Post your question

 

    Asked By: ఎం.నాగరాజు

    Ans:

    ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో డేటా సైన్స్‌ సంబంధిత రంగాల్లో  డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉన్నవారికి ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. బిజినెస్‌ అనలిటిక్స్‌ ప్రోగ్రాంలో వ్యాపార రంగంలో డేటా సైన్స్‌ అప్లికేషన్స్‌ గురించి చదువుతారు. అందుకని బిజినెస్‌ అనలిటిక్స్‌లో పీజిడీఎం/ఎంబీఏ చేసినవారికి ఉద్యోగావకాశాలు ఎక్కువే. బిజినెస్‌ అనలిటిక్స్‌ చదివినవారు జూనియర్‌ డేటా సైంటిస్ట్, జూనియర్‌ డేటా ఇంజినీర్, జూనియర్‌ డేటా కన్సల్టెంట్‌ లాంటి ఉద్యోగాలతో కెరియర్‌ను ప్రారంభించవచ్చు. ఉబర్, ఓలా, సింక్రోనీ, టీసీఎస్, డెలాయిట్, బిగ్‌ బాస్కెట్, అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్, యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, సెల్స్‌ ఫోర్స్, క్యాప్‌ జెమినీ, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, గూగుల్‌ లాంటి కంపెనీల్లో, అంతర్జాతీయ బ్యాంకుల్లో బిజినెస్‌ అనలిస్టుల అవసరం అధికం. బిజినెస్‌ అనలిటిక్స్‌ రంగంలో ఉద్యోగం పొందాలంటే డిగ్రీతో పాటు ఎస్‌క్యూఎల్, మెషిన్‌ లెర్నింగ్, డేటా విజువలైజేషన్, స్టాటిస్టిక్స్, పైతాన్, ఆర్‌ ప్రోగ్రామింగ్, ఎంఎస్‌ ఎక్సెల్, పవర్‌ బీఐ, బిగ్‌ డేటా, డేటా వేర్‌   హౌసింగ్, డేటా ఎథిక్స్, మ్యాథమెటిక్స్‌లపై మంచి పట్టుండాలి. వీటితో  పాటు కమ్యూనికేషన్, ప్రాబ్లం సాల్వింగ్, టీం బిల్డింగ్, డెసిషన్‌ మేకింగ్‌ నైపుణ్యాలు కూడా చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: prasanth

    Ans:

    స్పీచ్‌ థెరపిస్ట్‌ అవ్వాలంటే- స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ సైన్స్‌లో ప్రభుత్వ గుర్తింపు ఉన్న విద్యాసంస్థ నుంచి డిగ్రీ/ డిప్లొమా/ సర్టిఫికెట్‌ పొంది ఉండాలి. శిక్షణ పొందిన తర్వాత రిహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌సీఐ) గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేయాలి. జాతీయ స్థాయిలో ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్, మైసూరు మేటి సంస్థ. దీనికి అనుబంధంగా దేశవ్యాప్తంగా పలు సంస్థలు ఈ కోర్సులు అందిస్తున్నాయి. హైదరాబాద్‌లో అలీ యవార్‌ జంగ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్, గురునానక్‌ విద్యాసంస్థలు, మా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్, హెలెన్‌ కెల్లర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ అండ్‌ రిహాబిలిటేషన్, కామినేని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పారామెడికల్‌ సైన్సెస్, స్వీకార్‌ అకాడెమీ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ సైన్సెస్‌లు శిక్షణ అందిస్తున్నాయి. స్పీచ్‌ థెరపీకి సంబంధించిన కోర్సులను మేటి ప్రమాణాలున్న  సంస్థల్లో, ప్రత్యక్ష విధానంలో చదివితేనే నైపుణ్యాలు మెరుగవుతాయి. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఈ కోర్సుల్లో చేరవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీని అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ/ ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ/ మరేదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి దూరవిద్య ద్వారా చదివినా, ఆన్‌లైన్‌ పద్ధతిలో చదివినా రెగ్యులర్‌ పీజీ చేసే అవకాశం ఉంది. మీరు నిరభ్యంతరంగా సీపీజీఈటీ (కామన్‌ పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్‌) రాయవచ్చు. సీపీజీఈటీలో మంచి ర్యాంకు పొందితే యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, బనారస్‌ హిందూ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ యూనివర్శిటీల నుంచి ఎంఏ తెలుగు చదివే అవకాశం ఉంది. సీపీజీఈటీతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు నిర్వహించే పీజీ ఎంట్రన్స్‌ పరీక్షలు కూడా రాస్తే, రెండు రాష్ట్రాల్లో ఉన్న స్టేట్‌ యూనివర్సిటీల్లో కూడా ఎంఏ చదవొచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    మీకు ఇంటర్మీడియట్‌లో 85 శాతం మార్కులు వచ్చాయి కాబట్టి బీకాంలో అడ్మిషన్‌ తీసుకొని, చార్టెడ్‌ అకౌంటెన్సీ చేయవచ్చు. లేకపోతే బీకాంలో బిజినెస్‌ అనలిటిక్స్, కంప్యూటర్‌కు సంబంధించిన స్పెషలైజేషన్స్‌ ఎంచుకోవచ్చు. బీబీఏలో జనరల్, బ్యాంకింగ్, రిటైలింగ్, సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్‌ బిజినెస్, ఈ-కామర్స్, టూరిజం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి స్పెషలైజేషన్స్‌ కూడా చదవొచ్చు. ఆసక్తి ఉంటే బీఏలో ఇంగ్లిష్‌ లిటరేచర్, సైకాలజీ, జర్నలిజం, ఎకనమిక్స్‌ లాంటి సబ్జెక్టుల గురించి కూడా ఆలోచించవచ్చు. ఇవేకాకుండా, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కానీ ఇంటిగ్రేటెడ్‌ బీకామ్‌ ఎల్‌ఎల్‌బీ/ బీబీఏ ఎల్‌ఎల్‌బీ/ బీఏ ఎల్‌ఎల్‌బీ కూడా చదివే అవకాశం ఉంది. పైన చెప్పిన అన్ని ప్రోగ్రామ్స్‌లో ఉద్యోగావకాశాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైనా ఉద్యోగ ప్రయత్నాల్లో విద్యార్హత పాస్‌పోర్ట్‌ లాంటిది. నైపుణ్యాలు వీసా లాంటివి. నైపుణ్యాలు లేకుండా ఉద్యోగం పొందడం కష్టం. మీరు ఏ డిగ్రీ చదివినా, ఎంఎస్‌ ఎక్సెల్, పైతాన్, స్టాటిస్టిక్స్‌ లాంటి వాటిలో ప్రావీణ్యం ఉంటే, ఉద్యోగా వకాశాలు మెరుగవుతాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    ప్రతి డిగ్రీ పూర్తి చేయడానికి నిర్దిష్ట కాల వ్యవధి ఉంటుంది. యూజీసీ నిబంధనల ప్రకారం- మూడు సంవత్సరాల డిగ్రీని గరిష్ఠంగా ఐదు సంవత్సరాల వ్యవధిలో పూర్తిచేయాలి. కొన్ని యూనివర్శిటీలు కాలపరిమితి విషయంలో కొంత ఉదాసీనంగా ఉంటున్నాయి. మీరు బీఎస్సీ చదివిన యూనివర్శిటీలో గరిష్ఠ వ్యవధి గురించి తెలుసుకోండి. ఒకవేళ పరీక్షలు రాయడానికి వెసులుబాటు ఉన్నా, మీరు 2016లో బీఎస్సీ చివరి సంవత్సరం కాలేజీకి వెళ్లనందున డిగ్రీ పరీక్షలు రాయడం కుదరదు. బీఎస్సీలో ప్రాక్టికల్స్‌ కూడా ఉంటాయి. అందుకని కళాశాలకు వెళ్లడం తప్పనిసరి. మీరు చెబుతున్న పది సబ్జెక్టులు ఫైనల్‌ ఇయర్‌తో కలిపా? మొదటి రెండు సంవత్సరాలకు సంబంధించినవా? ఇప్పుడు మీరు పది సబ్జెక్టులు రాసినా, అన్నింటిలో ఉత్తీర్ణత సాధించడం చాలా కష్టం కాబట్టి, బీఏ పరీక్షలు రాయడం ఉపయోగకరం. మీరు బీఏ డిగ్రీని అయినా మూడు సంవత్సరాల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. ఆసక్తి ఉంటే మీ యూనివర్సిటీ నిబంధనలు అనుమతిస్తే, బీఎస్సీ పూర్తికి ప్రయత్నం చేయవచ్చు. మూడు సంవత్సరాల బీఎస్సీ డిగ్రీని సుదీర్ఘ వ్యవధిలో పూర్తి చేయడం వల్ల ఆ డిగ్రీతో ఉద్యోగం పొందడం కూడా కష్టమవుతుంది. ఉద్యోగం పొందడానికి డిగ్రీ సర్టిఫికెట్‌ అర్హత మాత్రమే. మేటి కొలువులు దక్కాలంటే విద్యార్హతతో పాటు విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు కూడా చాలా ముఖ్యం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    ఇటీవలి కాలంలో మెడికల్‌ కోడింగ్‌ కోర్సులకు డిమాండ్‌ పెరుగుతూ ఉంది. కొవిడ్‌ తరువాత మెడికల్‌ కోడింగ్‌ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువ అయ్యాయి. దీనిలో శిక్షణ పొందినవారికి బీపీఓల్లో, హాస్పిటల్స్‌లో, ఇన్సూరెన్స్‌ సంస్థల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. డెంటల్‌ కోర్సు చదివినవారికి కూడా ఈ రంగంలో మెరుగైన కెరియర్‌ ఉంటుంది. హైదరాబాద్‌ నగరంలో చాలా మెడికల్‌ కోడింగ్‌ శిక్షణ సంస్థలు ఉన్నాయి. మీ అవగాహన కోసం కొన్ని సంస్థల పేర్లు.. హైదరాబాద్‌లో- హెన్రీ హర్విన్, మెడేసన్, రెసాల్వ్‌ మెడికోడ్, ఐక్యా గ్లోబల్‌ ఎడ్యుకేషన్, ట్రాన్స్‌కోడ్‌ సొల్యూషన్స్, ఇన్ఫోమెటిజ్, జోషి మేడికోడ్, గ్లోబల్‌ మెడికోడ్, క్లినిజెన్, మెడికాన్‌. విజయవాడలో- ఎస్‌ఆర్‌ టెక్నాలజీస్, టెక్నోస్పార్క్,  డెస్టినెక్స్ట్, ఎస్‌కేఎల్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌. వీటిలో చేరే ముందు సంస్థల విశ్వసనీయత గురించి తెలుసుకొని, నిర్ణయం తీసుకోవాలి. ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్న నగరాల్లో శిక్షణ పొందితే, త్వరగా ఉద్యోగం పొందవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: - పి.వైష్ణవి

    Ans:

    ఇంటర్‌ తరువాత ఇంజనీరింగ్‌ కాకుండా చాలా రకాల ప్రోగ్రామ్స్‌ చదివే అవకాశం ఉంది. మీరు ఇంటర్‌లో ఎంపీసీ చదివారు కాబట్టి, డిగ్రీలో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో బీఎస్సీ చదవొచ్చు. మ్యాథ్స్‌తో పాటు ఫిజిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఎకనామిక్స్‌ /స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ జియాలజీ లాంటి కాంబినేషన్లు చదవొచ్చు. ఇవే కాకుండా బీఎస్సీలో డేటా సైన్స్‌లో చేరే అవకాశం ఉంది. మీకు బిజినెస్‌ రంగంపై ఆసక్తి ఉంటే బీబీఏ, బీకాం, జర్నలిజం, టూరిజం లాంటి ప్రోగ్రామ్స్‌ చదవొచ్చు. న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉంటే ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీలో చేరొచ్చు. యూపీఎస్సీ పరీక్షలో లా సబ్జెక్టును కూడా ఒక ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగానికి ఏ డిగ్రీ చదివినా అర్హులు అవుతారు. కానీ మీరు సివిల్స్‌ పరీక్షలో భవిష్యత్తులో ఎంచుకోబోయే ఆప్షనల్‌ సబ్జెక్టును దృష్టిలో పెట్టుకొని డిగ్రీలో ఆ సబ్జెక్టు చదివే ప్రయత్నం చేయవచ్చు. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, ఆంత్రొపాలజీ, సోషియాలజీ, సైకాలజీ, జియాలజీ, తెలుగు సాహిత్యం, ఇంగ్లిష్, సంస్కృత సాహిత్యం లాంటి వాటి గురించి కూడా ఆలోచించవచ్చు. రాష్ట్రస్థాయి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకూ డిగ్రీ విద్యార్హత సరిపోతుంది. వీటితో పాటు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్, బ్యాంకింగ్‌ లాంటి పలు ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హతతో పోటీపడి విజయం సాధించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: - కె.కార్తీక్‌

    Ans:

    డీఎస్సీ నోటిఫికేషన్‌ రాలేదని బీటెక్‌ చదవడం, బీటెక్‌తో ఉద్యోగం రాలేదని బీఈడీ చేయడం, టీచర్‌ ఉద్యోగం రాలేదని ఎంటెక్‌ చేయడం.. ఇవన్నీ మీకు మంచి కెరియర్‌ని ఇవ్వవు. మీకు ఏ రంగంలో ఆసక్తి ఉంది? ఏ ఉద్యోగం చేస్తే మానసిక/ ఉద్యోగ సంతృప్తి ఉంటుంది? మీకు ఏ రంగంలో నైపుణ్యాలు ఉన్నాయి? మీ దీర్ఘకాలిక/ స్వల్పకాలిక ఆశయాలు ఏమిటి? వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
    మీ ప్రశ్నకొస్తే- మీరు రెండో సెమిస్టర్‌కు ఫీజు కట్టలేదు కాబట్టి, రెండో సెమిస్టర్‌ చదవలేరు. రెండో సెమిస్టర్‌ చదవకుండా మూడో సెమిస్టర్‌/ రెండో సంవత్సరం చదవడం కుదరదు. మీరు బీటెక్‌ మొదటి సంవత్సరంలో ఎన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు అయ్యారనేది రెండో సెమిస్టర్‌లోకి ప్రమోట్‌ అవుతారా? లేదా? అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. మీరు మొదటి సెమిస్టర్‌ మళ్ళీ చదవాలా? నేరుగా వచ్చే సంవత్సరం మీ జూనియర్స్‌తో రెండో సెమిస్టర్‌లోకి ప్రవేశం పొందవచ్చా? అనేది అడ్మిషన్‌ తీసుకొన్న యూనివర్సిటీ నిబంధనలకు లోబడి ఉంటుంది. యూనివర్సిటీ అధికారులను సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: - రామకృష్ణ ప్రకాశ్‌

    Ans:

    మీరు ఎంబీఏలో మార్కెటింగ్‌ చదివి, ఆరేళ్లు ఉద్యోగం చేశారు కాబట్టి, ఆ రంగంలోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. మీ ఉద్యోగావకాశాలు మెరుగు పర్చుకోవాలంటే డిజిటల్‌ మార్కెటింగ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, మార్కెటింగ్‌ అనలిటిక్స్, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్, రిటైలింగ్, కంటెంట్‌ మార్కెటింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్, గూగుల్‌ అనలిటిక్స్, మైక్రోసాఫ్ట్‌ అడ్వర్టయిజింగ్‌ సర్టిఫికేషన్, హబ్‌ స్పాట్‌ ఇన్‌ బౌండ్‌ మార్కెటింగ్‌ లాంటి కోర్సుల్లో శిక్షణ పొందండి. వీటితో పాటు డేటా సైన్స్, మెషిన్‌ లెర్నింగ్, బిజినెస్‌ అనలిటిక్స్, డేటా విజువలైజేషన్, క్లౌడ్‌ కంప్యూటింగ్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Ans:

    బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివాక ఎక్కడైనా ఉద్యోగం చేశారా? లేదా? మీకు బీటెక్, ఎంబీఏల్లో ఏ స్థాయి మార్కులు వచ్చాయి? ఎంబీఏ ఎక్కడ చదివారు? ఆ విద్యాసంస్థలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొన్నారా?...ఈ వివరాలు చెప్పలేదు. ఎంబీఏలో హెచ్‌ఆర్, ఫైనాన్స్‌ స్పెషలైజేషన్లు చదివారు కాబట్టి ఆ రెండు విభాగాల్లో మీకు నైపుణ్యాలు ఎక్కువున్న స్పెషలైజేషన్‌ ఎంచుకొని ఉద్యోగప్రయత్నాలు చేయండి. సాధారణంగా ఎంబీఏ చదివినవారు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఉద్యోగం పొందడం సులువు. ఉద్యోగానుభవం లేకుండా నేరుగా సొంత ప్రయత్నాలతో ఉద్యోగం పొందడం కొంత కష్టమే! ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌ అంత ఆశాజనకంగా లేదు. అందుకని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే అదనంగా కోర్సులు చేసి మీ ఉద్యోగావకాశాలను మెరుగు పర్చుకోండి. ప్రముఖ విద్యా/ శిక్షణ సంస్థల నుంచి సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు చేయడం ఉపయోగకరం. ఈ మధ్య కాలంలో డేటా సైన్స్, బిజినెస్‌ అనలిటిక్స్‌ చదివినవారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రంగాల్లో అదనపు కోర్సులు చేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌