• facebook
  • whatsapp
  • telegram

టెట్‌లో తెలుగెంత?

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో ఏ సబ్జెక్టుకు చెందినవారికైనా తెలుగు తప్పనిసరి. భాషా సాహిత్యాలకు 24 మార్కులు, బోధనా పద్ధతులకు 6 మార్కులూ. తెలుగులో ఎక్కువ మార్కులు సాధించేలా మెలకువలు తెలుసుకుందాం.

 

తెలుగు భాషా సాహిత్యాలు పదోతరగతి స్థాయిలోనే ఉంటాయి. ఇంతకు ముందు అందరూ చదివినవే అయినా గుర్తుండకపోవడం, సరిగా అవగాహన లేకపోవడం జరుగుతుంది. అప్పటి ప్రశ్నల తీరుకూ, ఇప్పటివాటికీ భేదం ఉంటుంది. టెట్‌ ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది కాబట్టి సరైన అవగాహన సామర్థ్యం అవసరం.తెలుగు పరీక్షలో ఎక్కువ మార్కులు అపరిచిత పద్యం, అపరిచిత గద్యం అనే ప్రశ్నలకు ఉంటాయి. ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తే మార్కులు వస్తాయి.అపరిచిత పద్యం అంటే ఎక్కడినుంచో ఒక పద్యం ఇచ్చి ప్రశ్నలడుగుతారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఆ పద్యంలో ఉంటాయి. ఇచ్చిన పద్యాన్ని నాలుగైదుసార్లు స్థిమితంగా, పదాలు విడదీసుకుంటూ చదివితే సమాధానాలు రాయవచ్చు. సమాధానంగా ఇచ్చిన నాలుగింటిలో సరైనదానిని గుర్తించాలి. పద్యం కాబట్టి కవి పేరు, ఛందస్సు, అర్థం, ప్రకృతి-వికృతి వంటి ప్రశ్నలూ రావచ్చు. అపరిచిత పద్యాలు ఎక్కువగా శతక పద్యాల నుంచి వస్తున్నాయి. 7, 8, 9 తరగతి తెలుగు వాచకాలలోని శతక పద్యాలను అధ్యయనం చేయాలి. శతకాలు- శతక కవులు- వారి కాలాలు కూడా గుర్తుంచుకోవాలి.

 

అపరిచిత గద్యం తేలికగానే ఉంటుంది. ఒక గద్యభాగమిచ్చి ప్రశ్నలడుగుతారు. వాటికి సమాధానాలు ఆ గద్యభాగం నుంచే రాయాల్సి ఉంటుంది. వచనమే కాబట్టి తేలికగా అర్థం అవుతుంది. సమయాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరగా సమాధానం గుర్తిస్తే మిగిలిన ప్రశ్నలకు సమయం ఉంటుంది. గద్యభాగంలోని సామెతలు, జాతీయాలపై కూడా దృష్టి ఉంచాలి.అతిముఖ్యమైన భాగం వ్యాకరణం. దీనిపై కనీసం పది ప్రశ్నలుంటాయి. ఇందులో అంశాలన్నీ ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకు పూర్వం చదివినవే. మరోసారి పునశ్చరణ చేసుకోవడం, అభ్యాసం చెయ్యడం అవసరం. వ్యాకరణంలో సంధులు, ఛందస్సు, వాక్యభేదాలు, ప్రకృతి-వికృతులు ముఖ్యం. అప్పుడప్పుడు సమాసం, అలంకారాలపై ప్రశ్నలు అడుగుతారు కాబట్టి వాటినీ అధ్యయనం చేయాలి. తెలుగు వాచకాలలో పాఠ్యాంశాల చివర అధ్యయన వేదికగా, అభ్యాసంగా వ్యాకరణ విశేషాలుంటాయి. వాటిని బాగా చదవాలి.

 

సంధుల్లో సంస్కృత సంధులు 5, తెలుగు సంధులు 10 ముఖ్యమైనవి. సూత్రాలు అడగరు కానీ పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆ నేపథ్యం అవసరం. సంధుల్లో.
పదమిచ్చి ఏ సంధి అనిగానీ, 
పదమిచ్చి విడదీయమని గానీ 
పదాలిచ్చి కలపమని గానీ అడుగుతారు.

 

ఛందస్సులో ముఖ్యమైన నాలుగు వృత్త పద్యాలు- ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం నుంచి ప్రశ్నలు వస్తాయి. అరుదుగా ఆటవెలది, తేటగీతిలపై ప్రశ్నలు అడగవచ్చు. ఛందస్సులో ప్రశ్నలు..
గణాలిచ్చి పద్యం పేరు చెప్పమనవచ్చు. 
పద్యం పేరు చెప్పి గణాలు అడగవచ్చు. 
యతిస్థానంపై ప్రశ్న అడగవచ్చు.
లేదా సుమతీ శతకం (కందంలో), వేమన శతకం (ఆటవెలదిలో), ఆంధ్రనాయక శతకం (సీస పద్యాలలో) లో గల ఛందస్సు అడగవచ్చు.

 

సంధులు, ఛందస్సు తరువాత తప్పనిసరిగా వాక్యభేదాలపై ప్రశ్నలుంటాయి.
'వాడు వస్తాడో రాడో' అనేది ఏ వాక్యం? (సందేహార్థక వాక్యం) అనే విధంగా వాక్యమిచ్చి అడుగవచ్చు. లేదా గ్రాంథిక భాషలో ఉన్న వాక్యమిచ్చి వాడుకభాషలోకి మార్చమంటారు. సంశ్లిష్ట వాక్యమిచ్చి సంయుక్త వాక్యంగాకానీ, సంయుక్త వాక్యమిచ్చి రెండు సామాన్య వాక్యాలుగా మార్చమని కానీ అడుగుతారు. ప్రత్యక్షానుకృతి వాక్యం, పరోక్షానుకృతి వాక్యాలు ఇచ్చి పరస్పరం మార్చమంటారు. ఇక మరో ముఖ్యాంశం తెలుగు సాహిత్య పరిచయం. లోతుగా అధ్యయనం అవసరం లేదు. సంగ్రహంగా తెలుసుకుంటే చాలు. ప్రాచీన, ఆధునిక సాహిత్యంలోగల మైలురాళ్లను బాగా గుర్తుంచుకోవాలి. కవిత్వంపైనే ఎక్కువగా ప్రశ్నలు వచ్చినా కథ, నవలలపై కూడా శ్రద్ధ పెడితే మంచిది.

 

సాహిత్యం చదివేటపుడు..
బిరుదులు 
రచనలు 
కాలాలు 
పురస్కారాలు (ఆధునికంగా) అనేవిధంగా విభజించుకోవాలి. జీఎస్‌లో కూడా తెలుగు సాహిత్యానికి సంబంధించిన రెండు మూడు ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఆ రీత్యా కూడా చదవాలి.
ఉదాహరణకు.. 'ఇటీవల జ్ఞానపీఠం పొందిన రచయిత ఎవరు?' అనే ప్రశ్న జీఎస్‌లోనూ, తెలుగులోనూ రావచ్చు. రావూరి భరద్వాజకు ఈ పురస్కారం వచ్చింది. ఈయన రాసిన ఒక నవల 'పాకుడురాళ్లు'.
ఒక్కోసారి కలం పేర్లు ఇచ్చి పూర్తిపేరు రాయమని అడిగే అవకాశమూ ఉంది. బుచ్చిబాబు (శివరాజు వెంకట సుబ్బారావు), ఆరుద్ర (భాగవతుల శివశంకర శాస్త్రి), రావి శాస్త్రి (రాచకొండ విశ్వనాథశాస్త్రి), దాశరథి (దాశరథి కృష్ణమాచార్యులు) వంటివి.

 

బోధనా పద్ధతులు
తెలుగులో రెండోభాగం బోధనాపద్ధతులు. దీనిలో ముఖ్యమైన అంశాలు ఆరున్నాయి.
భాష- వివిధ భావనలు 
భాషా నైపుణ్యాలు 
బోధనా పద్ధతులు- ప్రక్రియలు 
ప్రణాళికా రచన- సహపాఠ్య కార్యక్రమాలు 
బోధనోపకరణాలు 
మూల్యాంకనం

 

ఇందులో మొదటి మూడు అంశాలు చాలా ముఖ్యం. భాషా నిర్వచనాలు, మాతృభాష, దాని లక్ష్యాలు, వ్యావహారిక గ్రాంథిక భాషలు, మాండలిక భాషలు మొదలైనవి ముఖ్యం. భాషా నైపుణ్యాలలో పఠనం, లేఖనం అనేవి చదవాల్సిన అంశాలు. భాషాదోషాలు, నాటకీకరణ, ప్రకాశ పఠనం, మౌన పఠనం, దృష్టలేఖనం, ఉక్తలేఖనం వంటివి గుర్తుంచుకోవాలి. బోధనా పద్ధతుల్లో గల సాహిత్య ప్రక్రియలు అధ్యయనం చేస్తే సాహిత్యానికి కూడా ఉపయోగపడతాయి. ప్రశ్నల సరళి సూటిగా కాకుండా తిప్పి అడగడం ఉంటుంది. ఉదాహరణకు..
భాషా నైపుణ్యాలలో తొలి సోపానమేది? 
భాషా నైపుణ్యాలలో కఠినమైనదేది? 
పఠనం కంటే కష్టమైనదేది? 
పఠనం కంటే తేలికైనదేది?
తెలుగే కదా అని నిర్లక్ష్యం వహించకుండా ఆంగ్లంలో కంటే ఎక్కువగా మార్కులు వచ్చే అవకాశం ఉందని గ్రహించి కాస్త మనసు పెట్టి చదవాలి. ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ప్రతి చిన్న విషయమూ ముఖ్యమే అనుకోవడం ఉత్తమం.

Posted Date : 25-02-2021

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌