Post your question

 

  Asked By: prasanth

  Ans:

  చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ విద్యార్హత సరిపోతుంది. డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదివినప్పటికీ చాలా కేంద్ర/ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలు రాసే అవకాశం ఉంది. బోధన, పరిశోధన, అడ్మినిస్ట్రేషన్‌ లాంటి ప్రత్యేక ఉద్యోగాలకు మాత్రమే  పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ లాంటి ఉన్నత విద్య అవసరం. ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవడం వల్ల పోటీపరీక్షల్లో కచ్చితంగా ఉపయోగం ఉంటుంది. చాలా ఉద్యోగ పోటీ పరీక్షల్లో మెంటల్‌ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ లాంటి అంశాలు ఉంటాయి. మ్యాథ్స్‌లో శిక్షణ పొందినవారికి, ఇతర సబ్జెక్టులు చదివినవారితో పోలిస్తే, ఈ సెక్షన్లలో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇంటర్‌లో హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్‌ చదివిననవారికి జనరల్‌ స్టడీస్‌లో ఎక్కువ మార్కులు వీలుంటుంది.
  కానీ ఇటీవలి పోటీ పరీక్షా ఫలితాలను విశ్లేషిస్తే- మ్యాథ్స్, ఇంజినీరింగ్‌ చదివినవారు కూడా జనరల్‌ స్టడీస్‌లో మెరుగైన ప్రతిభ కనపరుస్తున్నారు. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివితే సమస్యా పరిష్కారంలో మెలకువలు పెరుగుతాయి. లాజికల్‌ రీజనింగ్‌కు సంబంధించిన అంశాలు కూడా బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవడం వల్ల కంప్యూటర్‌ సైన్స్,  స్టాటిస్టిక్స్‌ లాంటి సబ్జెక్టులు చదవడానికి అర్హత ఉంటుంది. గణితంపై పట్టు ఉంటే పోటీ పరీక్షలతో పాటు, విదేశాల్లో విద్య అభ్యసించడానికి అవసరమైన జీఆర్‌ఈ, జీమ్యాట్‌ లాంటి పరీక్షల్లో కూడా రాణించవచ్చు. -
  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌
   

  Asked By: prasanth

  Ans:

  మీకు ఇంటర్మీడియట్‌లో 85 శాతం మార్కులు వచ్చాయి కాబట్టి బీకాంలో అడ్మిషన్‌ తీసుకొని, చార్టెడ్‌ అకౌంటెన్సీ చేయవచ్చు. లేకపోతే బీకాంలో బిజినెస్‌ అనలిటిక్స్, కంప్యూటర్‌కు సంబంధించిన స్పెషలైజేషన్స్‌ ఎంచుకోవచ్చు. బీబీఏలో జనరల్, బ్యాంకింగ్, రిటైలింగ్, సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్‌ బిజినెస్, ఈ-కామర్స్, టూరిజం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి స్పెషలైజేషన్స్‌ కూడా చదవొచ్చు. ఆసక్తి ఉంటే బీఏలో ఇంగ్లిష్‌ లిటరేచర్, సైకాలజీ, జర్నలిజం, ఎకనమిక్స్‌ లాంటి సబ్జెక్టుల గురించి కూడా ఆలోచించవచ్చు. ఇవేకాకుండా, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కానీ ఇంటిగ్రేటెడ్‌ బీకామ్‌ ఎల్‌ఎల్‌బీ/ బీబీఏ ఎల్‌ఎల్‌బీ/ బీఏ ఎల్‌ఎల్‌బీ కూడా చదివే అవకాశం ఉంది. పైన చెప్పిన అన్ని ప్రోగ్రామ్స్‌లో ఉద్యోగావకాశాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైనా ఉద్యోగ ప్రయత్నాల్లో విద్యార్హత పాస్‌పోర్ట్‌ లాంటిది. నైపుణ్యాలు వీసా లాంటివి. నైపుణ్యాలు లేకుండా ఉద్యోగం పొందడం కష్టం. మీరు ఏ డిగ్రీ చదివినా, ఎంఎస్‌ ఎక్సెల్, పైతాన్, స్టాటిస్టిక్స్‌ లాంటి వాటిలో ప్రావీణ్యం ఉంటే, ఉద్యోగా వకాశాలు మెరుగవుతాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: prasanth

  Ans:

  ప్రతి డిగ్రీ పూర్తి చేయడానికి నిర్దిష్ట కాల వ్యవధి ఉంటుంది. యూజీసీ నిబంధనల ప్రకారం- మూడు సంవత్సరాల డిగ్రీని గరిష్ఠంగా ఐదు సంవత్సరాల వ్యవధిలో పూర్తిచేయాలి. కొన్ని యూనివర్శిటీలు కాలపరిమితి విషయంలో కొంత ఉదాసీనంగా ఉంటున్నాయి. మీరు బీఎస్సీ చదివిన యూనివర్శిటీలో గరిష్ఠ వ్యవధి గురించి తెలుసుకోండి. ఒకవేళ పరీక్షలు రాయడానికి వెసులుబాటు ఉన్నా, మీరు 2016లో బీఎస్సీ చివరి సంవత్సరం కాలేజీకి వెళ్లనందున డిగ్రీ పరీక్షలు రాయడం కుదరదు. బీఎస్సీలో ప్రాక్టికల్స్‌ కూడా ఉంటాయి. అందుకని కళాశాలకు వెళ్లడం తప్పనిసరి. మీరు చెబుతున్న పది సబ్జెక్టులు ఫైనల్‌ ఇయర్‌తో కలిపా? మొదటి రెండు సంవత్సరాలకు సంబంధించినవా? ఇప్పుడు మీరు పది సబ్జెక్టులు రాసినా, అన్నింటిలో ఉత్తీర్ణత సాధించడం చాలా కష్టం కాబట్టి, బీఏ పరీక్షలు రాయడం ఉపయోగకరం. మీరు బీఏ డిగ్రీని అయినా మూడు సంవత్సరాల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. ఆసక్తి ఉంటే మీ యూనివర్సిటీ నిబంధనలు అనుమతిస్తే, బీఎస్సీ పూర్తికి ప్రయత్నం చేయవచ్చు. మూడు సంవత్సరాల బీఎస్సీ డిగ్రీని సుదీర్ఘ వ్యవధిలో పూర్తి చేయడం వల్ల ఆ డిగ్రీతో ఉద్యోగం పొందడం కూడా కష్టమవుతుంది. ఉద్యోగం పొందడానికి డిగ్రీ సర్టిఫికెట్‌ అర్హత మాత్రమే. మేటి కొలువులు దక్కాలంటే విద్యార్హతతో పాటు విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు కూడా చాలా ముఖ్యం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: - పి.వైష్ణవి

  Ans:

  ఇంటర్‌ తరువాత ఇంజనీరింగ్‌ కాకుండా చాలా రకాల ప్రోగ్రామ్స్‌ చదివే అవకాశం ఉంది. మీరు ఇంటర్‌లో ఎంపీసీ చదివారు కాబట్టి, డిగ్రీలో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో బీఎస్సీ చదవొచ్చు. మ్యాథ్స్‌తో పాటు ఫిజిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఎకనామిక్స్‌ /స్టాటిస్టిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ జియాలజీ లాంటి కాంబినేషన్లు చదవొచ్చు. ఇవే కాకుండా బీఎస్సీలో డేటా సైన్స్‌లో చేరే అవకాశం ఉంది. మీకు బిజినెస్‌ రంగంపై ఆసక్తి ఉంటే బీబీఏ, బీకాం, జర్నలిజం, టూరిజం లాంటి ప్రోగ్రామ్స్‌ చదవొచ్చు. న్యాయవాద వృత్తిపై ఆసక్తి ఉంటే ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీలో చేరొచ్చు. యూపీఎస్సీ పరీక్షలో లా సబ్జెక్టును కూడా ఒక ఆప్షనల్‌గా ఎంచుకోవచ్చు. సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగానికి ఏ డిగ్రీ చదివినా అర్హులు అవుతారు. కానీ మీరు సివిల్స్‌ పరీక్షలో భవిష్యత్తులో ఎంచుకోబోయే ఆప్షనల్‌ సబ్జెక్టును దృష్టిలో పెట్టుకొని డిగ్రీలో ఆ సబ్జెక్టు చదివే ప్రయత్నం చేయవచ్చు. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, ఆంత్రొపాలజీ, సోషియాలజీ, సైకాలజీ, జియాలజీ, తెలుగు సాహిత్యం, ఇంగ్లిష్, సంస్కృత సాహిత్యం లాంటి వాటి గురించి కూడా ఆలోచించవచ్చు. రాష్ట్రస్థాయి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకూ డిగ్రీ విద్యార్హత సరిపోతుంది. వీటితో పాటు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్, బ్యాంకింగ్‌ లాంటి పలు ఉద్యోగాలకు డిగ్రీ విద్యార్హతతో పోటీపడి విజయం సాధించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: - కె.కార్తీక్‌

  Ans:

  డీఎస్సీ నోటిఫికేషన్‌ రాలేదని బీటెక్‌ చదవడం, బీటెక్‌తో ఉద్యోగం రాలేదని బీఈడీ చేయడం, టీచర్‌ ఉద్యోగం రాలేదని ఎంటెక్‌ చేయడం.. ఇవన్నీ మీకు మంచి కెరియర్‌ని ఇవ్వవు. మీకు ఏ రంగంలో ఆసక్తి ఉంది? ఏ ఉద్యోగం చేస్తే మానసిక/ ఉద్యోగ సంతృప్తి ఉంటుంది? మీకు ఏ రంగంలో నైపుణ్యాలు ఉన్నాయి? మీ దీర్ఘకాలిక/ స్వల్పకాలిక ఆశయాలు ఏమిటి? వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
  మీ ప్రశ్నకొస్తే- మీరు రెండో సెమిస్టర్‌కు ఫీజు కట్టలేదు కాబట్టి, రెండో సెమిస్టర్‌ చదవలేరు. రెండో సెమిస్టర్‌ చదవకుండా మూడో సెమిస్టర్‌/ రెండో సంవత్సరం చదవడం కుదరదు. మీరు బీటెక్‌ మొదటి సంవత్సరంలో ఎన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులు అయ్యారనేది రెండో సెమిస్టర్‌లోకి ప్రమోట్‌ అవుతారా? లేదా? అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. మీరు మొదటి సెమిస్టర్‌ మళ్ళీ చదవాలా? నేరుగా వచ్చే సంవత్సరం మీ జూనియర్స్‌తో రెండో సెమిస్టర్‌లోకి ప్రవేశం పొందవచ్చా? అనేది అడ్మిషన్‌ తీసుకొన్న యూనివర్సిటీ నిబంధనలకు లోబడి ఉంటుంది. యూనివర్సిటీ అధికారులను సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: సుధీర్‌

  Ans:

  ఇంటర్‌ తర్వాత ఏ డిగ్రీ చదవాలి అన్న నిర్ణయానికి ముందు, మీ దీర్ఘకాలిక ఆశయాలు, స్వల్పకాలిక లక్ష్యాలపై స్పష్టత అవసరం. మీరు ఇష్టపడుతున్నది ప్రభుత్వ ఉద్యోగమా? ప్రైవేటు కొలువా? మీకు బోధన రంగంపై ఆసక్తి ఉందా? పరిశోధన అభిరుచి ఉందా? కెమికల్‌/ ఫార్మా పరిశ్రమల్లో పనిచేయడమా? విదేశాల్లో స్థిరపడటమా? మనదేశంలోనే ఉండటమా? అనే విషయాలకు సమాధానం తెలుసుకోండి. కెమిస్ట్రీ ప్రధానంగా డిగ్రీ చదివితే ఉద్యోగావకాశాలు ఎక్కువగా లేవు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, పీహెచ్‌డీ కెమిస్ట్రీ చదివితే జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థల్లో, ఫార్మా, కెమికల్‌ పరిశ్రమల్లో శాస్త్రవేత్తగా, విశ్వవిద్యాలయాలూ కళాశాలల్లో అధ్యాపకులుగా స్థిరపడవచ్చు. కెమికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చదివితే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో కెమికల్‌ ఇంజినీర్‌గా, పెట్రోలియం ఇంజినీర్‌గా, అనలిటికల్‌ కెమిస్ట్‌గా, క్వాలిటీ ఇంజినీర్‌గా ఉద్యోగావకాశాలుంటాయి. కెమికల్‌ ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ చేసి జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థల్లో, ఫార్మా, కెమికల్‌ పరిశ్రమల్లో శాస్త్రవేత్తగా, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అధ్యాపకులుగా స్థిరపడవచ్చు. కెమిస్ట్రీలో, కెమికల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసినవారికి మనదేశంలో కంటే, విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువ. కానీ విదేశాల్లో కూడా ఉద్యోగాలకు పోటీ పెరిగిపోయింది. ఏదేశంలో అయినా మంచి ఉద్యోగంలో స్థిరపడాలంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశం, విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు పెంపొందించుకోవటం అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

  Asked By: ఎస్‌.నర్సింగ్‌

  Ans:

  కామర్స్, ఆర్ట్స్‌లో ఏది మెరుగు అంటే, చెప్పడం చాలా కష్టం. ఏ కోర్సుకు అదే మెరుగు. ప్రతి డిగ్రీకీ మెరుగైన ఉన్నత విద్యా, ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఉపాధి అవకాశాలు కోర్సును బట్టి కాకుండా, ఆ డిగ్రీ చదివే వ్యక్తిపై, ఆ డిగ్రీ అందిస్తున్న విద్యాసంస్థపై కూడా ఆధారపడి ఉంటాయి. మీ అమ్మాయిని ఇంటర్‌లో కామర్స్‌లో చేర్చినప్పుడు ఏ ఉద్దేశంతో చేర్చారు? అది ఆమె నిర్ణయమా? మీ నిర్ణయమా? మీ అమ్మాయి ఇంటర్‌లో కామర్స్‌ని ఎలా చదివింది? ఇప్పుడు ఆర్ట్స్‌లోకి వెళ్ళడానికి కారణం ఏంటి? కామర్స్‌ మీద ఆసక్తి లేకా? ఆర్ట్స్‌పై ఆసక్తి ఉండా? మెరుగైన ఉపాధి అవకాశాల కోసమా? ఈ విషయాలపై స్పష్టత ఉంటే కానీ, మీ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. మీ అమ్మాయి స్వల్పకాలిక/ దీర్ఘకాలిక ఆశయాలు, ఆసక్తి, అభిరుచి, పట్టుదల, కష్టపడే తత్వం, నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం, కుటుంబ ఆర్థిక స్తోమత, కుటుంబ సహకారం లాంటి చాలా అంశాలు కెరియర్‌ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. బీకాం చదివినా, బీఏ చదివినా, డిగ్రీతో ఉన్న అన్ని కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వరంగ ఉద్యోగాలకూ సమాన అర్హత ఉంటుంది. అకౌంట్స్‌ ఆఫీసర్‌ లాంటి కొన్ని ఉద్యోగాలకు మాత్రం కామర్స్‌ చదివినవారు మాత్రమే అర్హులవుతారు. బీఏ, బీకాం డిగ్రీలతో బీఈడీ, పీజీలు చేయవచ్చు. ప్రైవేటు రంగంలో ఆర్ట్స్‌ చదివినవారి కంటే కామర్స్‌ చదివినవారికి కొన్ని ఉద్యోగావకాశాలు అదనంగా ఉంటున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: లావణ్య

  Ans:

  సాధారణంగా స్టాటిస్టిక్స్‌ కోర్సును డిగ్రీలో మ్యాథమెటిక్స్‌తో కలిపి చదివే అవకాశం ఉంది. బీఎస్సీలో మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ కానీ, మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్‌ కాంబినేషన్‌లో కానీ చదవొచ్చు. బీఏలో మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌ కాంబినేషన్‌ ఉంది. మీరు ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవలేదు కాబట్టి, ప్రస్తుత పరిస్థితుల్లో పైన చెప్పిన కాంబినేషన్లతో డిగ్రీ చేసే వీలు లేదు. జాతీయ విద్యావిధానం - 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక ఇలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరైనా ఏ కోర్సులైనా చదివే వెసులుబాటు ఉంటుంది. కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు ఇప్పటికే నూతన విద్యావిధానాన్ని అమలు చేయడం మొదలు పెట్టాయి. కాబట్టి, ఇంటర్‌లో మ్యాథ్స్‌ లేకుండా, డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ కాంబినేషన్‌ ఉన్న డిగ్రీ ప్రోగ్రాంలో చేరే ప్రయత్నం చేయండి. డిగ్రీ మొదటి సంవత్సరంలో మ్యాథ్స్‌ ఫౌండేషన్‌ కోర్సులు చేయాల్సిన అవసరం ఉంటుంది.
  మీకు స్టాటిస్టిక్స్‌ చదవాలన్న కోరిక బలంగా ఉంటే, ఇంటర్‌ రెండు సంవత్సరాల మ్యాథ్స్‌ సబ్జెక్టులను ఇప్పుడు పూర్తి చేసి, డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ కోర్సును మ్యాథ్స్‌ కాంబినేషన్‌లో చదవండి. అలా వీలు కాకపోతే బీకాంలోనే స్టాటిస్టిక్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివే ప్రయత్నం చేయండి. మీకు కంప్యూటర్‌ రంగంపై ఆసక్తి ఉందనుకోండి- బీకాం కంప్యూటర్స్‌ కోర్సు చదివితే, కంప్యూటర్స్‌తో పాటు స్టాటిస్టిక్స్‌ కోర్సును ఒక సబ్జెక్ట్‌గా చదవొచ్చు. స్టాటిస్టిక్స్‌ అప్లికేషన్స్‌పై ఆసక్తి ఉంటే, బీకాం/ బీబీఏలో బిజినెస్‌ అనలిటిక్స్‌/ డేటా సైన్స్‌ చదివే వీలుంటుంది. స్టాటిస్టిక్స్, డేటా సైన్స్, అనలిటిక్స్‌ కోర్సుల్లో రాణించాలంటే- మ్యాథ్స్‌పై గట్టి పట్టు ఉండాలి. మీరు డిగ్రీ చదువుతూనే స్వయం, ఎన్‌పీటెల్, కోర్స్‌ ఎరా, ఎడెక్స్, యుడెమి లాంటి ఆన్‌లైన్‌ వేదికల్లో స్టాటిస్టిక్స్‌ కోర్సులు చేయవచ్చు. -
  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: అక్రం షేక్‌

  Ans:

  సాధారణంగా ఏదైనా విశ్వవిద్యాలయంలో ఒక ప్రోగ్రాం పూర్తి చేయడానికి కనిష్ఠ, గరిష్ఠ కాల పరిమితులు ఆ యూనివర్సిటీల నిబంధనల ప్రకారం నిర్దేశించి ఉంటాయి. ఉదాహరణకు.. బీఏ/ బీఎస్సీ/ బీకాం డిగ్రీ కోర్సును కనిష్ఠంగా మూడు ఏళ్ల వ్యవధిలో పూర్తి చేయాలి. గరిష్ఠ వ్యవధి విషయానికొస్తే, ఒక్కో యూనివర్సిటీ ఒక్కో కాల పరిమితిని నిర్ణయిస్తోంది. చాలా యూనివర్సిటీలు డిగ్రీకి గరిష్ఠ పరిమితిని 5 సంవత్సరాలుగా, కొన్ని మాత్రం 6 సంవత్సరాలుగా నిర్ణయించాయి. కాకతీయ యూనివర్సిటీలో మూడేళ్ల డిగ్రీని ఆరేళ్లలో పూర్తిచేయాలి. మీరు 2014లో బీకాంలో చేరారు కాబట్టి, 2020 లోగా పూర్తి చేయాల్సింది. మీరు డిగ్రీ చదివినప్పుడు సంవత్సరాంత పరీక్షలు ఉన్నాయి. 2015/ 2016 తరువాత దేశంలో దాదాపు అన్ని యూనివర్సిటీలూ సెమిస్టర్‌ విధానంలోకి మారిపోయాయి. అందుకని మీరిప్పుడు బీకాం డిగ్రీని కొనసాగించలేరు. ఒకవేళ కాకతీయ యూనివర్సిటీ భవిష్యత్తులో ఎప్పుడైనా డిగ్రీ పూర్తి చేయడానికి ఒకే ఒక్క అవకాశం ఇచ్చినా, మీకు చాలా బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయి కాబట్టి, ఒకేసారి అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత కష్టం అవుతుంది. ఓపెన్‌ యూనివర్సిటీలో మరో డిగ్రీ చదవడానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కాకతీయ యూనివర్సిటీ అధికారులను సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: వేదప్రకాశ్‌

  Ans:

  కంప్యూటర్‌ రంగంలో పరిజ్ఞానం పెంపొందించుకోవాలనుకుంటే బీఎస్సీ కానీ, బీసీఏ కానీ, బీకాం (కంప్యూటర్స్‌) కానీ చదవొచ్చు. బీఎస్సీలో కంప్యూటర్‌ కోర్సును మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ స్టాటిస్టిక్స్‌ లాంటి మరో రెండు సబ్జెక్టులతో కలిపి చదువుతారు. బీకాంలో కామర్స్‌ సబ్జెక్టులతో పాటు కంప్యూటర్స్‌ కూడా చదువుతారు. బీసీఏలో అయితే మూడు సంవత్సరాల పాటు కంప్యూటర్స్‌ సంబంధిత కోర్సులు మాత్రమే చదువుతారు. కాబట్టి బీసీఏ చదివినవారికి కంప్యూటర్స్‌/ సాఫ్ట్‌వేర్‌ పరిజ్ఞానం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రెండు ప్రోగ్రాంల భవిష్యత్తు విషయానికొస్తే బీఎస్సీ (కంప్యూటర్స్‌) డిగ్రీతో వెంటనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు తక్కువ. ఆ తరువాత ఎంసీఏ కానీ, ఎమ్మెస్సీ (కంప్యూటర్స్‌/ డేటా సైన్స్‌) కానీ చేయాలి. బీసీఏ చదివితే మీ నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం ఆధారంగా వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశాలుంటాయి.
  బీఎస్సీ చదివినా, బీసీఏ చదివినా, ఎంసీఏ, ఎంబీఏ - జనరల్, ఎంబీఏ - బిజినెస్‌ అనలిటిక్స్‌ లాంటి కోర్సుల్లో చేరవచ్చు. మీ దీర్ఘకాలిక ఆశయాలను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. బీటెక్‌ - కంప్యూటర్‌ సైన్స్‌ చదివేవారి సంఖ్య ఎక్కువ అవ్వడం వల్ల బీసీఏ ప్రోగ్రాంకు కొంత ఆదరణ తగ్గింది. అయినప్పటికీ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు మెరుగుపర్చుకొంటే సాఫ్ట్‌వేర్‌ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. చివరిగా ప్రతి డిగ్రీకీ ఉద్యోగావకాశాలు బాగానే ఉంటాయి. కానీ ఉద్యోగం రావడం అనేది అభ్యర్థి ప్రతిభ, నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం, సమస్యా పరిష్కార సామర్థ్యం, భావప్రకటన లాంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌