Post your question

 

  Asked By: వంశీకృష్ణ

  Ans:

  సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి ప్రవేశించేముందు మీరు కంప్యూటర్‌ రంగానికి సంబంధించిన ప్రాథమిక అంశాలైన ఆపరేటింగ్‌ సిస్టమ్, కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్, డేటా స్ట్రక్చర్స్, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్, కోడింగ్‌లతో పాటు ఎంఎస్‌ ఆఫీస్‌పై పట్టు సాధించాలి. బీకాం చదివినవారు సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి ప్రవేశించాలంటే చాలా రకాల కోర్సులు చదివే అవకాశం ఉంది. వాటిలో ముఖ్యంగా- బిజినెస్‌ అనలిటిక్స్, డేటా సైన్స్, మెషిన్‌ లెర్నింగ్, ఎస్‌క్యూఎల్‌ డీబీఏ, సిక్స్‌ సిగ్మా, డిజిటల్‌ మార్కెటింగ్, వెబ్‌ డిజైనింగ్, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, గ్రాఫిక్‌ డిజైన్, హార్డ్‌వేర్‌ అండ్‌ నెట్‌ వర్కింగ్, వీఎఫ్‌ఎక్స్‌ అండ్‌ యానిమేషన్, ఐఓఎస్‌ డెవలప్‌మెంట్, ఎస్‌ఏపీ, ఈఆర్‌పీ లాంటి వాటికి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు వివిధ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ కూడా నేర్చుకొని ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. పైన పేర్కొన్నవాటిల్లో నచ్చిన కోర్సు ఎంచుకని, కనీసం ఒక సంవత్సరం పాటు కృషి చేస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: ఎస్‌.రవిశంకర్‌

  Ans:

  మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీలో మీరు ఆపరేషన్స్‌ ఇంజనీర్‌గా పనిచేసిన కాలంలో మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్, క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ లాంటి వివిధ అంశాలపై అవగాహన పొంది ఉంటారు. ఇప్పుడు మీరు సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌సీఎం) రంగంలోకి వెళ్లాలనుకోవడం సరైన నిర్ణయమే. ఎస్‌సీఎంకు సంబంధించిన ప్రొక్యూర్‌మెంట్, వేర్‌ హౌసింగ్, రవాణా, పంపిణీ లాంటి వివిధ విభాగాలతో మీరు పరోక్షంగా పనిచేస్తూనే ఉండివుంటారు. ఈ రంగాలతో ఉన్న పరిచయం, ప్రావీణ్యం మీరు మెరుగైన సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్‌గా రూపుదిద్దుకోవడానికి    తోడ్పడతాయి. 
  సర్టిఫికేషన్‌ కోర్సుల విషయానికొస్తే- ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎంఐటీ, మిషిగన్‌ యూనివర్సిటీలు సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌లో వివిధ కోర్సులు అందిస్తున్నాయి. అమెరికన్‌ ప్రొడక్షన్‌ అండ్‌ ఇన్వెంటరీ కంట్రోల్‌ సొసైటీ (ఏపీఐసీఎస్‌).. సర్టిఫైడ్‌ సప్లై చైన్‌ ప్రొఫెషనల్‌ (సీఎస్‌సీపీ) కోర్సునూ, అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌.. సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ ఇన్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ (సీపీఎల్‌ఎస్‌)నూ, ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌.. సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ ఇన్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ (సీపీఎస్‌ఎం)నూ అందిస్తున్నాయి. వీటితో పాటు కోర్స్‌ ఎరా, ఎడెక్స్, యుడెమీ, ఎన్‌పీటెల్,  స్వయం లాంటి ఆన్‌లైన్‌ అభ్యాస వేదికల్లో కూడా ఈ కోర్సులు చేసే అవకాశం ఉంది.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: జి. జ్యోతి

  Ans:

  ఈ సందేహం మీలాంటి చాలామంది విద్యార్థులకూ, తల్లిదండ్రులకూ చాలా సందర్భాల్లో కలిగేదే! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ/ కృత్రిమ మేధ) అంటే మనుషులకు ఉన్న మేధా సామర్థ్యముండే యంత్రాలను అభివృద్ధి చేసే కోర్సు. రోబోటిక్స్‌ అంటే ఆటోమేషన్, ఇన్నోవేషన్‌లను మెరుగుపరిచే డిజైన్లను చేసి, రోబోలను తయారుచేసే శాస్త్రం. ఈ రెంటి మధ్యా మరో ముఖ్యమైన తేడా ఉంది. రోబోటిక్స్‌లో సొంతంగా కదులుతూ, పరిసరాలతో సంబంధాలు పెట్టుకోగలిగే యంత్రాలను తయారుచేసే విధానాలు నేర్చుకుంటారు. ఏఐలో డేటా ప్రాసెసింగ్, అల్గారిథమ్స్‌ డిజైన్‌ గురించి నేర్చుకుంటారు. పునరావృతమయ్యే సూచనలను అనుసరించి రోబోలు వివిధ రంగాల్లో ఉత్పాదకతను మెరుగుపర్చేలా ప్రోగ్రామ్‌ చేస్తారు. ఏఐని కూడా వివిధ సందర్భాల్లో ఉపయోగించగలిగినప్పటికీ, ఇది రోబో కంటే మరింత చలనశీలంగా (డైనమిక్‌) ఉంటుంది. ఈ తేడాలను పక్కన పెడితే, ఈ రెండు కోర్సులూ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. రోబోల పనితీరును మెరుగుపరచడానికి కృత్రిమ మేధ ఉపయోగపడుతుంది. ఇవి రెండూ ఆటోమేషన్, డేటా అనాలిసిస్, డెసిషన్‌ మేకింగ్‌ లాంటి క్లిష్టమైన పనుల్ని సులభతరం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ రెండింటితో పాటు మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సుకు కూడా ఉన్నత విద్య, ఉపాధి, పరిశోధనావకాశాలు ఉన్నాయి. మీ అభిరుచి, ఆసక్తులను బట్టి సరైన కోర్సును ఎంచుకోండి. దీంతోపాటుగా ఆ కోర్సును సరిగా అర్థం చేసుకుని చదవడం, చదివిన విషయాల్ని ప్రాక్టికల్‌గా ఎలా ఉపయోగించాలో తెలియడం కూడా చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: ఇబ్రహీం

  Ans:

  మీరు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివి ఉద్యోగం చేస్తున్నానన్నారు కానీ, ఎలాంటి ఉద్యోగమో, ఏ సంస్థలో చేస్తున్నారో చెప్పలేదు. ఒకవేళ మీరు అదే సంస్థలో ఉద్యోగం కొనసాగించాలంటే ఆ ఉద్యోగానికీ, సంస్థకూ ఉపయోగపడే కోర్సులు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాకాకుండా మీకు ఉద్యోగం మారాలన్న ఆసక్తి ఉంటే, ఎలాంటి ఉద్యోగానికి మారాలనుకొంటున్నారనే అంశంపై మీరు చేయాల్సిన షార్ట్‌ టర్మ్‌ కోర్సులు ఆధారపడి ఉంటాయి. సాధారణంగా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారు ఆటో క్యాడ్, మాన్యుఫాక్చరింగ్, రోబోటిక్స్, టూల్‌ డిజైన్, మెకట్రానిక్స్, నానో టెక్నాలజీ, త్రీ డీ ప్రింటింగ్, మెషినింగ్, మిల్లింగ్, టర్నింగ్, ప్రొడక్ట్‌ డిజైన్‌ అండ్‌ అనాలిసిస్‌ లాంటి కోర్సులు చేయొచ్చు. మీకు డేటా సైన్స్‌ రంగంలోకి వెళ్ళే ఆసక్తి ఉంటే, అడ్వాన్స్‌డ్‌ ఎక్సెల్, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్, మెషిన్‌ లెర్నింగ్, డేటా విజువలైజేషన్‌ లాంటి కోర్సులు చేయాలి. పైన చెప్పిన వాటిలో మీ కెరియర్‌కు ఉపయోగపడేవాటిని చేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: మాలతి

  Ans:

  సాధారణంగా ప్రైవేటు ఉద్యోగం చేయడానికి వయసుతో పనిలేదు కానీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి ఎక్కువ వయసు కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసిన ఈ 15 ఏళ్లలో అన్ని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. మీరు ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్‌ చేసి, ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ వైపు వెళ్దామనుకొంటున్నారు కాబట్టి, మరోసారి మీ ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలను పునశ్చరణ చేసుకోండి. సాఫ్ట్‌వేర్‌లో ఏ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి. అందుకోసం కొన్ని ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లు నేర్చుకోవాలి. ఆ తరువాత ఏదైనా సాఫ్ట్‌వేర్‌ శిక్షణ సంస్థలో చేరి ప్రస్తుతం బాగా డిమాండ్‌ ఉన్న కోర్సులను నేర్చుకొనే ప్రయత్నం చేయండి. మొదటే ప్రముఖ సంస్థలో కాకుండా, ఏదైనా చిన్న సంస్థలో ఉద్యోగం చేసి కొంత అనుభవం గడించండి. టీసీఎస్, పలు సంస్థలు మీలాంటి వారికోసం సెకండ్‌ కెరియర్‌ అనే అవకాశాల్ని కల్పిస్తున్నాయి. కుటుంబ కారణాల వల్ల విరామం తీసుకున్న మహిళలకు 40 సంవత్సరాల పైవయసులోనూ వివిధ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. కాకపోతే, ఉద్యోగానుభవం మాత్రం తప్పనిసరి. అదేవిధంగా అమెజాన్, డెలాయిట్, గోల్డ్‌ మ్యాన్‌ సాచ్‌ ఇండియా, ఐబీఎం ఇండియా, ఎస్‌ఏపీ ఇండియా లాంటి సంస్థలు కూడా వయసుతో సంబంధం లేకుండా ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగా మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. వీటిలో కొన్ని సంస్థలు ముందుగా ఇంటర్న్‌షిప్‌ ఇచ్చి, ఆ తరువాత ఉద్యోగంలోకి తీసుకొంటున్నాయి. మీకు ఆసక్తి, అవకాశం ఉంటే, డేటా సైన్స్‌/ అనలిటిక్స్‌లో పీజీ చేసి కూడా సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: ఎస్‌.రవిశంకర్‌

  Ans:

  మీరు బీబీఏ రెగ్యులర్‌గా చేస్తున్నారా, ఓపెన్‌/ డిస్టెన్స్‌/ ఆన్‌లైన్‌ పద్ధతిలో చేస్తున్నారా అనేది చెప్పలేదు. ఒకవేళ మీరు బీబీఏ రెగ్యులర్‌గా ఏదైనా బిజినెస్‌ స్కూల్లో చదువుతూ ఉంటే, మీకున్న పని అనుభవంతో క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. మీరు బీబీఏలో ఏ స్పెషలైజేషన్‌ తీసుకున్నారో కూడా చెప్పలేదు. మీరింకా బీబీఏ స్పెషలైజేషన్‌ గురించి నిర్ణయం తీసుకోకపోతే ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌/ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్‌ / సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌/ బిజినెస్‌ అనలిటిక్స్‌/ డేటా సైన్స్‌ గురించి ఆలోచించండి.
  ఎంబీఏ విషయానికొస్తే-  క్యాట్‌ రాసి ఐఐఎం లాంటి ప్రముఖ విద్యాసంస్థలనుంచి రెగ్యులర్‌ ఎంబీఏ చేసే ప్రయత్నం చేయండి. రెగ్యులర్‌ ఎంబీఏ చేసే అవకాశం లేకపోతే మంచి బిజినెస్‌ స్కూల్‌ నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ చేయొచ్చు. ఆపరేషన్స్, మాన్యుఫాక్చరింగ్‌ రంగంలో మీకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంబీఏలో ఆపరేషన్స్‌/ లాజిస్టిక్స్‌/ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి స్పెషలైజేషన్‌లను చదివే ప్రయత్నం చేయండి. రెండో స్పెషలైజేషన్‌గా బిజినెస్‌ అనలిటిక్స్‌/ డేటా సైన్స్‌ చదివితే మీ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: సుధాకర్‌

  Ans:

  ఇంజినీరింగ్‌ చేయాలని ఎంపీసీ గ్రూప్‌ తీసుకోవడం సరైన నిర్ణయమే! కానీ మ్యాథ్స్‌ అంటే భయం అంటున్నారు. ఈ భయం ఎప్పటినుంచి ఉంది? మీకు పదో తరగతిలో మ్యాథ్స్‌లో ఎన్ని మార్కులు వచ్చాయి? హైస్కూల్‌లో మ్యాథ్స్‌ టీచర్‌ సరిగా చెప్పకపోవడం వల్ల కానీ, కుటుంబంలో అక్క/అన్న మ్యాథ్స్‌లో ఫెయిల్‌ అవ్వడం వల్ల కానీ ఇలాంటి భయాలు మొదలవుతాయి. తోటి మిత్రులు అదే పనిగా మ్యాథ్స్‌ పట్ల భయం కలిగే మాటలు చెప్పడం వల్లనో, ఇప్పుడు ఇంటర్లో మ్యాథ్స్‌ లెక్చరర్‌ సరిగా చెప్పకపోవడం వల్లనో కూడా ఇలా జరగొచ్చు.
  నాకు తెలిసిన ఒక విద్యార్థి మీలాగే మ్యాథ్స్‌ అంటే భయపడి ఇంటర్‌లో దాన్ని వద్దనుకొని బైపీసీ చదివి, మెడికల్‌ ఎంట్రెన్స్‌లో విఫలమయ్యాడు. తరువాత ఇంటర్‌లో ఉన్న నాలుగు మ్యాథ్స్‌ పేపర్లను ప్రైవేటుగా రాసి ఎంసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. యూఎస్‌లో ఎమ్మెస్‌ చేసి, ప్రస్తుతం అక్కడే ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పెద్ద హోదాలో పనిచేస్తున్నాడు. మీరు కూడా మ్యాథ్స్‌పై భయం పోగొట్టుకొని, ఇంటర్‌ పూర్తిచేసి, మంచి కాలేజీలో మ్యాథ్స్‌తో ఎక్కువగా అవసరం లేని బ్రాంచితో ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ, మీరు ఇప్పుడు ఎంపీసీ గ్రూపు నుంచి వేరే గ్రూపునకు మారినా, భవిష్యత్తులో మీరు రాయబోయే ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల్లో అరిథ్‌మెటిక్‌/ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ లాజికల్‌ రీజనింగ్‌/ డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ లాంటి సబ్జెక్టులకు మ్యాథ్స్‌లో ప్రాథమిక పరిజ్ఞానం చాలా అవసరం. ఇంజినీరింగ్‌ చదవడం కోసం కాకపోయినా భవిష్యత్తులో మెరుగైన ప్రభుత్వ ఉద్యోగం పొందడం కోసమైనా ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవడం ఉపయోగకరంగా ఉంటుంది. అవసరమైతే మ్యాథ్స్‌కు ట్యూషన్‌కు వెళ్లండి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: prasanth

  Ans:

  మీ అబ్బాయి తన కెరియర్‌ గురించి ఈ పాటికే ఒక నిర్ణయం తీసుకొనివుంటాడు. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక కూడా తల్లిదండ్రులు, బంధువులు కెరియర్‌ను నిర్ణయించడం శ్రేయస్కరం కాదు. ఎంటెక్‌ చేయాలా, ఎంబీఏ చేయాలా, ఎంబీఏ చేస్తే ఇండియా లోనా, విదేశాల్లోనా అనేవి అతనికే వదిలివేయడం మంచిది. తల్లిదండ్రులుగా అన్ని అవకాశాల్లో ఉన్న సాధకబాధకాలు చర్చించి నిర్ణయం మాత్రం తననే తీసుకోనివ్వండి.
  ఐసెట్‌లో మంచి ర్యాంకు వస్తే రాష్ట్రంలో ఉన్న మంచి ఎంబీఏ కాలేజీల్లో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. టిస్‌నెట్‌లో మెరుగైన ప్రతిభ కనపరిస్తే టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. క్యాట్‌లో మంచి స్కోరు పొందితే ఐఐఎంల్లో, దేశంలో ఉన్న కొన్ని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశం పొందవచ్చు. కొన్ని ప్రైవేటు బిజినెస్‌ స్కూల్స్‌ ప్రత్యేక ప్రవేశపరీక్షలు తామే నిర్వహించి ఎంబీఏ కోర్సులో అడ్మిషన్లు చేపడుతున్నాయి.
  విదేశాల్లో ఎంబీఏ విషయానికొస్తే జీమ్యాట్‌ తోపాటు టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌లో మంచి స్కోరు పొంది, ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశానికి ప్రయత్నాలు చేయవచ్చు. సాధారణంగా విదేశాల్లో ఎంబీఏ చేయడానికి కనీసం రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండటం మంచిది. ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ చదవాలంటే కనీసం కోటి రూపాయలు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: ఎస్‌.పద్మ

  Ans:

  మీ అబ్బాయి తన కెరియర్‌ గురించి ఈ పాటికే ఒక నిర్ణయం తీసుకొనివుంటాడు. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక కూడా తల్లిదండ్రులు, బంధువులు కెరియర్‌ను నిర్ణయించడం శ్రేయస్కరం కాదు. ఎంటెక్‌ చేయాలా, ఎంబీఏ చేయాలా, ఎంబీఏ చేస్తే ఇండియా లోనా, విదేశాల్లోనా అనేవి అతనికే వదిలివేయడం మంచిది. తల్లిదండ్రులుగా అన్ని అవకాశాల్లో ఉన్న సాధకబాధకాలు చర్చించి నిర్ణయం మాత్రం తననే తీసుకోనివ్వండి.

  ఐసెట్‌లో మంచి ర్యాంకు వస్తే రాష్ట్రంలో ఉన్న మంచి ఎంబీఏ కాలేజీల్లో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. టిస్‌నెట్‌లో మెరుగైన ప్రతిభ కనపరిస్తే టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. క్యాట్‌లో మంచి స్కోరు పొందితే ఐఐఎంల్లో, దేశంలో ఉన్న కొన్ని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశం పొందవచ్చు. కొన్ని ప్రైవేటు బిజినెస్‌ స్కూల్స్‌ ప్రత్యేక ప్రవేశపరీక్షలు తామే నిర్వహించి ఎంబీఏ కోర్సులో అడ్మిషన్లు చేపడుతున్నాయి.  విదేశాల్లో ఎంబీఏ విషయానికొస్తే జీమ్యాట్‌ తోపాటు టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌లో మంచి స్కోరు పొంది, ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశానికి ప్రయత్నాలు చేయవచ్చు. సాధారణంగా విదేశాల్లో ఎంబీఏ చేయడానికి కనీసం రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండటం మంచిది. ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ చదవాలంటే కనీసం కోటి రూపాయలు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం  తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: పి.హరితేజ

  Ans:

  ఇంజినీరింగ్‌లో ఈసీఈ చదువుతూ సీ‡ఎస్‌ఈ విద్యార్థిలా కోడింగ్‌ చేయగలగడం పెద్ద కష్టమేమీ కాదు. ముందుగా ఈ రెండు బ్రాంచ్‌ల సిలబస్‌ పరిశీలించండి. రెండిటిలో కామన్‌గా ఉన్న సబ్జెక్టులను ఎలాగూ మీరు చదువుతారు. సీఎస్‌ఈలో కోడింగ్‌కి సంబంధించిన సబ్జెక్టులు ఏమున్నాయో తెలుసుకొని వాటిని నేర్చుకొనే ప్రయత్నం చేయండి. ముందుగా ఎంఎస్‌ ఎక్సెల్, సీ, సీ ప్లస్‌ ప్లస్, ఆర్, జావా, పైతాన్‌ ప్రోగ్రామింగ్‌లను నేర్చుకోవడం మొదలుపెట్టండి. తరువాత వెబ్‌ డెవలప్‌మెంట్‌ లాంటి కోర్సులను కూడా చేయండి. వీటితో పాటు కోర్స్‌ఎరా, యుడెమి, ఎడెక్స్, ఉడాసిటీ, ఖాన్‌ అకాడెమీ, స్వయం, ఎన్‌పీటెల్‌తో పాటు కోడింగ్‌కి సంబంధించిన  ప్రత్యేక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల నుంచి సరైన కోర్సులు చేయండి. కోడింగ్‌ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈసీఈ కోర్సును నిర్లక్ష్యం చేయకండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌