• facebook
  • whatsapp
  • telegram

అర్హత ఉన్న అన్ని ఉద్యోగాలకు ప్రారంభించండి ప్రిపరేషన్‌!

తెలంగాణలో రానున్న నోటిఫికేషన్లపై నిపుణుల సూచనలు

 

 

అనేక అవకాశాలు ఉన్నప్పుడు సరైన దాన్ని ఎంపిక చేసుకోవడమే విజ్ఞత. ఒక గమ్యాన్ని చేరేందుకు అనేక మార్గాలు ఉండొచ్చు. వాటిలో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చి లక్ష్యానికి చేర్చేదే విజయవంతమైన మార్గం అవుతుంది! తెలంగాణలో భారీసంఖ్యలో కొలువుల నియామకాలు జరగబోతున్న సందర్భంగా ప్రిపరేషన్‌కు సంబంధించి ఉద్యోగార్థుల్లో తలెత్తుతున్న సందేహాలూ, వాటికి నిపుణుల సమాధానాలూ.. ఇవిగో! 

 

ప్రభుత్వ విభాగాల్లో 80 వేలకు పైగా ఖాళీలను నింపేందుకు ప్రణాళికాయుతంగా ముందుకు కదులుతామని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటించారు. పర్యవసానంగా తెలంగాణ నిరుద్యోగులు తమ పూర్తి శక్తియుక్తుల్ని వినియోగించేందుకు సిద్ధపడుతున్నారు. అయితే వీళ్ళందరి ముందు ఉన్న ప్రధాన సవాల్‌... ఇన్ని నోటిఫికేషన్లలో ఒకటి ఎంచుకోవాలా? వీలైనన్ని నోటిఫికేషన్లు ఎంపిక చేసుకుని అదృష్టాన్ని పరీక్షించుకోవాలా? దీనికోసం కొన్ని ప్రమాణాలను పరిశీలిద్దాం. అవే పరిష్కార మార్గాలను అందిస్తాయి. 

 

ఇప్పుడు మొదలుపెడితే ఉద్యోగం కొట్టగలమా? ...ఇటీవలికాలంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులూ, ప్రైవేటు రంగాల్లో ఇప్పటివరకుండి ప్రభుత్వ ఉద్యోగంలోకి ప్రవేశించాలనుకునేవారూ, గృహిణిగా బాధ్యతలు పూర్తిచేసుకుని ఇప్పుడు తమ ప్రతిభాపాటవాలతో రాణించాలనుకునేవారూ.. ఈ విషయంపై బాగా మథనపడుతున్నారు. కనీసం రోజుకి ఎనిమిది నుంచి పది గంటల పాటు ఆరు నెలల సమయం కేటాయించగలిగితే ఉద్యోగాన్ని పొందే అవకాశాలు మెరుగవుతాయి. అభ్యర్థులకు ఉండే గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, కాంపిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ను పెంపొందించుకోవడం, సామాజిక అనువర్తన మొదలైన అంశాలు అంతిమ ఫలితాన్ని నిర్ణయిస్తాయి.

 

కనీస అర్హత ప్రమాణాలు ఉన్నాయా? 

ఏదో ఒకటి రెండు పరీక్షలకు తప్ప మిగతా పరీక్షలన్నిటికీ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత కనీస అర్హతగా ఉంది. కనీస గ్రాడ్యుయేషన్‌పై ఆధారపడి ఇతర ప్రమాణాలు ఏమీ లేనివిగా గ్రూప్‌ 1, 2 మొదలైన పరీక్షలను గుర్తించవచ్చు. ఈ కారణం చేతనే గ్రూప్స్‌ పరీక్షలకు అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీపడుతుంటారు. గ్రూప్స్‌ నోటిఫికేషన్లలోనూ డీఎస్‌పీ, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, సీనియర్‌ అకౌంటెంట్‌ మొదలైన ఉద్యోగాలకు కొన్ని ప్రమాణాలు అదనంగా కావాలి.

 

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ లాంటి పరీక్షలకు శారీరక దార్ఢ్య పరీక్షలను నిర్వహిస్తారు. వాటికి తగిన రీతిలో సామర్థ్యాలు తమకు ఉన్నాయా లేదా అనేది పరిశీలించుకోవాలి. సరైన సమర్థత ఉంటేనే ఆ పరీక్షలు రాసేందుకు సిద్ధపడాలి.

 

ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో పోటీ పడేందుకు ముందస్తు అర్హత పరీక్షలో నిర్దిష్ట మార్కులు సాధించి ఉండాలి. అదేవిధంగా డీఈడీ…, డీ…ఎడ్‌ లాంటి అర్హతలు పొంది ఉండాలి. జూనియర్‌ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్‌ మొదలైన ఉద్యోగాల నియామకానికి తప్పనిసరిగా పీజీలో నిర్దిష్ట శాతంతో ఉత్తీర్ణులై ఉండాలి. స్లెట్, నెట్‌ లాంటివీ అడుగుతూ ఉంటారు.

 

నిర్దిష్ట నైపుణ్యానికి చెందిన ఇంజినీరింగ్‌ ఉద్యోగాల్లో ఎంపికయ్యేందుకు ఆయా సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ పాసైవుండాలి. ఈ విధంగా విద్యార్హతలకు సంబంధించి అవగాహన ఉంటే వాటి అర్హతలు ఉన్నప్పుడు తప్పనిసరిగా నిర్దిష్ట పరీక్షలు ఎంపిక చేసుకుని ప్రయత్నించవచ్చు.

 

లింగ భేదం అడ్డంకిగా ఉంటుందా?

మనదేశం ఇప్పుడిప్పుడే పితృస్వామిక సామాజిక లక్షణాల నుంచి బయట పడుతోంది. ఇప్పటికీ తల్లిదండ్రులు తమ ఆడపిల్లల్ని ఎక్కువ సందర్భాల్లో ఉపాధ్యాయురాలిగా పంపేందుకు ఇష్టపడతారు కానీ ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఆర్మీ ఉద్యోగాలకు పంపేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఆయా ఉద్యోగాలకు మహిళలు దూరమవుతున్నారు. అయితే వెలువడుతున్న నోటిఫికేషన్లు అన్నిటిలోనూ మహిళలు కూడా పోటీపడి ఉద్యోగాలు సాధించుకోవచ్చు. గతంలో డీ…ఎస్పీగా, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా, ఎస్‌ఐగా యూనిఫాం ఉద్యోగాల్లో చేరిన మహిళలు బాగా రాణిస్తున్నారు. అందుకని ప్రస్తుత నోటిఫికేషన్లలో ఉన్న ఖాళీలను బట్టి మహిళలు ఏ సంకోచమూ లేకుండా అన్ని ఉద్యోగాలకూ పోటీపడటమే సరైన నిర్ణయం.

 

వయసు అవరోధమా?

ఒక దశాబ్ద కాలంగా పోటీ పరీక్షల్లో పాల్గొంటూ విఫలమైనవారు, 40 సంవత్సరాలు పైబడి ఇతర వృత్తుల్లో కొనసాగి ఇప్పుడు పరిపాలన రంగంలోకి ప్రవేశించాలనుకునేవారు చాలామంది తమ వయసు గురించి ఆలోచిస్తూ ఈ పోటీ పరీక్షల్లో పోటీ పడగలమా లేదా అని తర్జనభర్జనలకు గురవుతున్నారు. నిజానికి వ్యక్తికి ఉండే నిబద్ధత, జ్ఞాపకశక్తి పరీక్ష కోణంలో చదవగలిగే నేర్పరితనం- విజయాన్ని శాసిస్తాయి. అందువల్ల 35 సంవత్సరాలు పైబడినా గానీ అభ్యర్థుల్లో పైన చెప్పిన సామర్థ్యాలుంటే తప్పనిసరిగా విజయాన్ని సాధించవచ్చు. 60 సంవత్సరాలకు రిటైర్మెంట్‌ కాబట్టి కనీసం 20 సంవత్సరాలయినా ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించే అవకాశం ఏర్పడుతుంది.

 

రెగ్యులర్‌ కోచింగ్‌ పొందలేము... నెగ్గుతామా?

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఇప్పటికే పని చేస్తున్న చాలామంది ఉద్యోగులు తమ జీవిక కోసం విధులు నిర్వహిస్తూనే ప్రిపేర్‌ అవ్వాలనుకుంటున్నారు. అయితే వారిని వేధిస్తున్న ప్రశ్నలు- కోచింగ్‌ తీసుకున్నవారితో పోటీ పడగలమా? సమయం కేటాయించ గలమా?. కోచింగ్‌ అనేది కొంత సౌలభ్యతను అభ్యర్థులకు అందించగలదు. అభ్యర్థిలో తగిన లక్షణాలు లేకుండా కోచింగ్‌తోనే విజయం ఎంతమాత్రం సాధ్యం కాదు. అందువల్ల ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు ఆన్‌లైన్‌ శిక్షణ వ్యవస్థను ఉపయోగించుకుని కోచింగ్‌ పొందవచ్చు. విస్తృత సమాచారాన్ని గూగుల్, సోషల్‌ మీడియాల నుంచి పొందవచ్చు. నిబద్ధత ముఖ్యం. ఉద్యోగం చేసుకుంటూనే ఉదయం నాలుగు గంటల సమయం, సాయంత్రం నాలుగు గంటల సమయం కేటాయించడం, సెలవు రోజులను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా విజయం సాధించే అవకాశాలను బలంగా పెంచుకోవచ్చు.

 

తెలుగు మీడియంలో రాస్తే విజయం సాధిస్తామా?

ఒక దశాబ్దం క్రితం ఇంగ్లిష్‌ మీడియంలో పరీక్షలు రాస్తే విజయం సాధిస్తామా అని అడిగేవారు. మారిన కాల పరిస్థితుల వల్ల తెలుగు మీడియంలో పరీక్ష రాస్తే రాణిస్తామా- అని సందేహపడుతున్నారు. ఆబ్జెక్టివ్‌ పరీక్షల వరకు తెలుగు, ఇంగ్లిష్‌ మీడియాల్లో ఏది ఎంచుకున్నా పెద్ద ఇబ్బందేమీ లేదు. ప్రశ్నలు తప్పుగా ముద్రితమైతే తప్ప.
కానీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలో భాష ప్రభావం ఎంత అని అభ్యర్థులు సందిగ్ధానికి గురవుతూనే ఉన్నారు. సబ్జెక్టుపై మంచి పట్టు, రాత నైపుణ్యాలు ఉన్నప్పుడు ఏ మీడియంలో రాసినా టాప్‌ ర్యాంకు సాధించవచ్చు. చాలామంది సాధించారు కూడా. అందువల్ల ఏ భాషపై పట్టుంటే ఆ భాషలో గ్రూప్‌-1 మెయిన్స్‌ రాయవచ్చు.

 

ఒకటికి మించిన నోటిఫికేషన్లకి ప్రిపేర్‌ కావచ్చా?

విపరీత పోటీ ఉన్న ఈ పరిస్థితుల్లో అవకాశాలు పెంచుకోవటం ముఖ్యం. అందుకని ఒకటికి మించిన నోటిఫికేషన్లకు  సిద్ధపడటం మంచి నిర్ణయం అవుతుంది. గ్రూప్స్‌ పరీక్షల వరకూ ఈ సూత్రం బలంగా ఉపయోగపడుతుంది. గ్రూప్‌ 1, 2...2, 3....3, 4 ఇలా విభిన్న కాంబినేషన్లు అనుసంధానించి చదువుకోవడం చాలా సందర్భాల్లో మంచి ఫలితాలను ఇచ్చింది. అయితే గ్రూప్‌-1 పరీక్ష అనేది కంటెంట్‌ ప్రజంటేషన్, ఎనాలిసిస్, రైటింగ్‌ నైపుణ్యాలు, విస్తృత అనువర్తనాలు అనే ప్రధాన గుణాలపై ఆధారపడి ఉంటుంది.  
ఏ కాంబినేషన్‌ ఎంపిక చేసుకోవాలనుకున్నా ఆయా పోటీ పరీక్షల మధ్య లభించే సమయాన్ని సరిగా పరిశీలించుకోవాలి. గ్రూప్‌ 1, 2 పరీక్షల మధ్య కాల అవధి ఎక్కువగా ఉన్నప్పుడే ఈ కాంబినేషన్‌ ఎంపిక చేసుకోవాలి. తక్కువగా ఉంటే ఏదో ఒక పరీక్ష ఎంపిక చేసుకోవడం మేలు. రాత నైపుణ్యాలు లేనప్పుడు గ్రూప్‌-1 వదిలివేయడం మంచిది.

 

గ్రూప్‌ 2,3,4 కాంబినేషన్‌ని సరిగా ప్లాన్‌ చేసుకుంటే ఈ పరీక్షలు ఆబ్జెక్టివ్‌ పరీక్ష విధానంలో ఉంటాయి కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి.

 

వృత్తి సంబంధమైన ఉపాధ్యాయ, అధ్యాపక, ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఇంజినీరింగ్, మెడికల్‌ ఉద్యోగాలు మరే ఇతర పరీక్షతోనూ కాంబినేషన్‌ ఏర్పర్చుకోకుండా విడిగా సిద్ధమవడమే మంచిది. ఇలాంటి వృత్తి సంబంధ పరీక్షలు పూర్తయిన తర్వాత సమయం ఉంటే ఇతర పరీక్షలపై దృష్టి పెట్టవచ్చు. వృత్తి సంబంధమైన కొన్ని పరీక్షల్లో పోటీ తక్కువగా ఉంటుంది. అందువల్ల సులభంగా ఎంపిక కావచ్చు. ఉపాధ్యాయ, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మొదలైన కొన్ని పరీక్షల్లో పోటీ తీవ్రంగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆయా పరీక్షలకే సిద్ధమవడం మేలు. 

 

కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ సివిల్స్, గ్రూప్‌-1 పరీక్షలను అనుసంధానించి చదువుకోవచ్చు. పరీక్ష తేదీలను బట్టి అంతిమ నిర్ణయం తీసుకోవడం సముచితం.

 

ఈసారికి సివిల్స్‌ పరీక్షను వదిలివేద్దామా?

కొద్ది సంవత్సరాలుగా సివిల్స్‌ పరీక్ష కోసం ప్రిపేర్‌ అవుతున్న చాలామంది అభ్యర్థులు ఈ గందరగోళానికి గురవుతున్నారు. ముఖ్యంగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో చాలా మంచి ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నందువల్ల ఈ తరహా సందిగ్ధత సివిల్స్‌ అభ్యర్థుల్లో ఏర్పడింది. సివిల్స్‌ చివరి ప్రయత్నంలో ఉన్నవారు, గతంలో మంచి ఫలితాలు సాధించినవారు సివిల్స్‌ పరీక్షకు హాజరవటం ప్రస్తుత పరిస్థితుల్లో సరైన నిర్ణయం అవుతుంది. రాష్ట్ర స్థాయి పరీక్షల్లో అనేక కారణాల వల్ల జాప్యం ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల సివిల్స్‌ పరీక్ష పూర్తి చేసుకుని గ్రూప్‌-1పై దృష్టి పెట్టడానికి సమయం దొరకవచ్చని అంచనా. అదే మొదటిసారి సివిల్స్‌ రాస్తున్నవారైతే ప్రయత్నాన్ని వృథా చేసుకోకుండా సివిల్స్‌ పరీక్షకు తాత్కాలికంగా కామా పెట్టి గ్రూప్‌-1 పరీక్షపైనే దృష్టి పెడితే స్థానిక అంశాలకు సంబంధించిన సబ్జెక్టుపై పట్టు దొరుకుతుంది. పర్యవసానంగా సివిల్స్‌ ప్రిపరేషన్‌లో పొందిన విస్తృత పరిజ్ఞానాన్ని ఉపయోగించి మంచి ర్యాంకులు సాధించవచ్చు.

 

మొదటి ప్రయత్నంలో సాధ్యమేనా?

తప్పనిసరిగా సాధించవచ్చు. అభ్యర్థుల్లో ఉండే సామర్ధ్యాల స్థాయులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. గత పరీక్షల్లో 22, 23 సంవత్సరాలకే ఉన్నత ఉద్యోగాలు పొందిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఎస్‌ఐ ఆఫ్‌ పోలీస్, కానిస్టేబుల్స్, ఉపాధ్యాయులుగా మొదటిసారే ఎంపికైన వారు 50 శాతానికి పైగానే ఉన్నారు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నైపుణ్య యువత... భారత్‌ భవిత

‣ దరి చేరనున్న 5జీ సాంకేతికత

‣ సులువుగా... సమగ్రంగా రాజ్యాంగాన్ని చదివేద్దాం!

‣ మార్కుల ఆధారంగా నేవీ ఉద్యోగాలు!

‣ అన్ని అడుగులూ కొలువుల వైపు!

‣ మౌఖిక పరీక్షల్లో ఇవి గుర్తుంచుకోవాలి!

 

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 
 

నమూనా ప్రశ్నపత్రాలు