Post your question

 

    Asked By: జేహెచ్‌ఎస్‌.ప్రసాద్‌

    Ans:

    ఇంజినీరింగ్, మెడిసిన్, లా, ఎంబీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌గా చదివితేనే మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్‌ కోర్సును దూరవిద్య ద్వారా చదవడం కుదరదు. కానీ మీరు ఈవెనింగ్‌ కళాశాలలో మూడు సంవత్సరాల ఇంజినీరింగ్‌ కోర్సును రెగ్యులర్‌గా చదివే అవకాశం ఉంది. కొన్ని యూనివర్సిటీలు మాత్రం సాయంకాలం బదులు శని/ ఆదివారాల్లో తరగతులు నిర్వహిస్తున్నాయి. బిట్స్‌ పిలానీ వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌లో భాగంగా ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ డిగ్రీని ఆన్‌లైన్‌ పద్ధతిలో అందిస్తున్నారు. ఈ డిగ్రీకి యూజీసీ గుర్తింపు ఉంది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఏఎంఐఈ (అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌)/ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్స్‌ ఇంజినీర్స్‌ (ఐఈటీఈ) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే, ఆ సర్టిఫికెట్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీకి సమానం అవుతుంది. కానీ, ఆ రెండు పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువ. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: పెద్దిరెడ్డి

    Ans:

    ఏజీ బీఎస్సీ చదివినవారు అగ్రికల్చర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, అగ్రికల్చర్‌ అనలిస్ట్, అసిస్టెంట్‌ ప్లాంటేషన్‌ మేనేజర్, సీడ్‌ ఆఫీసర్, ఫీల్డ్‌ ఆఫీసర్, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్, ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్, ఫుడ్‌ టెక్నాలజిస్ట్, ప్లాంట్‌ బ్రీడర్‌ లాంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు, అంతర్జాతీయ/ జాతీయ స్వచ్ఛంద సేవాసంస్థల్లో చాలా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా పరిశోధన సంస్థలు, ఫుడ్‌ టెక్నాలజీ కంపెనీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, విత్తన సంస్థలు, బ్యాంకులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అటవీ శాఖలు, ఫర్టిలైజర్‌ తయారీ సంస్థలు, అగ్రికల్చర్‌ టెక్నాలజీ సంస్థల్లో కొలువులు అందుబాటులో ఉంటాయి.
    ఉన్నత విద్యావకాశాల విషయానికొస్తే - అగ్రికల్చర్, అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ సైన్స్, జెనెటిక్స్, ప్లాంట్‌ పాథాలజీ, అగ్రికల్చర్‌ ఎకనామిక్స్, ప్లాంట్‌ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ల్లో పీజీ చేయొచ్చు. మీకు బోధన, పరిశోధన రంగాలపై ఆసక్తి ఉంటే పీజీ తరువాత పీహెచ్‌డీ కూడా చేసి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/ సైంటిస్ట్‌గా స్థిరపడవచ్చు.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: శ్రావ్య యాదవ్‌

    Ans:

    మీరు బీఈడీ, ఎంఏ (ఇంగ్లిష్‌) డిగ్రీలను ఏ విద్యా సంవత్సరంలో పూర్తిచేశారో చెప్పలేదు. యూజీసీ నిబంధనల ప్రకారం 2022 నుంచి మాత్రమే ఏక కాలంలో చేసిన రెండు డిగ్రీలు  చెల్లుబాటవుతాయి. ఆ నిబంధనల ప్రకారం- రెండు డిగ్రీ కోర్సులు, రెండు పీజీ కోర్సులు మాత్రమే ఏక కాలంలో చదివే అవకాశం ఉంది. కానీ, బీఈడీ అనేది నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) గుర్తించిన వృత్తివిద్యా కోర్సు. ప్రస్తుతానికి, ఎన్‌సీటీఈ బీఈడీతో పాటు మరో డిగ్రీని ఒకే సమయంలో చదవడానికి అనుమతి ఇవ్వలేదు. మీరు కచ్చితంగా ఈ రెండు డిగ్రీలనూ 2022కి ముందే ఏక కాలంలో చేసి ఉంటారు కాబట్టి ఒక డిగ్రీని మాత్రమే వాడుకోవాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మీరు డీఎస్‌సీ స్కూల్‌ అసిస్టెంట్‌ (ఇంగ్లిష్‌) ఉద్యోగానికి అర్హులు కారు. మరోసారి రెగ్యులర్‌/ దూరవిద్య ద్వారా పీజీ చేసి ఇంగ్లిష్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ అవ్వాలన్న మీ కోరికను నెరవేర్చుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: వాణిశ్రీ

    Ans:

    మీరు బీఏ (స్పెషల్‌ తెలుగు) పూర్తయ్యాక రెండు సంవత్సరాల బీఈడీని తెలుగు మెథడాలజీతో కనీసం 50 శాతం మార్కులతో పూర్తి చేయండి. ఆ తరువాత, సీటెట్‌ కానీ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్‌ (టీఎస్‌ టెట్‌/ ఏపీ టెట్‌) రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించండి. టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ వచ్చేవరకు వేచి చూడకుండా, ఇప్పటినుంచే సన్నద్ధత మొదలుపెట్టండి. రాత పరీక్షలో సాధించిన మార్కులతో తయారుచేసిన మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. ఉదాహరణకు - తెలంగాణ రాష్ట్ర టీచర్‌  రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ 80 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షను 160 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలతో కంప్యూటర్‌పై నిర్వహిస్తారు. ఒక్కో సరైన సమాధానానికి 0.5 మార్కులు. జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌ నుంచి 20, పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌ నుంచి 20, తెలుగు భాష నుంచి 88, టీచింగ్‌ మెథడాలజీ నుంచి 32 ప్రశ్నలుంటాయి. సీటెట్‌/ టీఎస్‌ టెట్‌/ ఏపీ టెట్‌లో వచ్చిన మార్కులకు 20 శాతం వెయిటేజి ఇచ్చి మొత్తం వంద మార్కులకు మెరిట్‌ లిస్ట్‌ తయారు చేస్తారు. ఈ పరీక్ష పుస్తకాల విషయానికొస్తే, మీరు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు సబ్జెక్టు పుస్తకాలతో పాటు, డిగ్రీ, బీఈడీలో చదివిన ప్రామాణిక పుస్తకాలను బాగా అర్థం చేసుకొని చదివి నోట్సు తయారు చేసుకోండి. జనరల్‌ నాలెడ్జ్‌ కోసం మార్కెట్‌లో ఉన్న డీఎస్సీ/గ్రూప్స్‌ పుస్తకాలను చదవండి. కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్రమం తప్పకుండా వార్తాపత్రికలను చదివి నోట్సు తయారుచేసుకోండి. ప్రణాళిక ప్రకారం చదివితే మీ ఆశయాన్ని నెరవేర్చుకోవడం కష్టం కాదు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: మహేష్‌

    Ans:

    ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదవడానికి యూజీసీ 2022 నుంచి మాత్రమే అనుమతి ఇచ్చింది. అంతకుముందు రెండు డిగ్రీలు ఏక కాలంలో చేసివుంటే, వాటిలో ఒక డిగ్రీ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మీరు ఒకే సబ్జెక్టుతో రెండు డిగ్రీలు చేయడానికి ఉన్న కారణాలు చెప్పలేదు. ఆ రెండు డిగ్రీలూ ఒకే యూనివర్సిటీ నుంచి చేశారా, వేర్వేరు వర్సిటీల నుంచి చేశారో తెలియదు. యూజీసీ గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి చేసిన రెగ్యులర్‌ డిగ్రీకీ, దూరవిద్య డిగ్రీకీ మధ్య తేడా లేదు. ఈ రెండు రకాల డిగ్రీలు చదివినవారు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ‘మీరు డిగ్రీని దూరవిద్య ద్వారా ఎందుకు చేశారు?’ అనే ప్రశ్న ఎదురవుతుంది. మీకు ఏ డిగ్రీలో ఎక్కువ మార్కులు వచ్చాయో, ఆ డిగ్రీని ఉపయోగించుకోండి. ఒకవేళ మీరు రెండు డిగ్రీలూ వేర్వేరు యూనివర్సిటీల నుంచి చేస్తే, మెరుగైన న్యాక్‌ స్కోరు, ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకు ఉన్న యూనివర్సిటీ డిగ్రీని ఉపయోగించుకొనే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: హరిచందన

    Ans:

    సాధారణంగా మెడికల్‌ కోడింగ్‌ రంగంలో ప్రవేశించాలంటే, డిగ్రీలో లైఫ్‌ సైన్సెస్‌/ హెల్త్‌కేర్‌ సబ్జెక్టులు చదివి ఉండి, వివిధ వ్యాధులూ, వాటి చికిత్సల గురించీ, మానవ శరీరపు పనితీరు గురించీ ప్రాథమిక అవగాహన ఉండాలి. మీరు డిగ్రీలో చదివిన లైఫ్‌ సైన్సెస్‌ సబ్జెక్టుతోపాటు మెడికల్‌ కోడింగ్‌ శిక్షణతో మెడికల్‌ కోడింగ్‌ రంగంలో ప్రవేశించడానికి అర్హత లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ అదనపు అర్హత అవుతుంది. మరికొన్ని సందర్భాల్లో ఈ అదనపు విద్యార్హత ఉద్యోగం పొందడంలో ప్రతిబంధకం కూడా అవ్వొచ్చు.
    మెడికల్‌ కోడింగ్‌ కోర్సులో వైద్య రికార్డులను జాగ్రత్తగా చదివి సరైన కోడ్స్‌ ఇవ్వడం, వివిధ వ్యాధుల చికిత్సా విధానాలు, మానవ శరీరం పనితీరు, డేటాను సరిగా విశ్లేషించి కావాల్సిన సమాచారాన్ని అందించడం ఉంటాయి. ఫండమెంటల్స్‌ ఆఫ్‌ మెడికల్‌ టెర్మినాలజీ, అనాటమీ స్ట్రక్చర్, కాంప్రహెన్సివ్‌ మెడికల్‌ టెర్మినాలజీ, మెడికల్‌ ఎథిక్స్, కోడింగ్‌ మాన్యువల్స్‌పై పూర్తి అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణ పూర్తయ్యాక మెడికల్‌ కోడర్‌గా, మెడికల్‌ రికార్డ్స్‌ టెక్నీషియన్‌గా, మెడికల్‌ రికార్డ్స్‌ కోఆర్డినేటర్‌గా, కోడింగ్‌ స్పెషలిస్ట్‌గా, కోడింగ్‌ ఎడ్యుకేటర్‌గా, కోడింగ్‌ ఆడిటర్‌గా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చదివినవారికి డ్రగ్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్‌ రిసెర్చ్‌ సంస్థలు, బయోటెక్‌ కంపెనీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలు, బయో ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీలు, వ్యవసాయ రంగం, క్లినికల్‌ రీసెర్చ్‌ సంస్థలు, ఎన్విరాన్మెంటల్‌ కంట్రోల్‌ సంస్థలు, బోధన - పరిశోధనా రంగాల్లో ఉద్యోగాలుంటాయి. మీరు ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, మెడికల్‌ కోడింగ్‌లను రెండింటినీ కలిపి కానీ, విడివిడిగా ఉపయోగించుకొని కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి. జ్యోతి

    Ans:

    ఈ సందేహం మీలాంటి చాలామంది విద్యార్థులకూ, తల్లిదండ్రులకూ చాలా సందర్భాల్లో కలిగేదే! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ/ కృత్రిమ మేధ) అంటే మనుషులకు ఉన్న మేధా సామర్థ్యముండే యంత్రాలను అభివృద్ధి చేసే కోర్సు. రోబోటిక్స్‌ అంటే ఆటోమేషన్, ఇన్నోవేషన్‌లను మెరుగుపరిచే డిజైన్లను చేసి, రోబోలను తయారుచేసే శాస్త్రం. ఈ రెంటి మధ్యా మరో ముఖ్యమైన తేడా ఉంది. రోబోటిక్స్‌లో సొంతంగా కదులుతూ, పరిసరాలతో సంబంధాలు పెట్టుకోగలిగే యంత్రాలను తయారుచేసే విధానాలు నేర్చుకుంటారు. ఏఐలో డేటా ప్రాసెసింగ్, అల్గారిథమ్స్‌ డిజైన్‌ గురించి నేర్చుకుంటారు. పునరావృతమయ్యే సూచనలను అనుసరించి రోబోలు వివిధ రంగాల్లో ఉత్పాదకతను మెరుగుపర్చేలా ప్రోగ్రామ్‌ చేస్తారు. ఏఐని కూడా వివిధ సందర్భాల్లో ఉపయోగించగలిగినప్పటికీ, ఇది రోబో కంటే మరింత చలనశీలంగా (డైనమిక్‌) ఉంటుంది. ఈ తేడాలను పక్కన పెడితే, ఈ రెండు కోర్సులూ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. రోబోల పనితీరును మెరుగుపరచడానికి కృత్రిమ మేధ ఉపయోగపడుతుంది. ఇవి రెండూ ఆటోమేషన్, డేటా అనాలిసిస్, డెసిషన్‌ మేకింగ్‌ లాంటి క్లిష్టమైన పనుల్ని సులభతరం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ రెండింటితో పాటు మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సుకు కూడా ఉన్నత విద్య, ఉపాధి, పరిశోధనావకాశాలు ఉన్నాయి. మీ అభిరుచి, ఆసక్తులను బట్టి సరైన కోర్సును ఎంచుకోండి. దీంతోపాటుగా ఆ కోర్సును సరిగా అర్థం చేసుకుని చదవడం, చదివిన విషయాల్ని ప్రాక్టికల్‌గా ఎలా ఉపయోగించాలో తెలియడం కూడా చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: నరసింహారావు

    Ans:

    మీ అమ్మాయిని టెన్త్‌ క్లాస్‌ తరువాత ఇంటర్మీడియట్‌ సైన్స్‌/ కామర్స్‌/ ఆర్ట్స్‌ చదివించండి. ఆ తర్వాత ఎయిర్‌ హోస్టెస్‌కు సంబంధించిన కళాశాల/ శిక్షణ సంస్థలో చేర్పించండి. ఎయిర్‌ హోస్టెస్‌ అవ్వాలంటే ఓర్పు, ఆత్మవిశ్వాసం, దృఢమైన వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు, బృందంలో పనిచేయడానికి కావాల్సిన నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఇంగ్లిష్‌ కాకుండా కనీసం ఓ భారతీయ భాషలో ప్రావీణ్యం అవసరం. ఏదైనా విదేశీ భాష తెలిసి ఉంటే అదనపు అర్హత అవుతుంది.
    ఇంటర్మీడియట్‌లో కనీసం 50 శాతం మార్కులు పొంది 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసుతో పాటు శారీరకంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యంతో ఉండాలి. ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ హాస్పిటాలిటీ, ఏవియేషన్‌ కస్టమర్‌ సర్వీస్, ఎయిర్‌ హోస్టెస్‌ ట్రైనింగ్, ఎయిర్‌లైన్స్‌ హాస్పిటాలిటీ, క్యాబిన్‌ క్రూ, ఫ్లైట్‌ అటెండెంట్‌ లాంటి ఏదో ఒక కోర్సులో ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు శిక్షణ పొందాలి. ఒకవేళ డిగ్రీ చదివి ఎయిర్‌ హోస్టెస్‌ అవ్వాలనుకొంటే బీఎస్సీ (ఎయిర్‌ హోస్టెస్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, బీఎస్సీ ఏవియేషన్, బీబీఏ టూరిజం మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులు చేయొచ్చు. ఎయిర్‌ హోస్టెస్‌ శిక్షణ సంస్థలు/ కాలేజీల విషయానికొస్తే- హైదరాబాద్, విశాఖపట్టణాల్లో చాలా ప్రైవేటు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ఏదైనా సంస్థ/ కాలేజీలో చేరేముందు దాని నాణ్యత, విశ్వసనీయత గురించి పూర్తిగా తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సీహెచ్‌.రాజశేఖర్‌

    Ans:

    అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్‌ కోర్సును దూరవిద్య ద్వారా చదవడం కుదరదు. కానీ, మూడు సంవత్సరాల డిప్లొమాతో ఉద్యోగం చేస్తున్నవారు మాత్రం ఈవినింగ్‌ కళాశాల్లో ఇంజినీరింగ్‌ కోర్సు చదవొచ్చు. మీ అమ్మాయి పదో తరగతి/ ఇంటర్మీడియట్‌ తరువాత డిప్లొమా చదివి ఉండకపోతే ఈవినింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదివే అవకాశం లేదు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ వారి ఏఎంఐఈ (అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ద ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే ఆ సర్టిఫికెట్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీకి సమానం అవుతుంది. కాకపోతే, ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువ. మీ అమ్మాయిని బీఈ/ బీటెక్‌ మాత్రమే చదివించాలి అనుకొంటే,  బీఎస్సీని మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌లతో పూర్తి చేసి, బిట్స్‌ పిలానీ వారి వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రాం (విల్ప్‌) ద్వారా బీటెక్‌ చేసే వీలుంది. దూరవిద్యలో బీఎస్సీ తరువాత, ఎమ్మెస్సీ( మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌) చేసి బిట్స్‌ విల్ప్‌ ద్వారా ఎంటెక్‌ చేసే అవకాశమూ ఉంది. ప్రస్తుతం తను ఉద్యోగం చేస్తున్న సంస్ధ నుంచి రెండు సంవత్సరాల సెలవు తీసుకొని, తను గతంలో చదివిన ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి మిగిలిన రెండు సంవత్సరాల కోర్సును పూర్తిచేసే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎల్‌.సమ్మయ్య నాయక్‌

    Ans:

    సాధారణంగా ఏదైనా యూనివర్సిటీలో ఒక కోర్సులో చేరినప్పుడు ఆ కోర్సు పూర్తిచేయడానికి కనిష్ఠ, గరిష్ఠ కాల పరిమితులు ఆ సంస్థ  నియమ నిబంధనల ప్రకారం నిర్దేశించివుంటాయి. ఉదాహరణకు ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం లాంటి పీజీ కోర్సులను కనిష్టంగా రెండు సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి చేయాలి. ఇక గరిష్ఠ వ్యవధి విషయానికొస్తే-  ఒక్కో యూనివర్సిటీ ఒక్కో కాల పరిమితిని నిర్ణయిస్తోంది. చాలా యూనివర్సిటీలు పీజీ కోర్సుకు గరిష్ఠ పరిమితిని నాలుగు సంవత్సరాలుగా, కొన్ని యూనివర్సిటీలు మాత్రం ఐదు సంవత్సరాలుగా నిర్ణయించాయి.
    మీ విషయానికొస్తే- ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యలో రెండు సంవత్సరాల పీజీ కోర్సును గరిష్ఠంగా ఐదు సంవత్సరాల్లో పూర్తిచేయాలి. మీరు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 2007లో చేరారు కాబట్టి, 2012లోగా కోర్సును పూర్తి చేసి ఉండవలసింది. చాలా యూనివర్సిటీలు కోర్సులో చేరిన సంవత్సరంతో సంబంధం లేకుండా మానవతా దృక్పథంతో బ్యాక్‌లాగ్‌ పేపర్లను రాయడానికి అప్పుడప్పుడూ ఒకే ఒక్క అవకాశాన్ని ఇస్తూ ఉంటాయి. ఆ అవకాశం కోసం వేచి చూడండి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం విద్యార్థి వ్యక్తిగత దరఖాస్తును ఆధారం చేసుకొని, సహేతుకమైన కారణాలుంటే ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశాన్ని కూడా కల్పిస్తారు. మీరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రం సంచాలకులను సంప్రదించి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌