• facebook
  • whatsapp
  • telegram

నైపుణ్య యువత... భారత్‌ భవిత

సరైన శిక్షణతోనే సుసాధ్యం

జనాభాలో యువజనులు ఎక్కువగా ఉంటే దేశాభివృద్ధికి వారు చోదక శక్తులుగా నిలుస్తారు. యువజనాధిక్యత వల్ల కలిగే ప్రయోజనం భారతదేశానికి మరో 25 ఏళ్లపాటు అందుబాటులో ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే యువతరాన్ని నిపుణ మానవ వనరులుగా తీర్చిదిద్దడానికి త్వరపడాలి. భారత జనాభాలో 50శాతం 25 ఏళ్లలోపువారే. 62శాతం 15-59 వయోవర్గంలోకి వస్తారు. మన జనాభా సగటు వయసు 29 సంవత్సరాలు మాత్రమే. దీనికి భిన్నంగా సంపన్న దేశాల జనాభాకు వయసు మీరిపోతోంది. అక్కడి జననాల రేటూ తగ్గుతోంది. ఈ కారణాల వల్ల అమెరికా, జపాన్‌ వంటి పారిశ్రామిక దేశాల్లో రాగల 20 ఏళ్లలో కార్మిక బలగం నాలుగు శాతం మేర తగ్గబోతుంటే- భారత్‌లో 32శాతం దాకా పెరగనున్నది. ఇది శీఘ్ర ఆర్థికాభివృద్ధి సాధనకు ఎంతో అనుకూలించే అంశం.

ధోరణి మారితేనే సత్ఫలితాలు

యువ శ్రామిక బలగానికి విజ్ఞాననైపుణ్యాలు తోడైతే మార్కెట్‌ పోటీలో నెగ్గుకురాగలుగుతాం. కొత్త అవకాశాలను అందిపుచ్చుకొని సవాళ్లను ఎప్పటికప్పుడు అధిగమించగలుగుతాం. కానీ, నైపుణ్యాభివృద్ధిలో భారత్‌ వెనకబడి ఉంది. మన యువజనులను నిపుణులుగా తీర్చిదిద్దితే సొంత అవసరాలను తీర్చుకోవడంతోపాటు వయసు పైబడుతున్న సంపన్న దేశాల శ్రామిక అవసరాలనూ తీర్చగలుగుతాం. ఈ హైటెక్‌ యుగంలో ఉపాధి, వ్యాపారాల్లో రాణించడానికి నైపుణ్యాలు తప్పనిసరి. చదువులో రాణించలేకపోయినవారే వర్కు షాపుల్లో చేరి పనులు నేర్చుకొంటారనే అభిప్రాయం మనలో పాతుకుపోయింది. కర్మాగారాల్లో చేతులకు ఆయిల్‌ మరకలు అంటించుకునే ఉద్యోగాలకన్నా కుర్చీలో కూర్చుని చేసే ఉద్యోగాలకే ఎక్కువ మంది భారతీయులు ఓటు వేస్తారు. భారత్‌లో పారిశ్రామిక నైపుణ్యాలు వృద్ధి చెందకపోవడానికి ఈ ధోరణి చాలావరకు కారణమైంది. భారతీయుల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. దేశవ్యాప్తంగా వృత్తి విద్యా సంస్థల్లో ఇస్తున్న శిక్షణ పారిశ్రామిక అవసరాలకు తగినట్లు ఉండటం లేదు. సాంకేతిక విద్యలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థులు చాలామందిలో ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కొరవడినట్లు అనేక అధ్యయనాలు సైతం వెల్లడించాయి. ఫలితంగా ఏకకాలంలో పరిశ్రమలకు సిబ్బంది కొరత, యువజనులకు ఉద్యోగాల కొరత ఏర్పడటమనే వింత పరిస్థితి ఇక్కడ కొనసాగుతోంది. భారత ప్రభుత్వం పెద్దయెత్తున నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినా- అవి 20 వేర్వేరు మంత్రిత్వ శాఖలు, విభాగాల చేతుల మీద నడుస్తున్నాయి. వాటి మధ్య సమన్వయం లేకపోవడంతో ఆశించిన లక్ష్యాలు నెరవేరడం లేదు. ఆ శిక్షణ కార్యక్రమాలు గిరాకీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి తోడ్పడేలా లేవు. కేంద్రం, రాష్ట్రాలు, పరిశ్రమలు కలిసికట్టుగా శిక్షణ కార్యక్రమాలను రూపొందించి యువతకు నైపుణ్యాలను అలవరచాలి. ప్రస్తుతం నడుస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చాలావరకు గ్రాంట్ల మీదో, ఉచితంగానో చేపట్టారు. పైగా ఆ కోర్సుల నాణ్యత కూడా అంతంతమాత్రమే. ఏం నేర్పుతున్నామనేదానికన్నా ఎంతమందిని చేర్చుకున్నామనేదానికి శిక్షణ సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ కారణాల వల్ల యువజనులు సైతం ఆయా కోర్సులను తేలిగ్గా తీసుకుంటున్నారు. ఈ పరిస్థితిని మార్చాలి. ఉద్యోగార్హతను అందించే నైపుణ్య కోర్సులను చేపట్టాలి. అనేకానేక సంస్థలు సర్టిఫికెట్లను అందించడం కాకుండా ఏకీకృత ధ్రువీకరణ పత్రానికి లేదా వివిధ కోర్సుల అనుసంధానానికి మారితే కోర్సులకు విలువ పెరుగుతుంది. ఈ తరహా అనుసంధానానికి కేంద్రం ‘జాతీయ నైపుణ్య సర్టిఫికేషన్ల చట్రం (ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌)’ ఏర్పాటు చేసినా, ఆశించిన ఫలితం అందడం లేదు. సమర్థులైన శిక్షకుల కొరత కూడా నైపుణ్యాభివృద్ధికి అడ్డుతగులుతోంది. శిక్షకుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలి. వారు ఆ వృత్తిలో ఎదగడానికి అవకాశాలు కల్పించాలి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను పరిశ్రమల అవసరాలతో అనుసంధానించకపోవడం మరో పెద్ద లోపం. ఫలితంగా శిక్షణ పొందినవారికి ఉద్యోగాలు దొరకడం కష్టమైపోతోంది. తమకు ఎటువంటి నైపుణ్యాలు కావాలో, ఎంతమందికి వాటిని నేర్పాలో పరిశ్రమలు సూచించనారంభించాయి. దీంతోపాటు మంచి జీతభత్యాలు, పని పరిస్థితులను కూడా కల్పించాలి.

ఆధునిక పాఠ్యప్రణాళిక కీలకం

భారతీయ శ్రామిక బలగంలో 93శాతం అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. సంఘటిత రంగంలో మాదిరిగా ఈ రంగానికి కావలసిన నైపుణ్యాలేమిటో కచ్చితంగా గుర్తించడం, శిక్షణ ఇవ్వడం కష్టసాధ్యం. అయితే, సంఘటిత రంగంకన్నా రెట్టింపు ఉద్యోగావకాశాలను సృష్టించే సత్తా అసంఘటిత రంగానికి ఉంది. కాబట్టి అసంఘటిత రంగ అవసరాలకు తగ్గ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడంపై తక్షణం శ్రద్ధ పెట్టాలి. భారత జనాభాలో అధిక శాతాన్ని ఆక్రమించే యువతరంలో సగంమంది యువతులే. కానీ, ఇటీవల మహిళా కార్మిక భాగస్వామ్యం తగ్గుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. 2004-11 మధ్య గ్రామాల్లో ఈ భాగస్వామ్య రేటు 33.3శాతం నుంచి 26.5శాతానికి, సర్వే చేసిన ఆరు పట్టణ ప్రాంతాల్లో 17.8శాతం నుంచి 15.5శాతానికి తగ్గింది. మహిళలకు ఆధునిక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారి ఉత్పాదకతను, భాగస్వామ్యాన్ని పెంచాలి. ప్రభుత్వ విభాగాలు, కార్పొరేట్‌ సంస్థలు కలిసి సమన్వయంతో ముందుకు కదిలితే యువతీయువకులకు సమగ్ర శిక్షణ ఇచ్చి దేశాభ్యుదయంలో చురుకైన పాత్రధారులుగా చేయవచ్చు. మారుతున్న కాలానికి తగినట్లు మన విద్యావ్యవస్థను సంస్కరించాలి. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన పాఠ్య ప్రణాళికలను ప్రవేశపెట్టి, 21వ శతాబ్దానికి కావలసిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నేటి యువతకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యవస్థాపక సామర్థ్యం పెరగాలి

కొవిడ్‌కు ముందు, తరవాత కూడా భారత్‌లో ఉపాధి అవకాశాలు తగ్గాయి. 2004-05 నుంచి 2009-10 వరకు భారత్‌లో కేవలం 27 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో కొత్త ఉద్యోగావకాశాల సృష్టికి సరైన విధానాలను అనుసరించాలి. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగ అభివృద్ధికి ఊతమివ్వాలి. అపార ఉపాధి అవకాశాలను సృష్టించి, భారత స్థూల దేశీయోత్పత్తిని వృద్ధి చేసే సత్తా  ఎంఎస్‌ఎంఈ రంగానికి ఉంది. తైవాన్‌ జీడీపీకి ఎంఎస్‌ఎంఈ రంగం 85శాతం వాటాను సమకూరుస్తుంటే- చైనాలో 60శాతం, సింగపూర్‌లో 50శాతం వాటాను అందిస్తోంది. భారత్‌కు వచ్చేసరికి జీడీపీలో ఎంఎస్‌ఎంఈ రంగ వాటా కేవలం 17శాతమే. ప్రభుత్వమే అన్నీ చూసుకోవాలనే మనస్తత్వం వదిలించుకుని తామే ఉద్యోగాలిచ్చే స్థాయికి యువత ఎదగాలి. ఇందుకు తోడ్పడే విధానాలను ప్రభుత్వం అమలు చేస్తూ- పెట్టుబడులు, మార్కెట్‌ మద్దతు అందించాలి. ఒక్క మాటలో, మన యువతలో వ్యవస్థాపక సామర్థ్యాన్ని ఇనుమడింపజేయాలి.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సులువుగా... సమగ్రంగా రాజ్యాంగాన్ని చదివేద్దాం!

‣ మార్కుల ఆధారంగా నేవీ ఉద్యోగాలు!

‣ అన్ని అడుగులూ కొలువుల వైపు!

‣ మౌఖిక పరీక్షల్లో ఇవి గుర్తుంచుకోవాలి!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 11-03-2022గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం