• facebook
  • whatsapp
  • telegram

భద్రమైన భవితకు బీఎస్సీ నర్సింగ్‌!

అడ్మిషన్ల కోసం ప్రకటన విడుదల

ఇటీవలి కాలంలో ప్రాధాన్యం పెరుగుతోన్న కోర్సుల్లో బీఎస్సీ నర్సింగ్‌ ఒకటి. ఆరోగ్య రంగంలోని అవసరాలకు కొవిడ్‌ నేపథ్యం తోడై సుశిక్షితులైన నర్సులకు గిరాకీ ఎక్కువైంది. మనదేశంతోపాటు ప్రపంచాన్నీ నర్సింగ్‌ నిపుణుల కొరత వేధిస్తోంది. అందువల్ల దీనిపై ఆసక్తి ఉన్నవారు బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు పూర్తిచేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్నత అవకాశాలు సొంతం చేసుకునే వీలుంది. ఇటీవలే డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్‌లోని సుమారు 170 కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలచేసింది. ఈ నేపథ్యంలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు, ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల వివరాలు చూద్దాం...

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) ప్రమాణాల ప్రకారం వెయ్యి మంది జనాభాకు ముగ్గురు నర్సులు ఉండాలి. మనదేశంలో 1.7 మందే ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అసలు ఈ మాత్రమూ లేరని ఈ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే 2024 నాటికి అదనంగా 43 లక్షల మంది నర్సులు మన ఒక్క దేశానికే అవసరమవుతారు. ప్రపంచానికి 2030 నాటికి 60 లక్షల మంది సేవలు అవసరమని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వాటి ప్రకారం లెక్కేసినా ఒక్క మన దేశ అవసరాలు తీర్చడానికే 20 లక్షల మంది నర్సులు కావాలి. 

ఇంటర్‌ తర్వాతే...

ఆసుపత్రుల్లో వైద్యుల తర్వాతి ప్రాధాన్యం నర్సులదే. అక్కడి కార్యకలాపాలు సజావుగా సాగడంలో వీరి పాత్రే కీలకం. ఒకవైపు వైద్యులకు సహాయంగా ఉంటూ, మరోవైపు రోగులకు మేమున్నామనే భరోసా ఇస్తున్నారు నర్సులు. మనదేశంలో నర్సింగ్‌ చదువులు ఇంటర్మీడియట్‌ తర్వాత మొదలవుతాయి. అభ్యర్థుల పూర్వ విద్య నేపథ్యం బట్టి ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులు ఎంచుకోవచ్చు. అయితే ఈ మూడింటిలో బీఎస్సీ నర్సింగ్‌ విశిష్టమైనది. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎంల్లో ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులకూ అవకాశం ఉంటుంది. అదే బీఎస్సీ నర్సింగ్‌ చదవడానికి మాత్రం ఇంటర్మీడియట్‌లో బయాలజీ (బోటనీ, జువాలజీ), ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత తప్పనిసరి. 

ఏపీలో ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో 89, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి అనుబంధంగా 82 కళాశాలలు బీఎస్సీ నర్సింగ్‌ విద్యను అందిస్తున్నాయి. ప్రస్తుత ప్రకటనతో 2021-2022 విద్యా సంవత్సరానికి వీటిలో సీట్లు భర్తీ చేస్తారు. సైన్స్‌ సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల మెరిట్‌తో రిజర్వేషన్లను అనుసరించి అవకాశం కల్పిస్తారు. 85 శాతం సీట్లకు స్థానికులే అర్హులు. మిగిలిన 15 శాతానికి అందరూ (స్థానికులు, స్థానికేతరులు) పోటీ పడవచ్చు. ఈ కోర్సులోకి పురుష విద్యార్థులకూ అవకాశం ఉంది. 

ఏం చదువుతారంటే...

బీఎస్సీ నర్సింగ్‌ నాలుగేళ్ల కోర్సులో చేరిన విద్యార్థులు ఫిజియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, న్యూట్రిషన్, సైకాలజీ, ఫార్మకాలజీ, సోషియాలజీ, పాథాలజీ, జెనెటిక్స్, కమ్యూనిటీ హెల్త్, మెంటల్‌ హెల్త్, చైల్డ్‌ హెల్త్, ఆబ్సెస్ట్రికల్‌ నర్సింగ్‌..తదితర అంశాలను అధ్యయనం చేస్తారు. మానవ శరీరానికి సంబంధించిన అన్ని అంశాలపైనా వీరికి ప్రాథమిక స్థాయి అవగాహన కల్పిస్తారు. రోగులతో ఎలా వ్యవహరించాలి, ఆసుపత్రుల్లో విధుల నిర్వహణపైనా వీరికి తెలిసేలా చేస్తారు. కోర్సు చివరలో ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. 

అవకాశాలు...

సుశిక్షితులైన నర్సులకు విదేశాల్లో ఉన్నత అవకాశాలు లభిస్తున్నాయి. ఎన్నో దేశాల్లో నర్సుల కొరత తీవ్రంగా ఉంది. ఇవన్నీ భారత్‌వైపు చూస్తున్నాయి. సబ్జెక్టుపై పట్టు, ఆంగ్లంలో ప్రావీణ్యం ఉన్నవారు యూకే, యూరప్‌ దేశాల్లో ప్రారంభంలోనే ఏడాదికి సుమారు రూ.20 లక్షల వేతనంతోపాటు వసతి, సౌకర్యాలను పొందవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలన్నింటికీ నర్సుల అవసరం ఉంది. గల్ఫ్, యూఎస్, యూకే, కెనడా, సింగపూర్, మిడిల్‌ ఈస్ట్‌లు భారత నర్సులకు ప్రాధాన్యమిస్తున్నాయి. 

కొవిడ్‌ నేపథ్యంలో ఈ వృత్తికి ప్రాధాన్యం, డిమాండ్‌ రెండూ పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమీప భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో నర్సుల నియామకాలు చేపట్టడానికి అవకాశం ఉంది. ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంలు, హెల్త్‌ సెంటర్లు, విద్యా సంస్థలు, ఓల్డేజ్‌ హోంలు, కార్పొరేట్‌ సంస్థలు..అన్ని చోట్లా నర్సులకు అవకాశాలుంటాయి. 

బీఎస్సీ నర్సింగ్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, రైల్వేలు, ఇతర కేంద్రీయ సంస్థలకు ఎంపికైనవారు లెవెల్‌ 7 మూలవేతనం రూ.44,900 పొందుతున్నారు. అంటే వీరు ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే డీఏ, హెచ్‌ఆర్‌ఏ, అలవెన్సులు కలుపుకుని సుమారు రూ.80 వేల వేతనం పొందవచ్చు. వీరిని ఆర్మీలో నేరుగా లెఫ్టినెంట్‌ (లెవెల్‌ 10) హోదాతో విధుల్లోకి తీసుకుని రూ.లక్షకు పైగా వేతనం చెల్లిస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు, హెల్త్‌ సెంటర్లు, సంక్షేమ వసతి గృహాల్లో సేవలు అందించడానికి నర్స్‌ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీరికి ప్రారంభ మూలవేతనం సుమారు రూ.30వేలు లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులతో మొదటి నెల నుంచే దాదాపు రూ.45 వేలు అందుకోవచ్చు. కార్పొరేట్‌ ఆసుపత్రులు బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసినవారికి ప్రారంభంలో రూ.20 వేల నుంచి 25 వేల వరకు వేతనం అందిస్తున్నాయి. శ్రమించే తత్వం, సహనం, వృత్తి నైపుణ్యం, మెలకువలు ఉన్నవారు ఈ రంగంలో తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు.

ఉన్నత విద్య

ప్రత్యేక విభాగాల్లో సేవలు అందించాలనుకునేవారు, బోధనలో రాణించాలని ఆశించేవారు ఉన్నత విద్య దిశగా అడుగులేయవచ్చు. ఎమ్మెస్సీ, ఎంఫిల్, పీహెచ్‌డీలు పూర్తిచేసుకోవచ్చు. 

పోస్టు బేసిక్‌ డిప్లొమా: ఏదైనా విభాగంలో ప్రత్యేక సేవలు అందించాలనుకున్నవారు బీఎస్సీ నర్సింగ్‌ తర్వాత ఏడాది వ్యవధితో ఉన్న పోస్టు బేసిక్‌ డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు. కార్డియో థొరాసిక్, క్రిటికల్‌ కేర్, మిడ్‌ వైఫరీ, న్యూరో సైన్స్, అంకాలజీ, ఆర్థోపెడిక్‌ అండ్‌ రిహాబిలిటేషన్, సైకియాట్రిక్, నియోనటాల్, ఆపరేషన్‌ రూమ్, ఎమర్జెన్సీ అండ్‌ డిజాస్టర్, ఆప్తాల్మిక్, టీబీ, లెప్రసీ..ఇలా నచ్చిన స్పెషలైజేషన్‌ ఎంచుకునే వీలుంది.

ఎమ్మెస్సీ నర్సింగ్‌: ఇందులో కమ్యూనిటీ హెల్త్‌ నర్సింగ్, మెడికల్‌ సర్జికల్‌ నర్సింగ్, ఆబ్సెస్ట్రిక్స్‌ అండ్‌ గైనకలాజికల్‌ నర్సింగ్, మెంటల్‌ హెల్త్‌ నర్సింగ్, చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్‌ స్పెషలైజేషన్లు ఉన్నాయి. కోర్సుల వ్యవధి రెండేళ్లు. పీజీ పూర్తి చేసుకున్నవారు స్పెషాలిటీ విభాగాల్లో ప్రత్యేక సేవలు అందించవచ్చు లేదా బోధన దిశగా అడుగులేయడానికి ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తిచేసుకోవచ్చు.

బీఎస్సీ నర్సింగ్‌ తర్వాత ఆసక్తి ఉన్నవారు ఎంబీఏ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు ఎంచుకోవచ్చు. లేదా కొన్ని సంస్థలు రెండేళ్ల వ్యవధితో అందిస్తోన్న నర్స్‌ ప్రాక్టీషనర్‌ క్రిటికల్‌ కేర్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ రెసిడెన్సీ ప్రొగ్రాంలో చేరవచ్చు. ఈ కోర్సుకు ప్రాధాన్యం పెరుగుతోంది. వీరు డాక్టర్‌ అందుబాటులో లేనప్పుడు చాకచక్యంగా అత్యవసర సేవలు అందించగలరు. 

విదేశాలకు ఇలా...

విదేశాల్లో ఉద్యోగాన్ని ఆశించేవారు ఆయా దేశాల్లో నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించడం తప్పనిసరి. 

యూఎస్‌ కోసం ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ టెస్టు (టోఫెల్‌ లేదా ఐఈఎల్‌టీఎస్‌)లో స్కోరు, నేషనల్‌ కౌన్సిల్‌ లైసెన్సింగ్‌ ఎగ్జామినేషన్‌ - రిజిస్టర్డ్‌ నర్స్‌ (ఎన్‌సీఎల్‌ఈఎక్స్‌ - ఆర్‌ఎన్‌)లో ఉత్తీర్ణత సాధించాలి. 

కెనడాలో కెరియర్‌ ఆశించేవారు కెనడియన్‌ రిజిస్టర్డ్‌ నర్సెస్‌ ఎగ్జామ్‌ (సీఆర్‌ఎన్‌ఈ)లో అర్హత పొందాలి.

దుబాయ్‌లో పనిచేయడానికి దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ నిర్వహించే పరీక్షలో, సౌదీ అరేబియాకు ప్రొమెట్రిక్‌ పరీక్షలో, ఖతార్‌కు సుప్రీం కౌన్సిల్‌ ఆఫ్‌ హెల్త్‌ పరీక్షలో అర్హత పొందాలి..

కొన్ని గల్ఫ్‌ దేశాలు రెండు మూడేళ్ల అనుభవం ఉన్నవారిని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. నేరుగా ఇంటర్వ్యూతో అవకాశం కల్పిస్తున్నాయి. పేరున్న నర్సింగ్‌ కళాశాలలు

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) న్యూదిల్లీతోపాటు భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, పట్నా, రాజ్‌పూర్, రుషికేష్‌ల్లో బీఎస్సీ నర్సింగ్‌ ఆనర్స్‌ కోర్సు మహిళల కోసం అందిస్తున్నారు. ఉమ్మడి పరీక్షతో ప్రవేశం పొందవచ్చు.  

క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ (సీఎంసీ), వెల్లూరు

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజ్‌ (ఏఎఫ్‌ఎంసీ), పుణె

జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్మర్‌), పుదుచ్చెరి

పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్, చండీగఢ్‌

మణిపాల్‌ అకాడెమీ

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల ఆధ్వర్యంలో నడుస్తోన్న నర్సింగ్‌ కళాశాలలు  

నిమ్స్, అపోలో, యశోదా..తదితర కార్పొరేట్‌ ఆసుపత్రుల కళాశాలలు

అర్హత: ఇంటర్మీడియట్‌లో ఇంగ్లిష్‌ తప్పనిసరి సబ్జెక్టుగా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్ర్టీలతో ఉత్తీర్ణత. అలాగే సైన్స్‌ సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 40 శాతం ఉండాలి. ఇంటర్‌ ఒకేషనల్‌ విద్యార్థులూ అర్హులే. అయితే వీరు బయాలజీ, ఫిజికల్‌ సైన్స్‌ల్లో బ్రిడ్జ్‌ కోర్సులు పూర్తిచేయడం తప్పనిసరి. 

వయసు: డిసెంబరు 31, 2021 నాటికి 17 ఏళ్లు పూర్తి కావాలి.

దరఖాస్తుల గడువు: మార్చి 21 మధ్యాహ్నం 4 గంటలు.

దరఖాస్తు ఫీజు: రూ.2360. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1888.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నైపుణ్య యువత... భారత్‌ భవిత

‣ దరి చేరనున్న 5జీ సాంకేతికత

‣ సులువుగా... సమగ్రంగా రాజ్యాంగాన్ని చదివేద్దాం!

‣ మార్కుల ఆధారంగా నేవీ ఉద్యోగాలు!

‣ అన్ని అడుగులూ కొలువుల వైపు!

‣ మౌఖిక పరీక్షల్లో ఇవి గుర్తుంచుకోవాలి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 14-03-2022


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌