Post your question

 

    Asked By: యు. ప్రవీణ్‌ తేజ

    Ans:

    సాధారణంగా ఏజీ బీఎస్సీ చదివిన తరువాత ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే చాలామంది ఎంఎస్సీ అగ్రికల్చర్‌ చదువుతారు. మరికొంతమంది బయోటెక్నాలజీ. ప్లాంట్‌ సైన్సెస్, జెనెటిక్స్, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, అగ్రికల్చర్‌ కెమిస్ట్రీ, అగ్రికల్చరల్‌ ఎకనమిక్స్, అగ్రికల్చరల్‌ ఎక్స్‌ టెన్షన్, ఆగ్రోనమి, ఎంటెమాలజీ లాంటి సబ్జెక్టుల్లో పీజీ చేస్తారు. ఇటీవలికాలంలో చాలామంది బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివాక ఎంబీఏలో అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు గురించీ ఆలోచిస్తున్నారు. ఇక విదేశాల్లో ఉన్నత విద్యావకాశాల విషయానికొస్తే- పైన పేర్కొన్న అన్ని కోర్సులతో పాటు, విభిన్న కోర్సులు చదివే అవకాశం ఉంది. ఉదాహరణకు- క్రాప్‌ సైన్సెస్, సాయిల్‌ సైన్స్, అగ్రికల్చర్‌ టెక్నాలజీ, గార్డెన్‌ డిజైన్, సస్టెయినబుల్‌ అగ్రికల్చర్, ఎన్విరాన్మెంటల్‌ సైన్స్, ఫుడ్‌ సెక్యూరిటీ లాంటి వినూత్న కోర్సులతో పాటు మరెన్నో మల్టీ డిసిప్ల్లినరీ కోర్సులు కూడా పూర్తిచేసుకోవచ్చు. పీజీ తరువాత, పీహెచ్‌డీ కూడా చేసినట్లయితే, బోధన, పరిశోధన రంగాల్లో ఉన్నత ఉద్యోగావకాశాలు పొందవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: శ్రీకాంత్‌ యాదవ్‌

    Ans:

    సోషియాలజీ డిగ్రీ అర్హతతో ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏమీ లేవు. కానీ, డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ మీరు అర్హులే. డిగ్రీ అర్హతతో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్, బ్యాంకింగ్‌ రిక్రూట్‌మెంట్, పోలీస్‌ రిక్రూట్‌మెంట్, ఎల్‌ఐసీ, కేంద్రప్రభుత్వ, రాష్ట్రప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాలన్నింటికీ మీకు అర్హత ఉంటుంది.
    ప్రైవేటురంగం విషయానికొస్తే డిగ్రీ అర్హత ఉన్న అన్ని ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేయవచ్చు. స్వచ్ఛంద సంస్థల్లో, పత్రికా రంగంలో, కౌన్సెలింగ్‌ రంగంలో ఉద్యోగాలకు సోషియాలజీ చదివినవారికి ఎక్కువ అవకాశాలుంటాయి. జర్నలిజం, పరిశోధన, మానవ వనరుల నిర్వహణలకు సంబంధించిన వృత్తుల్లో సోషియాలజీ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. మీరు డిగ్రీతోనే చదువు ఆపివేయకుండా సోషియాలజీ/ సోషల్‌ వర్క్‌/ జర్నలిజం/ సైకాలజీ/ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేస్తే ఉద్యోగావకాశాలు ఇంకా మెరుగవుతాయి. మీరు సోషియాలజీ డిగ్రీ తర్వాత, ఎల్‌ఎల్‌బీ కూడా చేసే అవకాశం ఉంది. బోధనరంగంలో ఆసక్తి ఉంటే బీఈడీ కూడా చేయవచ్చు.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: కల్యాణ్‌ కృష్ణ

    Ans:

    - పాఠశాలల్లో బోధన చేయదలిస్తే బీఏ, బీఈడీ అర్హత సరిపోతుంది. కేంద్రీయ విద్యాసంస్థల్లో, నవోదయ విద్యాలయాల్లో, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈల పాఠ్య ప్రణాళికలను అనుసరిస్తున్న పాఠశాలల్లో 11, 12 తరగతుల బోధన కోసం పీజీ టీచర్‌లను నియమిస్తారు. పీజీటీ ఉద్యోగాలకు బీఈడీ తో పాటు, సంబంధిత సబ్జెక్టులో పీజీ కూడా చేసి ఉండాలి. డిగ్రీలో చదివిన హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌ల్లో మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేసి స్కూళ్లలో, కళాశాలల్లో బోధన వృత్తిని చేపట్టవచ్చు. కంప్యూటర్స్‌ గురించిన ప్రాథ]మిక పరిజ్ఞానం మీకు అదనపు అర్హతగా పనికివస్తుంది. కేంద్రీయ విద్యాసంస్థల్లో పనిచేయాలంటే ఇంగ్లిషు, హిందీ భాషల్లో కూడా బోధించగల సామర్ధ్యం పెంచుకోవాలి.  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: టి. భవాని

    Ans:

    మీరు బీఎస్సీలో ఏ సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. డిగ్రీలో చేరి పూర్తిచేసేటప్పటికి మీకు కనీసం 32 సంవత్సరాలు వస్తాయి. ఆ తరువాత పీజీ చేయాలంటే మరో రెండేళ్లు పడుతుంది. అంటే డిగ్రీ పూర్తిచేశాక కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు వయసు రీత్యా మీకు అర్హత ఉండదు. కానీ, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలు చాలావాటికి మీకు అర్హత ఉంటుంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేయడానికి వయసుతో సంబంధం లేదు.
    భవిష్యత్తులో ఏ రంగంలో స్థిరపడాలనుకొంటున్నారో, ఆ రంగానికి అవసరమైన సబ్జెక్టులతో కూడిన డిగ్రీ చేస్తే మీకు ఉపయోగకరం. ఉదాహరణకు- మీరు సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు చేయాలి. స్వచ్ఛంద సంస్థల్లో ఉద్యోగాల కోసం, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పోటీ పరీక్షల కోసం హిస్టరీ, ఎకనమిక్స్, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, రూరల్‌ డెవలప్‌మెంట్‌ లాంటి కోర్సులు, డేటా సైన్స్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే డేటా సైన్స్‌ కోర్సులు, కౌన్సెలింగ్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే సైకాలజీ కోర్సులు, భాషా పండితులు కావాలనుకొంటే తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ లాంటి కోర్సులు చేస్తే మేలు. జర్నలిజం రంగంలో చేరడానికి జర్నలిజం కోర్సులు, మేనేజ్‌మెంట్‌ రంగంలోకి వెళ్లాలనుకొంటే బీబీఎ కోర్సులు, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ రంగం కోసం హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు, న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకొంటే ఐదు సంవత్సరాల బీఏ ఎల్‌ఎల్‌బీ/ బీబీఏ ఎల్‌ఎల్‌బీ లాంటి కోర్సులను చేయవచ్చు. బోధన వృత్తిలోకి వెళ్లాలనుకొంటే ఇంటర్‌ అర్హతతో డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ కానీ, బీఎస్సీ/ బీఏతో పాటు బీఈడీ లాంటి కోర్సులు కానీ చేయవచ్చు. కళాశాలలో అధ్యాపకులు అవ్వాలనుకుంటే డిగ్రీ తరువాత మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేసే ప్రయత్నం చేయండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కె. మధు

    Ans:

    బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివినవారికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు తక్కువేనని చెప్పవచ్చు. చాలా ప్రభుత్వరంగ సంస్థల్లో అవుట్‌ సోర్సింగ్‌/ కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఐటీ నియామకాలు చేస్తున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివినవారికి డేటా ఎంట్రీ ఆపరేటర్, నెట్‌ వర్కింగ్‌ ఇంజినీర్, వెబ్‌ డెవలపర్, జూనియర్‌ ప్రోగ్రామర్‌ లాంటి ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. సాధారణంగా కంప్యూటర్స్‌కు సంబంధించిన డిగ్రీలు చదివినవారికి ప్రైవేటు రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు బీఎస్సీలో కంప్యూటర్స్‌తో పాటు ఏయే సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. మీరు కంప్యూటర్స్‌తో పాటు స్టాటిస్టిక్స్‌ చదివివుంటే డేటా సైన్స్, ఆక్చూరియల్‌ సైన్స్, బిజినెస్‌ అనలిటిక్స్‌ లాంటి రంగాల్లో ప్రవేశించవచ్చు. ఏదైనా ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల కోసం ఎంఎస్‌ ఎక్సెల్, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్, మ్యాట్‌ ల్యాబ్, సీ ప్రోగ్రామింగ్, జావా, విజువల్‌ బేసిక్, ఎస్‌క్యూఎల్‌ లాంటి వాటిని నేర్చుకోవడం ముఖ్యం. బీఎస్సీతోనే చదువు ఆపేయకుండా వీలుంటే ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కానీ, ఎంసీఏ కానీ, ఎమ్మెస్సీ డేటా సైన్స్‌ కానీ, ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కానీ చదివితే మెరుగైన ఐటీ ఉద్యోగాలకు మీరు అర్హత సాధిస్తారు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సీహెచ్‌. దేవి

    Ans:

    - ఎంఎల్‌ఐ అండ్‌ ఎస్‌సీ చదివినవారికి అసిస్టెంట్‌/ డిప్యూటీ లైబ్రేరియన్లుగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా/ పరిశోధన సంస్థల్లో ఉద్యోగావకాశాలుంటాయి. కొంత కంప్యూటర్‌ పరిజ్ఞానంతో, ఐటీ రంగంలో కూడా ఉద్యోగ ప్రయత్నం చేయవచ్చు. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్‌ అనలిస్ట్‌గా, టెక్నికల్‌ రైటర్‌గానూ కెరియర్‌ ఎంచుకొనే అవకాశం ఉంది. ఎంఎల్‌ఐ అండ్‌ ఎస్‌సీ చదివినవారు న్యూస్‌ ఏజెన్సీల్లో, విదేశీ ఎంబసీల్లో, గ్రంథాలయాల్లో, ఇన్ఫర్మేషన్‌/ డాక్యుమెంటేషన్‌ సెంటర్లలో, మ్యూజియమ్స్‌లో కొలువులకు ప్రయత్నించవచ్చు. లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌ వర్కింగ్‌లో డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సు చేసినట్లయితే ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి. బోధనరంగంపై ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ చేసి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలకు ప్రయత్నించండి. ఎంఎల్‌ఐ అండ్‌ ఎస్‌సీ చదివినవారికి విదేశాల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంది.

    Asked By: పైడికల్వ పాలకొండ

    Ans:

    బీఏ చదివినవారికి డిగ్రీ విద్యార్హత ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్‌-1 నుంచి గ్రూప్‌ -4 వరకు ఉద్యోగాలన్నిటికీ మీరు ప్రయత్నించవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ చదివినవారు కొన్ని లక్షల్లో ఉన్నారు. కానీ అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రం వేలల్లోనే ఉన్నాయి. బీఏ చదివినవారికి ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా లేవు. ఉన్న అతికొద్ది కొలువుల్లో వేతనాలు ఆకర్షణీయంగా లేవు. బీఏ తరువాత పీజీ కానీ, మరేదైనా ప్రొఫెషనల్‌ కోర్సు కానీ చేస్తే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. బీఏలో మీరు చదివిన సబ్జెక్టుల్లో మీకు నచ్చినదానిలో పీజీ చేసే ప్రయత్నం చేయండి. మీకు భాషా శాస్త్రాల్లో ఆసక్తి ఉంటే డిగ్రీలో మీరు చదివిన లాంగ్వేజెస్‌లో పీజీ చేయవచ్చు. బోధన వృత్తిపై ఆసక్తి ఉంటే బీఈడీ, డీఈడీ, భాషా పండిట్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ లాంటి కోర్సులు చేయవచ్చు. ఇవికాకుండా ప్రొఫెషనల్‌ కోర్సులయిన ఎల్‌ఎల్‌బీ/ బీఎల్‌., ఎంబీఏలు కూడా చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: బి. వేణు

    Ans:

    * స్టార్టప్‌కైనా కొంత ఉద్యోగ అనుభవం అవసరం 
    సాధారణంగా బీకాం చదివినవారికి ఎం కామ్‌ చదివే అవకాశం ఉంది. మీకు మేనేజ్‌మెంట్‌ రంగంలో ఆసక్తి ఉంటే ఎంబీఏ చేయవచ్చు. బోధనరంగం ఇష్టమైతే బీఈడీ చేయవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో అకౌంటెంట్‌గా, ఆడిటర్‌గా ఉద్యోగావకాశాలు ఉంటాయి. చార్టెడ్‌ అకౌంటెంట్లు, ఆదాయపన్ను కన్సల్టెంట్ల దగ్గర అసిస్టెంట్లుగా చేరవచ్చు. బీమా, బ్యాంకింగ్‌ రంగాల్లోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. డిగ్రీ అర్హత ఉన్న అన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగాలకూ మీరు అర్హులే. ఇక బిజినెస్‌ అవకాశాల విషయానికొస్తే- వేరే వారితో పోల్చినప్పుడు బీకాం చదివినవారికి కొంత వెసులుబాటు ఉంటుంది. ఏ స్టార్టప్‌కైనా కొంత ఉద్యోగానుభవం అవసరం. మీరు ఏ రంగంలో స్టార్టప్‌ పెట్టాలనుకొంటున్నారో, ఆ రంగంలో కొంతకాలం ఉద్యోగం చేసి, ఆ వ్యాపారానికి సంబంధించిన మెలకువలు నేర్చుకోండి. ఆ తర్వాత సొంతంగా బిజినెస్‌ ప్రారంభించండి. 
    - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: చాంద్‌ పాష

    Ans:

    హిందీ విద్వాన్‌ కోర్సు డిగ్రీకి సమానం కాదు. ఈ కోర్సు చదివినవారు డిగ్రీ అర్హత ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కారు. అయితే, హిందీ పండిట్‌ శిక్షణ చేయడం కోసం మాత్రం దీన్ని డిగ్రీ విద్యార్హతగా పరిగణిస్తున్నారు. విద్వాన్‌తో పాటు హిందీ పండిట్‌ శిక్షణ పొందినవారు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో హిందీ బోధించవచ్చు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: మణికంఠ

    Ans:

    ఇంటర్మీడియట్‌ చదవకుండా, దూరవిద్యలో మీరు చదివిన బీకాంతో నిరభ్యంతరంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు పొందవచ్చు. కొన్ని ఉద్యోగాలకు మాత్రమే 10+2+3 పద్ధ్దతిలో చదివివుండాలన్న నిబంధన ఉంటుంది. అలాంటి ఉద్యోగాలకు మాత్రం మీరు అర్హులు కారు. ముఖ్యంగా, బీఈడీ చేయాలంటే పైన చెప్పిన 10+2+3 అర్హత అవసరం. ఉపాధ్యాయ ఉద్యోగాలు, అతికొన్ని ప్రత్యేక ఉద్యోగాలను మినహాయిస్తే, మీ విద్యార్హతల చెల్లుబాటు గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌