• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సర్కారు కొలువుకు సిద్ధమయ్యే ముందు..!

ఏయే అంశాలను గమనించి ప్రిపరేషన్‌ ప్రారంభించాలి?

‘పోటీ పరీక్షల ప్రిపరేషన్‌ను ఎలా ప్రారంభించాలి?’ - ప్రారంభంలో ప్రతి అభ్యర్థీ ఎదుర్కొనే ప్రశ్న ఇది. ‘సరైన ప్రారంభం సగం విజయం’ అంటారు కదా? అందుకే తెలంగాణలో రాబోతున్న ఉద్యోగ నోటిఫికేషన్లకు సంసిద్ధం అవ్వాలనుకుంటున్న అభ్యర్థులు కొన్ని ప్రధానమైన అంశాలను గమనించి, వాటి మేళవింపుతో ప్రిపరేషన్‌ను ప్రారంభించాలి. అవేమిటి? ఎలా? నిపుణుల సూచనలు ఇవిగో! 

మౌలికమైన అంశాలు

ఒక భాష నేర్చుకునేందుకు అక్షరాలను మొదట నేర్చుకోవాలి. అదేవిధంగా పోటీ పరీక్షల్లో వివిధ సబ్జెక్టులకు సంబంధించి ప్రాథమికంగా ఉండే మౌలిక అంశాలను ముందుగా అర్థం చేసుకుని జ్ఞాపకం ఏర్పర్చుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే భవంతులకు పునాదుల వంటివి మౌలిక అంశాలు. ఇవి ఒక్కో పోటీపరీక్షకు ఒక్కో రకంగా ఉంటాయి.

గ్రూప్స్‌ పరీక్షలు తీసుకుంటే వివిధ రకాలైన సబ్జెక్టులు సిలబస్‌ అంశాలుగా ఉంటాయి. ఆ సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక నిర్వచనాలు, సంకేతాలు, అర్థాలు గ్రహించాలి. ప్రధానంగా ఎన్‌సీఈఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ పుస్తకాల పఠనం మౌలిక అంశాలపై అవగాహన పెంచుతాయి. తెలుగు అకాడమీ మౌలిక అంశాలపై చిన్న చిన్న పుస్తకాలు కూడా విడుదల చేసింది. పాఠశాల స్థాయికి నిర్దేశించిన నాలుగో తరగతి పుస్తకాల నుంచి పదో తరగతి పుస్తకాల వరకు పోటీ పరీక్షల సిలబస్‌ను దృష్టిలో పెట్టుకుని చదివితే మౌలిక అంశాలపై పట్టు వస్తుంది. 

కానిస్టేబుల్, ఎస్‌ఐ ఆఫ్‌ పోలీస్‌ మొదలైనవాటి నియామక పరీక్షలకు కూడా ఈ పుస్తకాలనే చదవాలి. జూనియర్‌ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్‌ మొదలైన వృత్తి సంబంధిత పోటీ పరీక్షల్లోనూ జనరల్‌ స్టడీస్‌ అనివార్యంగా ఉంటుంది. అందుకని వాటికి సంబంధించిన మౌలిక అంశాలు నేర్చుకునేందుకు పైన చెప్పిన పుస్తకాలు చదివితే సరిపోతుంది. అయితే వృత్తిపరమైన సబ్జెక్ట్‌ను పరిశీలించే పేపర్‌కి మాత్రం అర్హత పరీక్షలో ఏ సిలబస్‌ ఉంటుందో దానిపై దృష్టి పెట్టాలి.

టెట్, డీఎస్సీ పరీక్షలను ఎదుర్కొనేందుకు అవసరమైన మౌలిక భావనలు నేర్చుకోవాలి. దీనికి ఆయా కోర్సుల స్థాయిలో ప్రభుత్వం నిర్దేశించిన పుస్తకాలు చదివితే సరిపోతుంది. కంటెంట్‌ విషయానికి సంబంధించి ఆయా ఉద్యోగాల ద్వారా ఏయే తరగతులకు పాఠాలు బోధిస్తారో ఆయా తరగతుల పాఠ్యపుస్తకాలను ప్రాథమికంగా చదవాల్సి ఉంటుంది. దాదాపు అన్ని పోటీ పరీక్షల్లోనూ జనరల్‌ నాలెడ్జ్‌ సంబంధిత ప్రశ్నలుంటాయి. వాటికి ఎల్లవేళలా స్థిరమైన సమాధానాలు ఉంటాయి. మౌలిక అంశాలు నేర్చుకునే క్రమంలో వాటినీ అధ్యయనం చేయాలి.

కాన్సెప్ట్‌ ఆధారితమా? ఫ్యాక్ట్‌ ఆధారితమా?

పోటీ పరీక్షల సన్నద్ధత అనగానే చాలామంది కాన్సెప్చువల్‌గా చదవండి- అని చెబుతుంటారు. ఇలా ప్రిపేర్‌ అవటం అనేది ఒక పరీక్ష స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. కాన్‌సెప్చువల్‌గా తయారవటంలో మనసు పెట్టటం, చదివిన విషయాలను వివిధ అంశాలతో అనుసంధానించటం, వినూత్న ఆలోచనలతో కొత్త అంశాలపై దృష్టి నిలపడం మొదలైన ప్రక్రియలుంటాయి. దీనికి భిన్నంగా ఫ్యాక్చువల్‌ ప్రిపరేషన్లో నిర్దిష్ట సమాచారాన్ని చదవటం, జ్ఞాపకం ఉంచుకోవటం జరుగుతుంది. ఎక్కాలు లాంటివి నేర్చుకోవడం ఈ తరహా ప్రిపరేషన్‌. 

డీఎస్సీ, కానిస్టేబుల్ గ్రూప్‌-4, గ్రూప్‌-3 మొదలైన దిగువస్థాయి పరీక్షల్లో ప్రశ్నలు చాలావరకు ఫ్యాక్చువల్‌ సమాచారంపైన ఆధారపడతాయి. అందువల్ల ఆయా పరీక్షలకు సిద్ధపడుతున్నప్పుడు ఫ్యాక్చువల్‌ సమాచారంపై పట్టు సాధించాలి.

గ్రూప్‌-1, డిగ్రీ లెక్చరర్స్, జూనియర్‌ లెక్చరర్స్‌ మొదలైన పరీక్షల్లో కాన్సెప్ట్‌ ఆధారిత ప్రశ్నలు ప్రధానంగా ఉంటాయి. ఆ విధంగానే సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. గ్రూప్‌-2లో చాలావరకూ ఫ్యాక్ట్‌ ఆధారిత ప్రశ్నలుంటాయి. ఇటీవలికాలంలో కాన్సెప్ట్‌ ఆధారిత ప్రశ్నలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. అందువల్ల అభ్యర్థులు గ్రూప్‌-2కి సన్నద్ధం అయ్యేటప్పుడు కాన్సెప్ట్‌ ఆధారిత ప్రశ్నలను కూడా వివిధ కోణాల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

పరీక్ష కోసం చదవడం ప్రారంభించే తొలిదశలోనే ఆ పరీక్షలో కాన్సెప్ట్‌ ఆధారిత అంశాలు ప్రధానమా, ఫ్యాక్ట్‌ ఆధారిత అంశాలు ప్రధానమా? అనే ప్రాథమిక ఆలోచన చేయాలి. ఆ కోణంలో సన్నద్ధతను మొదలుపెట్టాలి.

ప్రభుత్వ వనరులకు ప్రాముఖ్యం

పోటీ పరీక్షల తయారీ ప్రారంభించగానే సగటు అభ్యర్థులు ఎక్కువమంది సమీపంలోని బుక్‌ స్టాల్‌కి వెళ్లి  సంచుల్లో పుస్తకాలు కొంటున్నారు. అలా కొనేందుకు ప్రమాణం ఏమిటి అంటే- పుస్తకాల షాపు వాళ్ళు రిఫర్‌ చేయడం, ఆకర్షణీయమైన అట్టలు, వందల కొద్దీ పేజీలు. అయితే ఈ ప్రమాణాలు ఎంతమాత్రం హేతుబద్ధం కావు. 

నిజానికి ప్రభుత్వ ప్రచురణలు ఎగ్జామినర్‌కి ప్రధాన వనరులుగా ఉంటాయి. తెలుగు అకాడమీ పుస్తకాలు, పాఠశాల స్థాయి పుస్తకాలు, విశ్వవిద్యాలయ పుస్తకాలు ప్రధాన వనరులుగా వినియోగమయ్యే అవకాశం ఎక్కువ. అందువల్ల ఏ పోటీ పరీక్షలకు చదువుతున్నా సంబంధిత ప్రభుత్వ ప్రచురణలు ప్రామాణికంగా తీసుకుని చదవడం మంచిది. ఒక సబ్జెక్టుకు ఏదైనా ఒక పుస్తకం తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పుస్తకాలు కొంటున్నకొద్దీ అభ్యర్థికి అనేక సమస్యలు, సందిగ్ధాలు పెరుగుతాయి. ప్రభుత్వ ప్రచురణలే కాకుండా ప్రభుత్వ వెబ్‌సైట్లు కూడా ఇటీవలి కాలంలో పరీక్షలకు ఉపయోగపడే స్థాయిలో ఉన్నాయి. అందువల్ల ప్రధానంగా గ్రూప్‌ 1, 2 పరీక్షలకు సిద్ధపడేవారు ఆయా వెబ్‌సైట్‌లను వినియోగించుకోవాలి.

పకడ్బందీగా టైమ్‌ టేబుల్‌ 

పరీక్ష నోటిఫికేషన్‌ నుంచి పరీక్ష నిర్వహించే తేదీకి మధ్య ఉన్న కాలాన్ని సమర్థంగా వినియోగించుకునేందుకు టైమ్‌ టేబుల్‌ షెడ్యూల్‌ని పక్కాగా తయారు చేసుకోవాలి. ఎక్కువ మార్కులు ఇవ్వగలిగిన సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ఎక్కువ సమయం కేటాయించాలి. తక్కువ మార్కులు వచ్చే అంశాలకు తక్కువ సమయం కేటాయించాలి. ఇలా టైమ్‌టేబుల్‌ షెడ్యూల్‌ రూపొందించుకోవాలి. పరీక్ష సిలబస్‌కు సంబంధించిన అన్ని అంశాలూ తప్పనిసరిగా కవర్‌ అయ్యేలాగా చూసుకోవాలి. 

గ్రూప్‌-1 మెయిన్స్‌ లాంటి పరీక్షకు సిద్ధపడేటప్పుడు టైమ్‌టేబుల్‌ షెడ్యూల్‌ తయారీలో నిర్దిష్ట అంశాలకు ప్రాధాన్యం ఇస్తే సరిపోతుంది. పునశ్చరణ (రివిజన్‌)కు కూడా సమయం కేటాయించాలి. టైమ్‌టేబుల్‌ షెడ్యూల్‌ను తయారు చేయటమే కాదు, కచ్చితంగా దాన్ని అమలు చేయాలి. దీని అమల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ విఫలం అవ్వకూడదు. అలాంటి సంకల్పంతో, పట్టుదలతో పరీక్ష సన్నద్ధతను ప్రారంభించాలి.

సొంత నోట్సు

పోటీ పరీక్షల సన్నద్ధత అనగానే చాలామంది సొంత నోట్సు తయారు చేసుకోమని సలహా ఇస్తారు. ఇది మంచి సలహానే కానీ పరీక్షకు లభిస్తున్న సమయాన్ని బట్టి మాత్రమే సొంత నోట్సు తయారు చేసుకోవాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి. పుస్తకాలు చదివిన తర్వాత వివిధ అంశాలను సంక్షిప్త నోట్‌ మాదిరిగా తయారుచేసుకోవటమనేది తక్కువ సమయం ఉన్నప్పుడు ఉపకరిస్తుంది. 

గ్రూప్‌-1 లాంటి పరీక్షలకు తప్పనిసరిగా సొంత నోట్సు తయారు చేసుకోవాలి. మిగతా పరీక్షలకు చదవటం, వినటమే కాకుండా.. సమయం లభించినప్పుడే సొంత నోట్సు తయారీకి ప్రయత్నించాలి. అలాంటి వ్యవధి లేనప్పుడు ప్రామాణిక పుస్తకాన్ని తీసుకొని దాన్ని రివిజన్‌ చేయడం మంచిది.

తుది వరకూ దృఢచిత్తం

ప్రారంభంలో ఉండే ఆవేశం, తపన చివరి వరకూ కొనసాగేలా దృఢ చిత్తంతో ఉండాలి. చాలామంది పోటీ పరీక్షకు తయారయ్యేటప్పుడు మొదట్లో పెద్దఎత్తున కష్టపడతారు. కాలం గడుస్తున్నకొద్దీ లక్ష్యాన్ని మరిచిపోయి పక్కదోవలు పడుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలో..ఒక మానసిక ప్రణాళికను ప్రిపరేషన్‌ ప్రారంభ దశలోనే అనుభవజ్ఞుల సాయంతో రూపొందించుకోవాలి. రాబోయే అవరోధాల్ని అంచనా వేసుకుని పరిష్కారాలు ఆలోచించుకున్నపుడు ఆ అడ్డంకులు నిజంగా ఎదురైనపుడు వాటిని సమర్థంగా, సులువుగా అధిగమించవచ్చు.
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ అర్హత ఉన్న అన్ని ఉద్యోగాలకు ప్రారంభించండి ప్రిపరేషన్‌!

‣ భద్రమైన భవితకు బీఎస్సీ నర్సింగ్‌!

‣ వేగంగా నేర్చుకునేవాళ్లకు త్వరగా నియామకాలు

‣ నైపుణ్య యువత... భారత్‌ భవిత

‣ దరి చేరనున్న 5జీ సాంకేతికత

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-03-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌