Post your question

 

  Asked By: కె. విజయ్‌కుమార్‌

  Ans:

  సాధారణంగా ఏ బ్రాంచితో ఇంజనీరింగ్‌ చేసినవారికైనా కనీసం నాలుగు అవకాశాలు ఉంటాయి. మొదటిది- వారికి సంబంధించిన బ్రాంచిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కోర్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నించడం. రెండోది- ఐటీ/ సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళ్ళడం. మూడోది- సొంతంగా ఒక సంస్థ స్థాపించడం. నాలుగోది- ఉన్నత విద్యను అభ్యసించడం. వీటితో పాటు డిగ్రీ అర్హతతో పోటీ పరీక్షలు రాయడమూ మరొక మార్గం. ఇక మీ అబ్బాయి విషయానికొస్తే పైన చెప్పిన ఐదు అవకాశాల్లో తనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోమని చెప్పండి. ఇటీవలి కాలంలో చాలా ప్రభుత్వరంగ సంస్థలు గేట్‌ ద్వారా నియామకాలు చేస్తున్నాయి. మీ అబ్బాయిని గేట్‌ రాయమని చెప్పండి. గేట్‌ ద్వారా ఐఐటీ, ఎన్‌ఐటీల్లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌ చేసే అవకాశం ఉంది. క్యాట్‌ రాసి ఐఐఎంల్లాంటి విద్యాసంస్థల్లో ఎంబీఏ చేయవచ్చు. క్యాట్‌లో మంచి స్కోర్‌ రాకపోతే, వివిధ ప్రైవేటు మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థలు నిర్వహించే ప్రత్యేకమైన ప్రవేశ పరీక్షల ద్వారా ఆయా సంస్థల్లో కూడా ఎంబీఎ చేయవచ్చు. జీఆర్‌ఈ, టోఫెల్‌ల ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కూడా ఉన్నాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: నిఖిత

  Ans:

  మీ లక్ష్యం అభినందనీయం. టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే పోటీ పరీక్షల్లో ముఖ్యమైనవి గ్రూప్‌-1, 2. ఈ పరీక్షలకు సంబంధించిన స్కీమ్, సిలబస్‌ లాంటివి టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌ లోనుంచి డౌన్‌లోడ్‌ చేసుకోండి. గత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నపత్రాల కోసం అంతర్జాలంలో శోధించండి. వీలుంటే, హైదరాబాద్‌లో ఉండి గ్రూప్‌-1, 2 పరీక్షలకు సన్నద్ధమయ్యే మీ మిత్రబృందంతో ఆన్‌లైన్‌ స్టడీ గ్రూప్‌ ఏర్పాటు చేసుకొని, పరీక్షలకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించండి. సిలబస్‌కు అనుగుణంగా ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ మెటీరియల్‌ చదువుతూ సొంతంగా నోట్స్‌ తయారు చేసుకోండి. కరోనా మూలంగా చాలా కోచింగ్‌ సంస్థలు ఆన్‌లైన్‌ శిక్షణను అందిస్తున్నాయి. వాటిలో మేలైనదాన్ని విచారించి ప్రవేశం పొందండి. తెలంగాణకు సంబంధించిన సిలబస్‌ మినహా, మిగతా సిలబస్‌ చాలావరకూ యూపీఎస్‌సీ సిలబస్‌కి దగ్గరగా ఉంటుంది. యూపీఎస్‌సీ పరీక్షల ఆన్‌లైన్‌ మెటీరియల్‌నూ చదవండి. ఆన్‌లైన్‌లో ఈనాడు విద్యాసమాచారాన్నీ, ప్రతిభ మెటీరియల్‌నూ అనుసరించండి. ముఖ్యంగా సంపాదకీయాలనూ, వ్యాసాలనూ చదివి అర్ధం చేసుకొని నోట్స్‌ రాసుకోండి. గ్రూప్‌-1, గ్రూప్‌-2 శిక్షణలో నిష్ణాతులైనవారిని ఆన్‌లైన్‌లో సంప్రదించి, వారి సూచనలను తీసుకొంటూ మీ ఆశయాన్ని నెరవేర్చుకొనే ప్రయత్నం చేయండి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: పి. సాయిశ్రీ

  Ans:

  మీరు నిరభ్యంతరంగా విదేశీ యూనివర్సిటీల్లో ఎంఏ చదవవచ్చు. కొన్ని విదేశీ వర్సిటీలు మాత్రం నాలుగు సంవత్సరాల డిగ్రీ చదివిన వారికే ఎంఏలో ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి. చాలా విదేశీ విశ్వవిద్యాలయాలు ఆంగ్ల భాషకు సంబంధించిన పరీక్ష స్కోరుతో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఆంగ్ల భాషలో ప్రావీణ్యాన్ని పరీక్షించడం కోసం టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, పీటీఈ లాంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వివిధ దేశాల్లోని వివిధ యూనివర్సిటీలు ఒక్కో రకమైన పరీక్షలో వచ్చిన స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. కొన్ని యూనివర్సిటీలు ఈ మూడు పరీక్షల్లో ఏ పరీక్ష ద్వారానైనా ప్రవేశాలు కల్పిస్తాయి. అతి తక్కువ యూనివర్సిటీలు మాత్రమే ఎలాంటి ప్రవేశ పరీక్షా లేకుండా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. మీరు ఎంఏ తరువాత పీ‡హెచ్‌డీ చేయాలనుకొంటే ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ  పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఉంది. విదేశీ యూనివర్సిటీల్లో పీజీ చేయాలంటే ఖర్చు లక్షల్లో ఉంటుంది. అతి కొద్ది యూనివర్సిటీలు మాత్రమే అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: రాజేష్‌

  Ans:

  ఒక రెగ్యులర్‌ డిగ్రీతో పాటు మరో డిగ్రీని ఓపెన్‌/ డిస్టెన్స్‌/ఆన్‌లైన్‌లో చేయవచ్చన్న ప్రతిపాదనను యూజీసీ మే 2020లో ఆమోదించినట్లుగా అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. యూజీసీ నోటిఫికేషన్‌ అన్ని వివరాలతో వస్తుందని అందరూ ఆశించారు. కానీ సంబంధిత పూర్తి నోటిఫికేషన్‌ యూజీసీ వెబ్‌సైట్‌లో ఇంకా అందుబాటులో లేదు. రెండు డిగ్రీల్లో ఒకటి మామూలు డిగ్రీ, మరొకటి ప్రొఫెషనల్‌ కోర్సు అయితే ఈ అవకాశం వర్తిస్తుందా అనేదానిపై కూడా స్పష్టత లేదు. మీరు విడివిడిగా రెండు డిగ్రీలను నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. ఈ నిర్ణయం 2020లో తీసుకున్నారు కాబట్టి, 2020కి ముందు చదివినవారికి వెసులుబాటు ఉంటుందా, ఉండదా అనేది యూజీసీ పూర్తి నోటిఫికేషన్‌ వచ్చాకే తెలుస్తుంది. - ప్రొ.బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌   

  Asked By: అనిత

  Ans:

  ఏపీపీఎస్‌సీ నిర్వహించే గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలు రాయడానికి ఏదైనా బాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బీఎస్‌సీ నర్సింగ్‌ కూడా బాచిలర్‌ డిగ్రీనే కాబట్టి, ఏపీపీఎస్‌సీ అయినా, మరే సంస్థ అయినా బాచిలర్‌ డిగ్రీ అర్హతతో నిర్వహించే అన్నీ పోటీ పరీక్షలను మీరు నిరభ్యంతరంగా రాయవచ్చు. మీరు బీఎస్‌సీ నర్సింగ్‌లో చదివే సిలబస్‌ గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షల సిలబస్‌లు వేరు వేరుగా ఉంటాయి. అందుకని ఎక్కువ ప్రిపరేషన్‌ అవసరం ఉంటుంది. రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు ప్రణాళికాబద్ధంగా చదివితే మీ ఆశయాన్ని నెరవేర్చుకోవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: ఎ. సాయి పవన్‌

  Ans:

  సాధారణంగా ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ చదవడానికి డిగ్రీలో అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ/ సెరికల్చర్‌ లాంటి సబ్జెక్టులు చదివివుండాలి. మీరు బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీలతో డిగ్రీ చదివారు కాబట్టి, చాలా యూనివర్సిటీల్లో ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ చదవడానికి మీరు అర్హులు కారు. కానీ జీబీ పంత్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీలో ప్రవేశానికి రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ వారు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌- బయోటెక్నాలజీ (GAT-B) పరీక్ష రాయవలసి ఉంటుంది. రామకృష్ణ మిషన్‌ వివేకానంద ఎడ్యుకేషనల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కూడా అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ పీజీకి అర్హత ఉంది. ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ మైక్రోబయాలజీ చదవాలంటే డిగ్రీలో అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ/ సెరికల్చర్, డైరీ సైన్సెస్‌/ బీవీఎస్‌సీ/ హోమ్‌ సైన్స్‌ లాంటివి చదివివుండాలి. అందుకని మీరు ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ మైక్రోబయాలజీ చదవలేరు.
  ఎంఎస్‌సీ ప్లాంట్‌ బయోటెక్నాలజీ చదవడానికి మీరు అర్హులే. ఈ కోర్సు ఎంజీఎం యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లతో పాటు కొద్ది ప్రైవేటు కళాశాలల్లో అందుబాటులో ఉంది. మీ ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోవాలంటే ఎంఎస్‌సీ బయోటెక్నాలజీ కోర్సు ఎంచుకోండి. ఎంఎస్‌సీ సీడ్‌ సైన్స్‌ టెక్నాలజీ చదవాలంటే డిగ్రీలో అగ్రికల్చర్‌ సంబంధిత కోర్సులు చదివివుండాలి. బీఎస్‌సీ అర్హతతో కొన్ని ప్రైవేటువర్సిటీల్లో మాత్రమే ఈ కోర్సును చదివే అవకాశం ఉంది. ఆయా విద్యాసంస్థల్లో చేరేముందు, ఆ సంస్థల విశ్వనీయతను తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. -
  ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: ఎం నాగరాజు

  Ans:

  బీకామ్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌  కోర్సును హైదరాబాద్‌ చంచల్‌గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ మహిళా డిగ్రీ కళాశాలల్లో అందిస్తున్నారు. ఇంకా చాలా కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. లయోలా అకాడెమీ సికిందరాబాద్, సెయింట్‌ జోసెఫ్‌ కాలేజ్, భారతీయ విద్యాభవన్, వివేకానంద కాలేజ్, అవినాష్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్, బద్రుక కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్, ప్రగతి మహా విద్యాలయ, ఆంధ్ర మహిళాసభ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్, జాహ్నవి డిగ్రీ కాలేజ్, ప్రగతి డిగ్రీ కాలేజ్, నోబుల్‌ డిగ్రీ కాలేజ్, ఆర్‌ జి కేడియా కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్, గీతాంజలి విమెన్స్‌ డిగ్రీ కాలేజ్, సిద్దార్థ డిగ్రీ కాలేజ్, ధ్రువ డిగ్రీ కాలేజ్, కేశవ్‌ మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ సైన్సెస్, మేఘన డిగ్రీ కాలేజ్, తపస్య డిగ్రీ కాలేజ్‌..వాటిలో కొన్ని. మీకు డిగ్రీలో బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు చేయాలనుకొంటే బీబీఎ బిజినెస్‌ అనలిటిక్స్‌ కూడా అందుబాటులో ఉంది. సిలబస్‌ పరంగా బీకామ్‌ బిజినెస్‌ అనలిటిక్స్, బీబీఎ బిజినెస్‌ అనలిటిక్స్‌ల మధ్య పెద్ద తేడా లేదు.  - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: శ్రీనిఖిత, హైదరాబాద్‌

  Ans:

  ఇటీవలికాలంలో మీడియా చానల్స్‌ ఎక్కువ అవడం వల్ల జర్నలిజం కోర్సులకు బాగా ఆదరణ పెరిగింది. కమ్యూనికేషన్‌ రంగంలో వస్తోన్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా జర్నలిజం కోర్సుల్లో కూడా వివిధ స్పెషలైజేషన్లను ప్రారంభించారు. ఈ మార్పుల వల్ల జర్నలిజం చదివినవారికి విభిన్న ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చాయి. జర్నలిజం కోర్సును సాధారణంగా మాస్‌ కమ్యూనికేషన్‌తోగానీ, మీడియా స్టడీస్‌తోగానీ కలిపి బోధిస్తారు. జర్నలిజం చదివిన తర్వాత ప్రింట్‌ మీడియా, టెలివిజన్, పబ్లిక్‌ రిలేషన్స్, అడ్వర్‌టైజింగ్‌ రంగాల్లో కెరియర్‌ను ప్రారంభించవచ్చు. సామర్థ్యమున్నవారు ఈ రంగంలో స్వయంగా సంస్థను ప్రారంభించి మరికొంత మందికి ఉపాధి కల్పించవచ్చు. జర్నలిజం అనేది ప్రొఫెషనల్‌ కోర్సు. ఇలాంటి కోర్సులకు పరిజ్ఞానంతోపాటు నైపుణ్యం కూడా చాలా అవసరం. ముఖ్యంగా భావ వ్యక్తీకరణ, కనీసం రెండు భాషలపై పట్టు జర్నలిజంలో ప్రధానం. మీకీ రంగం మీద విపరీతమైన ఆసక్తి ఉంటే.. నిరభ్యంతరంగా జర్నలిజం కోర్సును చదవొచ్చు. ప్రస్తుతం మీరు చదువుతోన్న కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సు కూడా జర్నలిజం, మాస్‌ మీడియా రంగాల్లో కెరియర్‌కు బాగా ఉపయోగపడుతుంది. వీడియో ప్రొడక్షన్, రేడియో ప్రొడక్షన్, కన్వర్టెంట్‌ ప్రొడక్షన్‌ లాంటి సాంకేతిక రంగాల్లో రాణించే అవకాశాలున్నాయి. జర్నలిజం కోర్సులు చదివినవారు జర్నలిస్ట్‌గా, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌గా, కంటెంట్‌ రైటర్స్‌గా, ఎడిటర్స్‌గా కెరియర్‌ని ప్రారంభించవచ్చు. కెరియర్‌ ప్రారంభంలో అంత ఆకర్షణీయమైన వేతనాలు పొందలేనప్పటికీ ఉద్యోగానుభవంతో మంచి ఎదుగుదలని ఆశించవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: సాయి చరణ్‌

  Ans:

  మెషిన్‌ లర్నింగ్‌ నేర్చుకోవడానికి పైతాన్‌ సరిపోతుంది. మీరు డేటా అనలిటిక్స్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే SQL నేర్చుకొంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. డేటా ఎక్స్‌ట్రాక్షన్‌ యూజింగ్‌ SQL, R  ప్రోగ్రామింగ్, జావా అండ్‌ జావా స్క్రిప్ట్, జూలియా, LISP,  డేటా విజువలైజేషన్‌ కోసం Tableau కూడా నేర్చుకొనే ప్రయత్నం చేయండి. మైక్రోసాఫ్ట్‌ ఎక్స్‌ ఎల్, అడ్వాన్స్‌డ్‌ SQL, స్టాటిస్టిక్స్, మల్టీ వేరియేట్‌ అనాలిసిస్, న్యూరల్‌ నెట్‌ వర్క్స్, ఎన్‌ఎల్‌పీ లాంటి సబ్జెక్టుల బేసిక్స్‌పై కనీస పరిజ్ఞానం ఉంటే మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: ఎం. రత్నకుమార్‌

  Ans:

  కొద్దికాలంగా సైబర్‌ సెక్యూరిటీకి ప్రాధాన్యం పెరగడం వల్ల ఉద్యోగ మార్కెట్లో ఈ రంగానికి డిమాండ్‌ బాగా ఉంది. సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు సాఫ్ట్‌వేర్‌ రంగంతో పాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ రంగాల్లోనూ విస్తృత ఉపాధి అవకాశాలున్నాయి. మీరు ఐటీ ప్రొఫెషనల్‌గా ఏ విభాగంలో పనిచేస్తున్నారో తెలియజేయలేదు. మీరు ప్రస్తుతం పనిచేస్తున్న స్పెషలైజేషన్‌కూ, సైబర్‌ సెక్యూరిటీకీ ఏదైనా సంబంధం ఉందేమో చూడండి. దాన్ని ఆధారంగా చేసుకొని సైబర్‌ సెక్యూరిటీ రంగంలో మీకున్న ఉపాధి అవకాశాలను అంచనా వేసుకోండి. మీరు యుడెమి, క్లౌడ్‌ ఎరాల నుంచి పూర్తిచేసిన కోర్సులు ఈ రంగంపై అవగాహన కల్పించడానికి ఉపయోగపడతాయి కానీ, ఉద్యోగం సంపాదించి సైబర్‌ సెక్యూరిటీ రంగంలో స్థిరపడటానికి పెద్దగా ఉపకరించకపోవచ్చు.
  సైబర్‌ సెక్యూరిటీ అనేది విశాలమైన పరిధి ఉన్న విభాగం. మీరు ఇందులో ఏ ఉద్యోగం చేయాలనుకొంటున్నారో నిర్ణయం తీసుకొని దానికి కావాల్సిన విద్యార్హతలు, మెలకువల గురించి తెలుసుకోండి. వాటిలో శిక్షణ పొందండి. సైబర్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్‌గా పనిచేయడానికి ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలతో పాటు సైబర్‌ సెక్యూరిటీలో శిక్షణ అవసరం. ఈ రంగంలో ప్రవేశించాలంటే సమస్య పరిష్కార సామర్థ్యం, నాయకత్వ నైపుణ్యాలు, విభిన్న సెక్యూరిటీ స్పెషలైజేషన్లలో అనుభవం, భావప్రకటనా నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన, డేటాను విశ్లేషించడం లాంటివి ఎంతో అవసరం. వీటితో పాటు విండోస్, యునిక్స్, లినెక్స్, ఫైర్‌ వాల్స్, నెట్‌ వర్క్‌ సెగ్మెంటేషన్, నెట్‌ వర్క్‌ యాక్సెస్‌ కంట్రోల్, డీఎన్‌ఎస్, రూటింగ్, ప్రాక్సీ సర్వీసెస్, థర్డ్‌ పార్టీ ఆడిటింగ్, క్లౌడ్‌ రిస్క్‌ అసెస్మెంట్‌ మెథడాలజీలో కనీస పరిజ్ఞానం అవసరం.
  కోర్సుల విషయానికొస్తే..
  సర్టిఫికెట్‌/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీలను సైబర్‌ సెక్యూరిటీ, సైబర్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్‌ సెక్యూరిటీ ప్రోగ్రామ్, ఎథికల్‌ హ్యాకర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్, క్లౌడ్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్, సైబర్‌ ప్రో ట్రాక్‌ల్లో మీ అవసరానికి తగినట్లుగా ఎంచుకోండి. పైన చెప్పిన విభాగాల్లో శిక్షణానంతరం సైబర్‌ సెక్యూరిటీ రంగంలో నెట్‌వర్క్‌ సెక్యూరిటీ ఇంజినీర్, సైబర్‌ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సైబర్‌ సెక్యూరిటీ అనలిస్ట్, సైబర్‌ సెక్యూరిటీ మేనేజర్, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ అనలిస్ట్‌ లాంటి ఉద్యోగాల్లో స్థిరపడొచ్చు.
  - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌