Post your question

 

    Asked By: కె.హరనాథ్

    Ans:

    స్పీచ్‌ థెరపిస్ట్‌ అవ్వాలంటే మూడు సంవత్సరాల వ్యవధి ఉన్న బీఎస్సీ ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పెథాలజీ కోర్సు చేయాలి. ఈ కోర్సు అలీ యవార్‌ జంగ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ డిజేబిలిటీస్‌ సికింద్రాబాద్, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ మైసూరు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ చండీఘర్, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ న్యూడిల్లీ, బాంబే యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్, మణిపాల్‌ యూనివర్సిటీ, అమిటి యూనివర్సిటీ నోయిడా, క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ వెల్లూర్, భారతీ విద్యాపీఠ్‌ పుణె లాంటి విద్యాసంస్థల్లో ఉంది. ఆటిజం, డిస్లెక్సియా లాంటి ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ప్రత్యేక ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేవు. కానీ, ఏ ప్రభుత్వ పాఠశాల కూడా ఇలాంటి పిల్లలకు అడ్మిషన్‌ని నిరాకరించకూడదు. కానీ చాలా  ప్రభుత్వ పాఠశాలల్లో వీరి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా బోధించే ఉపాధ్యాయుల లేమి, వారికి అవసరమైన ప్రత్యేక బోధనా పరికరాల కొరత ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎం. నాగరాజు

    Ans:

    ప్రస్తుత పరిస్థితుల్లో ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు చదివినవారికి ఉద్యోగ మార్కెట్‌లో చాలా డిమాండ్‌ ఉంది. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో మాత్రమే ఈ కోర్సు 2017 నుంచి అందుబాటులో ఉంది. మనదేశంలో ఈ ప్రత్యేక కోర్సును తొలిసారిగా స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఇది గత రెండు సంవత్సరాలుగా దేశపు టాప్‌ టెన్‌ ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సుల్లో స్థానం సంపాదిస్తూ ఈ రంగంలో నిపుణుల్ని అందిస్త్తోంది. ఇక్కడ ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ చేయాలంటే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించే సెంట్రల్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీ)-2023 రాయాలి.. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 19 ఏప్రిల్, 2023. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాక, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌కి కూడా దరఖాస్తు చేయాలి. ప్రవేశపరీక్ష మార్కులకు 60% వెయిటేజీ ఇచ్చి, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలను 40 మార్కులకు నిర్వహించి, ఉమ్మడి ప్రతిభ ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు ఇంకా వివిధ ప్రైవేటు యూనివర్సిటీలు/ బిజినెస్‌ స్కూళ్లలో ఉంది. ఆయా విద్యాసంస్థల వెబ్‌సైట్‌లను సందర్శించి ప్రవేశ విధానాల గురించి తెలుసుకోండి. టీఎస్‌ ఐసెట్‌ ద్వారా తెలంగాణా రాష్ట్ర యూనివర్సిటీల్లో/ అనుబంధ కళాశాలల్లో మాత్రమే ఎంబీఏ అడ్మిషన్‌ పొందవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీల్లో/ కళాశాలల్లో ప్రత్యేక ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు అందుబాటులో లేదు. సాధారణ ఎంబీఏలో మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్‌ రిసోర్సెస్‌లతో పాటు ఒక స్పెషలైజేషన్‌గా మాత్రమే బిజినెస్‌ అనలిటిక్స్‌ సబ్జెక్ట్‌ అందుబాటులో ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి. శ్రీనివాస్‌

    Ans:

    దూరవిద్యలో చేసిన బీటెక్‌ డిగ్రీలకు ఏఐసీటీఈ/యూజీసీ గుర్తింపు లేదు. అందువల్ల మీ సంస్థ ప్రమోషన్‌ కోసం మీ డిగ్రీని గుర్తించడం లేదు. ప్రస్తుతం మీ ముందు మూడు అవకాశాలున్నాయి. అందులో మొదటిది.. ఇంజినీరింగ్‌ కోర్సుకు సమానమైన ఏఎంఐఈని చేయడం. దీనికోసం మీరు ఉద్యోగానికి సెలవు పెట్టవలసిన అవసరం లేదు. రెండోది.. మూడు సంవత్సరాలు ఉద్యోగానికి సెలవు పెట్టి, ఇంజినీరింగ్‌ కోర్సు రెగ్యులర్‌గా చేయటం. మూడోది.. మీ సంస్థలో బీఎస్సీ/బీఏ కోర్సుల ద్వారా ప్రమోషన్‌ పొందే వీలుంటే ఆ కోర్సులను దూరవిద్య ద్వారా చదవటానికి ప్రయత్నించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎ.మహేష్‌

    Ans:

    యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఒకే సమయంలో రెండు డిగ్రీలు/ పీజీలు ఒకటి రెగ్యులర్‌గా, మరొకటి రెగ్యులర్‌/ ఆన్‌లైన్‌/ డిస్టెన్స్‌/ ఓపెన్‌ పద్ధతిలో చదివే అవకాశం ఉంది. డిగ్రీ/పీజీతోపాటు డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు చేసే వెసులుబాటు గతంలో కూడా ఉంది. కానీ బీఈడీ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ అనే రెగ్యులేటరీ సంస్థ (ఎన్‌సీటీఈ) నియంత్రణలో ఉంది. ఇప్పటివరకైతే ఎన్‌సీటీఈ వారు బీఈడీతో పాటు మరో కోర్సు చేసే విషయంలో ఎలాంటి మార్గదర్శకాలూ విడుదల చేయలేదు. కాబట్టి మీరు బీఈడీ కోర్సు చేసే సమయంలో మరో కోర్సు చేయకపోవడమే శ్రేయస్కరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

     

    Asked By: రుక్మిణి

    Ans:

    యూజీసీ నెట్‌ జేఆర్‌ఎఫ్‌కు ఎంపికవ్వాలంటే ముందుగా ఎన్‌టీఏ వారు నిర్వహించే యూజీసీ నెట్‌ జేఆర్‌ఎఫ్‌కు సంబంధించిన రెండు పరీక్షల్లో కలిపి కనీసం 40% (రిజర్వేషన్‌ కేటగిరీలకు 35%) మార్కులు పొంది ఉండాలి. యూజీసీ నెట్‌ పరీక్ష రాసినవారిలో 6% మందికి మాత్రమే యూజీసీ నెట్‌ (అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) అర్హత లభిస్తుంది. ఈ 6% మందిలో భారత ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ రిజర్వేషన్‌ కేటగిరీలకు ఖాళీలను కేటాయిస్తారు. నెట్, జేెఆర్‌ఎఫ్‌ల సంఖ్యను సబ్జెక్టులవారీగా కూడా కేటాయిస్తారు. ఉదాహరణకు- మేనేజ్‌మెంట్‌ సబ్జెక్ట్‌లో ఎస్సీ కేటగిరీలో నెట్‌ అర్హత పొందేవారి సంఖ్యను కనుక్కోవాలంటే, ఎస్సీ కేటగిరీలో మేనేజ్‌మెంట్‌ సబ్జెక్ట్‌లో రెండు పేపర్లలో కలిపి 35% మార్కులు పొందినవారి సంఖ్యను పైన పేర్కొన్న 6% మందిలో ఎస్సీ కేటగిరీకి కేటాయించిన సంఖ్యతో గుణించి, అన్ని సబ్జెక్టుల్లో రెండు పేపర్లలో కనీసం 35% మార్కులు పొందిన ఎస్సీ కేటగిరికి చెందినవారి మొత్తం సంఖ్యతో భాగించాలి.
    జేఆర్‌ఎఫ్‌ విషయానికొస్తే.. యూజీసీ నెట్‌ పరీక్ష రాసిన వారిలో గరిష్ఠంగా 1% మందికి మాత్రమే యూజీసీ జేెఆర్‌ఎఫ్‌ అర్హత లభిస్తుంది. ఈ 1% మందిలో భారత ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధ రిజర్వేషన్‌ కేటగిరీలకు ఖాళీలను కేటాయిస్తారు. ఉదాహరణకు ఇంగ్లిష్‌ సబ్జెక్టులో ఎస్టీ కేటగిరీలో జేెఆర్‌ఎఫ్‌ అర్హత పొందేవారి సంఖ్యను కనుక్కోవాలంటే, ఎస్టీ కేటగిరీలో ఇంగ్లిష్‌లో జేఆర్‌ఎఫ్‌ని ఎంచుకొన్నవారిలో నెట్‌కి అర్హత సంబంధించిన వారి సంఖ్యను ఎస్టీ కేటగిరీకి కేటాయించిన మొత్తం జేెఆర్‌ఎఫ్‌ ఖాళీల సంఖ్యతో గుణించి ఎస్టీ కేటగిరీలో జేఆర్‌ఎఫ్‌ని ఎంచుకొన్నవారిలో నెట్‌కి అర్హత సంబంధించిన వారి సంఖ్యతో భాగించాలి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: పి. మధుసూదన్‌రావు

    Ans:

    మీరు 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న కంపెనీ గురించీ, అక్కడ నిర్వహిస్తున్న బాధ్యతల గురించీ చెప్పలేదు. మీరు ఎంబీఏ ఫైనాన్స్, పీజీ డిప్లొమా ఇన్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఏ యూనివర్సిటీ నుంచి చేశారో! సాధారణంగా ఉద్యోగం చేస్తూ ఎంబీఏ లాంటి కోర్సులు చేసినవారికి కొత్త కొలువు పొందడంలో వారి గత ఉద్యోగానుభవం చాలా ఉపయోగపడుతుంది. మీరు ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. ఎంబీఏ లాంటి కోర్సుల్లో మార్కులకంటే నైపుణ్యాలు చాలా ముఖ్యం. ఉద్యోగ ప్రయత్నాలపై మీరు ఎంబీఏ డిగ్రీ పొందిన యూనివర్సిటీ విశ్వసనీయత చాలా ప్రభావం చూపుతుంది. ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మీ నైపుణ్యాలను మెరుగుపర్చుకోండి. ఉద్యోగం చేయాలనుకుంటున్న కంపెనీలో పనిచేస్తున్న సీనియర్‌ ఉద్యోగుల ద్వారా మరిన్ని వివరాలు సేకరించి, దానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోండి. నిరుత్సాహపడకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: శ్రీకీర్తి

    Ans:

    హోటల్‌ మేనేజ్‌మెంట్‌/ టూరిజంలో ఎంబీఏ చేసినవాళ్లు చాలామంది అందుబాటులో ఉన్నప్పటికీ.. నిపుణుల కొరత ఎక్కువగానే ఉంది. ఈ డిగ్రీ చేసినవాళ్లు ట్రావెల్‌ ఏజెంట్, టూర్‌ మేనేజర్, టూర్‌గైడ్, వీసా ఎగ్జిక్యూటివ్, ట్రావెల్‌ కన్సల్టెంట్, హోటల్‌ మేనేజర్, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, హాస్పిటాలిటీ మేనేజర్, సేల్స్‌ మేనేజర్, హౌస్‌కీపింగ్‌ మేనేజర్, గెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ మేనేజర్, ఈవెంట్‌ మేనేజర్, బెవరెజ్‌ మేనేజర్, హాలిడే కన్సల్టెంట్, కేటరింగ్‌ మేనేజర్‌గా ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. ఈ కోర్సు చదివినవారికి హోటల్, హాస్పిటల్, ట్రావెల్‌ ఏజెన్సీలు, విమానయాన సంస్థలు, రిసార్ట్‌ల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఈ సంస్థలు అన్నింటిలో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కూడా ఉన్నాయి. సాధారణంగా హోటల్‌ మేనేజ్‌మెంట్‌/ టూరిజం ఏంబీఏ కోర్సులో భాగంగా ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా అదే సంస్థలో ఉద్యోగం లభించే అవకాశమూ ఉంది. చాలా సంస్థలు ఇంటర్న్‌షిప్‌ చేసేవారికి స్టైపెండ్‌ కూడా ఇస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కె.అరుంధతి

    Ans:

    ఇటీవల డేటా సైన్స్‌ రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా చాలా పరిశ్రమలు/ పరిశోధనా సంస్థలు డేటా సైన్స్‌/ అనలిటిక్స్‌కి సంబంధించిన విషయాలపై దృష్టి సారించాయి. ఎంఎస్సీ జువాలజీ చదివిన తర్వాత క్లినికల్‌ ఎస్‌ఏఎస్‌ కోర్సు చేయడం వల్ల మీ ఉద్యోగావకాశాలు మెరుగువుతాయి. ఫార్మా కంపెనీలు, బయోటెక్‌ కంపెనీలు, పరిశోధనా సంస్థల్లో క్లినికల్‌ డేటా అనాలిసిస్‌ కోసం డేటా అనలిస్ట్‌ల అవసరం పెరుగుతోంది. మీరు ఈ కోర్సు చేశాక క్లినికల్‌ డేటా మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, క్లినికల్‌ డేటా అసోసియేట్, క్లినికల్‌ డేటా అనలిస్ట్, క్లినికల్‌ డేటా మేనేజర్‌గా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఈ కోర్సులో చేరేముందు బయో స్టాటిస్టిక్స్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై పట్టు సాధించండి. వీలుంటే ఎంఎస్‌ ఎక్సెల్, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్‌లను కూడా నేర్చుకోండి. - ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కావ్య

    Ans:

    బీడీఎస్‌ తర్వాత యూఎస్‌లో పీజీ చేయాలంటే యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగన్, వాషింగ్టన్, బోస్టన్‌ యూనివర్సిటీ, టెక్సాస్‌ ఎ అండ్‌ ఎం యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఇలినాయిస్, నార్త్‌ కరోలినా, హార్వర్డ్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, బహాయో స్టేట్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ అలబామాల్లో అవకాశం ఉంది. ఇక స్కాలర్‌షిప్‌ విషయానికి వస్తే.. ఏడీఈఏ/ క్రెస్ట్‌ ఓరల్‌ బి స్కాలర్‌షిప్‌ ఫర్‌ డెంటల్, డెంటల్‌ ట్రేడ్‌ అలయన్స్‌ ఫౌండేషన్, ఏడీఈఏ/గ్లాక్సో స్మిత్‌క్లిన్‌ కన్‌స్యూమర్‌ హెల్త్‌ కేర్‌ డెంటిస్ట్రీ స్కాలర్‌షిప్, ఏడీఈఏ ఫౌండేషన్‌ డెంటల్‌ స్టూడెంట్‌ స్కాలర్‌షిప్, బారిగోల్డ్‌ వాటర్, క్రాక్‌డాట్‌ ప్రి డెంటల్‌ స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. - ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: టి.సునీల్‌కుమార్‌

    Ans:

    ఎన్‌సీహెచ్‌ఎం - జేఈఈ (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌)లో మెరుగైన ర్యాంకు సాధించినవారికి  బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌)లో ప్రవేశం లభిస్తుంది. ఈ  కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సంవత్సరానికి ఒకసారి ఇంగ్లిష్‌/హిందీ మీడియాల్లో నిర్వహిస్తుంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎన్‌సీహెచ్‌ఎం- జేఈఈ నోటిఫికేషన్‌ ఇటీవలే విడుదలయింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 27 ఏప్రిల్‌. జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం ఈ కోర్సులో చేరడానికి గరిష్ట వయః పరిమితి లేదు.
    ఎన్‌సీహెచ్‌ఎం - జేఈఈలో న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ అనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌లో 30 ప్రశ్నలు, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌లో 30 ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌లో 30 ప్రశ్నలు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 60 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్‌ ఫర్‌ సర్వీస్‌ సెక్షన్‌లో 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. మీకు హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రంగంపై ఆసక్తి ఉంటే నిరభ్యంతరంగా ఈ పరీక్ష రాయవచ్చు. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌ సరళి ప్రకారం బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ లాంటి కోర్సులు చేస్తే త్వరగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మీరు బీఎస్సీ (కంప్యూటర్స్‌) కోర్సు పూర్తిచేసి ఐదేళ్లు అయింది కాబట్టి, డిగ్రీలో చదివిన కంప్యూటర్‌ సబ్జెక్టులను మరొక్కసారి పూర్తిగా చదివి, ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) / ఎమ్మెస్సీ (డేటా సైన్స్‌) /ఎంసీఏ లాంటి పీజీ కోర్సులు చేయొచ్చు. మీకు ఎంబీఏ మీద ఆసక్తి ఉంటే ఎంబీఏ (బిజినెస్‌ అనలిటిక్స్‌) గురించీ ఆలోచించండి. ముందుగా మీరు ‘ఆర్‌’, ‘పైతాన్‌’ లాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లపై గట్టి పట్టు సాధించండి. ఆ తరువాత ఆసక్తి ఉన్న రంగానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లను ప్రైవేటుగా నేర్చుకొని మీ ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోండి. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌