• facebook
  • whatsapp
  • telegram

'టెట్‌' సన్నద్ధతకు తుది మెరుగులు

టెట్‌ అర్హత పరీక్షలో పొందిన మార్కులు ఉపాధ్యాయ పరీక్షలో కీలకం. సిలబస్‌ పూర్తిగా అభ్యసించి ఉంటే  ప్రధానంగా పునశ్చరణ, మాదిరి పరీక్షలు రాయడం, తప్పులు సరిదిద్దుకోవడం, సవరణాత్మక అభ్యసనం అవసరం. పరీక్ష జరగకపోవచ్చనుకుని పుస్తకాలు పక్కనపడేసినవారు సమయం వృథాచేయకుండా వెంటనే దీక్షతో అధ్యాయాల వారీగా అభ్యసనాన్ని కొనసాగించాలి.మిగిలిన ఈ కొద్ది సమయంలో మెలకువలు, నైపుణ్యంతో అభ్యాసం అవసరం. నూతన విషయాలు, అంశాల జోలికి వెళ్లకుండా గత విషయాలనే పునశ్చరణ చేయాలి. ప్రధానంగా మాదిరి పరీక్షలపై దృష్టిసారించాలి. తప్పు జరిగిన ప్రశ్నలకు సంబంధించి సమాధానాన్ని మాత్రమే కాకుండా దానికి చెందిన భావనలను అవగాహనతో అభ్యసించాలి.

ప్రధానంగా పేపర్‌-1, పేపర్‌-2ల్లో శిశువికాసం- అధ్యాపనంపై దృష్టి కేంద్రీకరించాలి. ఇందులో జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలతోపాటు అవగాహన, అనుప్రయుక్తానికి చెందిన ప్రశ్నలను అభ్యసించాలి. ఈ విభాగంలో సరైన సమాధానం ఎంచుకోవడంలో సందేహాలతో అభ్యర్థులు అవరోధాలను ఎదుర్కొంటున్నారు. వీటిని అధిగమించడానికి విస్తృత అధ్యయనం, లోతైన విశ్లేషణ అవసరం.
1. మానవ వికాసం- సూత్రాలు, పియాజె, కోల్‌బర్గ్‌, ఛామ్‌స్కీ, కార్ల్‌రోజర్స్‌ సిద్ధాంతాలు, వైయక్తిక విభేదాలు, ప్రజ్ఞ పరీక్షలు, మూర్తి వికాస సిద్ధాంతాలు, రక్షక తంత్రాలు, శిశువికాస అధ్యయన పద్ధతులు
2. అభ్యసన సిద్ధాంతాలు, స్మృతి- విస్మృతి
3. వివిధ శిశు కేంద్రీకృత ఉపగమాలు, మార్గదర్శకత్వం, మంత్రణం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఎన్‌సీఎఫ్‌- 2005, ఆర్‌టీఈ- 2009

గత ప్రశ్నపత్రాల్లో పునరావృతమైన భావనలకు సంబంధించి ప్రశ్నలడగడానికి అవకాశముంది. అందువల్ల అలాంటి ప్రాథమిక భావనలపై దృష్టి కేంద్రీకరించాలి.
ఉదా-1: వ్యక్తి అచేతనంలోని లక్షణాంశాలను గమనించడానికి ఉపయోగించే మూర్తిమత్వ పరీక్షలు (3)
1. నిర్ధారణ మాపనులు 
2. మూర్తిమత్వ శోధికలు 
3. ప్రక్షేపక పరీక్షలు 
4. పరిపృచ్ఛ
ఉదా-2. బోధనా నియమాలకు వర్తించనిది? (2)
1. సరళత నుంచి క్లిష్టతకు 
2. ప్రయోగాత్మకత నుంచి సామాన్యీకరణకు 
3. తెలిసిన దాని నుంచి తెలియనిదానికి 
4. మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు
ఈ రెండు ప్రశ్నల సరళిని పరిశీలించినపుడు విషయ అవగాహన విశ్లేషణ అవసరమని తెలుస్తోంది.

బోధన పద్ధతులు
పేపర్‌-1, 2ల్లో బోధనా పద్ధతుల్లో లక్ష్యాలు, స్పష్టీకరణలు (సబ్జెక్టుకు సంబంధించి), బోధన ఉపగమాలు, (శిశు కేంద్రీకృత విధానాలపై దృష్టి ఎక్కువ అవసరం), విద్యా ప్రణాళిక, పాఠ్యపుస్తకం లక్షణాలు, బోధనాభ్యసన సామగ్రి, ఉత్తమ ఉపాధ్యాయుని లక్షణాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, మంచి పరీక్షకుండవలసిన ప్రధాన లక్షణాలు
ఉదా-1. ఒక పరీక్ష ఏ అంశాలను కొలవాలో వానినే కొలవగలిగిన అది ఏ లక్షణాన్ని సంతృప్తి పరుస్తుంది? (2)
1.విశ్వసనీయత 
2.సప్రమాణత 
3.ఆచరణాత్మకత 
4.విశ్లేషణాత్మకత

జీవశాస్త్రం

జీవశాస్త్రాన్ని పునశ్చరణ చేసే సమయంలో మన శరీరాన్ని, పరిసరాలను, చుట్టుపక్కల మొక్కలను దృష్టిలో ఉంచుకోవాలి. ఇలా చేస్తే సమయం ఆదా కావడంతోపాటు ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు. ఈ నేపథ్యంలో జీవశాస్త్రం పేపర్‌-1, 2ల్లో ఈ కింది అంశాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి.
జీవశాస్త్రం పేపర్‌-1: జీవశాస్త్రం పేపర్‌-1 పునశ్చరణ సమయంలో పుష్పం, వాటి భాగాలు; ఫలదీకరణ; జంతు శరీరధర్మశాస్త్రంలోని జీర్ణ, శ్వాస, రక్త ప్రసరణ, విసర్జన వ్యవస్థలపై దృష్టి పెట్టాలి.
జీవశాస్త్రం పేపర్‌-2: ఈ పేపర్‌ అధ్యయనం చేసేటపుడు పునశ్చరణ సమయంలో అధ్యయనాంశాలను లోతుగా; అప్లికేషన్‌ విధానంలో చదువుతూ వాటిని మన శరీరానికీ, పరిసరాలకూ అనువర్తింజేస్తే అంశాలను సులువుగా గుర్తుంచుకోవచ్చు. దీనికి సంబంధించి జంతు శరీర ధర్మశాస్త్రంలో..
జీర్ణ, శ్వాస, రక్తప్రసరణ, విసర్జన, నాడీ, ప్రత్యుత్పత్తి వ్యవస్థలను లోతుగా పరిశీలించాలి.
జీర్ణవ్యవస్థ పునశ్చరణ సమయంలో పోషణ గురించి కూడా చదివితే సులువుగా గుర్తుంచుకోవచ్చు.
ఆవరణ శాస్త్రం చదివేటపుడు ఆహారపు గొలుసు, పిరమిడ్‌లు, కాలుష్యం, వలయాల గురించి కొంత లోతుగా పరిశీలించాలి.
వృక్షశాస్త్రానికి సంబంధించి పుష్పం నిర్మాణం, ఫలదీకరణలు ముఖ్యం.
జంతు, వృక్ష శాస్త్రాల్లో కామన్‌గా వచ్చే కణం నిర్మాణం, కణాంగాలు, కణవిభజన గురించి ఒకే సమయంలో కొద్దిమార్పులతో సులువుగా పూర్తిచేయవచ్చు.
1. వృక్ష జంతుకణాల్లో దేనిని కణ శక్త్యాగారంగా పిలుస్తారు? 
ఎ) మైటోకాండ్రియా బి) హరితరేణువు సి) గాల్జీ సంక్లిష్ఠం డి) రైబోసోములు (ఎ)

భౌతికశాస్త్రం
గణితాన్ని డిగ్రీస్థాయిలో అభ్యసించినవారికి కొంత సులభంగానే ఉంటుంది. ఇందులో ప్రశ్నలు పూర్తిగా విశ్లేషణతో, అనుప్రయుక్తానికి సంబంధించి, సమస్య సాధనతో కూడి ఉంటాయి.
ప్రధానంగా... భౌతికశాస్త్రంలో- ధ్వని, విద్యుత్తు, కాంతి, ఎలక్ట్రానిక్స్‌, ఆధునిక భౌతికశాస్త్రం, గతిశాస్త్రం.
రసాయన శాస్త్రంలో- ద్రావణాలు, పరిశ్రమలు, మూలక ఆవర్తన పట్టికలు చదవాలి. శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలు, పట్టికలు- ప్రమాణాలు, సమస్యల సాధన మొదలైనవి గత ప్రశ్నపత్రాల ఆధారంగా, విశ్లేషణతో అభ్యసించాలి.

సోషల్‌ స్టడీస్‌
సాంఘిక శాస్త్రం విభాగంలో పేపర్‌-1, పేపర్‌-2లలో మౌలికాంశాలతోపాటు అవగాహనతో, విశ్లేషణాత్మక అభ్యసనం ఉపయుక్తంగా ఉంటుంది.
అభ్యసన ప్రాధాన్య క్రమం భౌగోళికశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్ధశాస్త్రంగా ఉండాలి.
భౌగోళికశాస్త్రంలో భూఆవరణాలు, ప్రపంచంలోని వివిధ దేశాలు, భౌగోళిక పదజాలంతోపాటు అట్లాసుపై అవగాహన అవసరం.
చరిత్రలో మధ్యయుగ భారతదేశ చరిత్ర.. ప్రధానంగా రాజవంశీయులు, జీవన స్థితిగతులు, సంస్కృతి, కవులు, గ్రంథాలు, కట్టడాలు మొదలైనవి.
పౌర, ఆర్థికశాస్త్రంలో ప్రాథమిక అంశాలను వర్తమాన అంశాలతో సమన్వయం చేసుకుని అభ్యసించాలి.
ఉదా: మానవహక్కులు, సమాచారహక్కు చట్టం, సమ్మిళిత వృద్ధి

ఆంగ్లం
ఆంగ్లం మొత్తం మీద కాంప్రహెన్షన్‌, సిననిమ్స్‌, ఆంటనిమ్స్‌తోపాటు వ్యాకరణంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌, సెంటెన్సెస్‌, ప్రిపొజిషన్స్‌, ఆర్టికల్స్‌, డిగ్రీస్‌ ఆఫ్‌ కంపారిజన్‌, క్వశ్చన్‌ ట్యాగ్స్‌, కాంపొజిషన్‌తోపాటు లెటర్‌ రైటింగ్‌పై శ్రద్ధ చూపాలి. టెట్‌-1 వారు ప్రాథమికాంశాలపై దృష్టి సారిస్తే సరిపోతుంది.
టెట్‌-2 వారు ఫ్రేజెస్‌& క్లాజెస్‌పై ప్రత్యేక సాధన చేయవలసి ఉంది. వీటిపై 3, 4 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
సింథసిస్‌తోపాటు నీడ్‌ టూ ఇంప్రూవ్‌ (ఎర్రర్‌ డిటెక్షన్‌)పై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎస్‌. చంద్‌, అగర్వాల్‌ పుస్తకాలను సాధన చేస్తే మేలు. ఒకాబులరీ కోసం 8, 9 తరగతుల పాఠ్యపుస్తకాలను చదవాల్సి ఉంటుంది.

తెలుగు
టెట్‌లో 'శిశువికాసం- పెడగాజి' తర్వాత స్థానం తెలుగుదే. 24 మార్కుల కంటెంట్‌లో భాగంగా కవులు, కావ్యాలు, అపరిచిత గద్యపదాల తర్వాత వ్యాకరణానికే పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా క్రియలు- రకాలు, వాక్యాలు- రకాలు, వాక్యక్రమం, సంఘటన క్రమం, ఆధునిక భాషలోకి మార్పిడి, ప్రామాణిక లేఖన రూపాలు, కళలు, దృత ప్రకృతికాలు, భాషాభాగాలు, వచనాలు, కాలాలు, లింగాలు, విభక్తులు, విరామ చిహ్నాలు, సంధులు, సమాసాలు, ప్రకృతి- వికృతులు, వ్యతిరేక పదాలు, పర్యాయపదాలు, నానార్థాలు, వ్యుత్పత్యర్థాలు, పొడుపు కథలు, సామెతలు, జాతీయాలు, ఛందస్సు, అలంకారాలు మొదలైనవాటిపై దృష్టిసారించవలసి ఉంటుంది.
గత ప్రశ్నపత్రాల ఆధారంగా చూస్తే అపరిచిత గద్యపద్యాలు, అర్థపరిణామం, పదక్రమం వంటి అంశాలపై లోతైన అవగాహన అవసరమని తేలుతుంది.
సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్యాలు- రకాలు మొదలైనవాటిపై సాధారణ అవగాహన ఉంటే చాలు.
ఇక బోధనా పద్ధతులు టెట్‌-1కు టెట్‌-2కు సమానమే. అయినా టెట్‌-1కు వారు అదనంగా తెలుగు సాహిత్యంపై పట్టు సాధిస్తే మార్కులను సాధించడం సులువు అవుతుంది.
 

Posted Date : 25-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌