Post your question

 

    Asked By: బి.రాము

    Ans:

    ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాంను నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నియంత్రిస్తుంది. బీపీఈడీని దూరవిద్య  ద్వారా అందించడానికి ఎన్‌సీటీఈ నిబంధనలు అనుమతించవు. అందువల్ల మనదేశంలో ఏ యూనివర్సిటీ కూడా బీపీఈడీని దూరవిద్య ద్వారా అందించడం లేదు. మీకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ అవ్వాలన్న కోరిక బలంగా ఉంటే.. ప్రస్తుతం చేస్తున్న కేంద్రప్రభుత్వ ఉద్యోగానికి రెండు సంవత్సరాలు సెలవు పెట్టి, బీపీఈడీని రెగ్యులర్‌ విధానంలో చదవండి.
    బీఈడీ, బీపీఈడీ, ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ, జర్నలిజం, ఎంసీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌గా చదివితేనే వృత్తి నైపుణ్యాలు పెరుగుతాయి. మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇక ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ అర్హతల విషయానికొస్తే- ఏదైనా డిగ్రీ చదివాక, బీపీఈడీ శిక్షణ పొంది, టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణత సాధించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టులో మంచి ప్రతిభ కనబర్చాలి. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ అవ్వాలంటే.. వీటన్నింటి కంటే ముందు క్రీడల పట్ల విపరీతమైన ఇష్టంతో పాటు పిల్లలకు క్రీడలు నేర్పడంలో ఆసక్తి ఉండటం చాలా ముఖ్యం.
    - ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎ. మహేష్‌ చంద్ర

    Ans:

    మీరు ఒకే సమయంలో పీజీ, బీఈడీ చేస్తున్నాను అన్నారు. యూజీసీ 2022 నిబంధనల ప్రకారం రెండు పీజీలూ, రెండు డిగ్రీలూ ఏకకాలంలో చేయవచ్చు. అందులో ఒకటి రెగ్యులర్‌గా అయితే, మరొకటి డిస్టెన్స్‌/ ఓపెన్‌/ ఆన్‌లైన్‌ పద్ధతిలో చేయవచ్చు. డిగ్రీ, పీజీలు యూజీసీ పరిధిలో ఉంటాయి కాబట్టి రెండు పీజీలూ, రెండు డిగ్రీలూ ఒకేసారి చేయడంలో ఇబ్బంది లేదు. కానీ ఒక డిగ్రీ యూజీసీకి సంబంధించి, మరొకటి ఏదైనా రెగ్యులేటరీ సంస్థ పరిధిలో ఉన్న డిగ్రీ అయితే, ఆ రెండు డిగ్రీలూ చెల్లుబాటు అవుతాయా అనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు.
    ఉదాహరణకు ఎంబీబీఎస్‌ చదివే విద్యార్థి, ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి బి.ఎ. చదివే అవకాశం ఉందా? ఎల్‌ఎల్‌బీ చదివే విద్యార్థి అదేసమయంలో ఎంబీఏ కూడా చదవొచ్చా? ఇలాంటి సందేహాలు చాలామందిని వేధిస్తున్నాయి. మీ విషయానికొస్తే- ఎంఏ (తెలుగు) యూజీసీ పరిధిలో ఉంటే, బీఈడీ ప్రోగ్రాం ఎన్‌సీటీఈ పరిధిలో ఉంది. కానీ, ఇటీవల కొన్ని యూనివర్సిటీలు ఏఐసీటీఈ పరిధిలో ఉన్న ఇంజినీరింగ్‌ కోర్సుతో పాటు యూజీసీ పరిధిలో ఉన్న బీబీఏ (ఈ సంవత్సరం నుంచి బీబీఏ కూడా ఏఐసీటీఈ పరిధిలోకి వచ్చింది)లను కలిపి ఒకే సమయంలో చదివే వెసులుబాటు కల్పించారు. ఈ విషయాల్లో స్పష్టత వచ్చేలోగా అవకాశం ఉంటే, బీఈడీ పూర్తిచేశాక మరో యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు మరోసారి చదివే ప్రయత్నం చేయండి. టెట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం డీఈడీ…/ బీఈడీ చివరి సంవత్సరం చదివేవారు టెట్‌ రాయడానికి అర్హులు. మీరు టెట్‌ క్వాలిఫై అయింది బీఈడీ మొదటి సంవత్సరంలోనా, రెండో సంవత్సరంలోనా అనేది చెప్పలేదు. ఏదైనా కోర్సులో చేరేముందు ఆ కోర్సుతో లభించే ఉద్యోగ నోటిఫికేషన్లను పరిశీలించి, అందులో ఉన్న అర్హతలను బట్టి మీ కెరియర్‌ నిర్ణయాలను తీసుకోండి. చివరిగా- యూజీసీ రెండు కోర్సులు ఏకకాలంలో చేసే వెసులుబాటు కల్పించినా, ప్రొఫెషనల్‌ కోర్సులతో పాటు మరొక కోర్సు చదవకపోవడం వల్ల ప్రొఫెషనల్‌ కోర్సుపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టి, ఆ రంగంలో బాగా రాణించే అవకాశం ఉంది. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: షేక్‌ మెహరజ్‌

    Ans:

    మీకు బీకాం డిగ్రీ, సీఏ ఇంటర్‌తో పాటు, అకౌంటెంట్‌గా పది సంవత్సరాల వృత్తి అనుభవం ఉంది. ఈ అర్హతతో ఐటీ కంపెనీలో అకౌంటెంట్‌గా ఉద్యోగం పొందడం కష్టం కాకపోవచ్చు. ఐటీ కంపెనీలో అకౌంటెంట్‌ ఉద్యోగం చేయాలంటే- ఎంఎస్‌ ఎక్సెల్‌పై మంచి పట్టుతో పాటు, ట్యాలీ లాంటి అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ మెరుగ్గా వాడగలిగే సామర్థ్యం ఉండాలి. సాధారణంగా ఐటీ కంపెనీల్లో అకౌంటింగ్‌ విభాగంలో ఎస్‌క్యూఎల్‌ డేటాబేస్, ఈఆర్‌పీ లాంటి సాఫ్ట్‌వేర్లను వాడుతూ ఉంటారు. మీరు ఐటీ రంగంలో అకౌంటెంట్‌గా రాణించాలంటే పే సర్టిఫికేషన్, కంప్యూటరైజ్డ్‌ అకౌంటింగ్, ఎంఐఎస్, డీబీఎంఎస్‌ లాంటి సర్టిఫికెట్‌ కోర్సులతో పాటు కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు కూడా అవసరం. అవకాశం ఉంటే ఎంకాం (కంప్యూటర్స్‌) కోర్సును ఆన్‌లైన్‌/ దూరవిద్య ద్వారా చేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: డి.సుజాత

    Ans:

    మీకు కోడింగ్‌ అంటే ఇష్టం లేదు కాబట్టి, సాప్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం పొందడం కష్టం. మీ వయసు ప్రకారం కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేదు. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్స్‌ ఉద్యోగాలకు గరిష్ఠ వయసు తెలంగాణలో 44 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్‌లో 42 సంవత్సరాలుగా ఉంది. సామాజిక రిజర్వేషన్లు ఉన్నవారికి మరో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు పది సంవత్సరాల వెసులుబాటు ఉంటుంది.
    ముందుగా మీకు కెరియర్‌లో విజయం పొందడం అనే విషయంపై స్పష్టత అవసరం. సాధారణంగా కెరియర్‌ నిర్ణయాలు వ్యక్తిగత ఆసక్తి, అభిరుచి, విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం, వయసు, విషయ పరిజ్ఞానం, భావప్రకటన సామర్థ్యం, కుటుంబ సహకారం, ఆర్థిక స్థోమత లాంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. మీ దృష్టిలో కెరియర్‌ అంటే ఉద్యోగమా? వ్యాపారమా? సామాజిక సేవా? దీనిపై స్పష్టత తెచ్చుకోండి. ఒకవేళ ఉద్యోగం అయితే, ప్రభుత్వ ఉద్యోగమా? ప్రైవేటుదా? ఈ వయసులో మీరు పోటీ పరీక్షలు రాయాలంటే, మీకంటే కనీసం 15 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న అభ్యర్థులతో పోటీ పడాల్సిఉంటుంది. ఏదైనా వ్యాపారం చేయాలంటే పెట్టుబడి  కావాలి. మీరు ప్రస్తుతం నివసిస్తున్న ఊళ్లో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని, వాటిలో మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకోండి. ఆ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. మీకు ఆసక్తి ఉంటే, సైకాలజీలో పీజీ చేయండి. ఆపై కౌన్సెలింగ్‌లో డిప్లొమా చేసి, కౌన్సెలర్‌గా స్థిరపడొచ్చు. తక్కువ పెట్టుబడితో బేబీ కేర్‌ సెంటర్‌ కూడా ప్రారంభించవచ్చు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిరంతర కృషి ఉంటే ఎంచుకున్న కెరియర్‌లో వయసుతో సంబంధం లేకుండా రాణించవచ్చు. 
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: శివకుమార్‌

    Ans:

    సాధారణంగా బీఈడీ ప్రోగ్రాం వ్యవధి రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. మీరు బీఈడీ మూడో సంవత్సరం చదువుతున్నానన్నారు. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ ఎడ్‌/ బీఏఎడ్‌ ప్రోగ్రాం చదువుతున్నారని అనుకుంటున్నాం. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం ఎంఈడీ కోర్సును దూరవిద్యా విధానంలో అందించకూడదు. ఒకవేళ ఎవరైనా, అలా అందించే ప్రయత్నం చేస్తే ఆ ప్రోగ్రాంకు ఎన్‌సీటీఈ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేవా అనేది తెలుసుకోండి. మీకు టీచర్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలల్లో బోధించే ఆసక్తి ఉంటే, ఎంఈడీకి సమానమైన ఎంఏ ఎడ్యుకేషన్‌ చదివే ప్రయత్నం చేయండి. ఇగ్నో సంస్థలో ఎంఏ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం అందుబాటులో ఉంది. ప్రొఫెషనల్‌ కోర్సులను దూరవిద్య ద్వారా కాకుండా.. రెగ్యులర్‌గా చదివితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కరుణ

    Ans:

    ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం.. మేనేజ్‌మెంట్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అవ్వాలంటే- ఎంబీఏలో 60 శాతం మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతతో పాటు రెండు సంవత్సరాల వృత్తి అనుభవం ఉండాలి. కానీ బోధన రంగంలో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల చాలా యూనివర్సిటీలు/ బిజినెస్‌ స్కూల్స్‌ పీహెచ్‌డీ ఉన్నవారినే మేనేజ్‌మెంట్‌ విభాగంలో అధ్యాపకులుగా నియమిస్తున్నాయి. పీహెచ్‌డీతో పాటు అత్యుత్తమ జర్నల్స్‌లో పరిశోధన పత్రాలు ప్రచురించినవారికీ, జాతీయ/ అంతర్జాతీయ సమావేశాల్లో పరిశోధన పత్రాలు సమర్పించిన వారికీ నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది. మేనేజ్‌మెంట్‌ సబ్జెక్టులో యూజీసీ-నెట్‌లో ఉత్తీర్ణత సాధించడం అదనపు అర్హత అవుతుంది. కానీ, చాలా ప్రైవేటు కళాశాలలు ఎంబీఏ విద్యార్హతతోనే బీబీఏ/ ఎంబీఏలో బోధించే అవకాశాలు కల్పిస్తున్నాయి.
    మీకు బోధన రంగంలో స్థిరపడాలన్న ఆలోచన బలంగా ఉంటే.. ముందుగా ఏదైనా యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఫుల్‌ టైమ్‌ పీహెచ్‌డీ చేసి, బిజినెస్‌ స్కూల్‌/ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి ప్రయత్నించండి. ఫుల్‌ టైమ్‌ పీహెచ్‌డీ చేసే అవకాశం లేకపోతే.. ఏదైనా ఎంబీఏ/ బీబీఏ కళాశాలలో లెక్చరర్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరండి. పార్ట్‌ టైం పీహెచ్‌డీ పూర్తి చేసి మెరుగైన విద్యాసంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


     

    Asked By: కరీమున్నీసా

    Ans:

    మీరు డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదువుతున్నారో చెప్పలేదు. డిగ్రీలో సోషియాలజీ/ సోషల్‌ వర్క్‌ చదివినవారికి సోషల్‌ వర్క్‌లో పీజీ చేయడానికి ప్రాధాన్యం ఉంటుంది. డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదివినప్పటికీ మీకు సోషల్‌ వర్క్‌ సబ్జెక్టుపై ఆసక్తి ఉంటే, పీజీ సోషల్‌ వర్క్‌లో ప్రవేశం పొందవచ్చు. సోషల్‌ వర్క్‌ చేసినవారికి ప్రైవేటు రంగంలో ఎక్కువ ఉద్యోగావకాశాలున్నాయి. ఈ కోర్సులో పీజీ చేసినవారు ప్రైవేటు రంగంలో సోషల్‌ వర్కర్, ఫ్యామిలీ కౌన్సెలర్, హాస్పిటల్‌ కౌన్సెలర్, డీ అడిక్షన్‌ కౌన్సెలర్‌గా ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే,  కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగావకాశాలు ఉంటాయి.
    పీజీలో ఇండస్ట్రియల్‌ సైకాలజీ చదవాలంటే, ముందుగా ఎంఏ/ ఎమ్మెస్సీ సైకాలజీలో ప్రవేశం పొంది, ఇండస్ట్రియల్‌ సైకాలజీని ఒక స్పెషలైజేషన్‌గా చదవాలి. చాలా యూనివర్సిటీల్లో పీజీలో సైకాలజీ చదవాలంటే, డిగ్రీలో సైకాలజీ కచ్చితంగా చదివి ఉండాలి. కొన్ని యూనివర్సిటీలు మాత్రమే డిగ్రీలో సైకాలజీ చదవకపోయినా పీజీ సైకాలజీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఇండస్ట్రియల్‌ సైకాలజీ చదివినవారికి ప్రైౖవేటు రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విద్యార్హతతో హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆర్గనైజేషనల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్, టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్, బిహేవియర్‌ అనలిస్ట్, హ్యూమన్‌ రిసోర్సెస్‌ ప్రాక్టీస్‌ మేనేజర్, ఎంప్లాయీ రిలేషన్‌షిప్‌ మేనేజర్, ఎగ్జిక్యూటివ్‌ కోచ్, ఇండస్ట్రియల్‌ సైకలాజికల్‌ కౌన్సెలర్, కన్సల్టెంట్, రిసెర్చ్‌ అనలిస్ట్‌ లాంటి కొలువులకు అర్హత ఉంటుంది. ఇండస్ట్రియల్‌ సైకాలజీ చదివినవారికి ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల్లో అతి తక్కువ ఉద్యోగాలే అందుబాటులో ఉన్నాయి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: బి.మణికంఠ మహారాజ్‌

    Ans:

    ఆప్టోమెట్రీలో డిప్లొమా చేసినవారికి భారతీ విద్యాపీఠ్‌- పుణె, డీ.. వై పాటిల్‌ యూనివర్సిటీ- పుణెల్లో, బీఎస్సీ ఆప్టోమెట్రీలో లేటరల్‌ ఎంట్రీ ఉంది. ఇంటర్మీడియట్‌/ ఆప్టోమెట్రీ డిప్లొమా విద్యార్హతతో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ కోర్సు అందుబాటులో ఉంది. ఈ కోర్సులో నాలుగేళ్ల తర్వాత గ్రాడ్యుయేషన్‌ డిగ్రీతో బయటికి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎల్‌వీ ప్రసాద్‌ ఐ హాస్పిటల్‌తోపాటు హైదరాబాద్‌లో మరో రెండు ప్రైవేటు యూనివర్సిటీలు ఆప్టోమెట్రీలో డిగ్రీ కోర్సులు అందిస్తున్నాయి. ఈ కోర్సు చదివినవారికి ప్రభుత్వ రంగంతో పోలిస్తే, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రాంతీయ కంటి ఆసుపత్రుల్లో, వైద్య కళాశాలల్లో అతి తక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే ఆప్టోమెట్రీలో పీజీ/ పీహెచ్‌డీతో బోధన, పరిశోధన రంగాల్లో స్థిరపడవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: డేవిడ్‌

    Ans:

    ఫిజియోథెరపీ కోర్సు చదవాలంటే మీరు ముందుగా ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఆ తరువాత ఈ కోర్సు నోటిఫికేషన్‌ వచ్చాక దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్మీడియట్‌లో పొందిన మార్కుల ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. మంచి బోధన ఉన్న కళాశాలను ఎంచుకొని, కోర్సును బాగా చదివి మంచి మార్కులతో  ఉత్తీర్ణత పొందాలి. ఆపై స్పోర్ట్స్‌ స్పెషలైజేషన్‌తో మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ కోర్సు చేయాలి. నిమ్స్‌లో ఫిజియోథెరపీ కోర్సులకు ఆ సంస్థ నిర్వహించే ప్రత్యేక ప్రవేశపరీక్ష రాయాలి.
    స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ - ఒడిశా, ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌- ముంబై లాంటి జాతీయ విద్యాసంస్థల్లో ఫిజియో థెరపీలో యూజీ/ పీజీ కోర్సు చదవాలంటే, ఆ సంస్థలు నిర్వహించే ప్రత్యేక ప్రవేశపరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనపర్చాలి. మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీలో స్పోర్ట్స్‌ స్పెషలైజేషన్‌ పూర్తిచేసి ఏదైనా స్పోర్ట్స్‌ సెంటర్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా కొంతకాలం పనిచేసి, మంచి నైపుణ్యాలు పొందితే.. మీరే సొంతంగా ఫిజియోథెరపీ కేంద్రం స్థాపించవచ్చు. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: వంశీ

    Ans:

    ఇంటర్మీడియట్‌ పాసైనవారికి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, నేవీ, పోస్టల్‌ విభాగం, రైల్వేస్, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లలో ఉద్యోగావకాశాలుంటాయి. మీరు స్టెనోగ్రఫీ/ కంప్యూటర్‌/ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికెట్, డిప్లొమా లాంటి కోర్సులు చేసినట్లయితే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. సాధారణంగా ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్, పోస్టల్‌ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సార్టింగ్‌ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్, జనరల్‌ డ్యూటీ కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్‌ లోకో పైలట్‌ లాంటి ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. వీటి కోసం ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ పరీక్షలు, ఆల్‌ ఇండియా డిఫెన్స్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌ లాంటివి రాయవలసి ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌