది. దీనితోపాటు పరీక్ష విధానాన్ని అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమే. దీనివల్ల పరీక్షలోని విభాగాలపైన, ప్రశ్నల సాధనపైన స్పష్టత వస్తుంది.
‣ గేట్-2024 ఫిబ్రవరిలో జరుగుతుంది. ఇప్పుడున్న సమయంలో సన్నద్ధత, సాధన పూర్తిచేసేలా ప్రణాళికను రూపొందించాలి. ప్రణాళికలో పునశ్చరణకు ముఖ్య సమయం కేటాయించాలి.
‣ సన్నద్ధతను త్వరగా మొదలుపెట్టడం చాలా ముఖ్యం. దీనివల్ల సిలబస్‌లో ఉన్న కాన్సెప్ట్స్, విషయాలను ఎక్కువగా సాధన చేసుకోవచ్చు.
‣ గత గేట్ ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఏ అంశాలపై, ఏ కాన్సెప్ట్‌లకు ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చారో, ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలో తెలుస్తుంది.
‣ ఇంకా ఈఎస్ఈ, ఇస్రో, పీఎస్‌యూల ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీనివల్ల ఒక అంశాన్ని ఎన్ని విధాలుగా అడగడానికి అవకాశం ఉందో తెలుస్తుంది.
‣ మంచి ప్రామాణిక పాఠ్య పుస్తకాలు/ స్టడీ మెటీరియల్ ఎంచుకోవడం ప్రధానం. ఒకే సబ్జెక్టుపై ఒకటికి మించి వివిధ రకాల పుస్తకాలను చదవకపోవడమే మంచిది.
‣ గేట్లో అన్ని సబ్జెక్టులకూ, అన్ని అంశాలకూ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి సన్నద్ధతలో అంశాలన్నింటికీ ప్రాధాన్యం ఇవ్వాలి.
‣ ప్రతి సబ్జెక్టు, ప్రతి చాప్టర్‌కు సంబంధించిన అంశాలను, చిన్న చిన్న పట్టికలను సంక్షిప్తంగా తయారుచేసుకోవాలి.
‣ క్లిష్టమైన, సాధారణ, అతి సాధారణమైన అంశాలకు సన్నద్ధతలో సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.
‣ ప్రతి చాప్టర్, సబ్జెక్ట్ చదివిన తర్వాత దానికి సంబంధించి ప్రముఖ విద్యాసంస్థలు అందించే ఆన్లైన్ టెస్టులను రాయాలి. సన్నద్ధత పూర్తయ్యాక మాక్ టెస్టులు రాయాలి.
‣ ఎన్టీపీఎల్ పాఠాలు విద్యార్థులకు ప్రాథమిక అంశాల అవగాహనకు బాగా ఉపయోగపడతాయి. అలాగే విశ్లేషణాత్మక ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి సహాయపడతాయి.
‣ గత సంవత్సరపు ప్రశ్నపత్రాల్లో ఒక ప్రశ్నపత్రాన్ని పరీక్షకు కేటాయించిన సమయంలో సమాధానాలు రాయడానికి ప్రయత్నిస్తే.. ఏ స్థాయిలో ఉన్నారో అభ్యర్థులకు అర్థమవుతుంది.
తరచూ చేసే తప్పిదాలు
చాలామంది అభ్యర్థులు సన్నద్ధత మొదట్లోనే పరీక్ష సిలబస్‌ను చూసి భయపడుతుంటారు. నాలుగేళ్ల ఇంజినీరింగ్ సిలబస్‌తో పోలిస్తే.. గేట్ పరీక్ష సిలబస్ 60 శాతం మాత్రమే. మొత్తం ఇంజినీరింగ్ బ్రాంచ్‌కి సంబంధించిన మూలాలు, నూతన పోకడలు మాత్రమే గేట్ సిలబస్‌లో ఉంటాయి. ఒక పెద్ద కొండ సైతం రోజుకో బండ తొలగిస్తే కొంత కాలానికి మటుమాయం అవుతుంది. రోజుకు రెండు నుంచి మూడు గంటలు ఒక్కో కాన్సెప్ట్ అర్థం చేసుకు ంటూ ముందుకు వెళితే.. అందుబాటులో ఉన్న సమయంలో సిలబస్‌ను విజయవంతంగా పూర్తిచేసుకోవచ్చు.
‣ కొంతమంది విద్యార్థులు చదివిన అన్ని అంశాలూ గుర్తుంటాయని భావించి.. పునశ్చరణను విస్మరిస్తారు. ఇది పొరపాటు. చదివిన ప్రతి అంశాన్నీ తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి. పరీక్ష సాధన సమయంలో తయారుచేసుకున్న చిన్నచిన్న పట్టికలను ఈ పునశ్చరణలో సద్వినియోగం చేసుకోవాలి.
‣ కఠినమైన అంశాలు అర్థంకాకపోతేనో, మాక్ టెస్టుల్లో మార్కులు తక్కువ వస్తేనో.. కొంతమంది తాము గేట్లో విజయం సాధించలేమని నిరుత్సాహపడతారు. అలాకాకుండా మాక్ టెస్ట్‌లలో తప్పిదాలను గుర్తించి.. కఠినమైన అంశాలను మరోసారి చదవాలి.
ఇతర అభ్యర్థులతో బృందాలుగా ఏర్పడి చదివితే ఎలాంటి కఠినమైన అంశాలైనా అవగతం అవుతాయి.
అపోహలు మాత్రమే
గేట్‌కు సంబంధించి కొన్ని అభిప్రాయాలు ప్రచారంలో ఉన్నాయి. అవి ఎంతవరకూ నిజమో తెలుసుకుందాం.
‣ గేట్లో కేవలం ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులే విజేతలు అవుతారు. గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి ఈ పరీక్ష కష్టం.
ఇది పూర్తిగా అవాస్తవం. గత విజేతల వివరాలు విశ్లేషిస్తే చాలామంది సాధారణ కాలేజీల్లో చదివినవారే అని తెలుస్తుంది. ఎంతోమంది ఇంటర్మీడియట్ వరకూ మాతృభాషలో చదివిన గ్రామీణ నేపథ్యం కలిగినవారే. పేదరికం అసలే అడ్డు కాదు.
‣ కేవలం బీటెక్‌లోని మెరిట్ విద్యార్థులే గేట్లో విజయం సాధిస్తారు.
ఇది నిజం కాదు. పట్టుదలతో కృషిచేసి.. గొప్ప ర్యాంకులు సాధించినవారిలో బీటెక్ సాధారణ పాస్, సెకండ్ క్లాస్ ఉత్తీర్ణులు ఎందరో ఉన్నారు.
‣ గేట్ గెలవాలంటే ఇంజినీరింగ్ తర్వాత కనీసం ఒక సంవత్సరం పూర్తిగా చదవాలి.
ఇది కూడా నిజం కాదు. గత గేట్ విజేతలను పరిశీలిస్తే.. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు.
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రాంప్ట్ ఇంజినీర్.. కోట్లలో ప్యాకేజీ!
‣ బీటెక్‌తో హెచ్ఏఎల్లో ఉద్యోగాలు