Post your question

 

    Asked By: పి. సాయిశ్రీ

    Ans:

    మీరు నిరభ్యంతరంగా విదేశీ యూనివర్సిటీల్లో ఎంఏ చదవవచ్చు. కొన్ని విదేశీ వర్సిటీలు మాత్రం నాలుగు సంవత్సరాల డిగ్రీ చదివిన వారికే ఎంఏలో ప్రవేశాన్ని కల్పిస్తున్నాయి. చాలా విదేశీ విశ్వవిద్యాలయాలు ఆంగ్ల భాషకు సంబంధించిన పరీక్ష స్కోరుతో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఆంగ్ల భాషలో ప్రావీణ్యాన్ని పరీక్షించడం కోసం టోఫెల్, ఐఈఎల్‌టీఎస్, పీటీఈ లాంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వివిధ దేశాల్లోని వివిధ యూనివర్సిటీలు ఒక్కో రకమైన పరీక్షలో వచ్చిన స్కోరును పరిగణనలోకి తీసుకుంటాయి. కొన్ని యూనివర్సిటీలు ఈ మూడు పరీక్షల్లో ఏ పరీక్ష ద్వారానైనా ప్రవేశాలు కల్పిస్తాయి. అతి తక్కువ యూనివర్సిటీలు మాత్రమే ఎలాంటి ప్రవేశ పరీక్షా లేకుండా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. మీరు ఎంఏ తరువాత పీ‡హెచ్‌డీ చేయాలనుకొంటే ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ  పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఉంది. విదేశీ యూనివర్సిటీల్లో పీజీ చేయాలంటే ఖర్చు లక్షల్లో ఉంటుంది. అతి కొద్ది యూనివర్సిటీలు మాత్రమే అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నాయి. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: రాజేష్‌

    Ans:

    ఒక రెగ్యులర్‌ డిగ్రీతో పాటు మరో డిగ్రీని ఓపెన్‌/ డిస్టెన్స్‌/ఆన్‌లైన్‌లో చేయవచ్చన్న ప్రతిపాదనను యూజీసీ మే 2020లో ఆమోదించినట్లుగా అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. యూజీసీ నోటిఫికేషన్‌ అన్ని వివరాలతో వస్తుందని అందరూ ఆశించారు. కానీ సంబంధిత పూర్తి నోటిఫికేషన్‌ యూజీసీ వెబ్‌సైట్‌లో ఇంకా అందుబాటులో లేదు. రెండు డిగ్రీల్లో ఒకటి మామూలు డిగ్రీ, మరొకటి ప్రొఫెషనల్‌ కోర్సు అయితే ఈ అవకాశం వర్తిస్తుందా అనేదానిపై కూడా స్పష్టత లేదు. మీరు విడివిడిగా రెండు డిగ్రీలను నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. ఈ నిర్ణయం 2020లో తీసుకున్నారు కాబట్టి, 2020కి ముందు చదివినవారికి వెసులుబాటు ఉంటుందా, ఉండదా అనేది యూజీసీ పూర్తి నోటిఫికేషన్‌ వచ్చాకే తెలుస్తుంది. - ప్రొ.బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌   

    Asked By: ఎం నాగరాజు

    Ans:

    బీకామ్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌  కోర్సును హైదరాబాద్‌ చంచల్‌గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ మహిళా డిగ్రీ కళాశాలల్లో అందిస్తున్నారు. ఇంకా చాలా కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. లయోలా అకాడెమీ సికిందరాబాద్, సెయింట్‌ జోసెఫ్‌ కాలేజ్, భారతీయ విద్యాభవన్, వివేకానంద కాలేజ్, అవినాష్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్, బద్రుక కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్, ప్రగతి మహా విద్యాలయ, ఆంధ్ర మహిళాసభ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజ్, జాహ్నవి డిగ్రీ కాలేజ్, ప్రగతి డిగ్రీ కాలేజ్, నోబుల్‌ డిగ్రీ కాలేజ్, ఆర్‌ జి కేడియా కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్, గీతాంజలి విమెన్స్‌ డిగ్రీ కాలేజ్, సిద్దార్థ డిగ్రీ కాలేజ్, ధ్రువ డిగ్రీ కాలేజ్, కేశవ్‌ మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ సైన్సెస్, మేఘన డిగ్రీ కాలేజ్, తపస్య డిగ్రీ కాలేజ్‌..వాటిలో కొన్ని. మీకు డిగ్రీలో బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు చేయాలనుకొంటే బీబీఎ బిజినెస్‌ అనలిటిక్స్‌ కూడా అందుబాటులో ఉంది. సిలబస్‌ పరంగా బీకామ్‌ బిజినెస్‌ అనలిటిక్స్, బీబీఎ బిజినెస్‌ అనలిటిక్స్‌ల మధ్య పెద్ద తేడా లేదు.  - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఆశ్రిత

    Ans:

    ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ తిరుపతి, ఎన్‌ఐటీ వరంగల్, జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, జవహర్‌ లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ కాకినాడ, కేఎల్‌ యూనివర్సిటీల్లో ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ కోర్సు అందుబాటులో ఉంది. వీటితో పాటు కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలూ ఈ కోర్సును అందిస్తున్నాయి. చాలా విద్యాసంస్థల్లో ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ చదవాలంటే బీఈ/ బీటెక్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ కచ్చితంగా చదివి ఉండాలన్న నిబంధన ఉంది. జీఏంఆర్‌ఐటీ రాజంలో ఈ కోర్సును కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం వారు అందిస్తున్నారు.
    ఈ కోర్సు చదివిన తరువాత పురుషులకూ, మహిళలకూ ఉద్యోగావకాశాలు సమానమే. ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ కోర్సు చదివినవారికి కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్, ఎన్విరాన్‌మెంటల్‌ ఎక్స్‌పర్ట్, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఇంజినీర్, ఎన్విరాన్‌మెంటల్‌ కన్సల్టెంట్, ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ డిజైన్‌ ఇంజినీర్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలు వస్తాయి.      
        - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఉమా శ్రీకాంత్‌

    Ans:

    ఫిజికల్‌ కెమిస్ట్రీ కోర్సు మ్యాథమేటిక్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీల సమ్మేళనం. దీనిలో ఎక్కువగా అనలిటికల్‌ కెమిస్ట్రీ, కంప్యుటేషనల్‌ కెమిస్ట్రీలను నేర్చుకొంటారు. ఈ కోర్సులో ముఖ్యంగా పరిశ్రమల్లో కెమిస్ట్రీ వినియోగం తెలుసుకుంటారు. ఫిజికల్‌ కెమిస్ట్రీ  రంగంలో రాణించాలంటే గణితంలోని ప్రాథమిక సూత్రాలపై మంచి అవగాహన ఉండాలి.
    ఎంఎస్‌సీ (ఫిజికల్‌ కెమిస్ట్రీ) చదివితే ప్రైవేటు ఫార్మా, ఫుడ్, కాస్మొటిక్స్, బయో టెక్నాలజీ లాంటి కంపెనీల్లో, బోధన రంగంలో చాలా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఇస్రో, డీఆర్‌డీఓ, ఓఎన్‌జీసీ, భారత్‌ పెట్రోలియం, హిందుస్తాన్‌ పెట్రోలియం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లాంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో,  కేంద్ర ప్రభుత్వ ప్రయోగశాలల్లో, కేంద్ర, రాష్ట్ర,  ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోని కెమిస్ట్రీ ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు/సైంటిఫిక్‌ ఆఫీసర్‌/ టెక్నికల్‌ ఆఫీసర్‌/ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌/ ల్యాబ్‌ అసిస్టెంట్‌/ రిసెర్చ్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగాలు పొందొచ్చు.
    బోధన రంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ చేసి స్కూల్‌ అసిస్టెంట్‌/ టీజీటీ/ పీజీటీగా పాఠశాలల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ఇవే కాకుండా  ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కెమిస్ట్రీ లెక్చరర్‌గా స్థిర పడవచ్చు. నెట్‌/సెట్‌ లో ఉత్తీర్ణత సాధించి డిగ్రీ కళాశాలల్లో కెమిస్ట్రీలో సహాయ ఆచార్యుడిగా ఉద్యోగం పొందవచ్చు. ఫిజికల్‌ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసి కేంద్ర/ రాష్ట్ర/ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుడిగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. పరిశోధనలపై ఎక్కువ ఆసక్తి ఉంటే విదేశాల్లో పోస్ట్‌ డాక్టొరల్‌ పరిశోధన కోసం ప్రయత్నించవచ్చు. ఎంఎస్‌సీ (ఫిజికల్‌ కెమిస్ట్రీ) తర్వాత గేట్‌ రాసి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఎమ్‌టెక్‌ చేసి ఇంజినీరింగ్‌ సంస్థల్లో ఉద్యోగాలకు అర్హత సాధించవచ్చు. ఫిజికల్‌ కెమిస్ట్రీ కోర్సు చేసినవారికి కెమికల్‌ ఇంజినీరింగ్‌ పరిశ్రమల్లో  అధిక ప్రాధాన్యం ఉంటుంది.
    - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎం. నాగరాజు

    Ans:

    ఇంటర్‌లో ఎంఈసీ చదివిన చాలామంది సీఏ చేస్తూ బీకాం లేదా బీకాం చదువుతూ సీఏలో చేరతారు. అయితే వీరిలో ఎక్కువమంది బీకాం మాత్రమే పూర్తి చేయగలుగుతున్నారు. కొద్దిమందే సీఏ కోర్సుని విజయవంతంగా పూర్తి చేయగలుగుతున్నారు. మరికొద్దిమంది సీఏ (ఇంటర్‌)తోనే ఆపేస్తున్నారు. బీకాం పూర్తయిన తర్వాత ఎంబీఏ లేదా ఎంకాం ఎంచుకోవచ్చు. సీఏ కోర్సు ప్రైవేటు, బహుళజాతి సంస్థల్లో కాస్టింగ్, అకౌంటింగ్‌ రంగాల్లో అవకాశాలు కల్పిస్తుంది. ఇది పూర్తిచేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇన్‌కమ్‌ టాక్స్, ఆడిట్‌ రంగాల్లో ఉపాధి లభిస్తుంది. ఎంబీఏ చదువుకున్నవారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృత ఉద్యోగావకాశాలున్నాయి. ఎంకాం కోర్సు పూర్తిచేసినవారు అకౌంటింగ్‌ విభాగాలు, బోధన రంగంలో ఉపాధి పొందుతున్నారు.
    ఇటీవలికాలంలో డేటా సైన్స్‌/ బిజినెస్‌ అనలిటిక్స్‌ ప్రాచుర్యంలోకి వచ్చాయి. వివిధ సర్వేల ప్రకారం రాబోయే 20 ఏళ్లలో ఈ రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం తగినంత మంది అర్హులు లేనందున చాలా కళాశాలలు బిజినెస్‌ అనలిటిక్స్‌  కోర్సుని బీకాం, బీబీఏ, ఎంబీఏల్లో అందిస్తున్నాయి. ఈ కోర్సు స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ల సమ్మేళనం. దీన్ని పూర్తిచేయడానికి ప్రాబ్లం సాల్వింగ్‌పై అవగాహన, గణితంపై ఆసక్తి అవసరం. బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు చేశాక మంచి ఉద్యోగాలు పొందాలంటే వ్యాపారపు ఫంక్షనల్‌ పరిజ్ఞానం, స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్‌లపై పట్టు అవసరం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీ అబ్బాయి అభిరుచిని బట్టి కోర్సును ఎంచుకోమని చెప్పండి. ఫంక్షనల్, టెక్నికల్‌ (అనలిటిక్స్‌) రంగాల్లో పూర్తి అవగాహన ఉన్నవారు మార్కెట్‌లో తక్కువగా ఉన్నందున సీఏతోపాటు బీకాం అనలిటిక్స్‌ని చేయగలిగితే దేశ విదేశాల్లో మేటి అవకాశాలు పొందవచ్చు.
    - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎం.వరప్రసాద్‌

    Ans:

    బీటెక్‌ పూర్తిచేసిన ఏడేళ్ల తర్వాత సంస్కృత భాషను నేర్చుకోవాలనుకుంటున్న మీ ఆసక్తి అభినందనీయం. సంస్కృత భాషలో సామాన్య పరిజ్ఞానం కోసం కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం దిల్లీ, ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో) దిల్లీ, నేషనల్‌ సాన్‌స్క్రిట్‌ యూనివర్సిటీ (రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం) తిరుపతిల్లో ఆరు నెలల సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సు చేయవచ్చు. ఇగ్నోలో ఈ కోర్సు ఆంగ్ల మాధ్యమంలో అందుబాటులో ఉంది. ఏ వయసువారైనా ఇందులో చేరవచ్చు. సంస్కృతంలో ప్రాథమిక అర్హత ఉన్నవారు ఇవే సంస్థల ద్వారా పీజీ కూడా చేయవచ్చు. భారతీయ విద్యాభవన్‌ వారి సంస్కృత విశారద, సంస్కృత భారతిల్లో ప్రవేశ, పరిచయ, శిక్షా, కోవిద కోర్సులు ఉపయోగపడతాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ కూడా చాలా కోర్సులను అందిస్తోంది. డిగ్రీలో ద్వితీయ భాషగా సంస్కృతం చదువుకున్నవాళ్లు ఉస్మానియా, ఆంధ్రా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల్లో దూరవిద్య ద్వారా ఎంఏ సంస్కృతం కోర్సు చదవవచ్చు.  ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: షేక్‌ బాబా జీలన్

    Ans:

    డిప్లొమా ఇన్‌ సేఫ్టీని దూరవిద్యలో చదవొచ్చు. యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ (UPES), దెహ్రాదూన్‌లో అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ (హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్‌)ని దూరవిద్య ద్వారా అందిస్తున్నారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌  ఆఫ్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్‌ (NIFSE), హైదరాబాద్‌ వారు సర్టిఫికెట్‌ ఇన్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్, ఫైర్‌ ఆఫీసర్‌ కోర్సులను రెగ్యులర్‌ పద్ధతిలో అందిస్తున్నారు.
    ఇవే కాకుండా దూరవిద్యలో డిప్లొమా ఇన్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్‌ హెల్త్, సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్‌ ఫైర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ ఇంజినీరింగ్, అడ్వాన్స్‌ డిప్లొమా ఇన్‌ ఫైర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ ఇంజినీరింగ్, అడ్వాన్స్‌ డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ ఇంజినీరింగ్, ఫైర్‌ అండ్‌ సేఫ్టీలో ఎంబీఏ కోర్సు, పీజీ డిప్లొమా ఇన్‌ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ ఇంజినీరింగ్, పీజీ డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైర్‌ సేఫ్టీ ఇంజినీరింగ్, హైదరాబాద్‌ వారు అందిస్తున్నారు.
    వీటితో పాటు NIFSC, LSOS UK కలిసి అడ్వాన్స్‌ డిప్లొమా ఇన్‌ ఫైర్‌ ప్రివెన్షన్‌ అండ్‌ ప్రొటెక్షన్, అడ్వాన్స్‌ డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ అండ్‌ హైజీన్, మాస్టర్‌  డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ అండ్‌ హైజీన్, ఫైర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సులను అందిస్తున్నాయి. అన్నామలై యూనివర్సిటీ డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ,  డిప్లొమా ఇన్‌ ఇండస్ట్రియల్‌ హైజీన్‌లను దూరవిద్యలో అందిస్తోంది. ఈ కోర్సులు చదివినవారికి కెమికల్, పెట్రోకెమికల్, ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, హెల్త్, ఎన్విరాన్మెంట్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి.- ప్రొ.బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: వేమూరి నరేష్

    Ans:

    స్టాటిస్టిక్స్‌ చదివినవారికి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్‌ రంగాల్లో చాలా ఉద్యోగావకాశాలున్నాయి. రాష్ట్ర స్థాయిలో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్, కేంద్ర స్థాయిలో నేషనల్‌ శాంప్లింగ్‌ సర్వే లాంటి సంస్థల్లో ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. ఇవే కాకుండా, సాప్ట్‌వేర్‌ కోర్సులు నేర్చుకొని ఆ రంగంలోనూ ప్రవేశించవచ్చు.ఎంఎస్‌సీ (స్టాటిస్టిక్స్‌) కోర్సు దూరవిద్యలో ప్రొఫెసర్‌ రామిరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌- ఉస్మానియా యూనివర్సిటీ; సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌- ఆచార్య నాగార్జున యూనివర్సిటీల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి ఎంఎస్‌సీ (స్టాటిస్టిక్స్‌) కోర్సు ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదు. భవిష్యత్తులో అందుబాటులోకి రావొచ్చు. ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ అప్లైడ్‌ స్టాటిస్టిక్స్‌ కోర్సు ఉంది. - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: హరీష్‌ వర్మ

    Ans:

    మీరు బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రో బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, ఇమ్యునాలజీలలో ఏదో ఒకదానిలో పీజీ చేయవచ్చు.  ముందుగా మీరు ఏ సబ్జెక్టులో పీజీ చేయాలనుకొంటున్నారో నిర్ణయించుకోండి. సాధారణంగా అన్ని  విశ్వవిద్యాలయాలూ ఎంట్రన్స్‌ పరీక్షల ద్వారానే ప్రవేశాలను పూర్తి చేస్తున్నాయి. కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ పీహెచ్‌డీ కోర్సు కూడా అందిస్తునాయి. లైఫ్‌ సైన్సెస్‌లో పీజీ చేసినవారికి బోధన, పరిశోధన సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. పీజీ చేశాక బీఈడీ చేసి 11, 12 తరగతులు బోధించే పీజీ టీచర్‌ ఉద్యోగాన్ని పొందవచ్చు. బీఈడీ లేకుండా జూనియర్‌ కళాశాలల్లో బోధన వృత్తిని చేపట్టవచ్చు. నెట్‌ లేదా సెట్‌ లో ఉత్తీర్ణత సాధిస్తే డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా ఉపాధి పొందటానికి వీలుంటుంది. పీహెచ్‌డీ చేసి యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల కోసం, కేంద్రీయ, రాష్ట్రీయ పరిశోధన సంస్థల్లో సైంటిస్ట్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ప్రైవేటు రంగానికొస్తే ఫార్మా, బయోటెక్‌ సంస్థల్లో ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. అగ్రికల్చర్‌లో పీజీ చేయాలంటే డిగ్రీలో అగ్రికల్చర్‌ కచ్చితంగా చదివివుండాలి. మైక్రో బయాలజీ సబ్జెక్టులో పీజీ చేసినవారికి అగ్రికల్చర్‌లో పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది.  - ప్రొ. బి. రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌