Post your question

 

    Asked By: విజయ్‌

    Ans:

    నిబంధనల ప్రకారం, ఏ యూనివర్సిటీ అయినా యూజీసీకి చెందిన డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో (డెబ్‌) జారీ చేసే నిర్దేశాలకు లోబడి దూరవిద్య కోర్సులను నిర్వహించాలి. ఈ బ్యూరో నియమావళి ప్రకారం- ఏ యూనివర్సిటీ అయినా దాని భౌగోళిక పరిధిలోనే స్టడీ సెంటర్‌లను నిర్వహించాలి. తదనుగుణంగా వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు సంబంధించిన స్టడీ సెంటర్‌లను రెండు తెలుగు రాష్ట్రాల్లో  క్రమంగా మూసివేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కూడా తెలంగాణలో ఉన్న స్టడీ సెంటర్‌లను 2020 నుంచీ మూసివేసింది. 2013లో యూజీసీ పబ్లిక్‌ నోటీస్‌ ద్వారా యూనివర్సిటీలు/ డీమ్డ్‌ టుబి యూనివర్సిటీలు ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న పరీక్షల చట్టబద్ధతపై స్పష్టతనిచ్చింది. ఇదే విషయంపై గతంలో వివిధ రాష్ట్రాల హైకోర్టులు.. యూనివర్సిటీలు ఇచ్చే దూరవిద్య డిగ్రీలు యూజీసీ నిబంధనలకు లోబడే ఉండాలంటూ తీర్పులిచ్చాయి. ఈ విషయంపై కోర్టు తీర్పుల గురించి మరిన్ని వివరాలకోసం ‘ఇండియన్‌ కానూన్‌’ వెబ్‌సైట్‌ను సందర్శించండి. 2013 నుంచి 2020 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్‌యూ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ స్టడీ సెంటర్‌లో చదివి, డిగ్రీ పొందినవారి సర్టిఫికెట్‌లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లో చెల్లుబాటు గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలు యూజీసీని కోరుతూ లేఖలు రాశాయి. నిర్ణయం వచ్చేవరకు వేచి ఉండకుండా అవకాశం ఉంటే మరో డిగ్రీని యూజీసీ డెబ్‌ నిబంధనలను పూర్తిగా అమలుచేస్తున్న యూనివర్సిటీల దూరవిద్య  ద్వారా చేసే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: శివప్రసాద్‌

    Ans:

    బీఎడ్‌/ బీఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) రెండూ ముఖ్యమైనవే! దేని ప్రాధాన్యం దానిదే! మీకు ఏ రంగంలో స్థిరపడాలని ఉందో, ఎలాంటి విద్యార్ధులకు బోధించాలని ఉందో దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. బీఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) చేసి ఆ రంగంలో స్థిరపడాలంటే ప్రత్యేక అవసరాలున్న విద్యార్ధులపై సహానుభూతి, ప్రేమ చాలా అవసరం. అలా లేని పక్షంలో మీరు కానీ, మీదగ్గర చదువుకొనే పిల్లలు కానీ సంతోషంగా ఉండలేరు. రెగ్యులర్‌ బీఎడ్‌ చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా అవకాశాలుంటాయి. బీఎడ్‌ కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలు చేశాక దీనికి కొంత ఆదరణ తగ్గింది. ప్రభుత్వ పాఠశాలల్లో శాశ్వత నియామకాలు జరగకపోవడం కూడా ఒక కారణం కావొచ్చు. బీఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) చేసినవారు స్పెషల్‌ పాఠశాలల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు. కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం- సాధారణ పాఠశాలల్లో కూడా స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలి. వచ్చే రెండు సంవత్సరాల్లో ఇది పూర్తిగా కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. బీఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) చేసినవారి సంఖ్య సాధారణ బీఎడ్‌ చేసినవారికంటే తక్కువగా ఉండటం వల్ల వీరికి ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: టి.సునీల్‌కుమార్‌

    Ans:

    ఎన్‌సీహెచ్‌ఎం - జేఈఈ (నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌)లో మెరుగైన ర్యాంకు సాధించినవారికి  బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌)లో ప్రవేశం లభిస్తుంది. ఈ  కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సంవత్సరానికి ఒకసారి ఇంగ్లిష్‌/హిందీ మీడియాల్లో నిర్వహిస్తుంది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎన్‌సీహెచ్‌ఎం- జేఈఈ నోటిఫికేషన్‌ ఇటీవలే విడుదలయింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 27 ఏప్రిల్‌. జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం ఈ కోర్సులో చేరడానికి గరిష్ట వయః పరిమితి లేదు.
    ఎన్‌సీహెచ్‌ఎం - జేఈఈలో న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ అనలిటికల్‌ ఆప్టిట్యూడ్‌లో 30 ప్రశ్నలు, రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌లో 30 ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌లో 30 ప్రశ్నలు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 60 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్‌ ఫర్‌ సర్వీస్‌ సెక్షన్‌లో 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. మీకు హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రంగంపై ఆసక్తి ఉంటే నిరభ్యంతరంగా ఈ పరీక్ష రాయవచ్చు. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌ సరళి ప్రకారం బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ లాంటి కోర్సులు చేస్తే త్వరగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మీరు బీఎస్సీ (కంప్యూటర్స్‌) కోర్సు పూర్తిచేసి ఐదేళ్లు అయింది కాబట్టి, డిగ్రీలో చదివిన కంప్యూటర్‌ సబ్జెక్టులను మరొక్కసారి పూర్తిగా చదివి, ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) / ఎమ్మెస్సీ (డేటా సైన్స్‌) /ఎంసీఏ లాంటి పీజీ కోర్సులు చేయొచ్చు. మీకు ఎంబీఏ మీద ఆసక్తి ఉంటే ఎంబీఏ (బిజినెస్‌ అనలిటిక్స్‌) గురించీ ఆలోచించండి. ముందుగా మీరు ‘ఆర్‌’, ‘పైతాన్‌’ లాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లపై గట్టి పట్టు సాధించండి. ఆ తరువాత ఆసక్తి ఉన్న రంగానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లను ప్రైవేటుగా నేర్చుకొని మీ ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోండి. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: బి. మూర్తి

    Ans:

    సాంకేతిక (టెక్నికల్‌) కోర్సులంటే- కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, మెటలర్జీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, బయో మెడికల్, కెమికల్, ఏరోనాటికల్, ఆప్టోమెట్రీ, మెడికల్‌ టెక్నాలజీ లాంటివి. ఒకవేళ మీ ఉద్దేశం ఇంజినీరింగ్‌ కోర్సులయితే మాత్రం మనదేశంలో ఏ యూనివర్సిటీ కూడా బీటెక్‌/ పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సును దూరవిద్యలో అందించటం లేదు. ఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ ఇంజినీరింగ్‌కు సంబంధించిన సర్టిఫికెట్‌/ డిప్లొమా/ పీజీ డిప్లొమా కోర్సులు మాత్రం చాలా యూనివర్సిటీల్లో అందుబాటులో ఉన్నాయి. కానీ వాటిలో చేరాలంటే ఇంటర్‌/ డిగ్రీలో మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌/ కెమిస్త్రీ/ ఇంజినీరింగ్‌ చదివివుండాలి. మీరు కంప్యూటర్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ / డేటా సైన్స్‌ సంబంధిత సర్టిఫికెట్‌/ డిప్లొమా/పీజీ డిప్లొమా కోర్సులు చేయాలనుకుంటే మాత్రం ప్రభుత్వ/ఓపెన్‌/ ప్రైవేటు యూనివర్సిటీలు కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ డేటా సైన్స్‌లాంటి కోర్సుల్ని దూరవిద్య/ ఆన్‌లైన్‌లో అందిస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: వి. రమేష్‌

    Ans:

    సాధారణంగా ఐఐటిల్లో పీహెచ్‌డీ చేయాలంటే పీజీలో 55% మార్కులు పొందివుండాలి. ఐఐటీ దిల్లీ మాత్రం 60% మార్కులను కనీస అర్హతగా నిర్ణయించింది. అన్ని ఐఐటీల్లో షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌/ ట్రైబ్‌ రిజర్వేషన్‌ కేటగిరీలకు చెందినవారికి పీజీ మార్కుల్లో 5% వెసులుబాటు ఉంది. ఐఐటీల్లో పీహెచ్‌డీకి పీజీతో పాటు గేట్‌/ జేఆర్‌ఎఫ్‌/ నెట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. గేట్, జేఆర్‌ఎఫ్‌లు ఉన్నవారికి అడ్మిషన్లో ప్రాధాన్యం ఉంటుంది. మీకు పీజీ పరీక్షలో వచ్చిన మార్కుల శాతం, మీ పరిశోధనాంశం, గేట్‌ స్కోర్‌/ జేఆర్‌ఎఫ్‌/ నెట్‌ ఆధారంగా ఇంటర్వ్యూకి పిలిచి, దానిలో సాధించిన మార్కుల ఆధారంగా పీహెచ్‌డీలో ప్రవేశం కల్పిస్తారు. పీజీలో పొందిన మార్కులు, మెడల్స్, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్, పరిశోధనానుభవం, పరిశోధన పట్ల మీకున్న ఆసక్తి..ఇవి మీ ప్రవేశాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు ఏవైనా పరిశోధన పత్రాలు ప్రామాణికమైన జర్నల్స్‌లో ప్రచురించినా, ప్రముఖ కాన్ఫరెన్స్‌ల్లో పరిశోధన పత్రాల్ని సమర్పించినా, మీకు పీహెచ్‌డీ ప్రవేశ అవకాశాలు మెరుగవుతాయి. ఐఐటీల్లో కొన్ని డిపార్ట్‌మెంట్‌లు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గేట్‌/ జేఆర్‌ఎఫ్‌/ నెట్‌ లేనివారికి పీహెచ్‌డీలో ప్రవేశం కోసం ప్రవేశ పరీక్ష కూడా నిర్వహిస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎన్‌.పూర్ణచంద్రరావు

    Ans:

    ఎల్‌ఎల్‌బీ కోర్సును దూరవిద్యలో చదివే అవకాశం లేదు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఎల్‌ఎల్‌బీ కోర్సును రెగ్యులర్‌ పద్ధతిలోనే చదవాల్సివుంటుంది. ఏ నకిలీ విద్యాసంస్థ అయినా న్యాయవిద్యను దూరవిద్య విధానంలో అందిస్తామని చెబితే నమ్మి మోసపోకండి. మెడిసిన్, ఇంజినీరింగ్, ఎల్‌ఎల్‌బీ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను వేటినీ దూరవిద్యలో అందించరు. ఒకవేళ ఎవరైనా అలాంటి కోర్సుల్లో చేరితే, ఆ కోర్సులకు ప్రభుత్వ గుర్తింపు ఉండదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: రాజు, నెల్లూరు

    Ans:

    -  విస్తృత అవకాశాలు అందించే మేటి కోర్సుల్లో ఎకనామిక్స్‌ ఒకటి. పేరున్న సంస్థల్లో ఎంఏ ఎకనామిక్స్‌ చదివినవారు కెరియర్‌ పరంగా దూసుకెళ్లవచ్చు. అయితే ఇలాంటి వాటిలో ప్రవేశానికి బాగా శ్రమించడం తప్పనిసరి. ఎంఏ ఎకనామిక్స్‌లోనూ ఎన్నో స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల కాలంలో క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఐఎస్‌ఐ- కోల్‌కతా, దిల్లీల్లో ఈ కోర్సు అందిస్తున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభతో సీటు కేటాయిస్తారు. ఈ సంస్థల్లో అవకాశం వచ్చినవాళ్లు ప్రతినెల రూ.8000 స్టైపెండ్‌ అందుకోవచ్చు. ఎకనామిక్స్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు పరిశోధకులు, విశ్లేషకులు, ఆర్థిక సలహాదారు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్, వెంచర్‌ క్యాపిటలిస్ట్, ఆడిటర్, స్టాక్‌ బ్రోకర్, బిజినెస్‌ జర్నలిస్ట్‌ తదితర హోదాలతో ఉద్యోగాలు పొందవచ్చు. పీజీ అనంతరం పీహెచ్‌డీతో బోధన రంగంలో రాణించవచ్చు. ఎకనామిక్స్‌ పీజీతో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఏటా నిర్వహిస్తోన్న ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీసెస్‌ (ఐఈఎస్‌) పరీక్ష రాసుకోవచ్చు. ఎంపికైనవారు గ్రూప్‌ ఎ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తారు. అలాగే రిజర్వ్‌ బ్యాంకులో గ్రేడ్‌ బి పోస్టుల్లో కొన్నింటికి పీజీ ఎకనామిక్స్‌ అర్హతతో పోటీ పడవచ్చు.

    జాతీయ స్థాయిలో మేటి సంస్థలు

    జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, న్యూదిల్లీ; దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, న్యూదిల్లీ; హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ; జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ, న్యూదిల్లీ; గోఖలే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్, పుణే; మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (ఎంఎస్‌ఈ), చెన్నై; బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, వారణాసి; ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రిసెర్చ్‌ (ఐజీడీఆర్‌), ముంబయి; సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ (సీడీఎస్‌), తిరువనంతపురం; బిట్స్‌ - పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంపస్‌ల్లో ఆనర్స్‌ విధానంలో ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ కోర్సు అందిస్తున్నారు. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (బేస్‌), బెంగళూరు ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ కోర్సు అందిస్తోంది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నమూనాలో దీన్ని రూపొందించారు. వీటిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, మరికొన్ని సంస్థలు సీయూసెట్‌ పీజీలో చూపిన ప్రతిభతో అవకాశం కల్పిస్తున్నాయి. మిగిలినవాటికి ఆ సంస్థలు నిర్వహించే పరీక్షలు విడిగా రాసుకోవాలి. ఆంధ్రా, ఉస్మానియా, ఎస్వీయూ, ఆచార్య నాగార్జున... పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలు తెలుగు రాష్ట్రాల్లో ఎకనామిక్స్‌ కోర్సు అందిస్తున్నాయి. పీజీ సెట్లతో ప్రవేశం పొందవచ్చు.  ఐఐటీ దిల్లీ, రవుర్కెలాలు ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ కోర్సు అందిస్తున్నాయి. ఐఐటీలు నిర్వహించే జామ్‌తో ప్రవేశం లభిస్తుంది.

    Asked By: ఎం. అజయ్‌కుమార్‌

    Ans:

    -  కనీసం మూడు సంవత్సరాల వ్యవధి గల ఏ డిగ్రీ పూర్తి చేసినవారైనా, మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ కోర్సు చదవొచ్చు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. ఈ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ప్రైవేటు న్యాయ కళాశాలలూ ఈ కోర్సును అందిస్తున్నాయి. ప్రవేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీఎస్‌ లాసెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్‌ తర్వాత ఐదేళ్ల లా కోర్సును నల్సార్‌ యూనివర్సిటీ అందిస్తోంది. నల్సార్‌లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే క్లాట్‌ ప్రవేశపరీక్ష రాయవలసి ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ, యూనివర్సిటీ అనుబంధ ప్రైవేటు న్యాయ కళాశాలలు కూడా ఐదేళ్ల లా కోర్సు అందిస్తున్నాయి. ఈ కోర్సులో ప్రవేశానికి టీఎస్‌ లాసెట్‌ రాయాలి. హైదరాబాద్‌లో ఉన్న కొన్ని డీమ్డ్‌/ ప్రైవేటు యూనివర్సిటీల్లో ఐదేళ్ల లా కోర్సులో చేరటానికి ఏదైనా జాతీయ/ రాష్ట్ర స్థాయి/ సంబంధిత ప్రైవేటు యూనివర్సిటీ ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత సాధించివుండాలి. 


    ఒకప్పుడు ఎల్‌ఎల్‌బీ చదివినవారికి న్యాయవాద వృత్తిని మినహాయిస్తే పెద్దగా ఉద్యోగావకాశాలు ఉండేవి కావు. కానీ ఇటీవలికాలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో చాలారకాల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఎల్‌ఎల్‌బీ చదివినవారు లీగల్‌ అసోసియేట్, లా ఆఫీసర్, కార్పొరేట్‌ లాయర్, లీగల్‌ అడ్వైజర్, లీగల్‌ ఎనలిస్ట్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్, మెజిస్ట్రేట్, జ్యుడిషియల్‌ ఆఫీసర్‌ లాంటి ఉద్యోగాలు చేయవచ్చు. మీకు ఆసక్తి ఉంటే ఎల్‌ఎల్‌బీ తర్వాత ఎల్‌ఎల్‌ఎం/ పీహెచ్‌డీ చేసి బోధన రంగంలోనూ స్థిరపడవచ్చు. ఇవన్నీ కాకుండా సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టుకొనే అవకాశం ఎలాగూ ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎం.చందు

    Ans:

    ఒక కోర్సులో చేరి కొంతకాలం చదివి, దాన్ని మధ్యలో వదిలేసి మరో కోర్సులో చేరాలా, వద్దా అనే ఆలోచన చాలామందిని వేధిస్తుంది. ఈ నిర్ణయం తీసుకునేముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోండి. ముందుగా మీరు ఇంజినీరింగ్‌ కోర్సులో ఎందుకు చేరారు? ఇబ్బంది బ్రాంచితోనా? ఇంజినీరింగ్‌ కోర్సుతోనా? ఇంజినీరింగ్‌ కష్టంగా తోచి, సబ్జెక్టుల్లో మంచి మార్కులు పొందలేకపోతున్నారా? ఏమైనా బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయా? సమస్య కళాశాల అధ్యాపకులతోనా? సహాధ్యాయుులతోనా? ఈ కోర్సును కొనసాగించడం వల్ల ఉద్యోగావకాశాలు ఉండవని దిగులు పడుతున్నారా? గతంలో తెలుగు మీడియం చదివి ఇప్పుడు ఇంగ్లిష్‌ మీడియంలోకి మారడం వల్ల భాషా సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? సాధారణ డిగ్రీలో చేరి పోటీ పరీక్షలకు సిద్ధం అవ్వాలనుకొంటున్నారా?
    ఈ ప్రశ్నలన్నింటికీ సరైన సమాధానాలు తెలియకుండా.. సలహా ఇవ్వడం కష్టమే! ఇలాంటి నిర్ణయాలు తీసుకొనేముందు ఒక్కో అంశంలో ఉన్న లాభ నష్టాలను బేరీజు వేసుకోవాలి.
    మీ దీర్ఘకాలిక ఆశయాలు, స్వల్పకాలిక లక్ష్యాలు ఏమిటి? ఇంజినీరింగ్‌ కోర్సు చదవడం వల్ల వాటిని సాధించలేననే భయమా? పరీక్షల ఒత్తిడి ఎక్కువగా ఉందా? ఈ కోర్సు వదిలేసి డిగ్రీలో చేరాక, దానిపై కూడా ఆసక్తి తగ్గితే, అప్పుడేం చేస్తారు? ఇలాంటి ప్రశ్నలకు మీదగ్గర సరైన సమాధానాలున్నాయా? ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయం తీసుకోండి.
    ఒక కోర్సును రెండు సంవత్సరాలు చదివి, మరో కోర్సుకి మారడం అనేది చాలా పెద్ద నిర్ణయం. అందుకే తొందరపాటు వద్దు. మీ శ్రేయోభిలాషులతో, అధ్యాపకులతో, కెరియర్‌ కౌన్సెలర్‌లతో చర్చించండి. గతంలో ఇంజినీరింగ్‌/ మెడిసిన్‌ కోర్సును మధ్యలో వదిలేసి, డిగ్రీ చదివి ఐఏఎస్, ఐపీఎస్‌ లాంటి అత్యున్నత ఉద్యోగాలు పొందినవారు, డిగ్రీ పూర్తిచేసి చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్యోగం పొందనివారు, డిగ్రీనే పూర్తిచేయనివారూ ఉన్నారు. మీరు ఏ కేటగిరీలో ఉంటారు అనేది మీ కృషి, పట్టుదల, బలమైన ఆశయం, కుటుంబ సభ్యుల సహకారం, ఆర్థిక వనరులు లాంటి విషయాలపై ఆధారపడి ఉంటుంది.
    నా మిత్రుడొకరు ప్రముఖ ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండేళ్లు బీటెక్‌ చదివి, ఆ కోర్సుపై ఆసక్తి లేకపోవడం వల్ల మధ్యలో వదిలేసి, డిగ్రీ, పీజీ పూర్తిచేశారు. థియేటర్‌పై ఉన్న ఆసక్తితో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో డిప్లొమా కోర్సు చదివారు. ప్రస్తుతం ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేస్తూ, థియేటర్‌ రంగంలో రాణిస్తున్నారు. నూతన జాతీయ విద్యావిధానం - 2020, అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్, జాతీయ స్థాయిలో క్రెడిట్‌ల బదిలీ లాంటి విధానాలు అమల్లోకి వస్తే విద్యా సంవత్సరాలు నష్టపోకుండానే, ఒక కోర్సు నుంచి మరో కోర్సుకూ, ఒక విద్యా సంస్థ నుంచి మరో విద్యాసంస్థకూ మారే అవకాశం ఉంటుంది. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: కె.పవన్‌కుమార్‌

    Ans:

    డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఉద్యోగం పొందాలంటే మార్కెటింగ్, కంప్యూటర్‌ గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి. దీంట్లో రాణించాలంటే.. గూగుల్‌ డిజిటల్‌ మార్కెటింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్, వెబ్‌ ఎనలిటిక్స్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, మార్కెటింగ్‌ ఆటోమేషన్, వెబ్‌ డిజైనింగ్‌ లాంటి కోర్సులను ఆఫ్‌లైన్‌/ ఆన్‌లైన్‌లో చేయాలి. మీకు డిజిటల్‌ మార్కెటింగ్‌లో ఎనలిటిక్స్‌ రంగంపై ఆసక్తి ఉంటే గూగుల్‌ ఎనలిటిక్స్, గూగుల్‌ యాడ్‌ మేనేజర్, గూగుల్‌ యాడ్స్, హబ్‌ స్పాట్, మెయిల్‌ మోడొ, జీటీ మెట్రిక్స్, బిట్లీ, హూట్‌ సూట్, కేన్వా, గెట్‌ రెస్పాన్స్, బజ్‌ సుమో లాంటి టూల్స్‌ నేర్చుకోవాలి. పీజీ విషయానికొస్తే.. ఎంబీఏలో మార్కెటింగ్‌/ డిజిటల్‌ మార్కెటింగ్‌/ మార్కెటింగ్‌ ఎనలిటిక్స్‌ స్పెషలైజేషన్‌ చదివితే డిజిటల్‌ మార్కెటింగ్‌ రంగంలో ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌