• facebook
  • whatsapp
  • telegram

ఏఈ పరీక్ష తుది సన్నద్ధత ఎలా?

రివిజన్‌, మాక్‌ టెస్ట్‌లకు ప్రాధాన్యం

ఏపీపీఎస్‌సీ ద్వారా గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, మున్సిపల్‌ ఇంజినీరింగ్, భూగర్భ జలాలు, నీటి వనరులు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలలో 190 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) ఉద్యోగాల భర్తీ జరగబోతోంది. దీనికోసం నిర్వహించే రాత పరీక్షకు దాదాపు 60 రోజుల సమయం ఉంది. ఈ తరుణంలో అభ్యర్థుల సన్నద్ధత వ్యూహం, సమగ్రంగా తయారయ్యే మెలకువలు తెలుసుకుందాం!

ఏఈ నియామక పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇది ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. పరీక్షాపత్రం ఆంగ్ల భాషలో ఉంటుంది. అభ్యర్థులు ఇప్పటివరకు కొనసాగించిన ప్రిపరేషన్‌కు కొన్ని మెలకువలతో తుది మెరుగులు దిద్దుకుంటే ఈ పరీక్షలో విజయం సాధించవచ్చు.  

పరీక్షలోపు ఉన్న వ్యవధిని పునశ్చరణ సమయంగా పరిగణించవచ్చు. ఇప్పటినుంచి రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు సన్నద్ధతకు కేటాయించాలి. ఇప్పటికే అభ్యర్థులు తగినంత సమయం సన్నద్ధతకు కేటాయించి ఉంటారు. ఈ సమయంలో ఏవైనా అంశాలు మిగిలి ఉంటే అత్యంత త్వరితంగా పూర్తిచేసి పునశ్చరణను ప్రారంభించాలి. 

ఇప్పటినుంచి ప్రతిరోజూ సాలిడ్‌ మెకానిక్స్, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ నుంచి రెండు చాప్టర్‌లను (టాపిక్స్‌) ఎంచుకుని ముఖ్యమైన ఫార్ములాలను అభ్యసించాలి. వాటిని నోట్సులా తయారు చేసుకోవాలి. ఇది పరీక్ష ముందు రోజు త్వరిత పునశ్చరణకు ఉపయోగపడుతుంది. 

ప్రతిరోజూ జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీలో రెండు టాపిక్స్‌ చదవాలి. ఈ సబ్జెక్టు మొత్తానికీ సమగ్రమైన షార్ట్‌నోట్స్‌ తయారు చేసుకోవాలి.

ఎన్విరాన్‌మెంటల్‌ పరీక్ష రాయదలిచిన అభ్యర్థులు రోజుకు ఒక సబ్జెక్టు చొప్పున చదవాలి. పరీక్ష ముందు రోజు పునశ్చరణకు ఉపయోగపడేలా నోట్సు తయారు చేసుకోవాలి. 

ఈ పరీక్షకు నాన్‌ ప్రోగ్రామబుల్‌ కేలిక్యులేటర్‌ను అనుమతిస్తారు. అందుకని వైవిధ్యముండే న్యూమరికల్‌ ప్రశ్నలు అడగవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు సన్నద్ధతను కొనసాగించాలి. 

ముఖ్యమైన అంశాలను స్నేహితులతో చర్చించడం, సందేహాలు వస్తే అధ్యాపకుల, సీనియర్‌ల సలహాలు తీసుకోవడం చేస్తే పరీక్ష నెగ్గే అవకాశాలు మెరుగవుతాయి.

పేపర్‌-2, పేపర్‌-3లో మౌలిక అంశాలకు సంబంధించినవి 60 శాతం, ఆచరణాత్మక అనువర్తనాలు, న్యూమరికల్స్‌ 25 శాతం, ఫార్ములాలు, ఫ్యాక్ట్స్, ఫిగర్స్‌లో 15 శాతం ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

ఈ సమయంలో పరీక్ష సిలబస్‌ పరంగా ఏ అంశాలపై దృష్టి పెడితే ఎక్కువ మార్కులు వస్తాయో గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

క్లిష్టమైన కీలకాంశాలను మరోసారి చదివి అందులోని ప్రతి ఫార్ములాకు సంబంధించీ ఒకటి, రెండు న్యూమరికల్‌ ప్ల్రాబ్లమ్స్‌ అభ్యాసం చేయాలి.

సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యమని మరువకూడదు.

ఈ సమయంలో ఆన్‌లైన్‌లో నిర్వహించే పూర్తిస్థాయి నమూనా పరీక్షలు (మాక్‌ టెస్ట్‌లు) తప్పనిసరిగా రాయాలి. దీనివల్ల ప్రిపరేషన్‌ స్థాయి అర్థమవుతుంది. అంతేకాకుండా సమగ్ర అవగాహన లేని అంశాలను గుర్తించి, పునశ్చరణ చేయొచ్చు.

‣ పూర్వం చదివిన అన్ని అంశాలు గుర్తుంటాయని భావించటం సరికాదు. అందుకే చదివిన అన్ని అంశాల పునశ్చరణ చాలా ముఖ్యం. 

పూర్వపు ఏపీసీఎస్‌సీ (ఏఈ) ప్రశ్నపత్రాలతోపాటు ఏఈఈ ప్రశ్నపత్రాలను కూడా సాధన చేయాలి. గేట్, ఈఎస్‌ఈలో సాధారణ, సులభ ప్రశ్నలను సాధన చేయాలి.

ఏ పేపర్‌ ఎలా?

పేపర్‌-1: జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ (అన్ని బ్రాంచిలకూ కామన్‌)

ఈ పేపర్‌కు అభ్యర్థులు చాలా జాగ్రత్తగా తయారవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌ విభజన, దాని పరిపాలన, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు, కొత్త రాజధాని రూపకల్పనలో సవాళ్లు, చట్టపరమైన చిక్కులు, సమస్యలు, నూతన విద్యా సంస్థల నిర్మాణం, నదీజలాల పంపిణీ సమస్యలు, స్థానికతను బట్టి ఉద్యోగుల విభజన సమస్యలు ఇందులో కీలకం కానున్నాయి. 

భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక పరిస్థితులు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రాధాన్యం, ఆపత్కాల సమయాల్లో భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ల నిర్వహణ సామర్థ్యం, భూకంపాలు, తుపానులు, సునామీలు, వరదలు, కరవులు- వాటి నివారణ చర్యలు, పునర్నిర్మాణ చర్యలపై ప్రశ్నలు అడుగుతారు. 

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో నూతన మార్పులు, ప్రాంతీయంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అంశాలపై ఎప్పటికప్పుడు అవగాహన మెరుగుపరుచుకోవాలి.

పేపర్‌-2: సివిల్, మెకానికల్‌

ఇది సివిల్, మెకానికల్‌ అభ్యర్థులకు ఉమ్మడిగా ఉంటుంది. ఈ పేపర్‌ డిప్లొమా స్థాయిలో ఉంటుంది. 

ఇందులో రెండు సబ్జెక్టులు ఉన్నాయి. సాలిడ్‌ మెకానిక్స్, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌.

గత ప్రశ్నపత్రాల ఆధారంగా సాలిడ్‌ మెకానిక్స్‌లో ఇంజినీరింగ్‌ మెకానిక్స్, సింపుల్‌ స్ట్రెస్‌ అండ్‌ స్ట్రెయిన్, షియర్‌ ఫోర్స్‌ అండ్‌ బెండింగ్‌ మూమెంట్, థియరీ ఆఫ్‌ సింపుల్‌ బెండింగ్, కాలమ్స్, కాంప్లెక్స్‌ స్ట్రెసెస్‌ అండ్‌ స్ట్రెయిన్, థిన్‌ సిలిండర్స్‌పై ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. . 

ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌లో ఎనర్జీ ఈక్వేషన్‌ అండ్‌ ఇట్స్‌ అప్లికేషన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రెషర్‌ మెజర్‌మెంట్స్‌ అండ్‌ హైడ్రోస్టాటిక్స్, ప్రాపర్టీస్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్, డైమెన్షనల్‌ ఎనాలిసిస్‌పై ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.   

పేపర్‌-3: ఎన్విరాన్‌మెంటల్‌/ సివిల్‌ (కామన్‌) (పోస్ట్‌ కోడ్‌-3కి మాత్రమే)

ఈ పేపర్‌లో మొత్తం 10 సబ్జెక్టులు ఉన్నాయి.

గత ప్రశ్నపత్రాలను బట్టి చూస్తే.. ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌కు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

జియోటెక్నికల్‌ ఇంజినీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇంజినీరింగ్, రీఇన్‌ఫోర్స్‌డ్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ (ఆర్‌సీసీ), సర్వేయింగ్, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌లపై ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. 

పరీక్ష సమయంలో జాగ్రత్తలు

పరీక్షకు సన్నద్ధమవడం, పునశ్చరణ అనేవి ఒక ఎత్తయితే పరీక్ష రాసే సమయలో జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు. పరీక్షకు ముందుగానీ, పరీక్ష రాసే సమయంలోగానీ ఎలాంటి ఆందోళనకూ గురికాకూడదు. పరీక్ష రాసే సమయంలో మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం.  

ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో సమయం కీలకం. ఈ పరీక్ష విధానాన్ని పరిశీలిస్తే ఒక ప్రశ్నకు సమాధానం రాయడానికి ఒక నిమిషం అందుబాటులో ఉంది. సబ్జెక్టు పరంగా ఎంతటి నిష్ణాతులైనా అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయడం కష్టం. కాబట్టి ప్రతి పేపర్‌లో 150 ప్రశ్నలకు 120-130 ప్రశ్నల వరకూ సరైన సమాధానాలు రాసినా విజయం సాధించవచ్చు. 

న్యూమరికల్‌ ప్రశ్నలు ఎక్కువసార్లు సాధన చేస్తే పరీక్ష వ్యవధిలోపుగానే జవాబులు రాయడం సలభమవుతుంది.

పరీక్షలో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి ప్రయత్నించామనేదానికంటే ఎన్ని ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం గుర్తించామన్నదే ముఖ్యం. 

రుణాత్మక మార్కులు ఉన్నందువల్ల పూర్తిగా తెలిసిన, సరైన సమాధానాలను మాత్రమే గుర్తించాలి. తెలియని ప్రశ్నల జోలికి వెళ్లకపోవడం మేలు. 

రిఫరెన్స్‌ పుస్తకాలు

సాలిడ్‌ మెకానిక్స్‌ - రామామృతం వి.సి.పున్మియా

ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ - కె. సుబ్రహ్మణ్యం బన్‌పాల్‌

ఎన్విరాన్‌మెంటల్‌ - కె.ఎల్‌.దుగ్గల్‌

ఆబ్జెక్టివ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ - ఆర్‌.అగోర్, గుప్తా అండ్‌ గుప్తా

ఇండియన్‌ జాగ్రఫీ - డాక్టర్‌ కుల్లర్‌

హిస్టరీ మోడర్న్‌ ఇండియా - బిపిన్‌ చంద్ర

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ - స్పెక్ట్రమ్‌

ఇండియన్‌ ఎకానమీ - ప్రతియోగితా దర్పణ్, ఇండియా సామాజిక సర్వే, ఇండియా ఇయర్‌ బుక్‌ 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సర్కారు కొలువుకు సిద్ధమయ్యే ముందు..!

‣ నేర్పుగా... ఓర్పుగా!

‣ అర్హత ఉన్న అన్ని ఉద్యోగాలకు ప్రారంభించండి ప్రిపరేషన్‌!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు