Post your question

 

    Asked By: ఆకాంక్ష

    Ans:

    యూకేలో మెడిసిన్‌ కోర్సు చదవాలంటే ఇంటర్మీడియట్‌ (బైపీసీ)లో అత్యుత్తమ ప్రతిభతో పాటు ఐఈఎల్‌టీఎస్‌ పరీక్షలో కనీసం 7 స్కోరు సాధించాలి. ఈ పరీక్షలో ఉన్న నాలుగు సెక్షన్లలో (రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్‌) కనీసం 6.5 స్కోరు రావాలి. లేదా ఐబీ (ఇంటర్నేషనల్‌ బ్యాకలోరియట్‌) పరీక్షలో కనీసం 40 స్కోరు పొందాలి. కొన్ని మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశానికి యూకే క్లినికల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ టెస్ట్‌ని ఆన్‌లై న్‌లో నిర్వహిస్తారు. యూకే క్లినికల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో వెర్బల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ రీజనింగ్, ఆబ్‌స్ట్రాక్ట్‌ రీజనింగ్, డెసిషన్‌ అనాలిసిస్, సిట్యుయేషనల్‌ జడ్జ్‌మెంటుల్లో ప్రశ్నలు ఉంటాయి.
    జర్మనీ విషయానికొస్తే ఇంటర్మీడియట్‌ లో అత్యుత్తమ ప్రతిభతో, ఇంగ్ల్లిష్‌ ప్రావీణ్యంతో పాటు జర్మన్‌ భాషలో కూడా కొంత ప్రవేశం అవసరం. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లపై మంచి పట్టు, మ్యాథ్స్‌ ప్రాథమికాంశాల పరిజ్ఞానం ఉండాలి. వీటితో పాటు కొన్ని యూనివర్సిటీలు ప్రత్యేక నియామక పద్ధతులను అనుసరిస్తాయి. విదేశీ యూనివర్సిటీల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవాలి. విశ్వవిద్యాలయాల ప్రామాణికత తెలుసుకోవడానికి ప్రపంచ ర్యాంకింగ్‌ వెబ్‌సైట్‌లను సందర్శించాలి. విదేశాల్లో కూడా పారా మెడికల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మీరు పారా మెడికల్‌ కోర్సును ఏ దేశంలోని ఏ విశ్వవిద్యాలయంలో చేయాలనుకొంటున్నారో ఆ వర్సిటీ వెబ్‌సైట్‌కు వెళ్లి కావాల్సిన వివరాలను తెలుసుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: బిందు

    Ans:

    మీరు కంప్యూటర్‌ సైన్స్‌లో కానీ, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో కానీ, ఇండస్ట్రియల్‌ మేనేజ్‌మెంట్‌లో కానీ ఎంఎస్‌ చేయవచ్చు. ఇవే కాకుండా, ఇండస్ట్రియల్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి లాజిస్టిక్స్, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి వాటి గురించీ ఆలోచించవచ్చు. ఇటీవలికాలంలో డేటా సైన్స్‌ చదివినవారికి ఎక్కువ ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. అందుకని ఆసక్తి ఉంటే డేటా సైన్స్, బిజినెస్‌ ఎనలిటిక్స్‌ లాంటి సబ్జెక్టుల్లో ఎంఎస్‌ చేసే ప్రయత్నం చేయండి. ఇవే కాకుండా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఫిన్‌ టెక్, ఐఓటీ, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ లాంటి కోర్సుల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉన్నాయి. మీ అభిరుచి, ఆసక్తి, దీర్ఘకాలిక ఆశయాలను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    మీరు ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సు చేశాక, బీఏ డిగ్రీ కూడా చేశారు కాబట్టి, డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ మీరు అర్హులే. ఏదైనా ఉద్యోగ నోటిఫికేషన్‌లో ‘ఇంటర్‌ వొకేషనల్‌ చేసినవారు అర్హులు కాదు’ అని చెప్పనంతవరకు మీరు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలనూ నిశ్చింతగా రాయవచ్చు. ఇటీవల జారీ అయిన ఏ ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలోనూ ఆ విధంగా పేర్కొనలేదు. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: బీవీడీ రమణమూర్తి, విశాఖపట్నం

    Ans:

    ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ కోర్సుని డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విధానంలో అతితక్కువ యూనివర్సిటీలు మాత్రమే అందిస్తున్నాయి. సాధారణంగా ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ చేయాలంటే, డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ చదివి ఉండాలన్న నిబంధన అమల్లో ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్‌ విభాగంలో మాత్రం ఎంఎస్సీ స్టాటిస్టిక్స్‌ చేయాలంటే డిగ్రీలో మ్యాథ్స్‌/ స్టాటిస్టిక్స్‌ చదివి ఉండాలి. కాబట్టి, మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొ. జి. రాంరెడ్డి డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ నుంచి ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ కోర్సుని ప్రైవేటుగా చేయొచ్చు.    భవిష్యత్తులో నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020 పూర్తి స్థాయిలోకి అమల్లోకి వచ్చాక మరిన్ని యూనివర్సిటీలు  యూజీ/పీజీ కోర్సుల ప్రవేశాలకు విద్యార్హతలను    మరింతగా సడలించే అవకాశం ఉంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: karnakargoud22

    Ans:

    శాతవాహనుల జన్మస్థలం, రాజధానులపై ఉన్న భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జైన వాఞ్మయం ప్రకారం శాతవాహనుల తొలి రాజధాని ప్రతిష్ఠానపురం లేదా పైఠాన్. ఆధునిక చరిత్రకారులు కొందరు శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల అని పేర్కొంటున్నారు. పూర్తి విరాల కోసం కింది లింక్‌ను చూడండి.

    link:

    https://pratibha.eenadu.net/jobs/lesson/police-jobs/police-jobs-telangana/telugu-medium/education/2-1-10-427-723-485-5992-11980-4023-20040014107

    Asked By: ఎస్‌.సురేష్‌

    Ans:

    పోటీ పరీక్షల్లో జనరల్‌ ఇంగ్లిష్‌ సబ్జెక్టులో మెరుగైన స్కోరు సాధించాలంటే ముందునుంచే ప్రణాళికాబద్ధంగా సిద్దం కావాలి. ఇంగ్లిష్‌ కూడా మిగతా సబ్జెక్టుల్లాగే కొన్ని సూత్రాలు, నియమాలపై ఆధారపడి ఉంటుంది. ఆ నియమాలనూ, గ్రామర్‌నూ బాగా నేర్చుకొన్నట్లయితే పోటీ పరీక్షలో రాణించడం కష్టమేమీ కాదు. గ్రామర్‌ తోపాటు ఇంగ్లిష్‌లో పర్యాయ పదాలూ, వ్యతిరేక పదాలను కూడా బాగా నేర్చుకోండి. ఆంగ్ల వార్తా పత్రికలను క్రమం తప్పకుండా చదువుతూ టీవీలో, రేడియోలో ఇంగ్లిషు వార్తలను కూడా వినండి. వీటన్నింటితోపాటు ఆబ్జెక్టివ్‌ జనరల్‌ ఇంగ్లిష్‌ (ఎస్‌పీ భక్షి), ఇంగ్లిష్‌ గ్రామర్‌ అండ్‌ కంపోజిషన్‌ (ఎస్‌సీ గుప్త), ఆబ్జెక్టివ్‌ ఇంగ్లిష్‌ ఫర్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌ (హరిమోహన్‌ ప్రసాద్‌ అండ్‌ ఉమా సిన్హా), జనరల్‌ ఇంగ్లిష్‌ ఫర్‌ ఆల్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌  (దిశ ఎక్స్‌పర్ట్స్‌) లాంటి పుస్తకాలను చదివి, బాగా సాధన చేయండి. వీలున్నన్ని మాక్‌ టెస్ట్‌లు రాసి పోటీ పరీక్షల్లో మెరుగైన స్కోరు సాధించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

     

    Asked By: మేఘశ్యామ్‌

    Ans:

    డిగ్రీలో కంప్యూటర్‌కు సంబంధించిన చాలా కోర్సులు చదవాలంటే ఇంటర్‌లో మ్యాథమెటిక్స్‌ చదివి ఉండాలి. మీకు బిజినెస్‌/కామర్స్‌ సబ్జెక్టులపై ఆసక్తి ఉంటే బీకామ్‌ కంప్యూటర్స్‌ కానీ, బీబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కానీ, బీకామ్‌ డేటా సైన్స్‌ కానీ చదవొచ్చు. బిజినెస్‌ అనలిటిక్స్, డేటా సైన్స్‌ కోర్సులు చదవాలంటే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌ లాంటి సబ్జెక్టులపై గట్టి పట్టు ఉండాలి. అలాకాకుండా మీరు బీఎస్సీ డిగ్రీ చదవాలనుకొంటే డిగ్రీలో బయాలజీ, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులతో పాటుగా కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ లాంటి సబ్జెక్టులు ఉండేలా చూసుకోండి. మీకు డిగ్రీ పూర్తవ్వడానికి మరో మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి, ఈ మూడు సంవత్సరాల్లో డిగ్రీతో పాటు జావా, సీ‡, సీ‡ ప్లస్‌ ప్లస్, పీ‡హెచ్‌పీ‡, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్‌ లాంటి కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లను నేర్చుకోండి. వీటితో పాటుగా ఎంఎస్‌ ఎక్సెల్‌లో కూడా నైపుణ్యం సంపాదించండి. మీరు డిగ్రీ చివరి సంవత్సరంలోకి వచ్చాక సీనియర్‌లనూ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్నవారినీ సంప్రదించి త్వరగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పొందాలంటే ఎలాంటి ప్రత్యేక కోర్సులు చేయాలో తెలుసుకొని, వాటిలో శిక్షణ పొందితే మీ లక్ష్యం నెరవేరుతుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: బి.పార్థసారథి

    Ans:

    - అసిస్టెంట్‌ ఫారెస్ట్‌ కన్జర్వేటివ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగం అడవులను పరిరక్షించడానికి అవసరమైన ఒక పరిపాలనా ఉద్యోగం. దీనికి అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా అర్హులే. ఈ ఉద్యోగంలో అమ్మాయిలు మాత్రమే ఎదుర్కొనే ప్రత్యేకమైన సవాళ్లేమీ లేవు. ఫీల్డ్‌ వర్క్‌తోపాటు పరిపాలనా సంబంధిత బాధ్యతలనూ నిర్వహించవలసి ఉంటుంది. అటవీ పరిరక్షణ, ఆధునిక టెక్నాలజీని వాడటం, అపాయాలను ముందే పసిగట్టడం, ఉద్యోగుల పర్యవేక్షణ, అటవీ ప్రమాదాలను అంచనా వేయడం లాంటి బాధ్యతలు ఉంటాయి. ఈ ఉద్యోగానికి ఏం అవసరమంటే.. శారీరక దృఢత్వం, కమ్యూనికేషన్‌ స్కిల్స్, నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం, శ్రద్ధగా వినగలగటం, విశ్లేషణాత్మక శక్తి, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోగల సామర్థ్యం, నిర్వహణ నైపుణ్యాలు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో అమ్మాయిలు చేయలేని, చేయకూడని ఉద్యోగాలంటూ ఏమీ లేవు. అడవులను పరిరక్షిస్తూ, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలన్న ఆసక్తి ఉంటే, అమ్మాయిలు కూడా నిరభ్యంతరంగా ఈ ఉద్యోగానికి సన్నద్ధం కావొచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కె. వంశీరెడ్డి

    Ans:

    సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ నియామక ప్రకటనల్లో యూజీసీ/ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి విద్యార్హతలు ఉండాలని అడుగుతారు. మీరు ఏపీకి సంబంధించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి తెలంగాణలో ఉన్న కోదాడ స్టడీ సెంటర్‌లో డిగ్రీ చేశానని చెప్పారు. ఏ యూనివర్సిటీ అయినా యూజీసీ నియమనిబంధనల ప్రకారం స్టడీ సెంటర్‌ల ద్వారా డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందించడానికి కావాల్సిన అనుమతులు పొందివుంటే, ఆ డిగ్రీలు ఏ ఉద్యోగానికి అయినా చెల్లుబాటు అవుతాయి. మీరు తెలంగాణా రాష్ట్రానికి లోకల్‌ అయితే, తెలంగాణలో 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ఒకవేళ మీరు తెలంగాణ రాష్ట్రానికి నాన్‌ లోకల్‌ అయితే 5 శాతం ఓపెన్‌ కోటా కోసం పోటీపడాలి.  ఓపెన్‌ కోటాకు లోకల్, నాన్‌ లోకల్‌ అభ్యర్థులు అందరూ అర్హులే! టీఎస్‌పీ‡ఎస్సీ ఉద్యోగాలతో పాటు, డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ లోకల్‌/ ఓపెన్‌ కోటాలో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌