• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నేర్పుగా... ఓర్పుగా!  

సోషల్‌ అండ్‌ ఎమోషనల్‌ లర్నింగ్‌

చదువులో, వ్యక్తిగత జీవితంలో మెరుగ్గా రాణించాలని అందరికీ అంటుంది. దీనికి ఉపకరించే ఓ నైపుణ్యం- ‘సోషల్‌ అండ్‌ ఎమోషనల్‌ లర్నింగ్‌’. దీని ప్రాధాన్యం ఏమిటి? ఎలా అలవర్చుకోవచ్చు?

తరగతిలో లెక్చరర్‌ అడిగిన ప్రశ్నకు స్నిగ్ధ సమాధానం చెబుతోంది. తోటి విద్యార్థులు హేళనగా నవ్వారు. దాన్ని అవమానంగా భావించిన ఆమె కొన్ని రోజులపాటు కళాశాలకు వెళ్లడమే మానేసింది. ‘కోపగించి క్లాసులు మానేస్తే నష్టపోయేది నువ్వే’నని తల్లిదండ్రులు ఎంతగా నచ్చజెప్పినా వినిపించుకోవడం లేదు. 

సాగర్‌తో ఏదైనా విషయాన్ని చర్చించాలంటే బృంద సభ్యులందరూ సంకోచిస్తారు. ఎందుకంటే అతడు సమస్యను తన కోణం నుంచి మాత్రమే చూస్తాడు. ఎదుటివారి అభిప్రాయాలను అర్థం చేసుకోకుండా వెంటనే ఖండిస్తూ, వాదనకు దిగుతుంటాడు. దాంతో అతడితో చర్చించడానికి ఎవరూ ముందుకు రారు.

ఇలా కొందరు విద్యార్థులూ, ఉద్యోగులూ ఇతరులతో త్వరగా కలిసిపోలేరు. అలాగే అనేక విషయాల్లో సానుకూలంగా స్పందించనూ లేరు. దీనికి కారణం ‘సోషల్‌ అండ్‌ ఎమోషనల్‌ లర్నింగ్‌’ అనే నైపుణ్యం లేకపోవడమే. ఇతి ఉంటే చదువు, వ్యక్తిగత, వృత్తి జీవితాల్లో చక్కగా రాణించగలుగుతారు. ఏ పద్ధతుల ద్వారా దీన్ని మెరుగుపరుచుకోవాలో తెలుసుకుందామా...

స్వీయ అవగాహన: వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు, భావోద్వేగాలు, లక్ష్యాలు, విలువలను అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వ్యక్తిగత బలాలను కచ్చితంగా అంచనా వేయడానికీ, బలహీనతల గురించి తెలుగుకోవడానికి స్వీయ అవగాహనా నైపుణ్యం అనేది తోడ్పడుతుంది. సానుకూలంగా ఆలోచించడం, ఆశావహ దృక్పథంతో అడుగులు వేయాలన్నా ఎవరి గురించి వారికి అవగాహన ఉండాలి. ఈ సామర్థ్యం ఉంటే తమ ఆలోచనలు, భావోద్వేగాలు, చేసే పనులకు మధ్య ఉండే సంబంధాన్ని గుర్తించగలుగుతారు. 

స్వీయ నిర్వహణ: ఇది అలవడాలంటే భావోద్వేగాలు, ప్రవర్తనను నియంత్రించుకునే నేర్పు ఉండాలి. స్వీయ నిర్వహణ నైపుణ్యం ఉంటే.. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని నియంత్రించుకోగలుగుతారు. వ్యక్తిగత, వృత్తిగత లక్ష్యాలను సాధించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించగలిగే సామర్థ్యాన్ని సమకూర్చుకోగలుగుతారు.

సామాజిక అవగాహన: విద్యార్థి దశలోనైనా లేదా ఉద్యోగిగా ఏదైనా సంస్థలో పనిచేసినప్పుడైనా అందరితో కలిసిమెలిసి ఉండటం తప్పనిసరి. ఈ క్రమంలో ఇతరుల ఆలోచనలూ, అభిప్రాయాలను అర్థంచేసుకోవాల్సివుంటుంది. వివిధ నేపథ్యాలు, సంప్రదాయాల నుంచి వచ్చినవారి పట్ల సహానుభూతినీ ప్రదర్శించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, ఉద్యోగులు... ఇలా నలుగురితో కలిసి ప్రయాణించాల్సిన క్రమంలో సామాజిక అవగాహన నైపుణ్యం ఎంతో తోడ్పడుతుంది. ఎదుటివారి ఆలోచనలను అర్థంచేసుకుని స్పందించే నేర్పూ అలవడుతుంది. 

బాధ్యతాయుత నిర్ణయాలు: విభిన్నమైన పరిస్థితుల్లోనూ నిర్ణయాలు తీసుకునే నేర్పు ఉండాలి. అలా తీసుకునే నిర్ణయాలు కూడా బాధ్యతాయుతమైనవై ఉండాలి. వ్యక్తిగత కోణం నుంచి మాత్రమే కాకుండా ఇతరుల దృష్టి కోణం నుంచి కూడా ఆలోచించగలిగినప్పుడే ఇది సాధ్యం. వివిధ రకాల పనుల వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి సరిగ్గా అంచనా వేయగలినప్పుడే అందుకు అనుగుణంగా బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. 

ఇతరులతో సత్సంబంధాలు: ఇతరులతో కలిసి పనిచేయాలంటే వారితో సత్సంబంధాలు అవసరం అవుతాయి. వీటికి భావవ్యక్తీకరణ నైపుణ్యం ఉపయోగపడుతుంది. ఈ సామర్థ్యం ఉంటే ఎదుటివాళ్లు చెప్పే విషయాన్ని ఆసక్తిగా వినగలుగుతారు. మీ అభిప్రాయాలనూ ఎదుటివారికి స్పష్టంగా తెలియజేయగలుగుతారు. దీంతో ఇతరులతో మీ ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకోవడం, అవసరమైనప్పుడు ఎదుటివారి సహాయం తీసుకోవడం లాంటివి చేయగలుగుతారు. 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అర్హత ఉన్న అన్ని ఉద్యోగాలకు ప్రారంభించండి ప్రిపరేషన్‌!

‣ భద్రమైన భవితకు బీఎస్సీ నర్సింగ్‌!

‣ వేగంగా నేర్చుకునేవాళ్లకు త్వరగా నియామకాలు

‣ నైపుణ్య యువత... భారత్‌ భవిత

‣ దరి చేరనున్న 5జీ సాంకేతికత

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-03-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.