Post your question

 

    Asked By: పి.హరితేజ

    Ans:

    ఇంజినీరింగ్‌లో ఈసీఈ చదువుతూ సీ‡ఎస్‌ఈ విద్యార్థిలా కోడింగ్‌ చేయగలగడం పెద్ద కష్టమేమీ కాదు. ముందుగా ఈ రెండు బ్రాంచ్‌ల సిలబస్‌ పరిశీలించండి. రెండిటిలో కామన్‌గా ఉన్న సబ్జెక్టులను ఎలాగూ మీరు చదువుతారు. సీఎస్‌ఈలో కోడింగ్‌కి సంబంధించిన సబ్జెక్టులు ఏమున్నాయో తెలుసుకొని వాటిని నేర్చుకొనే ప్రయత్నం చేయండి. ముందుగా ఎంఎస్‌ ఎక్సెల్, సీ, సీ ప్లస్‌ ప్లస్, ఆర్, జావా, పైతాన్‌ ప్రోగ్రామింగ్‌లను నేర్చుకోవడం మొదలుపెట్టండి. తరువాత వెబ్‌ డెవలప్‌మెంట్‌ లాంటి కోర్సులను కూడా చేయండి. వీటితో పాటు కోర్స్‌ఎరా, యుడెమి, ఎడెక్స్, ఉడాసిటీ, ఖాన్‌ అకాడెమీ, స్వయం, ఎన్‌పీటెల్‌తో పాటు కోడింగ్‌కి సంబంధించిన  ప్రత్యేక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ల నుంచి సరైన కోర్సులు చేయండి. కోడింగ్‌ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈసీఈ కోర్సును నిర్లక్ష్యం చేయకండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: లహరి

    Ans:

    చాలా యూనివర్సిటీల్లో బీసీఏ చదవాలంటే ఇంటర్‌లో మ్యాథ్స్‌ ఉండాలన్న నిబంధన ఉంది. కొన్ని ప్రైవేటు యూనివర్సిటీల్లో ఈ నిబంధన లేనప్పటికీ బీసీఏ మొదటి సంవత్సరంలో మ్యాథ్స్‌ని బ్రిడ్జి కోర్సుగా చేయాల్సి ఉంటుంది. సాధారణంగా బీసీఏ లాంటి కోర్సుల్లో రాణించాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులపై పట్టు అవసరం. ఇక బీబీఏ, బీకాం  రెండు కోర్సులకూ మంచి భవిష్యత్తు ఉంది. బీబీఏని పేరున్న బిజినెస్‌ స్కూల్‌లో చదివితే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ అవకాశం ఉంది. బీబీఏ చదివినవారికి బీకాం పూర్తిచేసిన వారి కంటే కొంత ఎక్కువ వేతనం లభించవచ్చు. అదే సమయంలో బీబీఏ చదివిన వారినుంచి వ్యాపార సంస్థలు చాలా ఎక్కువ నైపుణ్యాలను ఆశిస్తున్నాయి. బీకాంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏదో ఒక ఉపాధి దొరికే అవకాశం ఉంది. బీకాం, బీబీఏల్లో దాదాపు సగం సిలబస్‌ ఒకేలా ఉంటుంది. కానీ వాటిని రెండు కోర్సుల్లో ఒక్కో రకంగా బోధిస్తారు. బీకాంలో వ్యాపారానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను ఎక్కువగా బోధిస్తారు. బీబీఏలో వ్యాపారానికి సంబంధించిన అప్లికేషన్‌లతో పాటు, కమ్యూనికేషన్, ప్రజెంటేషన్, ప్రాబ్లం సాల్వింగ్, కంప్యూటర్‌ నైపుణ్యాలపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. బీకాంలో అకౌంట్స్, ఫైనాన్స్, ట్యాక్స్, బిజినెస్‌ చట్టాలు, బ్యాంకింగ్‌ లాంటి అంశాలపై బోధన ఎక్కువ. డిగ్రీతో పాటు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ లాంటి కోర్సులు చేయాలంటే బీకాం చదవడం ఉపయోగకరం. భవిష్యత్తులో ఎంబీఏ చదవాలంటే బీబీఏతో పాటు, బీకాం పూర్తిచేసుకున్నవారూ అర్హులే. మీ దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఆశయాలనూ, ఆసక్తినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,  కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కె. వెంకటేష్‌

    Ans:

    ఇంటర్‌ బైపీసీ తర్వాత నర్సింగ్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, బయో మెడికల్‌ ఇంజినీరింగ్, జెనెటిక్స్, ఫోరెన్సిక్‌ సైన్సెస్, ఫిజియో థెరపీ,  ఫార్మసీ, ఆప్టోమెట్రీ, హెల్త్‌ సైకాలజీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, నేెచురోపతి, న్యూట్రిషన్, హోమ్‌ సైన్స్, హార్టి కల్చర్, ఆక్వా కల్చర్, ఫిషరీస్, ఫారెస్ట్రీ, జియాలజీ, ఫుడ్‌ సైన్స్, న్యూరో సైన్స్‌ కోర్సులు చదివే అవకాశం ఉంది. బయాలజీకి సంబధం లేని ప్రొఫెషనల్‌ కోర్సుల విషయానికొస్తే- ఐదు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ, బీబీఏ, టూరిజం, విజువల్‌ డిజైన్, హోటల్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్, ఫ్యాషన్‌ టెక్నాలజీ, మల్టీమీడియా, మాస్‌ కమ్యూనికేషన్‌ లాంటి కోర్సులు చదవవచ్చు. సాధారణంగా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రతి సంవత్సరం జులైౖలోగా పూర్తవుతాయి. కొన్ని కోర్సులకు ప్రవేశ పరీక్షల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా కేంద్రీకృత అడ్మిషన్లు నిర్వహిస్తారు. మరి కొన్ని కోర్సుల్లో ఇంటర్‌లో పొందిన మార్కుల ఆధారంగా ప్రవేశం పొందవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: రోహిత్‌

    Ans:

    దాదాపుగా ఆరేళ్ల విరామం తరువాత ఎస్‌ఏపీ ఫైనాన్స్‌ అండ్‌ కంట్రోలింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయించుకొన్నారు. అంటే మీ వయసు దాదాపు ముప్పై సంవత్సరాలు ఉండవచ్చు. బీబీఏ/ ఎంబీఏలో మీరు ఏ స్పెషలైజేషన్‌ చదివారో, ఉద్యోగానుభవం ఉందో, లేదో చెప్పలేదు. సాధారణంగా ఎస్‌ఏపీ ఫైనాన్స్‌ అండ్‌ కంట్రోలింగ్‌ని ఫైనాన్స్‌ రంగంలో కొంత అనుభవం పొందాక చేయడం శ్రేయస్కరం. ఈ రంగంలో ఉద్యోగం పొందాలంటే ఫైనాన్స్‌ నైపుణ్యాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా అవసరం. ఈ కోర్సు చేసినవారికి కన్సల్టెంట్లుగా ఉద్యోగావకాశాలుంటాయి. ఈ రంగంలో తక్కువ ఉద్యోగాలు అందుబాటులో ఉండటం వల్ల పోటీ ఎక్కువే. మీరు ఎస్‌ఏపీ ఎఫ్‌ఐసీఓ నేర్చుకొనేముందు ఫైనాన్స్‌ రంగంలో కనీసం రెండు సంవత్సరాలు పనిచేసి, ఆ విభాగానికి సంబంధించిన విషయాలపై పట్టు సాధించండి. ఈ కోర్సును మంచి శిక్షణ సంస్థ నుంచి నేర్చుకుంటే మెరుగైన ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఇందులో రాణించాలంటే అనలిటికల్, ప్రాబ్లం సాల్వింగ్, కమ్యూనికేషన్, ఇంటర్‌ పర్సనల్‌ నైపుణ్యాలు చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,  కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: ఎన్‌ అభిషేక్‌

    Ans:

    బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు తరువాత డేటా అనలిస్ట్‌ అవ్వాలన్న మీ నిర్ణయం సరైందే. బీకాం తరువాత, అవకాశం ఉంటే ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు కూడా చదవండి. డేటా అనలిస్ట్‌ అవ్వడానికి సంబంధించిన ప్రాథమిక మెలకువలను మీరు బిజినెస్‌ అనలిటిక్స్‌ డిగ్రీలో చదువుతారు. అవకాశం ఉంటే ఐఐటీ మద్రాస్‌ అందిస్తున్న ఆన్‌లైన్‌ బీఎస్‌సీ డేటా సైన్స్‌ డిగ్రీని కూడా పూర్తి చేయండి. అలా కాకపోతే డిగ్రీ చేస్తూనే, డేటా సైన్స్‌ కోర్సులను ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా చేయండి. డేటా అనలిస్ట్‌ అవ్వాలంటే మేథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్, కోడింగ్‌లపై మంచి పట్టుండాలి. మీరు ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సు చదివారు కాబట్టి, ఇంటర్‌ మ్యాథ్స్‌పై పట్టు సాధించండి. బీకాం డిగ్రీతో పాటు డేటా సైన్స్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు చేస్తూ, లైవ్‌ ప్రాజెక్టులు కూడా చేస్తే మీ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: వి.ఆశారాణి

    Ans:

    చదువుకు వయసుతో పనిలేదు. ఏ వయసులో అయినా చదువుకోవచ్చు. కాకపోతే, మీరు ఎందుకోసం చదవాలనుకుంటున్నారో తెలుసుకోండి. విజ్ఞానం కోసం, సమాజాన్ని తెలుసుకోవడానికి, పిల్లల్ని బాగా చదివించడానికి, వ్యాపారం కోసం, సమాజంలో హోదా, సమాజ సేవ, చిన్ననాటి కలల్ని నెరవేర్చుకోడం.. ఇలాంటివి ఏమైనా కావొచ్చు. ఏ కారణంతో అయినా సరే, ఈ వయసులో చదువు కొనసాగించాలన్న మీ ఆశయం అభినందనీయం. ముందుగా మీరు పదో తరగతిని ప్రైవేటుగా పరీక్ష రాసే ప్రయత్నం చేయండి. అలా కుదరని పక్షంలో ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదో తరగతి పూర్తి చేయండి. ఇంటర్‌ని కూడా ప్రైవేటుగా కానీ, ఓపెన్‌ స్కూల్‌ ద్వారా గాని పూర్తి చేయండి. ఇంకా ఆసక్తి ఉంటే, ఓపెన్‌ యూనివర్సిటీ లేదా దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేయండి. మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే ఇంటర్‌ తరువాత డీఈడీ.. కానీ, డిగ్రీ తరువాత బీఈడీ.. కానీ చేయవచ్చు. అలా కాకుంటే పదో తరగతి/ ఇంటర్‌ తరువాత నచ్చిన ఒకేషనల్‌ కోర్సు చదవండి. ఇంటర్‌/ డిగ్రీ తరువాత ఉద్యోగం త్వరగా లభించే కంప్యూటర్, టూరిజం, కుకింగ్, ఎంబ్రాయిడరీ, న్యూట్రిషన్, హోమ్‌ సైన్స్‌ లాంటి సబ్జెక్టుల్లో సర్టిఫికెట్‌ /డిప్లొమా కోర్సులు చేయండి. అవకాశం ఉంటే పీజీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎ.శ్రీహరి

    Ans:

    మీరు దూరవిద్యలో ఎంబీఏ చేయాలనుకొంటే ఆంధ్రప్రదేశ్‌ నుంచే చేయాల్సిన అవసరం లేదు. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ ద్వారా చేస్తే మీ డిగ్రీకి ఎక్కువ గుర్తింపు ఉండే అవకాశం ఉంది. పాండిచ్చేరి యూనివర్సిటీ దూరవిద్య ద్వారా కూడా ఎంబీఏ చదవొచ్చు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌ నుంచీ చదివే అవకాశం ఉంది. ఇవే కాకుండా సాంప్రదాయిక విశ్వవిద్యాలయాలైన ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో కూడా దూరవిద్య ద్వారా ఎంబీఏ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రైవేటు డీమ్డ్‌ టు బీ వర్సిటీల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఎంబీఏ చేయొచ్చు. వీటితో పాటు ఇతర రాష్ట్రాల ప్రముఖ ప్రైవేటు/డీమ్డ్‌ టు బీ వర్సిటీలు ఎంబీఏని ఆన్‌లైన్‌ విధానంలో అందిస్తున్నాయి. కోర్సును, యూనివర్సిటీని ఎంచుకొనేముందు ఆ కోర్సుకు యూజీసీ, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో అనుమతులు, ఏఐసీటీఈ గుర్తింపు, ఆ వర్సిటీకి న్యాక్‌ గ్రేడింగ్‌ ఏ/ఏ ప్లస్‌/ఏ ప్లస్‌ ప్లస్‌ ఉన్నాయో, లేదో తెలుసుకోండి. సాధారణంగా ఎంబీఏలో ప్రవేశం పొందాలంటే ఆ యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశపరీక్ష కానీ, రాష్ట్రస్థాయి ఐసెట్‌ కానీ రాయవలసి ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: టి.వంశీ

    Ans:

    రైల్వే కానిస్టేబుల్‌ నియామక పరీక్ష 120  మార్కులకు, 120 ప్రశ్నలతో, 90 నిమిషాల వ్యవధి గల కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ప్రతి సరైన సమాధానానికీ ఒక మార్కు, ప్రతి తప్పు సమాధానానికీ 0.33 నెగటివ్‌ మార్కులుంటాయి. రాత పరీక్ష, శారీరక దార్ఢ్య పరీక్ష, మెడికల్‌ టెస్ట్‌...ఈ మూడు దశలనూ విజయవంతంగా పూర్తి చేసినవారికి కానిస్టేబుల్‌ ఉద్యోగం లభిస్తుంది. రాత పరీక్షలో అరిథ్‌మెటిక్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ ఉంటాయి. ఆర్‌.ఎస్‌. అగర్వాల్‌ పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి. మాక్‌ టెస్ట్‌ల విషయానికొస్తే ఆన్‌లైన్‌లో చాలా వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉన్నాయి. విశ్వసనీయతను బట్టి సరైనవాటిని ఎంచుకోండి. వాటితో పాటు రైల్వే రిక్రూట్‌మెంట్‌ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, బ్యాంకింగ్‌కి సంబంధించిన నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: పావని

    Ans:

    మీరు డ్రాయింగ్‌ బాగా వేయగలను అంటున్నారు కాబట్టి, కార్టూన్లు వేయడం ఒక హాబీగా మొదలుపెట్టండి. మీరు వేసిన కార్టూన్లను వివిధ పత్రికలకు పంపుతూ మంచి పేరు తెచ్చుకోండి. ఆ తరువాత ఏదైనా పత్రికలో కార్టూనిస్ట్‌గా చేరవచ్చు. అలా కాకుండా, ఫ్రీలాన్సర్‌గా కూడా వివిధ పత్రికలకు, వాణిజ్య ప్రకటన సంస్థలకూ పనిచేయవచ్చు. కోర్సుల విషయానికొస్తే, కార్టూనిస్టుల కోసం ప్రత్యేకమైన కోర్సులు ఏమీ లేవు. యుడెమి, కోర్స్‌ ఎరా లాంటి ఆన్‌లైన్‌ వేదికల్లో కోర్సు చేయవచ్చు. మెరుగైన కెరియర్‌ కోసం డ్రాయింగ్‌ నైపుణ్యాలు అవసరమయ్యే సృజనాత్మక కోర్సులైన ఫైన్‌ ఆర్ట్స్, యానిమేషన్, విజువల్‌ ఆర్ట్, విజువల్‌ డిజైన్, గ్రాఫిక్‌ డిజైన్, డిజిటల్‌ గేమింగ్‌ డిజైన్‌ లాంటి కోర్సులు చేయండి. కార్టూన్లు వేయడంలో మరిన్ని మెలకువలు నేర్చుకోవడానికి ఎవరైనా ప్రముఖ కార్టూనిస్ట్‌ దగ్గర చేరి శిక్షణ పొందవచ్చు.

    Asked By: అల్తాఫ్‌

    Ans:

    వివిధ ప్రాంతాల్లో పర్యటించడమంటే ఇష్టం కాబట్టి మీరు డిగ్రీలో టూరిజం కోర్సు చదవండి. డిగ్రీ తరువాత టూరిజంలో పీజీ కూడా చేసి, ఆ రంగంలో కొలువు సంపాదిస్తే ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మీకు ఆసక్తి ఉంటే హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ హోటళ్లలో పనిచేసే అవకాశం కూడా ఉంటుంది.  షిప్‌లో షెఫ్‌గా చేరి సముద్రయానం కూడా చేయవచ్చు. డిగ్రీ, పీజీల్లో ఆర్కియాలజీ చదివి, ఆ రంగంలో ఉద్యోగం పొంది, పరిశోధనలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటించవచ్చు. ఇవే కాకుండా డిగ్రీ, పీజీల్లో ఆంత్రొపాలజీ, లింగ్విస్టిక్స్‌ లాంటి సబ్జెక్టులు చదివి, పరిశోధÅన రంగంలో ఉద్యోగం పొంది కూడా మీ కోర్కెను నెరవేర్చుకోవచ్చు. ఇంటర్‌ తరువాత ఏదైనా డిగ్రీ చేసి ఆర్మీ/ నేవీ/ఎయిర్‌ ఫోర్స్‌లో చేరి ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించవచ్చు. డిగ్రీ తరువాత బీఈడీ చేసి కేంద్రీయ విద్యాలయ, నవోదయ లాంటి పాఠశాలల్లో ఉద్యోగం పొందితే దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఉద్యోగం చేయొచ్చు. విదేశాల్లో ప్రముఖ యూనివర్సిటీల్లో పీజీ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌