Post your question

 

    Asked By: బి.హరిహర్‌

    Ans:

    ఇంజినీరింగ్‌ చదువుతూనే స్పానిష్‌ భాష నేర్చుకోవాలని అనుకోవడం అభినందనీయం. కనీసం ఒక విదేశీ భాషలో ప్రావీణ్యం సాధిస్తే మీ అంతర్జాతీయ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. చాలా విదేశీ భాషలను ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా నేర్చుకొనే అవకాశం ఉంది. స్పానిష్‌ భాషను యుడెమి, కోర్స్‌ ఎరా, ఎడ్‌ఎక్స్‌ల ద్వారా నేర్చుకోవచ్చు. ఇవే కాకుండా ప్రాక్టికల్‌ స్పానిష్‌ ఆన్‌లైన్, డుయో లింగో, మెమ్రైస్, బుసూ, ది ఓపెన్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్, ఆన్‌లైన్‌ ఫ్రీ స్పానిష్, బటర్‌ఫ్లై స్పానిష్, ఫ్లూయెంటూ, లోయెక్సన్, ఫ్యూచర్‌ లెర్న్, బాబ్బెల్, అలీసన్, స్టడీ స్పానిష్‌ డాట్‌ కామ్, ఎడ్యూరెవ్, ఎఫ్‌ఎస్‌ఐ స్పానిష్‌ ఇలా ఎన్నో వేదికలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన వెబ్‌సైట్‌ నుంచి స్పానిష్‌ భాషను నేర్చుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: ఎస్‌.మోహన్‌మౌళి

    Ans:

    ఇంజినీరింగ్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌గానే చదవాలి. ఇలాంటి కోర్సుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు ప్రాక్టికల్‌ నైపుణ్యాలు కూడా చాలా అవసరం. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్‌ కోర్సును దూరవిద్య ద్వారా చదవడం కుదరదు. కానీ, మీరు ఈవినింగ్‌ కళాశాలలో మూడు సంవత్సరాల ఇంజినీరింగ్‌ కోర్సును రెగ్యులర్‌గా చదివే అవకాశం ఉంది. కొన్ని యూనివర్సిటీలు మాత్రం సాయంకాలం బదులు శని/ ఆదివారాల్లో తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ వారి ఏఎంఐఈ (అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ద ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌) / ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్స్‌ ఇంజినీర్స్‌ (ఐఈటీఈ) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే, ఆ సర్టిఫికెట్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీకి సమానం అవుతుంది. కాకపోతే, ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో ఇంజినీరింగ్‌ కోర్సును కూడా ఆన్‌లైన్‌ పద్ధతిలో చదివే అవకాశాలు రావచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి.అశోక్, గోధుర్‌ (జగిత్యాల జిల్లా)

    Ans:

    ఏడో తరగతి చదువుతున్న మీ మనవడిని ఇప్పటినుంచే అంత పెద్ద లక్ష్యానికి సిద్ధం చేయాల్సిన అవసరం లేదు. పిల్లల్ని ఐఐటీ పేరుతోనో, నీట్, సివిల్స్‌ అనో వయసుకి మించిన బరువులు పెట్టడం వల్ల వాళ్ళు జీవితంలో విపరీతమైన ఒత్తిడికి గురి అవుతూ ఇబ్బందులు పడుతున్నారు. కనీసం పదో తరగతి పూర్తి అయ్యేవరకు ఇలాంటి ఒత్తిళ్లకు గురి చేయకుండా వారు తరగతి పుస్తకాలను పూర్తిగా అర్థం చేసుకొని, ఇష్టంగా చదివేలా ప్రోత్సహించండి. చదువుతో పాటు మానసిక, శారీరక అభివృద్ధికి కావాల్సిన వాతావరణం ఉండేలా చూడండి. ఐఏఎస్‌ ఆఫీసర్‌ అవ్వాలన్నా, శాస్త్రవేత్త అవ్వాలన్నా, మరే ఉద్యోగం పొందాలన్నా హైస్కూల్లో చదివే సబ్జెక్టులపై గట్టి పట్టు ఉండాలి. భవిష్యత్తులో వారి చదువులకూ, రాయబోయే పోటీ పరీక్షలకూ హైస్కూల్‌ విద్య పునాది లాంటిది. సివిల్‌ సర్వీసెస్‌ లాంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే విషయ పరిజ్ఞానం, సమస్యా పరిష్కార నైపుణ్యాలు, శాస్త్రీయ విశ్లేషణ, సృజనాత్మకత, భావప్రకటన సామర్థ్యం, సమాజంపై అవగాహన, సరైన నిర్ణయాలు తీసుకునే నేర్పు, నాయకత్వ లక్షణాలు చాలా అవసరం. ఇవన్నీ పాఠశాల విద్యలోనే నేర్చుకొనే అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ వార్తా పత్రికలను చదువుతూ జాతీయ, అంతర్జాతీయ అంశాలపై క్రమంగా అవగాహన పొందటం ముఖ్యం. ప్రస్తుతం తన చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టేందుకు అనువైన పరిస్థితుల్ని కల్పించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: అభిరామ్‌

    Ans:

    మీకు చదరంగ క్రీడాకారుడిగా రాణించాలన్న ఆసక్తి ఉంటే, ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ వెబ్‌సైట్‌కి  వెళ్ళి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. తర్వాత ఆ వెబ్‌సైట్‌ నుంచి చెస్‌ టోర్నమెంట్‌ల గురించి సమాచారం పొందండి. సంబంధిత రాష్ట్ర చెస్‌ అసోసియేషన్‌ కార్యాలయాన్ని సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోండి. మీరు డిగ్రీ చదువుతున్న కళాశాలలో చదరంగ ఛాంపియన్‌ అయి, యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించే స్థాయికి రావాలి. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను మీ కళాశాల వ్యాయామ అధ్యాపకుడి ద్వారా తెలుసుకోండి. ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంటుల్లో పాల్గొని, అక్కడ కూడా ఛాంపియన్‌ అయి, ముందుగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని రాష్ట్రానికీ, ఆ తరువాత అంతర్జాతీయ పోటీల్లో దేశానికీ ప్రాతినిధ్యం వహించగల్గితే, అప్పుడు ప్రభుత్వ సాయం లభించే అవకాశం ఉంది. మీరు కనీసం జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తే, స్పాన్సర్లు లభించే అవకాశం ఉంటుంది. స్పాన్సర్లు లభిస్తే, కోచ్‌లు కూడా అందుబాటులో ఉంటారు. అంతవరకు, మీరే కోచ్‌ని ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాకే ప్రభుత్వ సాయం అందే అవకాశాలు ఉంటాయి. చదరంగం లాంటి క్రీడలకు స్పాన్సర్లు తక్కువగా ఉంటారు. స్పాన్సర్ల సాయం పొందగలిగే స్థాయికి రావాలంటే కనీసం పది సంవత్సరాలు, ప్రభుత్వ సాయం పొందాలంటే ఆ తర్వాత కనీసం మరో ఐదేళ్లు విజయాలు సాధిస్తూనే ఉండాలి. అందుకోసం నిరంతరంగా, ఓపిగ్గా కృషి చేయాలి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: కిషోర్‌

    Ans:

    పుట్టగొడుగుల పెంపకంపై మనదేశంలో చాలా విద్యాసంస్థలు ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ శిక్షణను అందిస్తున్నాయి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ టెక్నాలజీ, గ్రేటర్‌ నోయిడా మష్రూమ్‌ కల్టివేషన్‌లో ఆరునెలల సర్టిఫికెట్‌ కోర్సును అందిస్తుంది. ఐసీఏఆర్‌- డైరెక్టొరేట్‌ ఆఫ్‌ మష్రూమ్‌ రీసెర్చ్‌ ఆరు రోజుల శిక్షణను నిర్వహిస్తున్నారు. ఐసీఏఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చరల్‌ రీసెర్చ్, బెంగళూరు మష్రూమ్‌ స్పాన్‌ ప్రొడక్షన్‌ అండ్‌ మష్రూమ్‌ కల్టివేషన్‌లో ఆరు రోజుల ఆన్‌లైన్‌ శిక్షణ ప్రోగ్రాంను అందిస్తుంది. ఇవే కాకుండా, మనదేశంలోని వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలూ పుట్టగొడుగుల పెంపకంపై ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ కోర్సులు నిర్వహిస్తున్నాయి. చాలా సంప్రదాయ యూనివర్సిటీలు/ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కూడా పుట్టగొడుగుల గురించి సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తున్నాయి. యుడెమీ లాంటి ఆన్‌లైన్‌ వేదికల్లోనూ పుట్టగొడుగుల పెంపకంపై చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఇబ్రహీం

    Ans:

    మీరు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివి ఉద్యోగం చేస్తున్నానన్నారు కానీ, ఎలాంటి ఉద్యోగమో, ఏ సంస్థలో చేస్తున్నారో చెప్పలేదు. ఒకవేళ మీరు అదే సంస్థలో ఉద్యోగం కొనసాగించాలంటే ఆ ఉద్యోగానికీ, సంస్థకూ ఉపయోగపడే కోర్సులు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాకాకుండా మీకు ఉద్యోగం మారాలన్న ఆసక్తి ఉంటే, ఎలాంటి ఉద్యోగానికి మారాలనుకొంటున్నారనే అంశంపై మీరు చేయాల్సిన షార్ట్‌ టర్మ్‌ కోర్సులు ఆధారపడి ఉంటాయి. సాధారణంగా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివినవారు ఆటో క్యాడ్, మాన్యుఫాక్చరింగ్, రోబోటిక్స్, టూల్‌ డిజైన్, మెకట్రానిక్స్, నానో టెక్నాలజీ, త్రీ డీ ప్రింటింగ్, మెషినింగ్, మిల్లింగ్, టర్నింగ్, ప్రొడక్ట్‌ డిజైన్‌ అండ్‌ అనాలిసిస్‌ లాంటి కోర్సులు చేయొచ్చు. మీకు డేటా సైన్స్‌ రంగంలోకి వెళ్ళే ఆసక్తి ఉంటే, అడ్వాన్స్‌డ్‌ ఎక్సెల్, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్, మెషిన్‌ లెర్నింగ్, డేటా విజువలైజేషన్‌ లాంటి కోర్సులు చేయాలి. పైన చెప్పిన వాటిలో మీ కెరియర్‌కు ఉపయోగపడేవాటిని చేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: మాలతి

    Ans:

    సాధారణంగా ప్రైవేటు ఉద్యోగం చేయడానికి వయసుతో పనిలేదు కానీ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి ఎక్కువ వయసు కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసిన ఈ 15 ఏళ్లలో అన్ని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. మీరు ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్‌ చేసి, ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ వైపు వెళ్దామనుకొంటున్నారు కాబట్టి, మరోసారి మీ ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో ప్రాథమిక అంశాలను పునశ్చరణ చేసుకోండి. సాఫ్ట్‌వేర్‌లో ఏ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి. అందుకోసం కొన్ని ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లు నేర్చుకోవాలి. ఆ తరువాత ఏదైనా సాఫ్ట్‌వేర్‌ శిక్షణ సంస్థలో చేరి ప్రస్తుతం బాగా డిమాండ్‌ ఉన్న కోర్సులను నేర్చుకొనే ప్రయత్నం చేయండి. మొదటే ప్రముఖ సంస్థలో కాకుండా, ఏదైనా చిన్న సంస్థలో ఉద్యోగం చేసి కొంత అనుభవం గడించండి. టీసీఎస్, పలు సంస్థలు మీలాంటి వారికోసం సెకండ్‌ కెరియర్‌ అనే అవకాశాల్ని కల్పిస్తున్నాయి. కుటుంబ కారణాల వల్ల విరామం తీసుకున్న మహిళలకు 40 సంవత్సరాల పైవయసులోనూ వివిధ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. కాకపోతే, ఉద్యోగానుభవం మాత్రం తప్పనిసరి. అదేవిధంగా అమెజాన్, డెలాయిట్, గోల్డ్‌ మ్యాన్‌ సాచ్‌ ఇండియా, ఐబీఎం ఇండియా, ఎస్‌ఏపీ ఇండియా లాంటి సంస్థలు కూడా వయసుతో సంబంధం లేకుండా ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగా మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. వీటిలో కొన్ని సంస్థలు ముందుగా ఇంటర్న్‌షిప్‌ ఇచ్చి, ఆ తరువాత ఉద్యోగంలోకి తీసుకొంటున్నాయి. మీకు ఆసక్తి, అవకాశం ఉంటే, డేటా సైన్స్‌/ అనలిటిక్స్‌లో పీజీ చేసి కూడా సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: మనోహర్‌బాబు

    Ans:

    జర్నలిజం కోర్సు విదేశాల్లో చాలా యూనివర్సిటీల్లో ఉంది. వీటిలో యూనివర్సిటీ ఆఫ్‌ ఆమ్‌స్టర్‌డామ్, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, ది లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌- ఆస్టిన్, నాన్యాంగ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా, యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ - మాడిసన్, మిచిగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ, న్యూయార్క్‌ యూనివర్సిటీ ముఖ్యమైనవి. ఇవే కాకుండా- ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, హాంకాంగ్‌ల్లో కూడా ప్రముఖ విశ్వవిద్యాలయాలు జర్నలిజం కోర్సును అందిస్తున్నాయి. ఉద్యోగావకాశాల విషయానికొస్తే జర్నలిజం చదివినవారు జర్నలిస్ట్, కంటెంట్‌ క్రియేటర్, రేడియో జాకీ, పబ్లిక్‌ రిలేషన్స్‌ ప్రొఫెషనల్, కాలమిస్ట్, ఎడిటర్, క్రిటిక్, కాపీ రైటర్, ఫిల్మ్‌ మేకర్‌..ఇలాంటి హోదాల్లో ఉద్యోగాల్లోకి ప్రవేశించవచ్చు. ఇవే కాకుండా బోధన, అడ్వర్‌టైజింగ్, బ్రాడ్‌ కాస్టింగ్‌ అండ్‌ ప్రొడక్షన్‌ రంగాల్లోనూ వివిధ రకాలైన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: అమూల్య

    Ans:

    ధ్యానం అనేది యోగాలో ఒక భాగం. వివిధ యోగా రూపాలైన హఠ యోగం, కర్మ యోగం, భక్తి యోగం, రాజయోగాల్లో హఠ యోగాన్ని ఎక్కువగా అభ్యసిస్తారు. ఇందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 భాగాలుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడు విశ్వవిద్యాలయాలు యోగాలో రెగ్యులర్‌ మాస్టర్‌/ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖపట్నం)లో ఎంఏ /పీజీ డిప్లొమా, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (తిరుపతి)లో ఎమ్మెస్సీ /పీజీ డిప్లొమా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (గుంటూరు)లో పీజీ డిప్లొమా (రెగ్యులర్‌/ పార్ట్‌ టైమ్‌) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: డి.రామకృష్ణ

    Ans:

    వీటిలో మీకు ఏది బాగా ఇష్టమో నిర్ధరణకు రండి. రెండింటిలో ఉన్న లాభనష్టాలను బేరీజు వేసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. మిత్రులు, కౌన్సెలర్లు సలహాలు మాత్రమే ఇవ్వగలరు. నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ముందుగా సీనియర్‌ దగ్గర పనిచేసి సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టే విషయానికొస్తే- సీనియర్‌ దగ్గర పనిచేస్తే, వృత్తిలో మెలకువలు నేర్చుకొని భవిష్యత్తులో సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టుకొని మంచి న్యాయవాదిగా రాణించే అవకాశాలుంటాయి. దీంట్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే, మీరు సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టినప్పుడు, మొదట్లో మీరు జూనియర్‌ లాయర్‌ అని కేసులు ఎక్కువగా రాకపోయే అవకాశం ఉంది. లాయర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల పోటీ కూడా ఎక్కువే. మీరు లాయర్‌గా స్థిరపడటానికి చాలా సమయం పట్టవచ్చు. కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తే ఉద్యోగ భద్రత ఉంటుంది కానీ, మీరు వ్యక్తిగతంగా కేసుల్ని వాదించి పేరు తెచ్చుకొనే అవకాశాలు తక్కువ. మీరు వాదించిన కేసుల్లో విజయం సాధించినా, ఆ విజయం మీరు పనిచేసే సంస్థకే చెందుతుంది. ఉదాహరణకు కొంత అనుభవం గడించి మీరే సొంతంగా కంపెనీ పెట్టడమా, జీవితకాలం ఏదో ఒక కంపెనీలో వేతనానికి పనిచేయడమా అనేది వ్యక్తిగత నిర్ణయం. కెరియర్లో రిస్క్‌ తీసుకోగల్గటం, ఉద్యోగ భద్రత, పరిమిత జీతం, అపరిమితమైన పేరు ప్రఖ్యాతులు, ఎక్కువ ఆదాయం అనే విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. ఏది సరైందో ఆలోచించి నచ్చిన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌