• facebook
  • twitter
  • whatsapp
  • telegram

మౌఖిక పరీక్షల్లో ఇవి గుర్తుంచుకోవాలి! 

ఉద్యోగాన్వేషణలో భాగంగా చాలామంది ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరవుతుంటారు. అడిగిన ప్రశ్నలన్నింటికీ సరిగానే సమాధానాలు చెప్పారు కాబట్టి ఆ ఉద్యోగం తమకే వస్తుందని ధీమాగా ఉంటారు. కానీ ఒక్కోసారి తాము ఎంపిక కాలేదని తెలిసి నమ్మలేకపోతుంటారు; నిరుత్సాహపడుతుంటారు. అలాంటి అభ్యర్థులు సవరించుకోవాల్సిన లోపాలు ఏమిటి? 

తగిన విద్యార్హతలు, ఉద్యోగానుభవం ఉన్నప్పటికీ కొంతమంది ఇంటర్వ్యూల్లో ఎంపిక కావడం లేదు. దీనికి కారణం ఏమిటో తెలియక ఒత్తిడికీ గురవుతుంటారు. అవగాహన లేమి కారణంగా ఒక్కోసారి కొన్ని పొరపాట్లూ జరుగుతుంటాయి. అసలు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుంటే సాధ్యమైనంతవరకు అవి దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కొన్ని దిగ్గజ ఐటీ సంస్థలు రాబోయే ఆరునెలల్లో తమ సంస్థల్లో ఫ్రెషర్స్‌ను నియమించుకోనున్నట్లు వెల్లడించాయి. ఆ తరహా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే.. కింది విషయాలను ఒకసారి గమనించాలి. 

తెలుసుకుంటే మంచిదే

ఇంటర్వ్యూ సమయంలో సాధారణంగా ‘మా సంస్థలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు’ అనే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు సంస్థకు సంబంధించిన సమాచారం మీ దగ్గర ఉంటేనే సరైన సమాధానం చెప్పగలుగుతారు. కాబట్టి ఇంటర్వ్యూకు హాజరయ్యే సంస్థకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలి. కంపెనీ లక్ష్యాలను, దృక్కోణాన్ని అర్థం చేసుకుంటే వాళ్లు మీ నుంచి ఏం కోరుకుంటున్నారనే విషయంలో మీకో అవగాహన వస్తుంది. అప్పుడు మీరు చెప్పే సమాధానం కూడా వారి ఆలోచనలకు తగినట్టుగా సరిగ్గా సరిపోతుంది. 

వాస్తవాలే రాయాలి

ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే ఆశతో రెజ్యూమెను అవాస్తవాలతో నింపేస్తుంటారు కొందరు. ఇలాచేయడం ఎంతమాత్రం సరికాదు.  విద్యార్హతలు, అనుభవాల విషయంలో తప్పులు రాయడం వల్ల భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటి తాలూకు రుజువులను చూపించమంటే అప్పుడు ఇబ్బందిపడాల్సి ఉంటుంది. అవన్నీ నిజం కాదని తెలిసినప్పుడు అప్పటివరకు మీ మీదున్న సదభిప్రాయం కూడా పోయే అవకాశం ఉంది. 

ఎక్కువగా మాట్లాడొద్దు

ప్రశ్నను జాగ్రత్తగా విని తడబడకుండా జవాబు చెప్పాలి. చెప్పిన సమాధానంతో ఎదుటివ్యక్తి సంతృప్తిచెందేలా ఉండాలి. వ్యక్తిగత విషయాల గురించి తక్కువగా మాట్లాడి, వృత్తి సంబంధమైన విషయాలు మాట్లాడటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేగానీ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ రిక్రూటర్లకు అవకాశం ఇవ్వకుండా ఏకబిగిన మాట్లాడేయకూడదు. ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు నేరుగా వారి కళ్లలోకి చూస్తూ, చిరునవ్వుతో తలాడించడం లాంటివి చేయాలి. అంతేగానీ వాళ్లు మాట్లాడుతున్నప్పుడు అసహనంగా దిక్కులు చూస్తూ కూర్చోకూడదు.

సెల్‌ఫోన్‌ చూడొద్దు: ఇంటర్వ్యూ సమయానికంటే అరగంట ముందే అక్కడ ఉండేలా చూసుకోవాలి. ఆ ఖాళీ సమయాన్ని ఫోన్‌ చూస్తూ గడిపేయకూడదు. సెల్‌ఫోన్‌ను స్విచాఫ్‌ చేయడం మంచిది. ఆ సమయంలో రెజ్యూమెలో మీరు రాసిన విషయాలను ఒకసారి మళ్లీ పరిశీలించుకోవచ్చు. దీంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ దృష్టిని ఇంటర్వ్యూ మీదే పూర్తిగా కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది. 

దుస్తులకూ ప్రాధాన్యం: ఇంటర్వ్యూ అనగానే కొంతమంది ఏదో ఫంక్షన్‌కు వెళుతున్నట్టుగా సిద్ధం అవుతుంటారు. మరికొందరు వస్త్రధారణకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వరు. కనీసం ఇస్త్రీకూడా చేయని డ్రెస్‌ వేసుకుని వెళుతుంటారు. నిజానికి ఈ రెండు పద్ధతులూ సరికావు. చక్కగా ఇస్త్రీ చేసిన లేత రంగుల దుస్తులకు చిరునవ్వునూ జోడిస్తే ఎదుటివారు మీ విషయంలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది. 

తక్కువ చేయొద్దు: ఉద్యోగానుభవం ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలో సాధారణంగా ‘ఉద్యోగం ఎందుకు మారాలనుకుంటున్నారు’ అనే ప్రశ్న ఎదురవుతుంటుంది. అలాంటప్పుడు కొంతమంది గతంలో పనిచేసిన సంస్థను తక్కువచేసి మాట్లాడేస్తుంటారు. ‘అక్కడ పనిగంటలు ఎక్కువ, జీతం తక్కువ, అభివృద్ధికి అవకాశం లేదు...’ లాంటి ప్రతికూల సమాధానాలు చెబుతుంటారు. అలాకాకుండా అక్కడ నేర్చుకున్న నైపుణ్యాలు, పని అనుభవాల గురించి మాత్రమే చెప్పాలి. అలాగే ‘మీకు ఇష్టంలేని వ్యక్తులతో కలిసి ఎలా పనిచేశారో’ వివరించమనే ప్రశ్న కూడా అడగొచ్చు. ఇలాంటప్పుడు చెప్పే సమాధానం కూడా సానుకూలంగా ఉండాలి. దీంతో పరిస్థితులు, వ్యక్తులు సహకరించకపోయినా పనిచేసే నైపుణ్యం మీకుందనే విషయం రిక్రూటర్లకు అర్థమవుతుంది. 
 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-01-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌