Post your question

 

    Asked By: మంజు

    Ans:

    మీరు డిగ్రీలో బయోకెమిస్ట్రీ చదివారు కాబట్టి పీజీ కూడా ఇదే సబ్జెక్టులో చేయటం వల్ల మేలుంటుంది. ఐదేళ్లపాటు బయోకెమిస్ట్రీ చదవడం వల్ల అవగాహన, విషయ పరిజ్ఞానం పెరిగి బయోకెమిస్ట్రీ రంగంలో ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఎక్కువ. పీజీలో బయోకెమిస్ట్రీ చదివినవారు బయో కెమిస్ట్, అనలిటికల్‌ కెమిస్ట్, బయోమెడికల్‌ సైంటిస్ట్, ఫోరెన్సిక్‌ సైంటిస్ట్, ఫార్మకాలజిస్ట్,  టాక్సికాలజిస్ట్, ఫుడ్‌ సైంటిస్ట్, సైంటిఫిక్‌ ల్యాబొరెటరీ టెక్నీషియన్, బయో టెక్నాలజిస్ట్, సైంటిఫిక్‌ రైటర్‌.. ఇలా వివిధ హోదాల్లో  ఉద్యోగావకాశాలకు ఆస్కారం ఉంటుంది. 
    ఒకవేళ మీరు పీజీలో బయోకెమిస్ట్రీ కాకుండా వేరే సబ్జెక్టులు చదవాలనుకుంటే బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్‌ సైన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, కంప్యుటేషనల్‌ బయాలజీ, సిస్టమ్స్‌ బయాలజీ, బయో మెడికల్‌ సైన్స్, బయో మెడికల్‌ ఇంజనీరింగ్, బిహేవియరల్‌ బయాలజీ, మాలిక్యులర్‌ బయాలజీ, క్లినికల్‌ బయోకెమిస్ట్రీ, సెల్‌ అండ్‌ సిస్టమ్స్‌ బయాలజీ, బయో ఆంత్రప్రెన్యూర్‌షిప్, పబ్లిక్‌ హెల్త్, ఎంబీఏ (హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌) లాంటి సబ్జెక్టులతో పీజీ చేయొచ్చు. లైఫ్‌ సైన్సెస్‌కు సంబంధించిన సబ్జెక్టుల్లో పీజీ చేస్తే అధ్యాపక ఉద్యోగాలు, పరిశ్రమ సంబంధిత అవకాశాలు అందుబాటులో ఉంటాయి. ఎంబీఏ (హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌) చదివితే హాస్పిటల్, హెల్త్‌కేర్‌ రంగల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. పీజీ తరువాత పీహెచ్‌డీ, విదేశాల్లో పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధన చేసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా బోధన, పరిశోధన రంగాల్లో మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగం పొందడం కోసమే కాకుండా మీకు ఆసక్తి ఉన్న కోర్సు చదివితేనే ఆ రంగంలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 
     

    Asked By: సంతోష్‌

    Ans:

    ప్రస్తుత ఉద్యోగమార్కెట్‌లో డిగ్రీల కంటే నైపుణ్యాలకు ప్రాధాన్యం పెరుగుతూ ఉంది. నైపుణ్యాలు లేకుండా ఎన్ని డిగ్రీలు చదివినా ఉపయోగం లేదు. అదే సమయంలో నైపుణ్యాలు ఉండి, డిగ్రీ లేకపోయినా ఇబ్బందే! ప్రస్తుతం ఎంసీఏ ప్రోగ్రామ్‌ను నాలుగు సెమిస్టర్లతో రెండు సంవత్సరాల వ్యవధిలో అందిస్తున్నారు. గతంలో ఈ ప్రోగ్రాం ఆరు సెమిస్టర్లతో మూడు సంవత్సరాలు ఉండేది. గతంతో పోలిస్తే, ఇప్పటి ఎంసీఏ సిలబస్‌ కొంత తక్కువ. ఎంసీఏ చదివినవారు బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్, డేటా సైన్స్, మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ), బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్, ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లు చదివినవారితో ఉద్యోగాలకోసం పోటీ పడాలి. దీన్ని తట్టుకొని ఉద్యోగం పొందాలంటే ఎంసీఏ డిగ్రీతో పాటు మరేదైనా కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత రంగంలో నైపుణ్యాలు పెంచుకోవడం తప్పనిసరి. నిత్యం జరుగుతూ ఉన్న సైబర్‌ మోసాలను ముందే పసిగట్టడానికీ, మోసం జరిగాక నేరపరిశోధనకూ హ్యాకింగ్‌లో నైపుణ్యాలున్నవారు చాలా అవసరం. భవిష్యత్తులో కూడా హ్యాకింగ్‌లో నైపుణ్యాలు ఉన్నవారికి మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. హ్యాకింగ్‌ కూడా కంప్యూటర్‌ రంగానికి సంబంధించిన విభాగమే కాబట్టి అది మీ ఎంసీఏ కోర్సుపై ఎలాంటి ప్రభావమూ చూపదు. ఎంసీఏతో పాటు హ్యాకింగ్, డేటా సైన్స్, బిజినెస్‌ అనలిటిక్స్, మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డిజిటల్‌ బిజినెస్‌ లాంటి కోర్సుల్లో మీకు నచ్చినవాటిని కూడా నేర్చుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రపంచంలో అందరికీ రోజుకు 24 గంటల సమయమే ఉంటుంది. మీరు ప్రణాళిక ప్రకారం సమయాన్ని విభజించి నిరభ్యంతరంగా హ్యాకింగ్‌లో శిక్షణ తీసుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంసీఏ ప్రోగ్రామ్‌ను అశ్రద్ధ చేయకండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  
     

    Asked By: కె. సూర్య

    Ans:

    మీ విద్యార్హతలతో సివిల్‌ ఇంజనీర్‌/ హెచ్‌ఆర్‌ మేనేజర్‌/ ఫైనాన్స్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేసే అవకాశం ఉంది. అలా కాకుండా, బీటెక్, ఎంబీఏ రెండు డిగ్రీలను ఉపయోగించుకొని ఏవైనా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల్లో కానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల్లో కానీ, సిమెంట్‌ ఫ్యాక్టరీల్లో కానీ కొలువు పొందవచ్చు. 
    సాధారణంగా సివిల్‌ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ రంగాల్లో మంచి ఉద్యోగాలు పొందాలంటే ఉద్యోగానుభవం అవసరం. ఒకవేళ మీకు గత ఉద్యోగానుభవం లేకపోతే మొదటి ఉద్యోగాన్ని తక్కువ వేతనంతో అయినా ప్రారంభించి మెలకువలు తెలుసుకోండి. కొంత అనుభవం గడించాక మెరుగైన కొలువుకు మారే ప్రయత్నం చేయవచ్చు. 
    మీరు ఎంబీఏలో పీహెచ్‌డీ చేయాలని ఎందుకనుకొంటున్నారు? బోధన రంగంపై ఆసక్తి ఉందా? లేదా మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేసి, ఇండస్ట్రీలోకి వెళ్లే ఉద్దేశం ఉందా? భవిష్యత్తులో ఎలా స్థిరపడాలనుకొంటున్నారన్న విషయంపై స్పష్టత అవసరం. 
    ఒకవేళ మీరు పీహెచ్‌డీ చేసి మెరుగైన ఉపాధి పొందాలనుకుంటే- ఐఐఎం, ఐఐటీల్లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి కానీ, ప్రముఖ విదేశీ యూనివర్సిటీల నుంచి కానీ పీహెచ్‌డీ చేసే ప్రయత్నం చేయండి. పరిశోధనపై ఆసక్తితో కనీసం నాలుగేళ్ల పాటు ఎలాంటి విసుగూ లేకుండా పట్టుదలతో, ఓపిగ్గా నాణ్యమైన కృషి చేయాలి. ఆపై అంతర్జాతీయ జర్నల్స్‌లో పరిశోధన పత్రాలు ప్రచురించి, బోధన, పరిశోధన రంగాల్లో మెలకువలు నేర్చుకొంటేనే మీ పీహెచ్‌డీకి విలువ ఉంటుంది. ఈ డిగ్రీని ఆభరణంలా కాకుండా, తపస్సులాగా చేసినప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 
     

    Asked By: విజయ్‌కుమార్‌

    Ans:

    1980ల్లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ పీజీ చదివినవారు తక్కువమంది. అందుకని మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, ఇతర ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో పీజీ చేసినవారు పీహెచ్‌డీలో కంప్యూటర్‌ సైన్స్‌ సంబంధిత అంశంపై పరిశోధన చేసి సీఎస్‌ విభాగంలో బోధన ఉద్యోగాలు  పొందేవారు. 1990ల్లో ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ సీట్లు ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేసినవారికి మాత్రమే కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో బోధించే అవకాశం కల్పించారు. 2000 సంవత్సరం తరువాత బీటెక్, ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారు, కంప్యూటర్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేసినవారు ఎక్కువమంది ఉండటం వల్ల కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ చేసినవారికి మాత్రమే కంప్యూటర్‌ సైన్స్‌ అధ్యాపక ఉద్యోగాలు పొందుతున్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో ఈ ఇబ్బంది లేదు. కంప్యూటర్‌ సైన్స్‌ రంగంలో అత్యుత్తమ పరిశోధన పత్రాలు ప్రచురించి ఉంటే, గ్రాడ్యుయేషన్‌లో చదివిన సబ్జెక్టుతో సంబంధం లేకుండా సీఎస్‌ విభాగంలో బోధించే అవకాశం ఇస్తున్నారు.
    ఇంజినీరింగ్‌ విద్య అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పరిధిలో ఉంది కాబట్టి, వారి నిబంధనల ప్రకారమే ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బోధన నియామకాలు చేపడతారు. ప్రత్యేక సందర్భాల్లో కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు బీటెక్‌లో చదివిన సబ్జెక్టుతో సంబంధం లేకుండా ఎంటెక్‌ డిగ్రీని బట్టి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. కానీ సంబంధిత అనుబంధ యూనివర్సిటీ, వారి సర్వీసును ర్యాటిఫై చేయడం లేదు. కొన్ని యూనివర్శిటీలు మాత్రం గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవకుండా ఎంటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ చదివినవారు ఎన్‌పీటెల్‌లో నాలుగు కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు చదివి సర్టిఫికెట్‌ పొందితే కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో బోధించడానికి అనుమతిస్తున్నాయి.
    జాతీయ విద్యావిధానం- 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక, వివిధ సబ్జెక్టుల మధ్య అడ్డుగోడలు తొలగిపోయి, అధ్యాపక నియామకాల్లో చాలా వెసులుబాట్లు ఉంటాయి. ఇటీవల యూజీసీ జారీచేసిన జేఆర్‌ఎఫ్‌- నెట్‌ నోటిఫికేషన్‌లో 75 శాతంతో నాలుగు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసినవారు నచ్చిన సబ్జెక్టులో నెట్‌ రాసి పీహెచ్‌డీ చేయవచ్చని పేర్కొన్నారు. కాబట్టి, భవిష్యత్తులో మీరు కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో బోధించడానికి ఇబ్బందులు ఉండకపోవచ్చు. మీకు బోధన రంగంలో ఆసక్తి ఉంటే ముందుగా ఏదైనా  ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అధ్యాపకుడిగా బోధన కెరియర్‌ను ప్రారంభించవచ్చు. అదే సమయంలో కంప్యూటర్‌ సైన్స్‌/ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌/డేటా సైన్స్‌లో పీహెచ్‌డీ చేసి, భవిష్యత్తులో ఈ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగానికి ప్రయత్నాలు చేయండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: ఎ.పవన్‌ కుమార్‌

    Ans:

    సాధారణంగా ఎంబీఏ చదివినవారికి విభిన్న రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎంబీఏ స్పెషలైజేషన్‌తోపాటు అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీలో చదివిన కోర్సులు, గత ఉద్యోగానుభావం లాంటి అంశాలు మరో ఉద్యోగంలోకి మారడానికీ, పదోన్నతికీ దోహదపడతాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మేనేజ్‌మెంట్‌ ్లో ఎంబీఏ చేస్తే, మీ ఉద్యోగావకాశాలు ఆయిల్‌, గ్యాస్‌ రంగాలకే పరిమితం అవుతాయి. ఇప్పటికే ఆయిల్‌, గ్యాస్‌ రంగంలో పనిచేసేవారు ఈ కోర్సు చేస్తే ఎక్కువ ఉపయోగకరం. విదేశాల్లో ఎంబీఏ ప్రోగ్రాంలో ప్రవేశం పొందాలంటే సంబంధిత రంగంలో ఉద్యోగానుభవం అవసరం. ఎంబీఏలో ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌, సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి స్పెషలైజేషన్‌తో చదివితే గ్యాస్‌, ఆయిల్‌ రంగాలతో పాటు ఇతర రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
    ప్రపంచవ్యాప్తంగా ఎంబీఏ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాంను అతి తక్కువ యూనివర్శిటీలు మాత్రమే అందిస్తున్నాయి. మన దేశంలో దీన్ని యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌, దేహ్రాదూన్‌ అందిస్తోంది. ఈ ప్రోగ్రాం యూకే, ఆస్ట్రే లియా, యూఎస్‌ యూనివర్సిటీల్లో ఎంబీఏలో కాకుండా.. ఎంఎస్‌లో భాగంగా అందుబాటులో ఉంది. యూనివర్సిటీ ఆఫ్‌ అబెర్డీన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ డూండీ, బ్రూనెల్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ లండన్‌, ఇంజినీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, గ్లాస్గో కలేడోనియన్‌ యూనివర్సిటీ, కొవెంట్రీ యూనివర్సిటీ, టెక్సాస్‌ ఏ అండ్‌ ఎం యూనివర్సిటీల్లో పీజీలో ఈ స్పెషలైజేషన్‌ ఉంది. ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్‌లకు వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: prasanth

    Ans:

    అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీని అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ/ ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ/ మరేదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి దూరవిద్య ద్వారా చదివినా, ఆన్‌లైన్‌ పద్ధతిలో చదివినా రెగ్యులర్‌ పీజీ చేసే అవకాశం ఉంది. మీరు నిరభ్యంతరంగా సీపీజీఈటీ (కామన్‌ పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్‌) రాయవచ్చు. సీపీజీఈటీలో మంచి ర్యాంకు పొందితే యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, బనారస్‌ హిందూ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ యూనివర్శిటీల నుంచి ఎంఏ తెలుగు చదివే అవకాశం ఉంది. సీపీజీఈటీతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు నిర్వహించే పీజీ ఎంట్రన్స్‌ పరీక్షలు కూడా రాస్తే, రెండు రాష్ట్రాల్లో ఉన్న స్టేట్‌ యూనివర్సిటీల్లో కూడా ఎంఏ చదవొచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: - రామకృష్ణ ప్రకాశ్‌

    Ans:

    మీరు ఎంబీఏలో మార్కెటింగ్‌ చదివి, ఆరేళ్లు ఉద్యోగం చేశారు కాబట్టి, ఆ రంగంలోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. మీ ఉద్యోగావకాశాలు మెరుగు పర్చుకోవాలంటే డిజిటల్‌ మార్కెటింగ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, మార్కెటింగ్‌ అనలిటిక్స్, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్, రిటైలింగ్, కంటెంట్‌ మార్కెటింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్, గూగుల్‌ అనలిటిక్స్, మైక్రోసాఫ్ట్‌ అడ్వర్టయిజింగ్‌ సర్టిఫికేషన్, హబ్‌ స్పాట్‌ ఇన్‌ బౌండ్‌ మార్కెటింగ్‌ లాంటి కోర్సుల్లో శిక్షణ పొందండి. వీటితో పాటు డేటా సైన్స్, మెషిన్‌ లెర్నింగ్, బిజినెస్‌ అనలిటిక్స్, డేటా విజువలైజేషన్, క్లౌడ్‌ కంప్యూటింగ్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Ans:

    బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివాక ఎక్కడైనా ఉద్యోగం చేశారా? లేదా? మీకు బీటెక్, ఎంబీఏల్లో ఏ స్థాయి మార్కులు వచ్చాయి? ఎంబీఏ ఎక్కడ చదివారు? ఆ విద్యాసంస్థలో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొన్నారా?...ఈ వివరాలు చెప్పలేదు. ఎంబీఏలో హెచ్‌ఆర్, ఫైనాన్స్‌ స్పెషలైజేషన్లు చదివారు కాబట్టి ఆ రెండు విభాగాల్లో మీకు నైపుణ్యాలు ఎక్కువున్న స్పెషలైజేషన్‌ ఎంచుకొని ఉద్యోగప్రయత్నాలు చేయండి. సాధారణంగా ఎంబీఏ చదివినవారు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఉద్యోగం పొందడం సులువు. ఉద్యోగానుభవం లేకుండా నేరుగా సొంత ప్రయత్నాలతో ఉద్యోగం పొందడం కొంత కష్టమే! ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌ అంత ఆశాజనకంగా లేదు. అందుకని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే అదనంగా కోర్సులు చేసి మీ ఉద్యోగావకాశాలను మెరుగు పర్చుకోండి. ప్రముఖ విద్యా/ శిక్షణ సంస్థల నుంచి సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు చేయడం ఉపయోగకరం. ఈ మధ్య కాలంలో డేటా సైన్స్, బిజినెస్‌ అనలిటిక్స్‌ చదివినవారికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రంగాల్లో అదనపు కోర్సులు చేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    మీరు 2013లో బీటెక్‌ డిస్‌కంటిన్యూ చేశారంటే, మీ వయసు దాదాపుగా 30 ఉండొచ్చు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉద్యోగానుభవం ఉంది కాబట్టి ఆ రంగంలో స్థిరపడితేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు బీటెక్‌లో ఏ బ్రాంచిలో చేరారు అన్న విషయాన్ని చెప్పలేదు. మీరు డిగ్రీ పూర్తి చేయలేదు కాబట్టి ఎంబీఏ చదవడానికి అర్హత లేదు. బీఏ/బీకాం/బీబీఏల్లో మీకు నచ్చిన డిగ్రీని ఆన్‌లైన్‌/ దూరవిద్య ద్వారా పూర్తి చేయండి. ఆ తరువాత ఎంబీఏ- మార్కెటింగ్‌ కానీ, ఎంబీఏ- రియల్‌ ఎస్టేట్‌ కానీ చదివే ప్రయత్నం చేయండి. సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేయాలన్నా కనీసం డిగ్రీ విద్యార్హత అవసరం. మీ రియల్‌ ఎస్టేట్‌ ఉద్యోగానుభవం, సాఫ్ట్‌వేర్‌ రంగంతో సంబంధం లేకపోవడం, ఇంటర్‌కూ, పూర్తి చేయబోయే డిగ్రీకీ మధ్య అధిక వ్యవధి.. ఈ కారణాలతో సాఫ్ట్‌వేర్‌ రంగంలో మంచి ఉద్యోగం పొందడం కొంత కష్టమే. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కొనసాగిస్తూనే డిగ్రీ/ఎంబీఏ పూర్తిచేసి, రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనే మెరుగైన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    సాధారణంగా జర్నలిజం చదివినవారికి, ప్రభుత్వ రంగంతో పోలిస్తే, ప్రైవేటు రంగంలోనే ఉపాధి అవకాశాలు ఎక్కువ. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో పబ్లిక్‌ రిలేషన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్లుగా చేరవచ్చు. దూరదర్శన్, ఆల్‌ ఇండియా రేడియోల్లోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి. జర్నలిజం చదివినవారికి ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్, దానికి సమానమైన రాష్ట్ర స్థాయి సర్వీసుల్లో కూడా అవకాశాలు లభిస్తాయి. మినిస్ట్రీ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌లో వివిధ విభాగాలైన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్‌ మీడియా మానిటరింగ్‌ సెంటర్, న్యూ మీడియా వింగ్, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో, పబ్లికేషన్స్‌ డివిజన్, రిజిస్ట్రార్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్స్‌ ఫర్‌ ఇండియాల్లో ఉపాధి ప్రయత్నాలు చేయవచ్చు. మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే- జర్నలిజం కళాశాలల్లో అధ్యాపకుడిగా స్థిరపడవచ్చు. జర్నలిజంలో శిక్షణ పొందినవారికి ప్రైవేటు రంగంలో విభిన్న ఉద్యోగావకాశాలు ఉన్నాయి. వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకొని కొంత ఉద్యోగానుభవం గడిస్తే వేతనం, హోదా కూడా పెరుగుతాయి. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరినవారికి పెన్షన్‌ సదుపాయం లేదు. అందుకని ఉద్యోగ భద్రత మినహా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు పెద్దగా తేడా ఏమీ లేదు. ప్రైవేటు రంగంలో సర్వీసు, వయసుతో పనిలేకుండా ప్రతిభ ఆధారంగా పదోన్నతులూ, అధిక వేతనాలకు ఆస్కారం ఉంటుంది. జర్నలిజం రంగంలో ప్రైవేటు ఉద్యోగాల్లో సృజనాత్మకతకు అవకాశం అధికం. ప్రైవేటు రంగంలో మంచి ఉద్యోగం వస్తే నిరుత్సాహపడకుండా చేరి నైపుణ్యాలు మెరుగుపర్చుకోండి. అంతర్జాతీయ మీడియా సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌