Post your question

 

    Asked By: ఎం.శ్రీలత

    Ans:

    మీరు డిగ్రీలో హిందీని ఒక ఆప్షనల్‌ సబ్జెక్టుగా చదివారో, ఒక లాంగ్వేజ్‌గా అయినా చదివారో లేదో తెలియదు. గతంలో హిందీ పండిట్‌ కోర్సు చేయాలంటే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ప్రవీణ/ విద్వాన్‌ చేసినవారికి కూడా అర్హత ఉండేది. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ ద్వారా 2018లో జారీ అయిన జీఓ ప్రకారం- లాంగ్వేజ్‌ పండిట్‌ శిక్షణ పొందాలంటే డిగ్రీలో హిందీని ఒక ఆప్షనల్‌గా చదివుండాలి. బి.ఎ. (హిందీ లిటరేచర్‌) చేసినవారికీ, హిందీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఓరియంట్‌ లాంగ్వేజెస్‌ చేసినవారికీ, ఎంఏ హిందీ చేసినవారికీ కూడా ఎల్‌పీసెట్‌ (లాంగ్వేజ్‌ పండిట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) రాయడానికి అర్హత ఉంది. ఎల్‌పీసెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ కోర్సును రెగ్యులర్‌గా చేసే అవకాశం ఉంది. మీరు ప్రభుత్వ గుర్తింపు ఉన్న కళాశాల నుంచి హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ చేస్తే, డీఎస్సీ రాయడానికి అర్హులవుతారు. హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ కోర్సును ప్రైవేటుగా/ దూరవిద్య ద్వారా చేసే అవకాశం లేదు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: మోహన్‌రెడ్డి

    Ans:

    యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్ష (ఈఎస్‌ఈ) మూడు దశల్లో ఉంటుంది. నోటిఫికేషన్‌లో ఇచ్చిన విద్యార్హతలు ఉన్నవారు పరీక్షకు దరఖాస్తు చేశాక ప్రిలిమినరీ రాయాలి. ప్రిలిమ్స్‌లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్, సంబంధిత ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో రెండు ఆబ్జెక్టివ్‌ పేపర్లు మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్దతిలో ఉంటాయి. తప్పు సమాధానాలకు 0.33 చొప్పున రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రిలిమినరీలో సాధించిన ప్రతిభ ఆధారంగా ఆ సంవత్సరంలో ఉన్న ఖాళీల సంఖ్యకు ఆరు నుంచి ఏడు రెట్ల సంఖ్యలో అభ్యర్ధులను మెయిన్స్‌ రాయడానికి అవకాశం కల్పిస్తారు. మెయిన్స్‌ పరీక్షలో ఎంచుకున్న ఇంజినీరింగ్‌ సబ్జెక్ట్‌లో రెండు పేపర్లు వ్యాసరూపంలో రాయాలి. మెయిన్స్‌ పరీక్ష ప్రతిభ ఆధారంగా, ఆ సంవత్సరంలో ఉన్న ఖాళీల సంఖ్యకు రెండు రెట్ల సంఖ్యలో ఇంటర్వ్యూకి అర్హత కల్పిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కులన్నింటినీ కలిపి మెరిట్‌ లిస్ట్‌ తయారు చేస్తారు.
    పరీక్ష సన్నద్ధత విషయానికొస్తే- జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌లో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన ప్రస్తుత సమస్యలు, లాజికల్‌ రీజనింగ్, అనలిటికల్‌ ఎబిలిటీ, ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్, ఇంజినీరింగ్‌ మ్యాథమెటిక్స్, న్యూమరికల్‌ అనాలిసిస్, డిజైన్, డ్రాయింగ్, భద్రత సూత్రాలు, ఉత్పత్తి, నిర్మాణంలో ప్రమాణాలు, నాణ్యతా పద్ధతులు, నిర్వహణ, సేవలు, ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం, క్షీణత, క్లైమేట్‌ ఛేంజ్, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, మెటీరియల్‌ సైన్స్, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్‌ ఆధారిత సాధనాలు, నెట్‌వర్కింగ్, ఈ-గవర్నెన్స్, టెక్నాలజీ ఆధారిత విద్య, ఇంజినీరింగ్‌ వృత్తిలో నీతి, విలువలు లాంటి అంశాలు సిలబస్‌లో ఉన్నాయి. పైన పేర్కొన్న అంశాలన్నీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ చదివినవారు ప్రత్యేకమైన శిక్షణ లేకుండానే పరీక్ష రాయగలిగే స్థాయిలో ఉంటాయి. కానీ, ప్రస్తుతం ఇంజినీరింగ్‌ చదువుతున్న చాలామంది గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను, టెస్ట్‌ పేపర్‌ గైడ్‌లను చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులవడానికి ప్రయత్నిస్తున్నందున, అన్నిపేపర్‌లకూ ప్రత్యేక శిక్షణ అవసరం అవుతోంది.
    ఈఎస్‌ఈలో మంచి ర్యాంకు సాధించాలంటే ఎంతకాలం పడుతుందనేది వారి సామర్థ్యం, కృషి, పట్టుదలపై ఆధారపడి ఉంటుంది. మొదటి ప్రయత్నంలోనే సర్వీస్‌ సాధించినవారు, చాలా ప్రయత్నాల్లో కూడా సాధించలేనివారూ ఉన్నారు. ఈఎస్‌ఈలో విజయవంతం కావడానికి - మీరు పరీక్ష కోసం ఎంచుకున్న ఇంజినీరింగ్‌ సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై గట్టి పట్టు ఉండాలి. ఇంజినీరింగ్‌  నైపుణ్యాలు, అనువర్తనాలపై చాలా ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతో పాటు వ్యాసరూప ప్రశ్నలూ సమర్థంగా రాయాలి. ప్రామాణిక పాఠ్యపుస్తకాలను చదివి సొంతంగా నోట్సు తయారు చేసుకోండి. గతంలో ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్షలో విజయం సాధించినవారితో మాట్లాడి, మరిన్ని మెలకువలు తెలుసుకోండి, ఈఎస్‌ఈ సాధించాలనే మీ కల నెరవేర్చుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: శ్రీహరి

    Ans:

    ఎల్‌ఎల్‌బీ తరువాత లాయర్‌ కాకుండా లీగల్‌ అడ్వైజర్, లీగల్‌ కన్సల్టెంట్, లీగల్‌ అనలిస్ట్, మీడియేటర్, ఆర్బిట్రేటర్, లా ఆఫీసర్, లైజన్‌ ఆఫీసర్, లీగల్‌ కౌన్సెలర్, కాంట్రాక్ట్‌ అడ్వైజర్, లేబర్‌ రిలేషన్స్‌ ఆఫీసర్, వెల్ఫేర్‌ ఆఫీసర్, లీగల్‌ జర్నలిస్ట్, కాంప్లియెన్స్‌ ఆఫీసర్, లీగల్‌ పబ్లిషర్, జ్యుడీషియల్‌ ఎగ్జిక్యూటివ్‌ హోదాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎల్‌ఎల్‌ఎం/ పీహెచ్‌డీ చేస్తే ఆధ్యాపకులుగా, ట్రైనర్స్‌గా కూడా స్థిరపడవచ్చు. ఎల్‌ఎల్‌బీ తరువాత ఎంబీఏ/ జర్నలిజం/ సైకాలజీ/ సోషల్‌ వర్క్‌/ హ్యూమన్‌ రైట్స్‌/ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాంటి కోర్సులు చేస్తే మరిన్ని ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి.అరుణ్‌కుమార్‌

    Ans:

    36 ఏళ్ల వయసులో మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ చేయాలనుకొంటున్నందుకు అభినందనలు. జర్మనీలో మాస్టర్స్‌ చేయడానికి వయః పరిమితి లేదు. మీరు ఎంచుకొన్న కోర్సు/ యూనివర్సిటీలకు అవసరమైన పరీక్షలు (జీఆర్‌ఈ/ జీమ్యాట్‌/ టోఫెల్‌/ ఐఈఎల్‌ఈఎస్‌) రాసి, ఆయా యూనివర్సిటీలు నిర్దేశించిన కనిష్ఠ స్కోర్లను పొందాక దరఖాస్తు చేయాలి. సాధారణంగా జర్మనీలో చాలా పబ్లిక్‌ యూనివర్సిటీలు డిగ్రీలో కనీసం 70% మార్కులు ఉన్నవారికే పీజీలో ప్రవేశం కల్పిస్తున్నాయి. మీ ఇంజినీరింగ్‌ ఫస్ట్‌ క్లాస్‌ డిగ్రీతో, అతి తక్కువ యూనివర్సిటీల్లో మాత్రమే పీజీ చదవడానికి అర్హులవుతారు. డిగ్రీలో తక్కువ మార్కులు ఉన్నందున పీజీలో ప్రవేశం పొందినా స్కాలర్‌షిప్‌/ ఫెలోషిప్‌ అవకాశాలు తక్కువే. చాలా అంతర్జాతీయ యూనివర్సిటీలు డిగ్రీ/ అర్హత పరీక్షలో పొందిన మార్కులతో పాటు రిఫరెన్స్‌ లెటర్లు, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్, వివరణాత్మక బయోడేటా, ఉద్యోగానుభవం లాంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకొంటాయి. యూనివర్సిటీలో ప్రవేశం లభించిన తరువాత కూడా కొన్ని సందర్భాల్లో వయసు ఎక్కువగా ఉన్నందున వీసా లభించకపోయే అవకాశం ఉంది. కానీ రిస్క్‌ తీసుకొని ప్రయత్నం చేస్తే మీ కలను నిజం చేసుకోవచ్చు. ఒకవేళ జర్మనీలో చదవడం సాధ్యం కాకపోతే మరేదైనా దేశంలో అయినా పీజీ చేసే ప్రయత్నం చేయండి. ఈ వయసులో మాస్టర్స్‌ చదవడం సరైన నిర్ణయమేనా అనేది మీ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ బాధ్యతలను బట్టి ఆలోచించండి. పీజీ చదివాక జర్మనీలో స్థిరపడతారా, మరేదైనా దేశానికి వెళ్తారా, మళ్ళీ ఇక్కడికే వస్తారా, ఉద్యోగానికి సెలవు పెట్టి వెళ్తారా, ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్తారా అనే అంశాలతో పాటు, మీ స్వల్పకాలిక/ దీర్ఘకాలిక ఆశయాలను కూడా దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎ. అభి

    Ans:

    ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌లో ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్‌ కోర్సు పూర్తిచేసినవారికి వివిధ ఉన్నత విద్యావకాశాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్వహించే బ్రిడ్జి కోర్సులో ఉత్తీర్ణత సాధించి, ఎంసెట్‌ రాసి ఇంజినీరింగ్‌ కోర్సులో కానీ, బీఎస్సీలో కానీ చేరవచ్చు. ఎలాంటి ప్రవేశ పరీక్షా రాయకుండా ఇంటర్‌ మార్కుల ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశం పొందవచ్చు. బ్రిడ్జి కోర్సుతో సంబంధం లేకుండా బీఏ, బీకామ్, బీబీఏ, ఐదు సంవత్సరాల బీఏ ఎల్‌ఎల్‌బీ/ బీబీఏ ఎల్‌ఎల్‌బీ/ బీకామ్‌ ఎల్‌ఎల్‌బీ లాంటి డిగ్రీ కోర్సుల్లోనూ చేరొచ్చు. నూతన విద్యావిధానం-2020 పూర్తి స్థాయిలోకి అమల్లోకి వస్తే మరిన్ని ఉన్నత విద్యావకాశాలు అందుబాటులో ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: ఎస్‌. సురేష్‌తేజ

    Ans:

    సాధారణంగా రెగ్యులర్‌గా చదివిన డిగ్రీలకూ, ఆన్‌లైన్‌ డిగ్రీలకూ సమానమైన హోదానే ఉంటుంది. కాకపోతే ఇంటర్వ్యూల్లో ఆన్‌లైన్‌ డిగ్రీలున్నవారితో పోలిస్తే రెగ్యులర్‌ డిగ్రీలు చదివినవారిపై కొంత సానుకూలత ఉండొచ్చు. దీన్ని అధిగమించాలంటే ఆన్‌లైన్‌ డిగ్రీ చదివేవారు, రెగ్యులర్‌ డిగ్రీ చదివినవారితో సమానంగా విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఎంటెక్‌/ ఎంఎస్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌గా చేస్తేనే ప్రయోజనాలు ఎక్కువ. రెగ్యులర్‌గా చేసే అవకాశం లేకపోతే మాత్రమే ఆన్‌లైన్‌ ద్వారా చేయాలి. ఆన్‌లైన్‌/దూర విద్య డిగ్రీలు ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్లు పొందడంలో ఉపయోగకరంగా ఉంటాయి.
    బిర్లా ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ ఆన్‌లైన్‌ ఎంటెక్‌ కోర్సు చాలాకాలం నుంచి అందుబాటులో ఉంది. ఇండియన్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు, ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ పాట్నా లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉద్యోగుల కోసం ఆన్‌లైన్‌ ఎంటెక్‌ కోర్సులను ప్రారంభించాయి. వీటితో పాటు మరికొన్ని ప్రైవేటు యూనివర్సిటీలూ ఆన్‌లైన్‌ ఎంటెక్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఏదైనా కోర్సులో చేరేముందు, ఆ విద్యాసంస్థ వెబ్‌సైట్‌కి వెళ్ళి, మీరు చదవబోయే ఆన్‌లైన్‌ కోర్సుకు యూజీసీ/ ఏఐసీటీఈ గుర్తింపు ఉందో లేదో నిర్థారించుకోండి. ఆన్‌లైన్‌ కోర్సులను ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి చేస్తేనే ఆ డిగ్రీలకు మంచి గుర్తింపు ఉంటుంది. ఇక చాలా విదేశీ యూనివర్సిటీలు ఆన్‌లైన్‌ ఎంఎస్‌ డిగ్రీలను అందిస్తున్నాయి. మీరు చదవాలనుకొంటున్న విశ్వవిద్యాలయపు అంతర్జాతీయ ర్యాంకింగ్, ట్యూషన్‌ ఫీజు, విశ్వసనీయత ఆధారంగా సరైన నిర్ణయం తీసుకోండి. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: బి.వినీల

    Ans:

    ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో చేరడానికి ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఈ కోర్సు బాంబే/ కాన్పూర్‌/ మద్రాసు/ ఖరగ్‌పూర్‌ ఐఐటీల్లో, అతికొద్ది ప్రభుత్వ యూనివర్సిటీల్లో / ప్రైవేటు యూనివర్సిటీల్లో/ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అందుబాటులో ఉంది. ఐఐటీల్లో ప్రవేశానికి జేెఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు పొందాలి. ఐఐటీలతో పాటు తిరువనంతపురంలో ఉన్న ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నాలుగు సంవత్సరాల బీటెక్‌ ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశానికి కూడా జేెఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకును ప్రాతిపదికగా తీసుకొంటారు. రాష్ట్రప్రభుత్వ యూనివర్సిటీ/ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకు పొందాలి. ప్రైవేటు యూనివర్సిటీలు తాము నిర్వహించే ప్రత్యేక ప్రవేశపరీక్షల్లో కనపర్చిన ప్రతిభ ఆధారంగా అడ్మిషన్లు నిర్వహిస్తాయి. కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలు ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగా కూడా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: ఎల్‌. రాజు

    Ans:

    మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ డిప్లొమా పూర్తయిన తరువాత బీఎస్సీని మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌/మెడి కల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ/మైక్రో బయాలజీ/బయోకెమిస్ట్రీ/ బయోమెడికల్‌/ జెనెటిక్స్‌/ బయోటెక్నాలజీ లాంటి సబ్జెక్టులతో చదివి, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోసం విదేశాలకు వెళ్ళండి. విదేశాల్లో పీజీ చేయాలంటే జీఆర్‌ఈ, టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ లాంటి పరీక్షలు రాసి మెరుగైన స్కోరు పొందాలి. సాధారణంగా డిగ్రీలో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కోర్సు చదివినవారు పీజీలో మెడికల్‌ ల్యాబొరేటరీ సైన్స్‌ కాన్సంట్రేషన్, బయోమెడికల్‌ ల్యాబొరేటరీ సైన్స్, ల్యాబొరేటరీ మెడిసిన్, క్లినికల్‌ ల్యాబొరేటరీ సైన్స్‌ లాంటి కోర్సులు చేసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు బీఎస్సీలో మైక్రో బయాలజీ/బయోకెమిస్ట్రీ/ బయోమెడికల్‌/జెనెటిక్స్‌/ బయోటెక్నాలజీ లాంటి సబ్జెక్టులు చదివితే, ఎంఎస్‌లో ఆ స్పెషలైజేెషన్‌లు చదివే అవకాశం కూడా ఉంది. మీరు ఏ దేశంలో, ఏ యూనివర్సిటీలో, ఏ కోర్సు చదవాలనుకొంటున్నారో -  ఆ కోర్సుకు అవసరమైన అర్హతలను సరిచూసుకొని దరఖాస్తు చేసుకోండి.

    Asked By: శ్రీనివాస్‌

    Ans:

    బీఎస్సీ బయోకెమిస్ట్రీ తరువాత, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేసే అవకాశం ఉంది. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేసినవారికి కార్పొరేట్‌ హాస్పిటల్స్, బయోటెక్‌ కంపెనీలు, ఫుడ్‌ అండ్‌ బేవరెజెస్‌ ఇండస్ట్రీలు, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ఫార్మా, కెమికల్, ఫోరెన్సిక్, హెల్త్‌ కేర్‌ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. మీకు బోధన రంగంపై ఆసక్తి ఉంటే జూనియర్‌/ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేయవచ్చు. బయోకెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేసి, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా/ పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా స్థిరపడవచ్చు. ఎంఎస్సీలో బయోకెమిస్ట్రీ కాకుండా దీనికి అనుబంధంగా ఉన్న మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, సిస్టమ్స్‌ బయాలజీ, ప్లాంట్‌ బయాలజీ, యానిమల్‌ బయాలజీ, బయోమెడికల్, బయో ఫిజిక్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, టాక్సికాలజీ, ఇమ్యునాలజీ లాంటి సబ్జెక్టులు కూడా చదవొచ్చు. పైన పేర్కొన్న అన్ని కోర్సులకూ ఉద్యోగావకాశాలు బాగుంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సాయికృష్ణ

    Ans:

    బీఎస్‌సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌) చదివినవారు ఎమ్మెస్సీలో మ్యాథ్స్‌/స్టాటిస్టిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ డేటా సైన్స్‌/ ఆక్చూరియల్‌ సైన్స్‌ కోర్సులు చదవొచ్చు. ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కూడా చేసే అవకాశం ఉంది. ఎంసీఏ గురించి కూడా ఆలోచించవచ్చు. ఇవే కాకుండా- ఏదైనా డిగ్రీ అర్హతతో చదివే ఎంబీఏ, ఎంఏ (తెలుగు/ ఇంగ్లిష్‌/ హిందీ/సైకాలజీ/ జర్నలిజం/ ఎకనామిక్స్‌/, హిస్టరీ/ సోషియాలజీ/ఆంత్రొపాలజీ /పొలిటికల్‌ సైన్స్‌/ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌/ జాగ్రఫీ/ ఎడ్యుకేషన్‌/ ఫిలాసఫీ/ లింగ్విస్టిక్స్‌/ ఎల్‌ఎల్‌బీ/ పబ్లిక్‌ హెల్త్‌/ పబ్లిక్‌ పాలసీ/ బీఈడీ లాంటి కోర్సులు చదవొచ్చు. ఉద్యోగావకాశాల విషయానికొస్తే డిగ్రీలో మీరు  చదివుతున్న స్టాటిస్టిక్స్‌ విద్యార్హతతో అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌  ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత వస్తుంది. కేంద్ర/  రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, డిగ్రీ విద్యార్హతతో నియామకం చేసే ప్రభుత్వ ఉద్యోగాలకూ అర్హులే. వీటితో పాటు పోలీసు, బ్యాంకు ఉద్యోగాలనూ ఆలోచించంచవచ్చు. కనీసం ఏడాదిపాటు కొన్ని సాఫ్ట్‌వేర్‌లు నేర్చుకొని ఐటీ కంపెనీల్లో ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌