Post your question

 

    Asked By: prasanth

    Ans:

    వీడియో గేమ్స్‌ అంటే ఇష్టం వేరు, వాటికి సంబంధించిన కోర్సులు చదవడం వేరు. చాలా సందర్భాల్లో ఒక వయసు వచ్చాక పిల్లల్లో వీడియో గేమ్స్‌ మీద ఆసక్తి తగ్గి, అందుకు సంబంధించిన కోర్సులపై ఇష్టం తగ్గే ప్రమాదం ఉంది. మీ అబ్బాయిని వీడియో గేమ్స్‌/ యానిమేషన్‌ లాంటి కోర్సుల్లో చేర్పించేముందు, ఆ రంగంలో రాణించాలంటే ఎంత ఓపిక ఉండాలో, ఎన్ని సవాళ్లు ఎదుర్కోవాలో, ఎలాంటి నైపుణ్యాలు అవసరమో చెప్పే ప్రయత్నం చేయండి. యానిమేషన్‌ రంగంలో ప్రవేశించాలంటే డ్రాయింగ్‌పై ఆసక్తి, టెక్నాలజీపై కొంత  అవగాహన, సృజనాత్మకత అవసరం. ఇలాంటి కోర్సుల్లో డ్రాయింగ్, విజువల్‌ ఎఫెక్ట్స్, వీడియో గేమ్‌లను ఎలా తయారుచేయాలో నేర్పుతారు. యానిమేషన్‌కు సంబంధించిన ప్రోగ్రాంలను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌- అహ్మదాబాద్, ఐడీసీ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ ఐఐటీ- బాంబే, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌- కోల్‌కతా, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, అమిటీ యూనివర్సిటీ, పీఏ ఇనాందార్‌ కాలేజ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్, డిజైన్‌ అండ్‌ ఆర్ట్‌- పుణె,   ఇండియన్‌ ఇన్‌స్ట్టిస్టూట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ యానిమేషన్‌- బెంగళూరు, ఆసియన్‌  అకాడెమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌- నోయిడా, ఎంఐటీ యూనివర్సిటీ ఆఫ్‌ డిజైన్‌- పుణె, సెయింట్‌ జేవియర్‌ కాలేజ్‌- కోల్‌కతా అందిస్తున్నాయి. వీడియో గేమింగ్‌కు సంబంధించిన కోర్సులు చాలా ప్రైవేటు సంస్థల్లో అందుబాటులో ఉన్నాయి. సంస్థల విశ్వసనీయత పూర్తిగా తెలుసుకుని మంచి శిక్షణ సంస్థను ఎంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: prasanth

    Ans:

    ఎంఏ ఎడ్యుకేషన్‌ చదివినవారికి గతంలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత ఉండేది. కాలక్రమేణా  డీఈడీ, బీఈడీ చేసినవారికి మాత్రమే ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత కల్పించారు. ఒడిశా లాంటి కొన్ని రాష్ట్రాల్లో డిగ్రీ స్థాయిలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులతో పాటు ఎడ్యుకేషన్‌ను కూడా ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు. అలాంటి కళాశాలల్లో ఎంఏ ఎడ్యుకేషన్‌తో పాటు నెట్‌/ సెట్‌/ పీహెచ్‌డీ అర్హతతో డిగ్రీ కళాశాల అధ్యాపకులుగా స్థిరపడవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ స్థాయిలో ఎడ్యుకేషన్‌ కోర్సు అందుబాటులో లేదు. మీకు ఎంఏ ఎడ్యుకేషన్‌తో పాటు, మరో సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ, ఎడ్యుకేషన్‌లో నెట్‌/ సెట్‌ ఉత్తీర్ణత సాధిస్తే, ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో అధ్యాపక ఉద్యోగాలకు అర్హులు అవుతారు.
    ఎంఏ ఎడ్యుకేషన్‌ చదివినవారికి ప్రత్యేకమైన ఉద్యోగావకాశాలు లేవు. దీన్ని మరో పీజీ సబ్జెక్టుగా మాత్రమే పరిగణించి, ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. విద్యా రంగానికి సంబంధించిన స్వచ్ఛంద సేవాసంస్థల్లో కొలువుల కోసం ప్రయత్నించవచ్చు. ఎడ్యుకేషన్‌ టెక్నాలజీలో అదనపు కోర్సులు చేసి ఎడ్యుటెక్‌ కంపెనీల్లోనూ, సైకాలజీలో అదనపు కోర్సులు చేసి విద్యాసంస్థల్లోనూ కౌన్సెలర్‌గా ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: prasanth

    Ans:

    స్నేహితులు, కౌన్సెలర్లు సలహాలు మాత్రమే ఇవ్వగలరు. చివరి నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ముందుగా సీనియర్‌ లాయర్‌ దగ్గర కొంతకాలం జూనియర్‌గా పనిచేసి, వృత్తి నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. తర్వాత ప్రాక్టీస్‌ పెట్టాలి. సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టాక, కొంతకాలం వరకు కేసులు ఎక్కువగా రాకపోవచ్చు. లాయర్ల సంఖ్య అధికంగా ఉండటం వల్ల పోటీ కూడా ఎక్కువగానే ఉంది. మీరు లాయర్‌గా స్థిరపడటానికి చాలా సమయం కూడా పట్టవచ్చు. ఉద్యోగం చేస్తే స్థిరమైన ఆదాయం ఉండొచ్చు కానీ, ఉద్యోగం రావడానికి ఎక్కువ సమయం అవసరం అవ్వొచ్చు. మీ దృష్టిలో ఉద్యోగం అంటే న్యాయవ్యవస్థకు సంబంధించిన ఉద్యోగమా, ఇతర ప్రభుత్వ/ ప్రైవేటు ఉద్యోగమా అనేది చెప్పలేదు. ప్రాక్టీస్‌ చేయడమా, ఉద్యోగం చేయడమా అనేది మీ వ్యక్తిగత నిర్ణయం. జీవితంలో ఆర్థిక స్థాయితో పాటు మనసుకు నచ్చిన పని చేయడం కూడా ముఖ్యం. లాయర్‌గా ప్రాక్టీస్‌ చేయాలన్న బలమైన కోరిక ఉంటే, అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. కెరియర్‌లో రిస్క్‌ తీసుకోవడం, ఉద్యోగ భద్రత, పరిమిత జీతం, అపరిమితమైన పేరు ప్రఖ్యాతులు, మెరుగైన ఆదాయం లాంటి వాటిని పరిగణనలోకి తీసుకొని నచ్చిన నిర్ణయం దిశగా అడుగులేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: ఆర్‌.శ్యామ్‌సుందర్‌

    Ans:

    మీరు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన తరువాత యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధం అవ్వాలని ఉందన్నారు. మీ దృష్టిలో యూపీఎస్సీ పరీక్ష అంటే సివిల్సా, ఇంజినీరింగ్‌ సర్వీసా అనేది చెప్పలేదు. పీయూసీ చదివేప్పుడే భవిష్యత్తు కెరియర్‌ గురించి ఆలోచించడం, యూపీఎస్సీ పరీక్ష లాంటి అత్యున్నత లక్ష్యాన్ని ఎంచుకోవడం అభినందనీయం! అయితే, మీరు ఇప్పుడు చదువుతున్న పీయూసీపై శ్రద్ధ పెట్టి, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని, ఇంజినీరింగ్‌ కోర్సును ఉత్తమ విద్యా సంస్థ నుంచి చదివే ప్రయత్నం చేయండి. ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం నుంచి యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధత మొదలు పెట్టండి.
    యూపీఎస్సీ పరీక్షలకూ, బోర్డ్‌/ యూనివర్సిటీ పరీక్షలకూ చాలా తేడా ఉంటుంది. బోర్డ్‌/ యూనివర్సిటీ పరీక్షల్లో ప్రశ్నల్ని నేరుగా ఇస్తే, యూపీఎస్సీలో అప్లికేషన్‌పై ఎక్కువగా అడుగుతారు. యూపీఎస్సీ సిలబస్‌లో జనరల్‌ స్టడీస్, కరెంట్‌ అఫైర్స్‌లు కూడా భాగం. కాబట్టి, ఇంజినీరింగ్‌ పుస్తకాలతో పాటు వార్తా పత్రికలను చదవడం మీ రోజు వారి జీవితంలో భాగం చేసుకోండి. యూపీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నలు ఆలోచనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, సృజనాత్మకంగా, సమస్య- పరిష్కార పద్ధతుల్లో ఉంటాయి. మీరు పరీక్షలకు చదివేప్పుడు బట్టీ పట్టి చదవడం కాకుండా, అర్థం చేసుకొని, సొంతంగా నోట్సు రాసుకుంటూ చదవాలి. అప్పుడే విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. యూపీఎస్సీ పరీక్షలో రాణించాలన్న బలమైన ఆశయం ఉండి, ప్రణాళికయుతంగా కొన్ని సంవత్సరాల పాటు కృషి చేస్తే, మీ కలను నెరవేర్చుకోవడం అసాధ్యం కాదు. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: రమణ

    Ans:

    మీరు బీటెక్‌లో ఏ బ్రాంచి చదివారో, సాఫ్ట్‌వేర్‌లో ఏ ఉద్యోగం చేశారో చెప్పలేదు. ప్రభుత్వ ఉద్యోగం అంటే, ఇంజినీరింగ్‌కు సంబంధించినదా? గ్రూప్స్‌ లాంటిదా? ఏ ప్రభుత్వ కొలువుకు అయినా చాలా పోటీ ఉంటుంది కాబట్టి, ప్రణాళికాబద్ధంగా, పట్టుదలతో సమయపాలనను పాటిస్తూ సన్నద్ధం అవ్వాలి. అప్పుడు సర్కారీ ఉద్యోగం పొందడం కష్టం కాదు. మీ విద్యార్హతతో ఏయే ఉద్యోగాలకు అర్హులు అవుతారో, ఏ ఉద్యోగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఆ తరువాత ఆ ఉద్యోగ పరీక్షకు సంబంధించిన పూర్వ ప్రశ్నపత్రాలను సేకరించండి. ఆ పరీక్షకు నిర్థÄరించిన సిలబస్‌ని చూసి ఎంత సన్నద్ధత అవసరమో అంచనా వేయండి. సిలబస్‌కు సంబంధించిన పాఠ్యపుస్తకాలూ, రిఫరెన్స్‌ పుస్తకాలూ కొనుగోలు చేయండి. ప్రతిరోజూ వార్తా పత్రికల్ని చదువుతూ, అందులోని సంపాదకీయ పేజీలో వచ్చే వ్యాసాల్లోని ముఖ్యాంశాలతో సొంత నోట్స్‌ తయారు చేసుకోండి. కరెంట్‌ అఫైర్స్‌పై కూడా దృష్టి పెట్టండి. సిలబస్‌కి అనుగుణంగా నోట్స్‌ తయారు చేసుకొంటూ, అర్థం చేసుకొని చదవడం అలవాటు చేసుకోండి. ఆ పరీక్షలో విజయం సాధించి ఉద్యోగం చేస్తున్నవారిని సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోండి. అదే విధంగా, ఆ పోటీ పరీక్షకు సన్నద్ధం అవుతున్నవారితో చర్చిస్తూ సన్నద్ధతలో మెలకువలు నేర్చుకోండి. వీలున్నన్ని నమూనా పరీక్షలు రాస్తూ, పోటీ పరీక్ష రాయడంలో మీ వేగాన్ని పెంచుకోండి. చివరిగా, ఆర్థిక వెసులుబాటు ఉంటే, విశ్వసనీయత ఉన్న శిక్షణ సంస్థలో కోచింగ్‌ పొందే విషయాన్ని కూడా పరిగణించండి. వివిధ ఉద్యోగ పోటీ పరీక్షల్లో విజయం పొందినవారి ఇంటర్వ్యూలను చూస్తూ ప్రేరణ పొందుతూ, ప్రభుత్వ కొలువు పొందాలన్న మీ ఆశయం నెరవేర్చుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: బి.నీలిమ

    Ans:

    ఒకే సమయంలో రెండు డిగ్రీలు చదివితే, ఆ రెండు డిగ్రీలూ చెల్లుబాటు అవుతాయా? అనే సందేహం చాలా సంవత్సరాలుగా చాలామందిని వేధిస్తూనే ఉంది. ఈ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఏక కాలంలో రెండు డిగ్రీలు చదవడానికి వెసులుబాటు కల్పించే నిబంధనలను యూజీసీ 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గతంలో కొన్ని నియామక సంస్థలు రెండు డిగ్రీలు ఏక కాలంలో చదివినప్పటికీ, అవి ఒకటి రెగ్యులర్, మరొకటి దూరవిద్య ద్వారా అయితే ఆ రెండు డిగ్రీలనూ పరిగణనలోకి తీసుకొనేవి, ఉద్యోగావకాశాలు కల్పించేవి. కొన్ని సందర్భాల్లో మాత్రం దరఖాస్తు నింపేటప్పుడు రెండు డిగ్రీలు చదివిన కాలాన్ని ఒకే సంవత్సరంలో పేర్కొంటే, కంప్యూటర్‌ పోర్టల్‌లో ఎర్రర్‌ మెసేజ్‌ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు యూజీసీ అధికారికంగా అనుమతి ఇచ్చినందున భవిష్యత్తులో ఈ  సమస్య కూడా పరిష్కారం కావొచ్చు. మీరు టెట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉంటే, స్కూల్‌ అసిస్టెంట్, పీజీటీ ఉద్యోగాలకు అర్హురాలిని అన్న నమ్మకంతో ఉద్యోగ సన్నద్ధత మొదలు పెట్టండి. ఒకవేళ ఒకే సమయంలో చదివిన రెండు డిగ్రీలూ చెల్లుబాటు కావేమో అన్న సందేహం ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూవుంటే.. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరో పీజీని దూరవిద్య ద్వారా పూర్తిచేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

     

    Asked By: దుర్గాదేవి

    Ans:

    సాధారణంగా బీఎస్సీ (బీజడ్‌సీ) చదివినవారికి అగ్రోనమిస్ట్, బయోకెమిస్ట్, బయో ఫిజిసిస్ట్, ఎపిడమాలజిస్ట్, ఫుడ్‌ సైంటిస్ట్, హార్టికల్చరిస్ట్, ఇమ్యునాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్‌.. ఇలాంటి ఉద్యోగావకాశాలు ఉంటాయి. మీకు పీజీ చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఏవైనా సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. హెల్త్‌కేర్‌ రంగంపై ఆసక్తి ఉంటే అనస్థీషియా టెక్నీషియన్, డయాలసిస్‌ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, న్యూరో ఫిజియాలజీ టెక్నీషియన్, ఈఎన్‌టీ టెక్నీషియన్, ల్యాబొరేటరీ సేఫ్టీ, మెడికల్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్, ఆఫ్తల్మాలజీ, డెంటల్‌ హైజీనిస్ట్, డెంటల్‌ మెకానిక్, డెంటల్‌ ఆపరేటింగ్‌ రూమ్‌ అసిస్టెంట్, పల్మనరీ టెక్నీషియన్‌ లాంటి సర్టిఫికెట్‌ కోర్సులు చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. ఫార్మా కంపెనీల్లో కెమిస్ట్‌గా, సేల్స్‌ రిప్రజెంటేటివ్‌గా కూడా పనిచేసే అవకాశాలుంటాయి. కోడింగ్‌పై ఆసక్తి ఉంటే మెడికల్‌ కోడింగ్‌లో శిక్షణ తీసుకొని మెడికల్‌ కోడర్‌గానూ ప్రయత్నాలు చేయవచ్చు. ఇవే కాకుండా- సీక్వెన్సింగ్, క్లినికల్‌ డేటా మేనేజ్‌మెంట్, మాలిక్యులర్‌ బయాలజీ, బయో స్టాటిస్టిక్స్‌ల్లో కూడా సర్టిఫికెట్‌ కోర్సులు చేయవచ్చు. బోధనరంగంపై ఆసక్తి ఉంటే ఉపాధ్యాయ శిక్షణ పొంది టీచర్‌గా స్థిరపడవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్,  కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: అఖిల్‌

    Ans:

    మీరు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ, బీఈడీ చేశాక ‘డీ…ఎస్సీకి అర్హత లేదు’ అని ఎందుకు అన్నారో కారణం తెలుసుకొని ఉండాల్సింది. అప్పుడే మీరు ఉన్నతాధికారులనో, న్యాయస్థానాన్నో ఆశ్రయించివుంటే, మీ సమస్యకు పరిష్కారం లభించివుండేది. మీరు ఇంటిగ్రేటెడ్‌ పీజీ చదివిన విద్యాసంస్థను సంప్రదించి డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు విడివిడిగా ఇస్తారేమో కనుక్కోండి. కొన్ని యూనివర్సిటీలు ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో ఎగ్జిట్‌ క్లాజ్‌ ప్రవేశపెట్టి యూజీ, పీజీ రెండు డిగ్రీలూ ఇస్తున్నాయి. ఇక మీ ప్రశ్న విషయానికి వస్తే- మీరు బీఈడీ చేసిన తరువాత డిగ్రీ చదివినా, డీఎస్సీకి అర్హులవుతారు. మీరు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బీఈడీ తరువాత డిగ్రీ చేశారు కాబట్టి ఆ విషయాన్ని సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ సమయంలో చెప్పే ప్రయత్నం చేయండి. ఒకవేళ వారు ఒప్పుకోకపోతే పై అధికారుల్ని కలవండి. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చాక, ఇలాంటి చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీరు నిరభ్యంతరంగా డీఎస్సీకి సన్నద్ధం కండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: బి.సునీత

    Ans:

    బీబీఏ చేసి సప్లై చెయిన్‌ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు కాబట్టి, ఆ సబ్జెక్టులో పీజీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. మనదేశంతో పోలిస్తే విదేశాల్లో సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ను అందించే విద్యాసంస్థలు ఎక్కువ. ఈ రంగంలో ఉద్యోగావకాశాలు కూడా విదేశాల్లోనే అధికం. కాకపోతే, విదేశాల్లో విద్యాభ్యాసానికి చాలా ఖర్చు అవుతుంది. ప్రస్తుతం విదేశాల్లో ఉద్యోగావకాశాలు తక్కువ కాబట్టి విదేశీ విద్య విషయంలో కొంతకాలం వేచివుండటం మంచిది. ఇక మనదేశంలో ఐఐఎం కోజికొడ్, ఐఐఎం తిరుచ్చి, ఐఐఎం ఉదయ్‌పుర్, ఐఐటీ రూర్కి, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్, మణిపాల్‌ యూనివర్సిటీ, నిక్‌మార్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి విద్యాసంస్థలు సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ/ పీజీ డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తున్నాయి. వీటితోపాటు చాలా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌లో వివిధ కోర్సులు అందిస్తున్నాయి. ఈ రంగంలో రాణించాలంటే ఆప్టిమైజేషన్‌ నైపుణ్యాలు, కంప్యూటర్‌ పరిజ్ఞానం, ప్రాబ్ల్లమ్‌ సాల్వింగ్‌/ డెసిషన్‌ మేకింగ్‌/ టైం మేనేజ్‌మెంట్‌/ కమ్యూనికేషన్‌ మెలకువలు చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: తేజ

    Ans:

    ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే, ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు బోధించడానికి స్పీచ్‌ థెరపీ కోర్సులను నేర్చుకోవాలన్న మీ కోరిక అభినందనీయం. సాధారణంగా ఇలాంటి కోర్సులను ప్రత్యక్ష విధానంలో చదివితేనే నైపుణ్యాలు మెరుగవుతాయి. మీకు రెగ్యులర్‌ కోర్సులు చదవడానికి వీలు అవ్వకపోతే- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్, దిల్లీ స్టేట్‌ గవర్నమెంట్‌ పారామెడికల్‌ కౌన్సిల్, యుడెమిల ద్వారా ఆన్‌లైన్‌ కోర్సులు చేసే అవకాశం ఉంది. చాలా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రైవేటు ఈఎన్‌టీ హాస్పిటల్స్‌ కూడా స్పీచ్‌ థెరపీలో ఆన్‌లైన్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఆ సంస్థల విశ్వసనీయత గురించి పూర్తిగా తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌