Post your question

 

    Asked By: నీరజ

    Ans:

    సంస్కృత విభాగంలో ఇంటర్మీడియట్‌ స్థాయిలో బోధించడానికి లెక్చరర్‌ అవ్వాలంటే ఎంఏలో కనీసం 55% మార్కులు పొందివుండాలి. డిగ్రీ కళాశాల/ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అవ్వాలంటే- అదనంగా సంస్కృతంలో యూజీసీ నెట్‌/ సెట్‌ ఉత్తీర్ణత కూడా సాధించాలి. నెట్‌/ సెట్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోతే, పీహెచ్‌డీ అయినా చేసి ఉండాలి. యూజీసీ నియమాలు పాటించే ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కూడా ఇవే నిబంధనల ప్రకారం నియామకాలు చేపడతారు. ఈ మధ్యనే నెట్‌ పరీక్షలో హిందూ స్టడీస్, ఇండియన్‌ నాలెడ్జ్‌ సిస్టమ్‌ అని రెండు కొత్త సబ్జెక్టులను కూడా చేర్చారు. కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాల కోసం ఆయా విభాగాలకు సంబంధించిన శాస్త్ర విషయాల్లో పూర్తి పరిజ్ఞానం ఉండాలి. ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరర్‌ అవ్వాలంటే.. సంబంధిత పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వారు నిర్వహించే రాత పరీక్షలో మెరుగైన ప్రతిభ కనపర్చి, ఆ తర్వాత ఇంటర్వ్యూలోనూ విజయం సాధించటం అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: రవితేజ

    Ans:

    ఇంజినీరింగ్‌ అయ్యాక మనదేశంలోనే ఉద్యోగం చేయాలా? విదేశాల్లో ఎంఎస్‌ చేయాలా? అనే ప్రశ్న చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు నిత్యం ఎదుర్కొనేదే! ముందుగా మీరు విదేశాలకు ఎందుకు వెళ్ళాలనుకొంటున్నారు అనే విషయంపై స్పష్టత అవసరం. చాలామంది మెరుగైన విద్య, ఉపాధి కావాలనో, డబ్బు, విలాసవంతమైన జీవితం కోసమనో, కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చడానికో, విదేశాల్లో స్థిరపడాలనే కల నెరవేర్చుకోవడం కోసమనో.. ఇలా వివిధ కారణాలు చెప్తుంటారు. పైన చెప్పినవాటిలో మీరు ఏ కారణంతో విదేశాలకు వెళ్లాలనుకొంటున్నారనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి.
    పిల్లల్ని విదేశాలకు పంపడం చాలామంది తల్లిదండ్రులు ఒక హోదాగా భావిస్తున్నారు. విదేశాలకు వెళ్లకుండా మనదేశంలోనే స్థిరపడాలనుకునే చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్పే కారణాలు ఇలా ఉంటాయి: విదేశీ(( విద్య ఖర్చుతో కూడుకున్నది, విదేశాల్లో కూడా ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంది, ఇక్కడే ఉండి మన దేశాభివృద్ధికి తోడ్పడాలి, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తోడుగా ఉండాలి, విలాసాలు, సౌకర్యాల విషయంలో మనదేశం కూడా విదేశాలతో పోటీ పడుతోంది, ప్రతిభ ఉంటే ఎక్కడైనా రాణించవచ్చు, దూరపు కొండలు నునుపు..ఇలా! ఇవి రెండూ కాకుండా కొంతమంది ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ కొంత అనుభవం గడించి, వెనక్కి వచ్చి భారత్‌లో స్థిరపడటం కూడా గమనిస్తున్నాం. విదేశాలకు వెళ్ళడం, లేదా ఇక్కడే స్థిరపడటం అనేది మీ వ్యక్తిగత నిర్ణయం. విదేశీ విద్య కొంత ఆర్థికభారంతో కూడుకొంది కాబట్టి మీరు, మీ కుటుంబ సభ్యులూ కలిసి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అంశమిది.
    ప్రస్తుతం మనదేశంలో ప్రభుత్వ ఉద్యోగం పొందడం, గేట్‌లో మెరుగైన ర్యాంకు పొందడం అనేవి... విదేశాల్లో ఎంఎస్‌ సీటు తెచ్చుకోవడం కంటే కూడా ఎక్కువ కష్టంగా ఉన్నాయి. విదేశాల్లో చదువుతున్న చాలామంది ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో ఉద్యోగాలు పొందడం కష్టంగా ఉంది కాబట్టి కొంతకాలం విదేశీ విద్య ఆలోచనల్ని పక్కనపెట్టడం మంచిదని సలహాలు ఇస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగావకాశాలు తగ్గుతున్న ఈ సందర్భాల్లో కూడా చాలామంది విదేశీ విద్యపై మోజు పడుతూనే ఉన్నారు. మీకు ప్రతిభ, విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలుంటే ఎక్కడైనా ఉద్యోగం పొందవచ్చు. డిగ్రీల ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు పొందే రోజులు పోయాయి. మారుతున్న పరిస్థితుల్లో డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం, వ్యక్తిత్వం, భావప్రకటనా సామర్థ్యం, సృజనాత్మకత, సమస్యా పరిష్కార నైపుణ్యాలు, ప్రోగ్రామింగ్, కోడింగ్, కృత్రిమ మేధపై అవగాహన లాంటివి మంచి ఉద్యోగం పొందడానికి దోహదపడుతున్నాయి.ఇవి దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: సాయి సంకీర్తన, హైదరాబాద్‌

    Ans:

    హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో మైక్రో బయాలజీతో పాటు ఇతర పీజీ ప్రవేశాలు కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ)- పీజీ స్కోరు ఆధారంగా జరుగుతాయి. జులై 2024లో విద్యాసంవత్సరం మొదలవుతుంది.
    సీయూఈటీ నోటిఫికేషన్‌ ఇటీవలే వెలువడింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులను జనవరి 24 వరకు స్వీకరిస్తారు. పరీక్షలు మార్చి 11 నుంచి 28 వరకు రోజూ 3 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. సీయూఈటీలో సాధించిన స్కోరుతో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల్లో, రాష్ట్రీయ విశ్వవిద్యాలయాలూ, డీమ్డ్‌ యూనివర్సిటీలూ, ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ చదువుకోవచ్చు.
    మైక్రోబయాలజీ పీజీ కోర్సును అందించే దేశంలోని ఇతర ప్రముఖ విద్యాసంస్థలు..
    * పాండిచ్చేరి యూనివర్సిటీ
    * దిల్లీ యూనివర్సిటీ
    * మదురై  కామరాజ్‌ యూనివర్సిటీ
    * యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతా
    * ప్రెసిడెన్సీ యూనివర్సిటీ
    * అమృత యూనివర్సిటీ
    * ఎంఎస్‌ రామయ్య  యూనివర్సిటీ.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

     

    Asked By: అశోక్‌

    Ans:

    బీఎస్సీ (బీజడ్‌సీ) చదివినవారు వైద్య/ ఆరోగ్య రంగానికి సంబంధించి పీజీలో బయోకెమిస్ట్రీ, బయో టెక్నాలజీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్, ఫోరెన్సిక్‌ సైన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్, న్యూట్రిషన్, పబ్లిక్‌ హెల్త్, మాలిక్యులర్‌ బయాలజీ, లైఫ్‌ సైన్సెస్, హ్యూమన్‌ జెనెటిక్స్, బయో థెరప్యూటిక్స్, బయో మాలిక్యులర్‌ ఫిజిక్స్, జీనోమ్‌ టెక్నాలజీ, మెడికల్‌ బయోటెక్నాలజీ, సిస్టమ్స్‌ బయాలజీ, టిష్యూ సైన్స్‌ లాంటి కోర్సులు చేయవచ్చు. మీకు మేనేజ్‌మెంట్‌ రంగంపై ఆసక్తి ఉంటే ఎంబీఏ హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్, హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సుల గురించి ఆలోచించవచ్చు. ఇవేకాకుండా అడ్వాన్స్‌డ్‌ కోర్సులైన స్టెమ్‌ సెల్‌ టెక్నాలజీ, ట్రాన్‌స్లేషనల్‌ ఇమ్యునాలజీ, ట్రాన్‌స్లేషనల్‌ న్యూరోసైన్స్, క్లినికల్‌ వైరాలజీ లాంటి కోర్సులు కూడా చదివే అవకాశం ఉంది. మీ ఆసక్తిని బట్టి ఏది చదవాలో నిర్ణయించుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి.హరి

    Ans:

    బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రెగ్యులేషన్స్‌ ప్రకారం ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రాంను ఈవెనింగ్‌ కాలేజీ/ దూరవిద్య/ పార్ట్‌ టైం ద్వారా చదవడం కుదరదు. ఎల్‌ఎల్‌బీ డిగ్రీ చదవాలన్న కోరిక బలంగా ఉంటే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి విరామాన్ని ఇవ్వండి. లాసెట్‌లో మెరుగైన ర్యాంకు పొంది రెగ్యులర్‌గానే చదవండి. కొంతమంది ప్రభుత్వ/ ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే రెగ్యులర్‌గా ఎల్‌ఎల్‌బీ చదివే ప్రయత్నం చేస్తున్నారు. అలా పొందిన ఎల్‌ఎల్‌బీ డిగ్రీతో ఉపాధి పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: వి.భాను

    Ans:

    ప్రస్తుతం ఉన్న ఉద్యోగ మార్కెట్‌లో డిగ్రీతో పాటు అదనంగా పొందిన నైపుణ్యాలతో ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటున్నాయి. ఏదైనా డిగ్రీ చదువుతూ, ఆ డిగ్రీకి సంబంధించిన ఇతర కోర్సులు నేర్చుకోవడం వల్ల లాభమే కానీ, నష్టం ఉండదు. ఎంసీఏతో పాటు హ్యాకింగ్‌లో శిక్షణ పొందడం వల్ల సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. ఎథికల్‌ హ్యాకింగ్‌పై పట్టున్నవారి సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆ కోర్సులో శిక్షణ పొందినవారికి డిమాండ్‌ ఉంది. కానీ మీరు రెగ్యులర్‌గా చదవబోయే ఎంసీఏను అశ్రద్ధ చేయకూడదు. రెండింటినీ సమన్వయం చేస్తూ విషయ పరిజ్ఞానాన్ని, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. అదే సమయంలో హ్యాకింగ్‌లో మెలకువలను కూడా నేర్చుకొని, అందులో సర్టిఫికేషన్‌ పొందితే పేరున్న సంస్థలో ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగం లభిస్తుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  

    Asked By: నితీష్‌ రెడ్డి

    Ans:

    బీఎస్సీలో మీరు చదువుతున్న మూడు సబ్జెక్టులకూ మంచి భవిష్యత్తు  ఉంది. మీ ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోవడానికి బయోటెక్నాలజీ, బయో ఫార్మాస్యూటికల్‌ రిసెర్చ్, ఫుడ్‌ టెక్నాలజీ, ఫోరెన్సిక్‌ సైన్సెస్, క్లినికల్‌ రిసెర్చ్, జెనెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, సెల్‌ బయాలజీ, ఇమ్యునాలజీ, కంప్యుటేషనల్‌ బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, హెల్త్‌ కేర్, జీనోమిక్స్, పబ్లిక్‌ హెల్త్, బయో స్టాటిస్టిక్స్, వైరాలజీ, బయో ఎథిక్స్‌ లాంటి సబ్జెక్టుల్లో సర్టిఫికెట్‌/ డిప్లొమా/ పీజీ డిప్లొమా/ పీజీ కోర్సులు చేయొచ్చు. ఇతర ఉద్యోగాలతో పోలిస్తే మెడికల్‌ కోడింగ్‌ ఉద్యోగాల వృద్ధి రేటు కొంత మెరుగ్గానే ఉండటం వల్ల ఆ రంగంలో అవకాశాలు ఎక్కువ. కానీ కొంతకాలానికి మీరు చేస్తున్న ఉద్యోగంలో వైవిధ్యం లేదని ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. మీరు ఏ రంగంలోకి వెళ్ళాలి అనేది పూర్తిగా మీ అభిరుచి, ఆసక్తి, దీర్ఘకాలిక ఆశయాలను పరిగణనలోకి తీసుకుని, సరైన కోర్సును ఎంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: టి.అభిలాష్‌ కుమార్‌

    Ans:

    ఎల్‌ఎల్‌బీ చదువుతూనే వివిధ రకాల సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు చదవడం వల్ల విషయ పరిజ్ఞానాన్ని మెరుగుపర్చుకోవచ్చు. ఎల్‌ఎల్‌బీ చదువుతూనే యుడెమి నుంచి ఎసెన్షియల్‌ ఫౌండేషన్స్‌ ఫర్‌ యాస్పైరింగ్‌ పారాలీగల్స్‌ ఆన్‌లైన్‌ కోర్స్‌ కానీ, లాయిడ్‌ కాలేజ్‌ దిల్లీ నుండి ఆన్‌లైన్‌ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ సివిల్‌ లిటిగేషన్‌ స్కిల్స్‌ కోర్సు కానీ చేయొచ్చు. లాసీఖో నుంచి సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ సివిల్‌ లిటిగేషన్‌: ప్రాక్టీస్, ప్రొసీజర్‌ అండ్‌ డ్రాఫ్టింగ్‌ ఆన్‌లైన్‌ కోర్సునూ చేయవచ్చు. దీనివల్ల మీరు భవిష్యత్తులో మంచి లాయర్‌గా రాణించే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉంటే సైబర్‌ లా, ఫోరెన్సిక్‌ లా, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్, మీడియా లాస్, డ్రాఫ్టింగ్‌- నెగోషియేషన్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కాంట్రాక్ట్స్, ఫ్యామిలీ డిస్‌ప్యూట్‌ రిజల్యూషన్, ఏవియేషన్‌ లా అండ్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి కోర్సులను నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా లాంటి నేషనల్‌ యూనివర్సిటీల నుంచి దూరవిద్య ద్వారా చేసే ప్రయత్నం చేయండి. లా డిగ్రీ పూర్తయిన తరువాత ఎవరైనా సీనియర్‌ లాయర్‌ దగ్గర అసిస్టెంట్‌గా చేరి న్యాయవాద వృత్తిలో మెలకువలు నేర్చుకోండి. ఎల్‌ఎల్‌బీ లాంటి వృత్తివిద్యా కోర్సుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు వృత్తి నైపుణ్యాలు చాలా అవసరం. ఈ నైపుణ్యాలు అనుభవంతోనే మెరుగుపడతాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: సిరిచందన

    Ans:

    సాధారణంగా ఆభరణాల డిజైనింగ్‌ కోర్సులో జ్యూలరీ కాంపోనెంట్స్, టూల్స్, బ్రేస్లెట్స్‌ డిజైన్, నెక్లెస్‌ డిజైన్, బీడింగ్‌ టెక్నిక్స్, స్టిచెస్, పర్ల్స్‌ గురించి విపులంగా తెలుసుకొంటారు. యుడెమిలో నగల తయారీలో ఆన్‌లైన్‌ కోర్సు అందుబాటులో ఉంది. ముందుగా ఆ కోర్సు చేసి జ్యూలరీ డిజైన్‌లో ప్రాథమిక అంశాలు తెలుసుకోండి. అందుబాటులో ఉన్న కోర్సుల్లో బేసిక్‌ జ్యూలరీ డిజైనింగ్, కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైనింగ్‌ ఫర్‌ జెమ్స్‌ అండ్‌ జ్యూలరీ, అడ్వాన్స్‌ జ్యూలరీ డిజైనింగ్, కలర్డ్‌ జెమ్‌ స్టోన్‌ ఐడెంటిఫికేషన్, డైమండ్‌ ఐడెంటిఫికేషన్‌ అండ్‌ గ్రేడింగ్, జెమ్స్‌ అండ్‌ జ్యూలరీ మార్కెటింగ్, కాస్ట్యూమ్‌ జ్యూలరీ మేకింగ్‌ లాంటివి ప్రాచుర్యం పొందాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో వివిధ ప్రైవేటు సంస్థలు నగల డిజైనింగ్‌ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో విశ్వసనీయత ఉన్న సంస్థను ఎంచుకొని మీకు నచ్చిన కోర్సులో చేరండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎ.సాయిపవన్‌

    Ans:

    మైక్రో బయాలజీ ప్రోగ్రాంలో సూక్ష్మ జీవుల గురించి విపులంగా చదువుతారు. ఫంగీ, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఆల్గే లాంటివి. మైక్రో బయాలజీలో వైరాలజీ, బ్యాక్టీరియాలజీ, మైకాలజీ, ప్రోటో జువాలజీ, పారాసైటాలజీ లాంటి స్పెషలైజేషన్‌లు ఉంటాయి. మీరు ఎమ్మెస్సీ మైక్రోబయాలజీలో చదివిన స్పెషలైజేషన్‌ ఆధారంగా ఏ రంగంలో ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయో తెలుసుకొని, అవసరమైన నైపుణ్యాలు పెంచుకోండి. మైక్రోబయాలజీ చదివినవారికి ఫార్మా, బయోటెక్నాలజీ రంగాలతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్, హెల్త్‌ కేర్, బయోమెడికల్‌ రంగాల్లోనూ ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఫార్మా, బయోటెక్‌.. రెండు రంగాల్లో మైక్రో బయాలజిస్ట్‌గా ఉద్యోగం పొందవచ్చు. ప్రస్తుతం ఫార్మా, బయోటెక్‌ పరిశ్రమలు రెండూ హెల్త్‌కేర్‌ రంగంతో పాటు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయి. మీ ఆసక్తిని బట్టి దేనిలో స్థిరపడాలో నిర్ణయించుకొని ఆ రంగాన్ని ఎంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌