• facebook
  • whatsapp
  • telegram

టెట్‌లో తేలిగ్గా మార్కులు 

ఇది అర్హత పరీక్ష మాత్రమే కాదు; ఈ మార్కులకు డీఎస్‌సీలో 20% వెయిటేజీ! అందుకే దీనిలో అత్యధిక మార్కుల సాధనకు ప్రయత్నించాలి. డీఈడీ పూర్తిచేసినవారు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ఉద్యోగం కోసం టెట్‌ పేపర్‌-1, బీఈడీ పూర్తిచేసినవారు స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం కోసం టెట్‌ పేపర్‌-2లో అర్హత సాధించాలి. గతంలో జరిగిన 4 టెట్‌లను పరిశీలిస్తే 120 మార్కులకుపైగా సాధించిన అభ్యర్థులు చాలామందే ఉన్నారు. కాబట్టి కొత్తగా టెట్‌ రాయబోయే అభ్యర్థులందరూ ప్రణాళికాబద్ధంగా చదవాల్సి ఉంటుంది.

ఇందులో శిశువికాసం- పెడగాజి, భాష- 1, 2 (తెలుగు, ఆంగ్లం)తోబాటు కంటెంట్స్‌, మెథడాలజీలు ఉంటాయి. గతంలో ఎక్కువ మార్కులు సాధించినవారందరూ కంటెంట్‌, మెథడాలజీల్లో అందరితోపాటు మార్కులు సాధించినా శిశువికాసం (సైకాలజీ), భాష 1, 2లపై ప్రత్యేక దృష్టిసారించి ఎక్కువ మార్కులు పొందారు. తద్వారా వీరికి డీఎస్‌సీలో ఉద్యోగసాధన సులభమవుతుంది.

1. శిశువికాసం- పెడగాజి
ఈ విభాగాన్ని అభ్యర్థులందరూ కొంత క్లిష్టంగా భావించడానికి ప్రధాన కారణం- ఈ సబ్జెక్టును కింది తరగతుల్లో ఎక్కడా చదవకపోవడంతోపాటు విషయాన్ని పరీక్షల్లో కూడా సైద్ధాంతిక భావనల్లో కాకుండా అన్వయంతో అడగడం ప్రధాన కారణం. ఇందులో ఎస్‌జీటీవారు డీఈడీ మనోవిజ్ఞానశాస్త్రం, స్కూల్‌ అసిస్టెంట్‌వారు బీఈడీ మనోవిజ్ఞానశాస్త్రం, తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా తీసుకోవాలి. విషయాన్ని జ్ఞానాత్మకం నుంచి క్రమంగా అవగాహన వినియోగానికి విస్తరించుకోవాలి; అత్యధికంగా మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. ఈ ప్రక్రియ వల్ల అభ్యర్థుల స్థాయి పెరుగుతుంది. ఎస్‌జీటీతో పోలిస్తే స్కూల్‌ అసిస్టెంట్‌లోని ప్రశ్నలు విద్యార్థి అవగాహనను అంచనా వేసే కఠినస్థాయికి చెందినవై ఉంటాయి. శిశువికాసంలోగల మొత్తం 3 భాగాల్లో మొదటి రెండు అకాడమీ పుస్తకాల్లోని అంశాలతోపాటు, పుస్తకాల్లో లేని మరికొన్ని అంశాలను (నోమ్‌ ఛామ్‌స్కీ, కార్ల్‌ రోజర్స్‌ సిద్ధాంతాలు) సేకరించుకోవాలి. మూడో భాగంలో వివిధ మనోవిజ్ఞాన అంశాలు బోధనకు ఎలా ఉపయోగించాలి అని తెలిపే బోధనాశాస్త్రం (పెడగాజి) ఉంది. ఇందులో విద్యాహక్కు చట్టం- 2009, జాతీయ ప్రణాళిక చట్టం- 2005, శిశుకేంద్రీకృత విధాన ప్రణాళిక, నిరంతర సమగ్ర మూల్యాంకనం ముఖ్యమైన అంశాలు.

2. భాష-1 (తెలుగు)
సాధారణంగా మాతృభాష కాబట్టి తెలుగు చాలా సులభమనే భావన అభ్యర్థులకు ఉంది. దీంతో తెలుగుపై తగిన శ్రద్ధ చూపక, ప్రశ్నల సరళి అర్థంకాక ఎక్కువశాతం మార్కులను కోల్పోతున్నారు.
‣ ఇందులో తెలంగాణ కవులు, వారి రచనలతోపాటు సాహిత్య వ్యాకరణ అంశాలను కంటెంట్‌తో కలిపి చదువుకోవాలి. 
‣ ప్రామాణిక పదాలు, వ్యావహారిక, మాండలిక రూపాలను పరిశీలించాలి. 
‣ ప్రక్రియలు, భాషారూపాలు, భాషాంశాలను చదివి అర్థం చేసుకుంటూ నోట్సు రాసుకోవడం మంచిది.

3. భాష-2 (ఆంగ్లం) 
ప్రశ్నపత్రాల్లో అడిగే ఆంగ్ల ప్రశ్నల్లో కష్టతరమైన పదాలు ఉంటున్నాయి. అందువల్ల అవగాహన చేసుకోవడంలో ప్రధానంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు.
ఇందులో వ్యాకరణాంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలి. దీన్ని ఒకేసారి కాకుండా విడతలవారీగా నేర్చుకోవడం మంచిది.
వ్యాకరణంతోపాటు సమానార్థక పదాలు, వ్యతిరేక పదాలను నేరుగా అడగకుండా వ్యాఖ్య/ సన్నివేశ ఆధారితంగా అడగడంతో తికమకకు ఆస్కారం ఏర్పడుతోంది. దీన్ని గుర్తించి ఆంగ్లంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి.

పెడగాజి (తెలుగు, ఆంగ్లం) 
ప్రణాళికాబద్ధంగా చదివితే తెలుగు, ఆంగ్లాల్లో పెడగాజికి సంబంధించిన 12 మార్కులు సాధించడం కష్టంకాదు.
ఈ విభాగంలో భాషల భావనకు సంబంధించిన బోధన పద్ధతులు, మాతృభాష బోధనాలక్ష్యాలు, భాషా నైపుణ్యాలు, బోధనోపకరణాలు, మూల్యాంకనం వంటి అంశాలపై దృష్టిసారించాలి.

4. కంటెంట్స్‌ 

పేపర్‌-1లోని గణితం, పరిసరాల విజ్ఞానానికి సంబంధించి అడిగే ప్రశ్నలు అవగాహనను పరీక్షించేలా ఉంటాయి. ఇందుకోసం మూడు నుంచి ఎనిమిది తరగతుల వరకు గల పుస్తకాలు అధ్యయనం చేయాలి.
పేపర్‌-1తో పోలిస్తే పేపర్‌-2లో అడిగే ప్రశ్నలు కఠినస్థాయిలో ఉంటాయి. దీనికిగానూ ప్రధానంగా 6-10వ తరగతి వరకు చదవవలసి ఉంటుంది.
గతంలో టెట్‌-2 రాసి ప్రస్తుతం స్కోరింగ్‌ కోసం ప్రయత్నించేవారు పదో తరగతి వరకే పరిమితం కాకుండా ఇంటర్మీడియట్‌ స్థాయి వరకు చదవడం ప్రయోజనకరం.
టెట్‌-2 సైన్స్‌ విభాగానికి చెందిన అభ్యర్థులు గణితం, బయోసైన్స్‌, భౌతికశాస్త్ర విభాగాలను చదవాల్సి ఉంటుంది. ఇందులో గణిత అభ్యర్థులు బయోసైన్స్‌పై, బయాలజీ అభ్యర్థులు గణితం, ఫిజికల్‌ సైన్స్‌పై ప్రత్యేక దృష్టిసారించాలి.
సాంఘికశాస్త్ర అభ్యర్థులు భౌగోళికశాస్త్రం, చరిత్రలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ సివిక్స్‌, ఎకనామిక్స్‌ అంశాలను వర్తమానాంశాలకు అన్వయిస్తూ అధ్యయనం చేయాలి. బోధనా పద్ధతులు (పెడగాజి) సాధారణంగా సైకాలజీ తర్వాత కొంత క్లిష్టమైనదిగా అభ్యర్థులు భావిస్తారు. కానీ దీన్ని ఒక క్రమ పద్ధతిలో అభ్యసిస్తే సగటు అభ్యర్థి కూడా

మంచి మార్కులు సాధించవచ్చు. దీని కోసం...
మొదట పాఠ్యపుస్తకం చదివి ప్రాథమిక భావనలను చక్కగా అర్థం చేసుకోవాలి. 
ప్రాథమిక భావనలతో విషయాన్ని అనుప్రయుక్తం చేసుకుంటూ చదవాలి. 
టెట్‌-1, టెట్‌-2 సైన్స్‌ అభ్యర్థులు శాస్త్ర అంశాల్లో సారూప్యత కలిగిన అంశాలను అనుసంధానం చేసుకుని చదవాలి.

Posted Date : 05-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌