• facebook
  • whatsapp
  • telegram

స‌వాళ్లు ఎదురైనా స‌న్న‌ద్ధ‌త ఆప‌లేదు!

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 టాప‌ర్ల కృషి వివ‌రాలు

గ్రూపు-1 పరీక్షల్లో ఉన్నత విద్యావంతులే మౌఖిక పరీక్షల్లో పోటీపడ్డారు. చురుకుదనంతో సరైన సమాధానాలు చెప్పి ఉద్యోగాలకు చేరువయ్యారు. మౌఖిక పరీక్షలకు 320 మంది అభ్యర్థులు హాజరైతే..వీరిలో 152 మంది మహిళలే. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా 53 మంది పురుషులుంటే మహిళలు 49 మంది ఉన్నారు. విజేతల్లో మహిళల నేపథ్యాన్ని పరిశీలిస్తే వీరంతా ఏదో ఒక ఉద్యోగాన్ని చేస్తూ డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగాలు దక్కించుకున్నారు. కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే చక్కటి సన్నద్ధత కొనసాగించారు. వీరిలో ఇద్దరు సివిల్స్‌ రాసి ఐ.ఎ.ఎస్‌.లు కాబోతున్నారు కూడా. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, జిల్లా అధికారి, సీనియర్‌ అసిస్టెంట్, ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్, అధ్యాపకురాలు, వైద్యులుగా ఉన్నవారు కూడా వీరిలో ఉండటం విశేషం. 


ఈ అభ్యర్థుల సన్నద్ధత తీరును పరిశీలిస్తే... తమ సీనియర్లతో సబ్జెక్టులపై ఎలా పట్టు సాధించాలో చర్చించారు. ప్రిపరేషన్‌లో ఉన్న లోపాలు సవరించుకున్నారు. వాట్సాప్‌ ద్వారా సహచరులకు నోట్స్, ప్రశ్నలు, జవాబులు పంపిస్తూ కరెక్షన్‌ చేయించుకుంటూ పట్టు సాధించారు. గ్రూపు-1 ఏపీ హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఇతర అంశాల్లో సివిల్స్‌ కంటే కొంత అదనంగా సన్నద్ధం కావాల్సివచ్చింది. వీరు చెప్పిన దాని ప్రకారం..సివిల్స్‌ ప్రిపరేషన్‌ గ్రూపు-1 ఉద్యోగాలను దక్కించుకునేలా చేస్తుంది. 


గ్రూప్‌-1 టాపర్ల అవిరళ కృషి పోటీ పరీక్షల్లో అభ్యర్థుల సన్నద్థత ఊరికే పోదు. నిబద్ధతతో నిరంతరం ప్రిపరేషన్‌ కొనసాగిస్తే రకరకాల ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఇటీవల ఏపీపీఎస్‌సీ ప్రకటించిన గ్రూపు-1 ఫలితాల ద్వారా డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగాలకు ఎంపికైన తొలి పది మందిలో కొందరి కృషిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా కనిపించింది. 2018లో గ్రూపు-1 నోటిఫికేషన్‌ వెలువడితే...2022 వరకు అదే పనిలో నిమగ్నమై...ప్రణాళికబద్ధంగా తయారైతే ఏదైనా సాధించవచ్చని రుజువుచేశారు! 


మూడో ర్యాంకర్‌ సంజనాసిన్హా 

గ్రూపు-1 పాత ప్రశ్నపత్రాల ఆధారంగా సన్నద్ధత సాగించారు. రచనా నైపుణ్యం ఉండాలనీ, పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు...అదనంగా ఒక మార్కు సాధించాలంటే ఉన్న ఆయుధాల్లో రైటింగ్‌ స్కిల్‌ ఒకటి అని ఆమె వ్యాఖ్యానించారు. ఈమె సివిల్స్‌ ఫలితాల్లో 37వ ర్యాంకు సాధించారు. 2020   సివిల్స్‌లో 207 ర్యాంకు దక్కించుకున్నారు. డీటెయిల్డ్‌ అప్లికేషన్‌ ఫామ్‌లో ఇచ్చిన వివరాలకు   అనుగుణంగా మౌఖిక పరీక్షలో ఆమెను ప్రశ్నలు అడిగారు. 

నాలుగో ర్యాంకర్‌ ఎన్‌.రామలక్ష్మి 

బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. 2017లో ఒకసారి సివిల్స్‌ రాశారు. ఏపీపీఎస్సీ ద్వారా ఎలాగైనా గ్రూపు-1 ఉద్యోగాన్ని దక్కించుకోవాలని పట్టుదలగా సన్నద్ధమయ్యారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌ల సిలబస్‌ను సమాంతరంగా చదివారు. ప్రశ్నలకు రాసిన జవాబులను సీనియర్స్‌కు చూపించారు. 2016లో టాపర్స్‌గా నిలిచినవారి నుంచి సూచనలు పొందారు. ఇలా ఆమె సన్నద్ధత రెండేళ్లపాటు సాగింది. ఆన్‌లైన్‌ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉన్నందున దానిపైనే ప్రశ్నలు ఇంటర్వ్యూలో వచ్చాయి. నాయకత్వ లక్షణాల గురించి బోర్డులోని సభ్యులు గమనించారు. ఇంజినీర్‌గా పనిచేస్తూ గ్రూపు-1 సన్నద్ధతకు తెల్లవారుజాము నుంచే సాధన ఆరంభించేవారు. పనివేళలు ముగిశాక రాత్రిపూట మరికొంత సమయాన్ని కేటాయించేవారు.


ఐదో ర్యాంకర్‌ డాక్టర్‌ పోలూరు శ్రీలేఖ 

లక్ష్యం.. అడ్మినిస్ట్రేషన్‌ రంగంలో ఉన్నత స్థానానికి చేరాలన్నది. 2021 సివిల్స్‌ నోటిఫికేషన్‌ ద్వారా 427 ర్యాంకు సాధించారు. ఐపీఎస్‌ లేదా ఐఆర్‌ఎస్‌ కావడానికి అవకాశం ఉంది. ఆరో ప్రయత్నంలో విజయం వరించింది. తొలి మూడు ప్రయత్నాల్లో ప్రధాన పరీక్షలు రాసేందుకు కూడా అవకాశం రాలేదు. నాలుగోసారీ, ఐదోసారీ ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. 2018 గ్రూపు-1 నోటిఫికేషన్‌ ద్వారా తొలి ప్రయత్నంలోనే 5వ ర్యాంక్‌ వచ్చింది. సివిల్స్‌ ప్రిపరేషన్‌ దీనికి బాగా ఉపయోగపడింది. సివిల్స్‌లో విజయం సాధించేందుకు ఏడేళ్లకుపైగా తపించారు. లక్ష్య సాధన కోసం వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చారు.


ఏడో ర్యాంకర్‌ కె.మధులత 

విద్యార్హత బీఎస్సీ నర్సింగ్‌. 2012 గ్రూపు-4 నోటిఫికేషన్‌ ద్వారా జూనియర్‌ అసిస్టెంట్‌గా అనంతపురం కలెక్టరేట్‌లో చేరారు. 2018లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది ఆర్డీఓ ఆఫీసులో ఏడాది పనిచేశారు. ఆ తరువాత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా, ఆపై సీనియర్‌ అసిస్టెంట్‌గా చేశారు. జిల్లా విభజన అనంతరం శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్‌లో పని చేస్తున్నారు. 2016 గ్రూపు-1 నోటిఫికేషన్‌ ద్వారా జరిగిన ఇంటర్వ్యూలో మెరుగైన ప్రతిభ కనబరిచినప్పటికీ ఓవరాల్‌ మార్కులపరంగా వెనుకబడ్డారు. అందులో గణితం పేపరులో మార్కులు తక్కువ వచ్చాయి. ఇంటర్వ్యూలో 75కి 58 మార్కులు సాధించినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఈసారి ప్రధాన పరీక్షల్లో గణితం పేపరు లేకపోవడం అవకాశంగా తీసుకొని విజయకేతనాన్ని ఎగురవేశారు. గ్రూపు-1 ఉద్యోగ సాధన కోసం ప్రత్యేకంగా కోచింగ్‌ తీసుకోలేదు. ఆన్‌లైన్‌లో మాక్‌ పరీక్షలు రాశారు. ప్రధాన పరీక్షల సమయంలో మెటర్నిటీ సెలవు అవకాశంగా తీసుకొని ఆరోగ్యం సంరక్షించుకుంటూనే పుస్తకాలతో మమేకమై లక్ష్యాన్ని చేరుకున్నారు. 


ఎనిమిదో ర్యాంకర్‌ డి. కీర్తి 

తెలుగు మాధ్యమంలో చదివారు. తెలుగులోనే గ్రూపు-1 ప్రధాన పరీక్షలు రాశారు. ఏయూలో ఎమ్మెస్సీ చదివి, 2008 డీఎస్సీ ద్వారా స్కూలు అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. 2011 గ్రూపు-1 నోటిఫికేషన్‌ ద్వారా 2018లో విజయనగరం జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. కానీ ఐఏఎస్‌ అయ్యే అవకాశముందని తొలి నుంచీ ఆర్డీఓ కావాలనేది ఆమె ఆకాంక్ష. గ్రూప్‌-1కు కోచింగ్‌ తీసుకోలేదు. అందుకు సమయం కూడా లేదు. సిలబస్‌కు అనుగుణంగా పుస్తకాలు సంపాదించి సన్నద్ధమయ్యారు. రెగ్యులర్‌గా పత్రికల్లోని ఎడిటోరియల్స్, వ్యాసాలు బాగా చదువుతూ వర్తమాన అంశాలపై పట్టుసాధించారు. జిల్లా అధికారిగా ఉన్నప్పటికీ ప్రణాళికతో సన్నద్ధతకు సమయాన్ని కేటాయించుకున్నారు. నోటిఫికేషన్ల జారీ మధ్య విరామం ఉన్నప్పటికీ..సన్నద్ధత ఆపకూడదని ఆమె సూచిస్తున్నారు.


 

పదో ర్యాంకర్‌ సాయిశ్రీ 

2015 ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఏలో గోల్డ్‌మెడల్‌ సాధించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఎంఏలో టాపర్‌గా నిలిచారు. 2018లో సివిల్స్‌ రాసినా మెయిన్స్‌కు రాయడానికి అర్హత సాధించలేకపోయారు. ఇదే సమయంలో ఏపీపీఎస్‌సీ నుంచి గ్రూపు-1 నోటిఫికేషన్‌ వెలువడింది. దీనికి దరఖాస్తు చేస్తూనే...కేంద్ర హోంశాఖ జారీచేసిన అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజిన్స్‌ ఆఫీసర్స్‌ ఉద్యోగం కోసం ప్రయత్నించారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరిగింది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రం వేలూరులో కేంద్ర హోంశాఖకు చెందిన ఇంటెలిజిన్స్‌ వింగ్‌లో పనిచేస్తున్నారు. గ్రూపు-1 ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ప్రణాళికబద్ధంగా సన్నద్ధమయ్యారు. ప్రత్యేకంగా శిక్షణేమీ పొందలేదు. కానీ..సివిల్స్‌ సన్నద్ధత బాగా ఉపయోగపడింది. విధులు ముగించి ప్రిపరేషన్‌ కొనసాగించేవారు. సహచర అభ్యర్థులతో బృంద చర్చలు ఈమెకు బాగా ఉపకరించాయి. ఇంటర్వ్యూలో ఇంటెలిజెన్స్‌ రంగం గురించిన ప్రశ్నలను లోతుగా అడిగితే తగిన సమాధానాలిచ్చారు. విజయవంతంగా  గ్రూప్‌-1 సర్వీసుకు ఎంపికయ్యారు.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప‌ట్టు ప‌ట్టు.. ప్రిలిమ్స్ హిట్‌!

‣ మళ్లీ అగ్రస్థానంలో ఐఐఎస్సీ

‣ సైన్స్‌ బోధనలో.. పరిశోధనలో!

‣ నీకు నువ్వు న‌చ్చ‌ట్లేదా?

‣ ఆరోగ్య రక్షణలో కోర్సుల్లోకి ఆహ్వానం

‣ ఎక్కువ పరీక్షలు రాశా.. తప్పులు సరిచేసుకున్నా!

Posted Date : 01-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌