Post your question

 

    Asked By: సీహెచ్‌.రాజశేఖర్‌

    Ans:

    అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్‌ కోర్సును దూరవిద్య ద్వారా చదవడం కుదరదు. కానీ, మూడు సంవత్సరాల డిప్లొమాతో ఉద్యోగం చేస్తున్నవారు మాత్రం ఈవినింగ్‌ కళాశాల్లో ఇంజినీరింగ్‌ కోర్సు చదవొచ్చు. మీ అమ్మాయి పదో తరగతి/ ఇంటర్మీడియట్‌ తరువాత డిప్లొమా చదివి ఉండకపోతే ఈవినింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదివే అవకాశం లేదు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ వారి ఏఎంఐఈ (అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ద ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే ఆ సర్టిఫికెట్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీకి సమానం అవుతుంది. కాకపోతే, ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువ. మీ అమ్మాయిని బీఈ/ బీటెక్‌ మాత్రమే చదివించాలి అనుకొంటే,  బీఎస్సీని మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌లతో పూర్తి చేసి, బిట్స్‌ పిలానీ వారి వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రాం (విల్ప్‌) ద్వారా బీటెక్‌ చేసే వీలుంది. దూరవిద్యలో బీఎస్సీ తరువాత, ఎమ్మెస్సీ( మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌) చేసి బిట్స్‌ విల్ప్‌ ద్వారా ఎంటెక్‌ చేసే అవకాశమూ ఉంది. ప్రస్తుతం తను ఉద్యోగం చేస్తున్న సంస్ధ నుంచి రెండు సంవత్సరాల సెలవు తీసుకొని, తను గతంలో చదివిన ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి మిగిలిన రెండు సంవత్సరాల కోర్సును పూర్తిచేసే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: అమూల్య

    Ans:

    ధ్యానం అనేది యోగాలో ఒక భాగం. వివిధ యోగా రూపాలైన హఠ యోగం, కర్మ యోగం, భక్తి యోగం, రాజయోగాల్లో హఠ యోగాన్ని ఎక్కువగా అభ్యసిస్తారు. ఇందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 భాగాలుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో మూడు విశ్వవిద్యాలయాలు యోగాలో రెగ్యులర్‌ మాస్టర్‌/ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖపట్నం)లో ఎంఏ /పీజీ డిప్లొమా, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (తిరుపతి)లో ఎమ్మెస్సీ /పీజీ డిప్లొమా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (గుంటూరు)లో పీజీ డిప్లొమా (రెగ్యులర్‌/ పార్ట్‌ టైమ్‌) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: డి.రామకృష్ణ

    Ans:

    వీటిలో మీకు ఏది బాగా ఇష్టమో నిర్ధరణకు రండి. రెండింటిలో ఉన్న లాభనష్టాలను బేరీజు వేసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. మిత్రులు, కౌన్సెలర్లు సలహాలు మాత్రమే ఇవ్వగలరు. నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ముందుగా సీనియర్‌ దగ్గర పనిచేసి సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టే విషయానికొస్తే- సీనియర్‌ దగ్గర పనిచేస్తే, వృత్తిలో మెలకువలు నేర్చుకొని భవిష్యత్తులో సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టుకొని మంచి న్యాయవాదిగా రాణించే అవకాశాలుంటాయి. దీంట్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే, మీరు సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టినప్పుడు, మొదట్లో మీరు జూనియర్‌ లాయర్‌ అని కేసులు ఎక్కువగా రాకపోయే అవకాశం ఉంది. లాయర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల పోటీ కూడా ఎక్కువే. మీరు లాయర్‌గా స్థిరపడటానికి చాలా సమయం పట్టవచ్చు. కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తే ఉద్యోగ భద్రత ఉంటుంది కానీ, మీరు వ్యక్తిగతంగా కేసుల్ని వాదించి పేరు తెచ్చుకొనే అవకాశాలు తక్కువ. మీరు వాదించిన కేసుల్లో విజయం సాధించినా, ఆ విజయం మీరు పనిచేసే సంస్థకే చెందుతుంది. ఉదాహరణకు కొంత అనుభవం గడించి మీరే సొంతంగా కంపెనీ పెట్టడమా, జీవితకాలం ఏదో ఒక కంపెనీలో వేతనానికి పనిచేయడమా అనేది వ్యక్తిగత నిర్ణయం. కెరియర్లో రిస్క్‌ తీసుకోగల్గటం, ఉద్యోగ భద్రత, పరిమిత జీతం, అపరిమితమైన పేరు ప్రఖ్యాతులు, ఎక్కువ ఆదాయం అనే విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. ఏది సరైందో ఆలోచించి నచ్చిన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌