Asked By: బి.అశోక్, గోదూర్, జగిత్యాల జిల్లా
Ans:
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఎల్‌ఎల్‌బీ కోర్సును రెగ్యులర్‌గానే చదవాలి. దూరవిద్య ద్వారా చదవడానికి అవకాశం లేదు. ఒకవేళ మీరు లాసెట్ రాసి ఏదైనా న్యాయ కళాశాలల్లో ప్రవేశం పొందినా, మీరు రెగ్యులర్‌గా తరగతులకు హాజరు కావాలి. మీరు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నందున కళాశాలకు ప్రతిరోజూ వెళ్ళడం సాధ్యం కాదు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత చదువులు చదవాలంటే ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వాలి. కాబట్టి మీరు ఉద్యోగం చేస్తూ ఈ కోర్సు చదవడం కష్టమే. అవకాశం ఉంటే మూడేళ్లు సెలవుపై వెళ్లడానికి మీ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని ఎల్‌ఎల్‌బీ చదవవచ్చు. అలా కుదరకపోతే పదవీ విరమణ తరువాత మీ కల నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: శ్రీహరి
Ans:
ఎల్‌ఎల్‌బీ తరువాత లాయర్ కాకుండా లీగల్ అడ్వైజర్, లీగల్ కన్సల్టెంట్, లీగల్ అనలిస్ట్, మీడియేటర్, ఆర్బిట్రేటర్, లా ఆఫీసర్, లైజన్ ఆఫీసర్, లీగల్ కౌన్సెలర్, కాంట్రాక్ట్ అడ్వైజర్, లేబర్ రిలేషన్స్ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్, లీగల్ జర్నలిస్ట్, కాంప్లియెన్స్ ఆఫీసర్, లీగల్ పబ్లిషర్, జ్యుడీషియల్ ఎగ్జిక్యూటివ్ హోదాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎల్‌ఎల్‌ఎం/ పీహెచ్‌డీ చేస్తే ఆధ్యాపకులుగా, ట్రైనర్స్‌గా కూడా స్థిరపడవచ్చు. ఎల్‌ఎల్‌బీ తరువాత ఎంబీఏ/ జర్నలిజం/ సైకాలజీ/ సోషల్ వర్క్/ హ్యూమన్ రైట్స్/ ఫోరెన్సిక్ సైన్స్ లాంటి కోర్సులు చేస్తే మరిన్ని ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎన్.పూర్ణచంద్రరావు
Ans:
ఎల్‌ఎల్‌బీ కోర్సును దూరవిద్యలో చదివే అవకాశం లేదు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఎల్‌ఎల్‌బీ కోర్సును రెగ్యులర్ పద్ధతిలోనే చదవాల్సివుంటుంది. ఏ నకిలీ విద్యాసంస్థ అయినా న్యాయవిద్యను దూరవిద్య విధానంలో అందిస్తామని చెబితే నమ్మి మోసపోకండి. మెడిసిన్, ఇంజినీరింగ్, ఎల్‌ఎల్‌బీ లాంటి ప్రొఫెషనల్ కోర్సులను వేటినీ దూరవిద్యలో అందించరు. ఒకవేళ ఎవరైనా అలాంటి కోర్సుల్లో చేరితే, ఆ కోర్సులకు ప్రభుత్వ గుర్తింపు ఉండదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్
Asked By: ఎం. అజయ్‌కుమార్
Ans:
- కనీసం మూడు సంవత్సరాల వ్యవధి గల ఏ డిగ్రీ పూర్తి చేసినవారైనా, మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు చదవొచ్చు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. ఈ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ప్రైవేటు న్యాయ కళాశాలలూ ఈ కోర్సును అందిస్తున్నాయి. ప్రవేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీఎస్ లాసెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్ తర్వాత ఐదేళ్ల లా కోర్సును నల్సార్ యూనివర్సిటీ అందిస్తోంది. నల్సార్‌లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే క్లాట్ ప్రవేశపరీక్ష రాయవలసి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ, యూనివర్సిటీ అనుబంధ ప్రైవేటు న్యాయ కళాశాలలు కూడా ఐదేళ్ల లా కోర్సు అందిస్తున్నాయి. ఈ కోర్సులో ప్రవేశానికి టీఎస్ లాసెట్ రాయాలి. హైదరాబాద్‌లో ఉన్న కొన్ని డీమ్డ్/ ప్రైవేటు యూనివర్సిటీల్లో ఐదేళ్ల లా కోర్సులో చేరటానికి ఏదైనా జాతీయ/ రాష్ట్ర స్థాయి/ సంబంధిత ప్రైవేటు యూనివర్సిటీ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించివుండాలి.
ఒకప్పుడు ఎల్‌ఎల్‌బీ చదివినవారికి న్యాయవాద వృత్తిని మినహాయిస్తే పెద్దగా ఉద్యోగావకాశాలు ఉండేవి కావు. కానీ ఇటీవలికాలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో చాలారకాల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఎల్‌ఎల్‌బీ చదివినవారు లీగల్ అసోసియేట్, లా ఆఫీసర్, కార్పొరేట్ లాయర్, లీగల్ అడ్వైజర్, లీగల్ ఎనలిస్ట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మెజిస్ట్రేట్, జ్యుడిషియల్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలు చేయవచ్చు. మీకు ఆసక్తి ఉంటే ఎల్‌ఎల్‌బీ తర్వాత ఎల్‌ఎల్‌ఎం/ పీహెచ్‌డీ చేసి బోధన రంగంలోనూ స్థిరపడవచ్చు. ఇవన్నీ కాకుండా సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకొనే అవకాశం ఎలాగూ ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్