Post your question

 

    Asked By: వి.స్నేహ

    Ans:

    నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం- ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలంటే ఇంటర్‌/ డిగ్రీతో పాటు డీఈడీ/ బీఈడీ పూర్తి అయి ఉండాలి. అదనంగా టెట్‌/ సీ టెట్‌లో కూడా కచ్చితంగా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఉపాధ్యాయ శిక్షణ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల అభ్యర్థనల మేరకు కొన్ని సందర్భాల్లో, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు డీఈడీ../ బీఈడీ చివరి సెమిస్టర్‌/ సంవత్సరం చదువుతున్నవారికి కూడా డీఎస్సీకి దరఖాస్తు చేయడానికి అవకాశం ఇస్తున్నాయి. కానీ, డీ.. ఎస్సీ ఫలితాలు విడుదలై, సర్టిఫికెట్ల పరిశీలన నాటికి డీఈడీ/ బీఈడీ ఫలితాలు వచ్చి ఉండాలి.
    మీ విషయానికొస్తే.. ప్రస్తుతం బీఈడీ మూడో సెమిస్టర్‌లో ఉన్నారు. బీఈడీ పూర్తి అయి ఫలితాలు వచ్చేవరకు మరో సంవత్సరం పట్టొచ్చు. టెట్‌ రాయాలంటే మీరు బీఈడీ రెండో సంవత్సరంలో ఉండాలి. టెట్‌ నోటిఫికేషన్‌ వచ్చాక దానికి దరఖాస్తు చేసి అందులో ఉత్తీర్ణత సాధిస్తే, తర్వాత వచ్చే డీ.. ఎస్సీ నోటిఫికేషన్‌లో బీఈడీ చివరి సంవత్సరం చదువుతున్నవారికి అవకాశం కల్పిస్తే, మీరు ఆ డీఎస్సీకి అర్హులవుతారు. బీఈడీ చదువుతూ ఒకే సంవత్సరంలో టెట్, డీఎస్సీ లాంటి రెండు పోటీ పరీక్షలకు సన్నద్ధత సాధించడం చాలా కష్టం. ఈ క్రమంలో మీరు ప్రస్తుతం చదువుతున్న బీఈడీ శిక్షణపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ముందుగా మీరు బీఈడీ కోర్సును శ్రద్ధగా చదువుతుండండి. టెట్‌/ సీటెట్‌కు దరఖాస్తు చేసి, అందులో ఉత్తీర్ణత సాధిస్తే, వచ్చే సంవత్సరం వెలువడే డీఎస్సీ నోటిఫికేషన్‌కు మీరు అర్హులవుతారు.
    - ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: వివేక్‌

    Ans:

    మీరు ఇంటర్మీడియెట్‌ 2014లో అంటే, దాదాపు పదేళ్ల క్రితం పూర్తిచేశారు. పదో తరగతిని బట్టి మీ వయసు అటు ఇటుగా 30 సంవత్సరాలు ఉండొచ్చు. మీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగమా? ప్రైవేటు ఉద్యోగమా అనే విషయంపై స్పష్టత అవసరం. కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌ కోర్సుతో ఐటీఐ చేశారు కాబట్టి కంప్యూటర్‌ రంగంలోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయడం శ్రేయస్కరం. ముందుగా ఓపెన్‌ యూనివర్సిటీ ద్వారా కానీ, దూరవిద్య ద్వారా కానీ కంప్యూటర్‌ కు సంబంధించిన సబ్జెక్టుతో డిగ్రీ పూర్తి చేయండి. ఈలోగా కొన్ని కంప్యూటర్‌ కోడింగ్, ప్రోగ్రామింగ్‌ కోర్సులు నేర్చుకోండి. డిగ్రీ చదువుతూనే కొంత అనుభవం గడించండి. డిగ్రీ పూర్తయ్యాక ఈ అనుభవంతో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు కనీస విద్యార్హత డిగ్రీ కాబట్టి డిగ్రీని పూర్తిచేయడం చాలా అవసరం. ఇలాచేస్తే పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పలు పరీక్షలకు అర్హులవుతారు. అలా కాకుండా మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ, న్యాయవాది అవ్వాలనుకొంటే ఎల్‌ఎల్‌బీ, జర్నలిస్ట్‌ కావాలంటే జర్నలిజం, లెక్చరర్‌ అవ్వాలనుకొంటే మీకు నచ్చిన సబ్జెక్టులో పీజీ చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: ఎ.వేణు

    Ans:

    నటన అంటే చాలా ఇష్టం అన్నారు. కానీ  ఇప్పటివరకు మీరు నటన ఎక్కడైనా నేర్చుకొన్నారా, ఏమైనా సాధన చేశారా? పాఠశాల, కళాశాలల్లో నటించిన అనుభవం ఉందా? కొన్ని శిక్షణ సంస్థలు నటనకు సంబంధించిన ప్రోగ్రాంలో ప్రవేశం కల్పించడానికి నటనలో పూర్వానుభవం కూడా ఉండాలని ఆశిస్తాయి. నటనలో ప్రాథమిక కోర్సులు చేయాలనుకుంటే- పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల్లో డిప్లొమా ప్రోగ్రాములు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో వివిధ స్టూడియోల నుంచి కూడా నటనకు సంబంధించిన అనేక స్వల్పకాలిక వర్క్‌షాపులు ఉన్నాయి. అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా, రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్, దాదాసాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌స్టడీస్, మధు ఫిలిం ఇన్‌స్ట్టిట్యూట్, మయూఖ మొదలైన సంస్థల్లో ఫిల్మ్‌ యాక్టింగ్‌ కోర్సులు ఉన్నాయి. ఏదైనా నట శిక్షణ సంస్థలో చేరేముందు, ఆ సంస్థ విశ్వసనీయత తెలుసుకోండి. మీకు ఇప్పటికే థియేటర్‌ యాక్టింగ్‌లో కొంత శిక్షణ, అనుభవం ఉంటే నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, బెంగళూరులో ఒక సంవత్సరం యాక్టింగ్‌ కోర్సు చేయొచ్చు. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా దిల్లీలో మూడేళ్ల ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, పుణేలో రెండేళ్ల యాక్టింగ్‌ కోర్సు ఉంది. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీలు థియేటర్‌ ఆర్ట్స్‌లో మాస్టర్స్‌ కోర్సుల్ని అందిస్తున్నాయి. నటనలో రాణించాలంటే.. నైపుణ్యాలతో పాటు అనుభవం, సామర్థ్యం, పరిజ్ఞానం కూడా చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: హరికృష్ణ

    Ans:

    టౌన్‌/ అర్బన్‌ ప్లానింగ్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్ని రెగ్యులర్‌ పద్ధ్దతిలో చదివితేనే వృత్తి నైపుణ్యాలు మెరుగవుతాయి. ఒకవేళ, మీరు ప్రస్తుతం అదే రంగంలో పనిచేస్తూ, విద్యార్హతలు పెంచుకోవాలనుకొంటే కరస్పాండెన్స్‌/ డిస్టెన్స్‌/ ఓపెన్‌/ ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ పీజీ కోర్సులు ఉపయోగపడతాయి. సాధారణంగా టౌన్‌ ప్లానింగ్‌లో పీజీ కోర్సులను ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీలు బీఆర్క్‌ చదివినవారికి మాత్రమే రెగ్యులర్‌ పద్దతిలో అందిస్తున్నాయి. అతికొద్ది విద్యాసంస్థలు మాత్రమే టౌన్‌/ అర్బన్‌ ప్లానింగ్‌లో సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) పీజీ డిప్లొమా ఇన్‌ అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంని  అందిస్తోంది. స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌, దిల్లీ.. సిటీ అండ్‌ మెట్రోపాలిటన్‌ ప్లానింగ్‌నూ, ఐఐటీ ఖరగ్‌పూర్‌.. అర్బన్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టమ్స్‌లో, ఐఐటీ రూర్కీ.. ఇంట్రడక్షన్‌ టు సర్వీసెస్‌ ప్లానింగ్‌లో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ కోర్సులను ‘స్వయం’ పోర్టల్‌ ద్వారా అందిస్తున్నాయి. ఇవే కాకుండా కొన్ని ప్రైవేటు/ విదేశీ యూనివర్సిటీలు కూడా టౌన్‌/ అర్బన్‌ ప్లానింగ్‌లో ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఆ సంస్థల విశ్వసనీయత పూర్తిగా తెలుసుకొని ప్రవేశం విషయంలో సరైన నిర్ణయం తీసుకోండి. ది గ్లోబల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, నాగాలాండ్‌లో అర్బన్‌ ప్లానింగ్‌లో ఎమ్మెస్సీ ప్రోగ్రాం దూరవిద్య ద్వారా అందుబాటులో ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: బి.చరణ్‌

    Ans:

    మీరు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమాను 88.85 శాతంతో పూర్తిచేసి బీటెక్‌ చేస్తున్నాను అన్నారు. ఇప్పుడు బీటెక్‌ని కూడా కనీసం 70 శాతం మార్కులతో పూర్తి చేయండి. ఆ తరువాత విదేశాల్లో ఎంఎస్‌ చేయడానికి అవసరమైన జీఆర్‌ఈ, టోఫెల్‌/ ఐఈఎల్‌ టీఎస్‌ లాంటి పరీక్షల్లో కూడా మంచి స్కోరు పొందండి. అప్పుడు మీ మొత్తం విద్యార్హతల్లో ఒక్క పదో తరగతిలోనే తక్కువ స్కోరు ఉంటుంది కాబట్టి, మీ ఎంఎస్‌ అడ్మిషన్‌కు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరు మంచి విదేశీ యూనివర్సిటీ నుంచి మంచి పర్సెంటే జ్‌తో ఎంఎస్‌ పూర్తి చేసి, ఆ కోర్సుకు సంబంధించిన విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు పొందినట్లయితే, మీ ఉద్యోగాన్వేషణలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.
    గతంలో తక్కువ మార్కులు వచ్చాయని బాధపడుతూ, వర్తమానంలో చదువుతున్న కోర్సును అశ్రద్ధ చేస్తూ, భవిష్యత్తుపై నమ్మకాన్ని కోల్పోకండి. విదేశీ యూనివర్సిటీలు, విదేశీ ఉద్యోగ సంస్థలు ఒక అభ్యర్థికి విద్యా, ఉద్యోగావకాశాలు కల్పించేప్పుడు మార్కుల కంటే ఎక్కువగా వ్యక్తిత్వం, ప్రేరణ, భవిష్యత్‌ ప్రణాళికలు, పోటీ పరీక్షలో వచ్చిన స్కోర్లు, రిఫరెన్స్‌ లెటర్స్, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్, ఎక్‌స్ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌.. ఇవన్నీ మూల్యాంకనం చేసి అడ్మిషన్‌/ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పదో తరగతిలో మీకు తక్కువ మార్కులు వచ్చాయన్నది పక్కన పెట్టి, ఇప్పుడు చదువుతున్న కోర్సుపై శ్రద్ధ పెట్టండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: ఎస్‌.పవన్‌

    Ans:

    మీరు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్‌ ఏ సంవత్సరంలో తీసుకున్నారో చెప్పలేదు. డీఆర్‌ బీఆర్‌ఏఓయూలో 2017 నుంచి సీబీసీఎస్‌ (చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం)ను ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో డిగ్రీ పూర్తయ్యాక, అదనపు కోర్సును చదివే వెసులుబాటు లేదు. 2017కి ముందు అడ్మిషన్‌ తీసుకొన్నవారికి ఈ వెసులుబాటు ఉండేది. సీబీసీఎస్‌ పథకం మొదలై దాదాపు ఏడు సంవత్సరాలు అయింది కాబట్టి, ప్రస్తుతం అదనపు సబ్జెక్టు చదివే అవకాశం లేదు. ఏదైనా ప్రైవేటు యూనివర్సిటీని  సంప్రదించి ఇలాంటి వెసులుబాటు ఇస్తారేమో కనుక్కోండి. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక, కల్పించే వెసులుబాట్లు పాత విద్యార్థులకు వర్తింపచేస్తారా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేము. మరింత సమాచారం కోసం డీఆర్‌ బీఆర్‌ఏఓయూలో స్టూడెంట్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ను సంప్రదించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: జె.శ్రీనివాస్‌

    Ans:

    బీసీఏ (బ్యాచిలర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) ప్రోగ్రాంలో ప్రవేశం పొందాలంటే ఇంటర్మీడియట్‌లో కచ్చితంగా మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలన్న నిబంధన ఉండేది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవకపోయినా, బీసీఏ ప్రోగ్రాం లో అడ్మిషన్లు కల్పిస్తున్నారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ, బీసీఏ చదవాలంటే ప్లస్‌ టూలో మ్యాథ్స్‌ చదవాలన్న నిబంధన అమల్లో ఉంది. చాలా ప్రైవేటు యూనివర్సిటీల్లో ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవకపోయినా బీసీఏ చదివే అవకాశం ఉంది. ఇటీవల చాలా ప్రైవేటు యూనివర్సిటీలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ బీసీఏ ప్రోగ్రాంలో కూడా ఇంటర్‌ ఏ సబ్జెక్టుతో చదివినా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్‌ లాంటి ప్రోగ్రాంలు మాత్రమే ఏఐసీటీఈ పరిధిలో ఉండేవి. ఈ విద్యా సంవత్సరం నుంచి బీబీఏ, బీసీఏ ప్రోగ్రాంలను కూడా దీని పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకనుంచి ఏఐసీటీఈ వారు నిర్థ్ధరించిన విద్యార్హతలతోనే  బీసీఏ ప్రోగ్రాంలో ప్రవేశాలు కల్పించే అవకాశం ఉంది.
    జాతీయ విద్యావిధానం- 2020 ప్రకారం ఏఐసీటీఈ చాలా విద్యార్హతలను సమీక్షిస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూనే ఉంది. అందులో భాగంగా 29 ఇంజినీరింగ్‌ ప్రోగ్రామ్స్‌లో 10 ప్రోగ్రామ్స్‌కి ఇంటర్‌లో మ్యాథ్స్‌ కోర్సును చదివి ఉండాలన్న నిబంధనను మినహాయించారు. ఈ  మినహాయింపు ఇచ్చినవాటిలో కంప్యూటర్‌ సైన్స్‌కి సంబంధించిన ప్రోగ్రామ్స్‌ ఏమీ లేవు. మీరు బీసీఏ ప్రోగ్రాంకు అర్హులా? కాదా అనే విషయం తెలియాలంటే ఈ విద్యా సంవత్సరం డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్లు వచ్చేవరకు వేచి ఉండండి. చివరిగా ఇంజనీరింగ్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లాంటి ప్రొఫెషనల్‌/ టెక్నికల్‌ కోర్సులు చదవాలంటే మ్యాథమెటిక్స్‌ ప్రావీణ్యం చాలా అవసరం. అవకాశం ఉంటే, గణితంలో బ్రిడ్జి కోర్సు చేసి నైపుణ్యాలు పెంచుకోండి.
    రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవకపోయినా, బీసీఏ ప్రోగ్రాంలో అడ్మిషన్లు కల్పిస్తున్నారు. కానీ, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటికీ, బీసీఏ చదవాలంటే ప్లస్‌ టూలో మ్యాథ్స్‌ చదవాలన్న నిబంధన అమల్లో ఉంది.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

     

    Asked By: శ్రీనివాస్‌

    Ans:

    ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఎంసీఏ (మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) ప్రోగ్రాంలో ప్రవేశం పొందాలంటే డిగ్రీ లేదా ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో మాత్రం ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవకపోయినా ఎంసీఏలో చేరవచ్చు. కానీ అలాంటి విద్యార్థులు ఎంసీఏ మొదటి సంవత్సరం సబ్జెక్టులతో పాటు, మ్యాథమెటిక్స్‌ను బ్రిడ్జ్‌ కోర్సుగా చదివి ఉత్తీర్ణత సాధించాలి. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఎంసీఏ ప్రోగ్రాం విద్యార్హతలను ఏఐసీటీఈ ఇంకా ప్రకటించలేదు. జాతీయ విద్యావిధానం - 2020 పూర్తి స్థాయిలో  అమల్లోకి వస్తే ఏ డిగ్రీ చదివినవారైనా, ఏ పీజీ ప్రోగ్రాంలో అయినా ప్రవేశం పొందే వీలుంటుంది. కానీ, అంతకంటే ముందు ఇంటర్మీడియట్, డిగ్రీ పాఠ్య ప్రణాళికల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఇంటర్‌/ డిగ్రీలో మ్యాథ్స్‌ చదవనివారు ఎంసీఏ చదవడానికి అవకాశం ఉందో, లేదో తెలియాలంటే ఈ విద్యా సంవత్సరం ఐసెట్‌/ నిమ్‌సెట్‌ అడ్మిషన్ల నోటిఫికేషన్లు వచ్చేవరకు వేచి ఉండండి. ఇంజినీరింగ్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లాంటి ప్రొఫెషనల్, టెక్నికల్‌ కోర్సులకు మ్యాథ్స్‌లో ప్రావీణ్యం చాలా అవసరం. కాబట్టి గణితంలో బ్రిడ్జి కోర్సు చేసి.. నైపుణ్యాలు పెంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

     

    Asked By: ఐశ్వర్య

    Ans:

    ఆంధ్రా యూనివర్సిటీకి న్యాక్‌ గ్రేడింగ్‌ ఆధారంగా యూజీసీ గ్రేడ్‌ వన్‌ అటానమస్‌ హోదా కల్పించారు. దీనివల్ల యూనివర్సిటీకి కొత్త కోర్సుల రూపకల్పనకు అవసరమైన స్వయంప్రతిపత్తి ఉంటుంది. ఏదైనా యూనివర్సిటీ నిర్వహించే దూరవిద్య, ఆన్‌లైన్‌ ప్రోగ్రాంలకు యూజీసీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో (డెబ్‌) అనుమతి తప్పనిసరి. సాధారణంగా, ప్రభుత్వ యూనివర్సిటీలు జారీచేసే డిగ్రీల విషయంలో నియామక సంస్థలకు ఎలాంటి అనుమానాలూ ఉండవు. ఏదైనా పోటీ పరీక్షకు డిగ్రీ అనేది ఒక విద్యార్హత మాత్రమే. రాత పరీక్షలో, ఇంటర్వ్యూలో చూపే ప్రతిభపైనే మీ ఉద్యోగావకాశాలు ఆధారపడి ఉంటాయి. మీరు యూనివర్సిటీ నుంచి డెబ్‌ జారీ చేసిన అనుమతి పత్రాన్ని తీసుకొని భద్రపర్చుకోండి. భవిష్యత్తులో ఏదైనా ఇంటర్వ్యూలో అవసరం అయితే ఉపయోగపడవచ్చు. మీరు ప్రస్తుతం చదువుతున్న ఆన్‌లైన్‌ ఎంఏతో పీహెచ్‌డీ, ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌లతో పాటు అన్ని పోటీ పరీక్షలకూ అర్హులవుతారు. జాతీయ విద్యావిధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక రెగ్యులర్, డిస్టెన్స్, ఆన్‌లైన్‌ డిగ్రీలు అన్నింటికీ ఒకే రకమైన గుర్తింపు ఉండే అవకాశాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: అశోక్‌ యాదవ్‌

    Ans:

    మీరు డిప్లొమాలో ఏ సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. గత సంవత్సరం వరకు నీట్‌ రాయాలంటే, ఇంటర్మీడియట్‌లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కచ్చితంగా చదివి ఉండాలి. కానీ, జాతీయ విద్యావిధానం- 2020లో భాగంగా ఈ సంవత్సరం నుంచి నీట్‌ విద్యార్హతల్లో కొంత వెసులుబాటు కల్పించాలని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ వారు నిర్ణయించారు. అందులో భాగంగా.. ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే చదివివుంటే, ఆ తర్వాత గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి అదనపు సబ్జెక్ట్‌గా బయాలజీ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించినవారినీ నీట్‌కు అనుమతించాలని నిర్ణయించారు. ఇలాంటి విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదవాలంటే, వారి విద్యార్హతలు నిర్థÄరిస్తూ నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ వారు జారీ చేసే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌ అవసరం. నీట్‌ 2024 నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు మాత్రమే ప్రామాణికంగా తీసుకొని మీ అర్హతను నిర్థÄరించుకోండి. మీరు డిప్లొమాలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివివుంటే, ఆ డిప్లొమాని, ఇంటర్మీడియట్‌కు సమానంగా ప్రభుత్వం గుర్తించి ఉంటే, మీరు నీట్‌ రాయడానికి అర్హులు అవుతారు. ఒకవేళ, మీరు డిప్లొమాలో బయాలజీ చదివి ఉండకపోతే, దాన్ని అదనపు సబ్జెక్ట్‌గా చదివి, నీట్‌కి అర్హత సాధించండి. మీ ప్రస్తుత విద్యార్హతలతో నీట్‌ రాయడానికి అర్హత లేకపోతే, ఇంటర్మీడియట్‌ని బైపీసీతో పూర్తి చేసి  నీట్‌కి సన్నద్ధం కండి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం నీట్‌ పరీక్ష రాయడానికి గరిష్ఠ వయః పరిమితి లేదు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌