Post your question

 

  Asked By: prasanth

  Ans:

  ఇటీవలికాలంలో చాలా ఉద్యోగ/ప్రవేశ పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)గానే నిర్వహిస్తున్నారు. కొన్ని సంవత్సరాలపాటు పెన్ను, పేపర్‌ పరీక్షలకు అలవాటుపడిన తరానికి మొదటిసారి సీబీటీ రాయడం కొంత కంగారు కలిగించవచ్చు. కానీ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకొని, మాక్‌ టెస్ట్‌లను కంప్యూటర్‌పై సాధన చేస్తే సీబీటీని సులువుగా రాయవచ్చు. సాధారణ రాత పరీక్షలో అభ్యర్థులు తమకు కేటాయించిన బెంచి/ కుర్చీపై కూర్చొని రైటింగ్‌ ప్యాడ్‌/ టేబుల్‌పై పరీక్ష రాస్తారు. కానీ సీబీటీలో వారికి కేటాయించిన కంప్యూటర్‌ ముందు కూర్చుంటారు. కేటాయించిన ఐడీ…, పాస్‌వర్డ్‌లతో లాగిన్‌ అవ్వాలి. ఆపై తెరపై ఉన్న వివరణాత్మక సూచనలను జాగ్రత్తగా చదవాలి. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నలు కంప్యూటర్‌ తెర మీద కనిపిస్తాయి. ప్రశ్నను జాగ్రత్తగా చదివి, సరైన సమాధానాన్ని మౌస్‌తో గుర్తించాలి. పరీక్ష అయ్యేవరకు కీబోర్డ్‌ పనిచేయదు. ఒకవేళ మీరు తప్పు సమాధానాన్ని గుర్తించినట్లు భావిస్తే, పరీక్ష పూర్తయ్యేలోపు ఎప్పుడైనా దాన్ని సరిచేసుకోవచ్చు. ఈ  వెసులుబాటు పెన్ను, పేపర్‌ పరీక్షల్లో ఉండదు.  ఏదైనా కంప్యూటర్‌/మౌస్‌ సరిగా పనిచేయకపోతే, ఆ అభ్యర్ధికి వెంటనే మరొక కంప్యూటర్‌/మౌస్‌ను కేటాయిస్తారు. ఈ మార్పిడిలో కోల్పోయిన సమయం సర్వర్‌లో సర్దుబాటు చేస్తారు. రాత పరీక్షలోలాగా మీరు ప్రతిసారీ టైమ్‌ చూసుకొనే పని లేకుండా, మానిటర్‌పై ఇంకా ఎంత  టైమ్‌ మిగిలి ఉందో కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి టైమర్‌ సున్నాను చూపించగానే పరీక్ష పూర్తవుతుంది. మీరు గుర్తించిన సమాధానాలు వాటికవే అప్‌ లోడ్‌ అయిపోతాయి. ప్రత్యేకించి పరీక్షను క్లోజ్‌ చేయాల్సిన అవసరం లేదు. పరీక్ష రాసేప్పుడు సమయంతో పాటు, ఎన్ని ప్రశ్నలు చదివారు, ఎన్ని  సమాధానాలు రాశారు, ఎన్నింటికి సమాధానాలు రాయలేదు, ఎన్ని సమాధానాలను రివ్యూ చేయాలని భావించారు అనే వివరాలు కూడా డిస్‌ ప్లే అవుతాయి. ఒకవేళ పరీక్ష సమయం పూర్తయ్యేలోపు మీరు రివ్యూ చేయాలనుకున్న సమాధానాలను రివ్యూ చేయలేకపోతే, ఆ సమాధానాలను కూడా మూల్యాంకనం చేస్తారు. మీరు పరీక్ష రాసేప్పుడు అవసరమైన కాలిక్యులేషన్స్‌ అన్నింటినీ ఇచ్చిన రఫ్‌షీట్‌లో మాత్రమే చేయాలి. పరీక్ష పూర్తయిన తర్వాత రఫ్‌ షీట్లను తప్పనిసరిగా విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని సీబీటీని ధైర్యంగా రాయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: రాజేష్‌ సెహ్వాగ్‌

  Ans:

  బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌లో కంప్యూటర్స్‌తోపాటు మీరు ఏయే సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. కార్డియాలజీ టెక్నీషియన్‌ పీజీ డిప్లొమా చేయాలంటే చాలా యూనివర్సిటీలు, హాస్పటల్‌లు డిగ్రీలో కనీసం ఒక లైఫ్‌సైన్స్‌ కోర్సు చదివి ఉండాలన్న నిబంధన విధిస్తున్నాయి. కార్డియాలజీలో డిప్లొమా కోర్సులకు కూడా ఇంటర్మీడియట్‌లో సైన్స్‌ చదివి ఉండాలన్న నిబంధన ఉంది. మీరు ఇంటర్‌/ డిగ్రీ స్థాయిలో లైఫ్‌ సైన్సెస్‌ కోర్సు చదివివుంటే కార్డియాలజీలో డిప్లొమా/ పీజీ డిప్లొమా చేసే అవకాశం ఉంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ విషయానికొస్తే మీకు ఈ కోర్సు చదివే అర్హత ఉంటే నాన్‌ లోకల్‌ కోటాలో పోటీపడాలి. హైదరాబాద్‌లో చాలా కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ కూడా ఈ  కోర్సును అందిస్తున్నాయి. మీకు విద్యార్హతలు, ఆర్ధిక వెసులుబాటు ఉంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో చదవడానికి ప్రయత్నించవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: సచిన్

  Ans:

  పరిశోధన చేయాలంటే సాధారణంగా ప్రవేశ పరీక్ష రాయాలి. యూజీసీ రెగ్యులేషన్స్‌ ప్రకారం యూజీసీ‡/ సీ‡ఎస్‌ఐఆర్‌ జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో, యూజీసీ/ సీ‡ఎస్‌ఐఆర్‌ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌), స్టేట్‌ లెవెల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (స్లెట్‌), గేట్‌లో ఉత్తీర్ణులయిన వారికి ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీల విషయానికొస్తే.. అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పరీక్ష నియమాలు యూజీసీ నిబంధనలకు అనుగుణంగా దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణ లోనూ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సెంట్రల్‌ యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ అడ్మిషన్‌ కోసం ఆయా యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశపరీక్షలు రాయవలసి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సెంట్రల్‌ యూనివర్సిటీలకూ కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష పెట్టాలని ఆలోచిస్తున్నారు. పీహెచ్‌డీ ప్రవేశానికి ఇంటర్వ్యూ తప్పనిసరి. ఇంటర్వ్యూలో పరిశోధన అంశం, సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం, పరిశోధన నైపుణ్యాలను పరిశీలిస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కులకు ఇంటర్వ్యూ మార్కులు కలిపి మెరిట్‌ లిస్టు తయారుచేసి పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తారు.      - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

  Asked By: జయశ్రీ

  Ans:

  -  స్కాలస్టిక్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ (శాట్‌)ను కాలేజ్‌ బోర్డ్‌ నిర్వహిస్తుంది. అమెరికా, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కళాశాలల్లో అడ్మిషన్‌ తీసుకోవాలనుకునేవారు ఈ పరీక్ష రాయాలి. ఇంటర్మీడియట్‌/ 12 క్లాస్‌ పూర్తయినవారు ఈ పరీక్ష రాయవచ్చు.  శాట్‌లో రీడింగ్, రైటింగ్, మ్యాథ్స్‌ అనే మూడు విభాగాలుంటాయి. రీడింగ్‌లో లిటరేచర్, హిస్టారికల్‌ డాక్యుమెంట్స్, సోషల్‌ సైన్సెస్, నేచురల్‌ సైన్సెస్‌లో ప్యాసేజ్‌లు ఉంటాయి. రైటింగ్‌లో గ్రామర్, ఒకాబ్యులరీ, ఎడిటింగ్‌ మెలకువలు ఉంటాయి. మ్యాథ్స్‌ విషయానికొస్తే దీనిలో రెండు భాగాలుంటాయి. ఒకటి కాలిక్యులేటర్‌ ఉపయోగించి సమాధానాలు కనుగొనడం, మరొకటి కాలిక్యులేటర్‌ ఉపయోగించకుండా సమాధానాలు కనుగొనడం. మ్యాథ్స్‌ విభాగంలో ప్రశ్నలు ఆల్జీబ్రా, జ్యామెట్రీ, ట్రిగొనమెట్రీల నుంచి ఉంటాయి. శాట్‌ని ఒక సంవత్సరంలో ఆరు సార్లు నిర్వహిస్తారు. దీన్ని ఎన్నిసార్లు అయినా రాయవచ్చు. జేఈఈ మెయిన్స్, శాట్‌ అనేవి రెండు విభిన్నమైన పరీక్షలు. జేఈఈ మెయిన్స్‌లో మ్యాథ్స్‌ కంటే, శాట్‌లో మ్యాథ్స్‌ సులభంగానే ఉంటుంది. శాట్‌లో నెగెటివ్‌ మార్కులు లేవు. ముందునుంచే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయితే శాట్‌లో మంచి స్కోరు తెచ్చుకోవడం కష్టమేమీ కాదు. -  ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: రాజేష్‌ సెహ్వాగ్‌

  Ans:

  ఏ రాష్ట్రంలో డిగ్రీ చదువుకున్నా హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా కోర్సు నిరభ్యంతరంగా చేయవచ్చు. కాకపోతే మీరు డిగ్రీ పొందిన యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉండాలి. మీరు డిగ్రీలో ఏం చదివారో, ఇప్పుడు ఏ కోర్సు, ఏ యూనివర్సిటీలో చదవాలనుకొంటున్నారో చెప్పలేదు. హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, నేషనల్‌ లా యూనివర్సిటీలు పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. ఒక్కో యూనివర్సిటీ, ఒక్కో సమయంలో ప్రకటనలు విడుదలచేస్తుంది. మీరు ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్‌లకు వెళ్ళి, అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ వివరాలు చూసి, నచ్చిన కోర్సుకు మీ విద్యార్హతలు సరిపోతాయో లేదో పరిశీలించి పీజీ డిప్లొమా కోర్సు చేయండి.- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

  Asked By: వినయ్‌కుమార్‌

  Ans:

  రెండు తెలుగు రాష్ట్రాల్లో బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సు ప్రవేశ పరీక్ష రాయాలంటే ఇంటర్‌లో బైపీసీ చదివి ఉండాలి. కానీ ఐసీ‡ఏఆర్‌ వారు నిర్వహించే ఏఐఈఈఏ పరీక్షకు ఇంటర్‌లో ఎంపీసీ చదివినవారు కూడా అర్హులే. ఈ పరీక్షలో మెరుగైన ర్యాంకు సాధించినవారు నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ -కర్నాల్, రాణి లక్ష్మీబాయి సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ-ఝాన్సీ, డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ- పూసాల్లో 100% సీట్లతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వ్యవసాయ యూనివర్సిటీల్లో  15% సీట్ల కోసం పోటీపడి ప్రవేశం పొందొచ్చు. మీరు ఇంటర్‌లో బయాలజీ చదవలేదు కాబట్టి అగ్రికల్చర్‌ కోర్సులో చేరేముందు బయాలజీ, అగ్రికల్చర్‌ సబ్జెక్టుల్లోని ప్రాథమిక విషయాలపై అవగాహన పెంచుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

   

  Asked By: మాధవి

  Ans:

  మీరు ఇంటర్మీడియట్‌ని 2011లో పూర్తిచేసి, డిగ్రీని 2020లో చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందీ లేదు. ఏ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌లోనూ రెండు కోర్సుల మధ్య విరామం గురించి ప్రత్యేకంగా అడగరు. డిగ్రీ అర్హత ఉన్న అన్నిరకాల ఉద్యోగాలకూ దూరవిద్యలో డిగ్రీ చదివినవారు అర్హులే. ఏదైనా నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు ఆయా ఉద్యోగాలకు మీ అర్హతను నిర్థరించుకోండి. ఆపై నిరభ్యంతరంగా దరఖాస్తు చేసుకోండి.

  Asked By: బి. ఆంజనేయులు

  Ans:

  సాధారణంగా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందాలంటే ఆరు మార్గాలున్నాయి.
  1. యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ నిర్వహించే జేఆర్‌ఎఫ్‌ పరీక్షలో ఉత్తీర్ణత
  2. యూజీసీ/ సీఎస్‌ఐఆర్‌ నెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత
  3. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణత
  4. గేట్‌ పరీక్షలో ఉత్తీర్ణత 
  5. ఎంఫిల్‌ చేసి ఉండటం
  6. వివిధ యూనివర్సిటీలు నిర్వహించే ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత 
  వీటిలో నుంచి ఒక్కో యూనివర్శిటీ ఒక్కో పదతిలో పీహెచ్‌డీ ప్రోగ్రాం ప్రవేశాలు నిర్వహిస్తాయి. మీరు ఏ సబ్జెక్ట్‌లో, ఏ యూనివర్సిటీలో ప్రవేశం పొందాలనుకొంటున్నారో ఆ వర్శిటీ వెబ్‌సైట్‌ సందర్శించి వివరాలు తెలుసుకోండి.
  జేఆర్‌ఎఫ్‌లో ఉత్తీర్ణత సాధించినవారికి మంచి ఫెలోషిప్‌లు అందుబాటులో ఉన్నాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చేసేవారికి నాన్‌ నెట్‌ ఫెలోషిప్‌ అందుబాటులో ఉంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పీహెచ్‌డీ చేసేవారికి ఫెలోషిప్‌లను అందిస్తున్నాయి. ఇవికాకుండా సైన్స్‌వారికి డీఎస్‌టీ, డీబీటీ ఫెలోషిప్‌లు, సోషల్‌ సైన్స్‌ వారికి ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ ఫెలోషిప్‌లున్నాయి. హిస్టరీ, ఆంత్రొపాలజీ, ఫిలాసఫీ లాంటి  సబ్జెక్ట్‌ల్లో పీహెచ్‌డీ చేసేవారిలో అతి కొద్ది మందికి ఆయా సబ్జెక్ట్‌ల ప్రొఫెషనల్‌ సొసైటీలు ఫెలోషిప్‌లు అందిస్తున్నాయి. కొన్ని ఎన్‌జీవోలు, అంతర్జాతీయ సంస్థలు కూడా అత్యంత ప్రతిభ ఉన్న పీహెచ్‌డీ స్కాలర్‌లకు ఫెలోషిప్‌లను అందిస్తున్నాయి.
  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌