Post your question

 

    Asked By: సీహెచ్‌. రవితేజ

    Ans:

    బీబీఎం డిగ్రీలో మీరు ఏ స్పెషలైజేషన్‌ చదివారో చెప్పలేదు. మీరు చదివిన స్పెషలైజేషన్, ఏ కంపెనీలో పని చేయాలనుకొంటున్నారో అన్న అంశాలను బట్టి ఎలాంటి సర్టిఫికెట్‌ కోర్సులు చేయాలో నిర్ణయించుకోండి. మీరు మార్కెటింగ్‌ రంగంలో ఉద్యోగం చేస్తూ ఉంటే డిజిటల్‌ మార్కెటింగ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, అడ్వర్‌టైజింగ్, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్, బ్రాండింగ్‌ మేనేజ్‌మెంట్, సేల్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్‌ ఎనలిటిక్స్, మార్కెటింగ్‌ రిసెర్చ్‌ల్లో సర్టిఫికెట్‌ కోర్సులు చేయవచ్చు. ఫైనాన్స్‌ రంగంలో ఉద్యోగం చేస్తూవుంటే, క్వాంటిటేటివ్‌ ఫైనాన్స్, ఫిన్‌ టెక్, ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్, ఫైనాన్సియల్‌ మార్కెట్స్, కాస్ట్‌ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్‌ ఎనలిటిక్స్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌ల్లో సర్టిఫికెట్‌ కోర్సులు చేసుకోవచ్చు. హెచ్‌ఆర్‌ రంగంలో హెచ్‌ఆర్‌ లీడర్‌ షిప్, స్ట్రాటజిక్‌ హెచ్‌ఆర్‌ఎం, టాలెంట్‌ హెచ్‌ఆర్‌ఎం, రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ట్రెయినింగ్, హెచ్‌ఆర్‌ ఎనలిటిక్స్‌ల గురించి కూడా ఆలోచించవచ్చు. ఆపరేషన్స్‌ రంగానికొస్తే, సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్, సోర్సింగ్, క్వాలిటీ మేనేజ్‌మెంట్, సిక్స్‌ సిగ్మా, సర్వీస్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్, సప్లై చెయిన్‌ ఎనలిటిక్స్‌ల్లో సర్టిఫికెట్‌ కోర్సులు చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: వాసన్‌

    Ans:

    మీరు డిగ్రీలో ఏ సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో రాణించాలంటే ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌ ప్రాథమిక అంశాలపై అవగాహన పెంచుకొని, పట్టు సాధించాలి. మీరు డిగ్రీలో చదివిన సబ్జెక్టులపైనే ఆధారపడితే నేరుగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పొందడం కష్టం. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి బాగా డిమాండ్‌ ఉన్న ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌ కోర్సులను నేర్చుకొనే ప్రయత్నం చేయండి. కనీసం ఏడాది పాటు సీ, జావా, ఆర్, పైతాన్‌ లాంటి ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌తో పాటు, కంప్యూటర్‌ ఆర్కిటెక్చర్, డేటా స్ట్రక్చర్స్, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ లాంటి సబ్జెక్టులను ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా నేర్చుకోండి. మీకు డిగ్రీలో మార్కుల శాతం ఎక్కువగా లేకపోతే కంప్యూటర్‌ సైన్స్‌/ డేటా సైన్స్‌/ బిజినెస్‌ అనలిటిక్స్‌ల్లో పీజీ చేసి మంచి మార్కులు పొందటం మేలు. పీజీ కోర్సును క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ అవకాశాలున్న విద్యా సంస్థల్లో చదివితే మంచిది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడాలంటే ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్, లాంగ్వేజ్, ఎనలిటికల్, లాజికల్‌ స్కిల్స్‌ చాలా అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి. విక్రమ్‌

    Ans:

    తెలంగాణా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ నిర్వహించే గ్రూప్‌-4 ఉద్యోగ పరీక్షలకు విద్యార్హత డిగ్రీ. యూజీసీ గుర్తింపు పొందిన ఏ విశ్వవిద్యాలయం నుంచైనా కనీసం మూడు సంవత్సరాల డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారే గ్రూప్‌-4 ఉద్యోగాలకు అర్హులు. దూరవిద్య, ఓపెన్‌ యునివర్సిటీ ద్వారా డిగ్రీ చదివినవారూ అర్హులే. కానీ, డిప్లొమా చదివినవారు గ్రూప్‌- 4 ఉద్యోగాలకు అర్హులు కారు. మన దేశంలో డిగ్రీని పూర్తిచేయడానికి కనీసం 15 సంవత్సరాల పాటు విద్యని అభ్యసించి ఉండాలి. మీరు మూడు సంవత్సరాల డిప్లొమాతో కలిపి 13 సంవత్సరాలే చదివారు కాబట్టి, గ్రూప్‌ 1,2,3,4 పరీక్షలకు అర్హత సాధించాలంటే కచ్చితంగా డిగ్రీ పూర్తిచేయాలి. డిప్లొమా చదివినవారు నేరుగా డిగ్రీ రెండో సంవత్సరంలో ప్రవేశం పొంది, రెండేళ్లలోనే డిగ్రీ పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మీరు డిప్లొమా/పదో తరగతి విద్యార్హత ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియట్‌ విద్యార్హత ఉన్న కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు డిప్లొమా చదివినవారికి కూడా అర్హత ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలావాటికి అర్హత సాధించాలంటే ముందుగా మీరు డిగ్రీని పూర్తి చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి. విక్రమ్‌

    Ans:

    తెలంగాణా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ నిర్వహించే గ్రూప్‌-4 ఉద్యోగ పరీక్షలకు విద్యార్హత డిగ్రీ. యూజీసీ గుర్తింపు పొందిన ఏ విశ్వవిద్యాలయం నుంచైనా కనీసం మూడు సంవత్సరాల డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారే గ్రూప్‌-4 ఉద్యోగాలకు అర్హులు. దూరవిద్య, ఓపెన్‌ యునివర్సిటీ ద్వారా డిగ్రీ చదివినవారూ అర్హులే. కానీ, డిప్లొమా చదివినవారు గ్రూప్‌- 4 ఉద్యోగాలకు అర్హులు కారు. మన దేశంలో డిగ్రీని పూర్తిచేయడానికి కనీసం 15 సంవత్సరాల పాటు విద్యని అభ్యసించి ఉండాలి. మీరు మూడు సంవత్సరాల డిప్లొమాతో కలిపి 13 సంవత్సరాలే చదివారు కాబట్టి, గ్రూప్‌ 1,2,3,4 పరీక్షలకు అర్హత సాధించాలంటే కచ్చితంగా డిగ్రీ పూర్తిచేయాలి. డిప్లొమా చదివినవారు నేరుగా డిగ్రీ రెండో సంవత్సరంలో ప్రవేశం పొంది, రెండేళ్లలోనే డిగ్రీ పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మీరు డిప్లొమా/పదో తరగతి విద్యార్హత ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే అర్హులు. ఇంటర్మీడియట్‌ విద్యార్హత ఉన్న కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు డిప్లొమా చదివినవారికి కూడా అర్హత ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలావాటికి అర్హత సాధించాలంటే ముందుగా మీరు డిగ్రీని పూర్తి చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: గాయత్రి

    Ans:

    ప్రతి ఓటమీ విలువైన అనుభవాన్నిస్తుంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని, రాబోయే చిక్కులను సమర్థంగా ఎదుర్కొనే మానసిక  స్థైర్యాన్ని పొందండి. సమస్యతో పోరాడాలే కానీ, సమస్య నుంచి పారిపోవడం పరిష్కారం కాదు. ఈ వైఫల్యాన్ని మిమ్మల్ని మీరు రుజువు చేసుకొనే అవకాశంగా భావించండి. సమస్యను లోపల నుంచి కాకుండా, బయట నుంచి చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు సమస్య తీవ్రత తగ్గిపోతుంది!

    ‣ ఇంటర్‌ ఫెయిలై ఇంజినీరింగ్‌ చదవలేకపోయాననే బాధతో ఇలాంటి ప్రతికూల ఆలోచనలు చేయటంలో అర్థం లేదు. ప్రపంచంలో అన్నింటికన్నా అత్యంత విలువైనది మీ జీవితం. ఇది మీ ఒక్కరిదే కాదు, మీ కుటుంబానిదీ, సమాజానిదీ కూడా! ఆ ఆలోచన వచ్చిన ప్రతిసారీ మీరే లోకంగా ఉండే అమ్మానాన్నల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆత్మహత్య చేసుకున్న మీ క్లాస్‌ టాపర్‌ కన్నవాళ్లకు ఎంత క్షోభ మిగిల్చాడో దృష్టిలో పెట్టుకోండి. పరీక్షలో ఫెయిలవ్వడం అనేది ప్రమాదం లాంటిది. దాని తరువాత కూడా జీవితం ఉంటుంది. చాలాసార్లు అంతకుముందు కంటే ఇంకా బాగుండే అవకాశమూ ఉంది.

    దాదాపు 35 సంవత్సరాల క్రితం ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెÆయిలైనప్పుడు ఆత్మహత్య ఆలోచన నాకూ వచ్చింది. అప్పుడు మా అమ్మగారు ‘జీవితాన్ని అర్థ్ధాంతరంగా ముగించడం పిరికివాళ్ళు చేసే పని’ అంటూ మందలించి, ఆ ఆలోచన నుంచి నన్ను దూరం చేశారు. ఒకవేళ అలాంటి నిర్ణయమే తీసుకొనివుంటే, ఈ రోజు మీకీ సమాధానం ఇవ్వడానికి నేనుండేవాడినే కాదు.

    ఈ ఓటమి కంటే ముందు, మీరెన్నో విజయాలు సాధించివుంటారు. అవన్నీ గుర్తుకు తెచ్చుకొని మీమీద నమ్మకాన్ని పెంచుకోండి. ‘చంద్రుడు కనిపించట్లేదని ఏడిస్తే, కళ్ళల్లో నీరు నిండి నక్షత్రాలు కూడా కనిపించవు’. మన చుట్టూ ఉన్న చాలామంది మనకంటే తీవ్రమైన సమస్యలను చిరునవ్వుతో ఎదుర్కొంటూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అవకాశం ఉంటే ఎవరైనా ఒక కౌన్సెలర్‌తో మాట్లాడండి. అమ్మానాన్నలతో మీ ఆలోచనలను పంచుకోండి. సానుకూల దృక్పథం ఉన్న బంధువులతో, స్నేహితులతో మాట్లాడుతూ ఉండండి. మ్యాథ్స్‌ సబ్జెక్టుకు ట్యూషన్‌ పెట్టుకొని ఈసారి కచ్చితంగా ఉత్తీర్ణులయ్యే ప్రయత్నం చేయండి. ఇంటర్‌ మ్యాథ్స్‌లో ఉత్తీర్ణతే కష్టంగా ఉంటే, ఇంజినీరింగ్‌లో ఉండే మ్యాథ్స్‌ కూడా కష్టంగా ఉండే అవకాశం ఉంది. అందుకని ఇంజినీరింగ్‌ కాకుండా, నచ్చిన మరేదైనా డిగ్రీ చదివే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఇంజినీరింగ్‌ మీద బాగా ఇష్టం ఉంటే.. ఈ కోర్సులో చేరడానికి ముందే ఇంజినీరింగ్‌ మ్యాథ్స్‌పై పట్టు తెచ్చుకొనే ప్రయత్నం చేయండి. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కుమార్‌

    Ans:

    మీ అబ్బాయి అగ్రికల్చర్‌ కోర్సును విదేశాల్లో చదివిన తరువాత అక్కడే స్థిరపడతాడా, మనదేశానికి తిరిగివస్తాడా అనే విషయాన్ని బట్టి, ఏ దేశంలో చదవాలనే నిర్ణయం తీసుకోండి. అగ్రికల్చర్‌లో మొదటి డిగ్రీని మనదేశంలో చేసి, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, పరిశోధనల కోసం విదేశాలకు వెళ్ళడం శ్రేయస్కరం. అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/ లైఫ్‌ సైన్సెస్‌ చదివినవారికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువే. మీ అబ్బాయి అగ్రికల్చర్‌ కోర్సుని చదవాలనుకొనే దేశంలో ఏ స్పెషలైజేషన్‌కి ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయో, ఆ స్పెషలైజేషన్‌ను ఎంచుకోవాలి. మరిన్ని ఉద్యోగావకాశాల కోసం అగ్రికల్చర్‌లో లైఫ్‌ సైన్సెస్‌ సంబంధిత స్పెషలైజేషన్‌లు కూడా ఎంచుకుని ఆ రంగంలోనూ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు.
    యూకేలో కేంబ్రిడ్జ్, నాటింగ్‌ హామ్, గ్లాస్గో, లివర్‌ పూల్, బ్రిస్టల్‌ యూనివర్సిటీలు అగ్రికల్చర్‌ కోర్సును అందిస్తున్నాయి. కెనడాలో గుల్ఫ్, అల్బెట్రా, బ్రిటిష్‌ కొలంబియా, మెక్‌ గిల్, సాస్కట్చెవన్‌ విశ్వ విద్యాలయాలు, ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్‌బోర్న్, క్వీన్స్‌ లాండ్, అడిలైడ్, లాత్రోబే యూనివర్శిటీలు ఈ కోర్సు అందిస్తున్నాయి యూఎస్‌లో.. మసాచుసెట్స్, పర్ద్యూ, కార్నెల్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా విశ్వ విద్యాలయాల్లో చదువుకోవచ్చు. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కె.ప్రసాద్‌

    Ans:

    యానిమల్‌ హజ్బెండరీ రంగంలో విదేశాల్లో పరిశోధన చేయాలనుకోవడం అభినందనీయం. యూకేలో యానిమల్‌ హజ్బెండరీలో పరిశోధన చేయాలంటే యూనివర్శిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్, యూనివర్శిటీ ఆఫ్‌ నాటింగ్‌ హామ్, యూనివర్శిటీ ఆఫ్‌ ఎడిన్‌బరో, యూనివర్శిటీ ఆఫ్‌ గ్లాస్గో, యూనివర్శిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌లను పరిగణించవచ్చు. కెనడాలో వెస్టర్న్‌ కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ మెడిసిన్, అంటారియో వెటర్నరీ కాలేజ్, యూనివర్శిటీ ఆఫ్‌ గుల్ఫ్, యూనివర్శిటీ ఆఫ్‌ ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్, యూనివర్శిటీ ఆఫ్‌ కాల్గెరి, ఆస్ట్రేలియాలో యూనివర్శిటీ ఆఫ్‌ సిడ్నీ, యూనివర్శిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్, యూనివర్శిటీ ఆఫ్‌ క్వీన్స్‌ లాండ్, యూనివర్శిటీ ఆఫ్‌ అడిలైడ్, చార్లెస్‌ స్టర్ట్‌ యూనివర్శిటీల్లో కూడా ఈ రంగంలో పరిశోధనకు అవకాశాలున్నాయి. యూఎస్‌లో యూనివర్శిటీ ఆఫ్‌ ఆరిజోనా, పర్ద్యూ యూనివర్శిటీ, కెంట్‌ స్టేట్‌ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్‌ ఇల్లినాయిస్, యూనివర్శిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ల్లో కూడా యానిమల్‌ హజ్బెండరీ పరిశోధన చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: రామ్‌నాథ్‌

    Ans:

    పర్యావరణ కోర్సులకు విదేశాల్లో చాలా డిమాండ్‌ ఉంది. యూఎస్‌లో ఈ కోర్సు చేశాక వివిధ వస్తువుల తయారీ పరిశ్రమల్లో, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ, రిఫైనరీ, బోధన - పరిశోధన రంగాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఎన్విరాన్‌మెంటల్‌ కోర్సు చేసినవారు పర్యావరణ శాస్త్రవేత్త, అధ్యాపకుడు, పర్యావరణ పాత్రికేయుడు, పర్యావరణ అధికారి, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్, రిసెర్చ్‌ అసోసియేట్, క్లైమేట్‌ కంట్రోలర్‌ ఉద్యోగాలు చేయటానికి వీలుంటుంది. ఇంకా ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ అండ్‌ సేఫ్టీ ఆఫీసర్, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్, సస్టెయినబిలిటీ కన్సల్టెంట్, నేచర్‌ కన్జర్వేషన్‌ ఆఫీసర్, పర్యావరణ విద్యాధికారి.. ఈ హోదాల్లో పనిచేసే అవకాశాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌